కృష్ణ మాయ!
వేణుగానము గోపికా కాంచనాభరణమట !
కృష్ణా! నీ మోవి తాకినంతనే పిల్లన గోవికి ప్రాణమొచ్చునట!
తనివి తీరని తీయని రాగం నీదై… తన్మయత్వాన ..
మురళీ గానం విని అంబరమే రంగులు అలదుకొను విచిత్రమట!
నీ మూసిన రెప్పల మాటున దాగిన ప్రేమ నను చిత్తరువుగ చేసెనట!
నీల మోహనా! నటనాగ్రేసరుడవు నీవైతే…
నే నాట్య మయూరిగ నాట్యమాడుటేల? ఓయీ! ఇదంతా నీ మాయట!
హాయిని గొలిపే మురళీరవము విని నాయెద పులకించె కాదుటోయీ!
నీలో లీనమై నా జన్మ పచ్చని జగతిగ మారెనట! మది పూవై వికసించెనట
కానీ నీ ప్రతిబింబముగా
యమునేమో నల్లని వాహినిగా సాగెనట!
యమునా తటి రంగస్థలమాయెనట
నీ ప్రతిచర్యా ఎంత మాయనోయీ! కృష్ణా!
చిత్రకారిణి పేరు : సీత ఆత్మకూరి
వృత్తి: ఇంజనీరు
ఊరు: సాన్ ఫ్రాన్సిస్కో, అమెరికా
సీత గారికి చిన్నతనం నుంచీ లలిత కళలంటే ప్రీతి. చిత్రలేఖనం తోనూ, సంగీతం లోనూ ప్రవేశం ఉన్నప్పటికీ, కొంత విరామం ఇచ్చారు. వారి అబ్బాయికి రేఖా చిత్రం నేర్పుతూ, వారు కూడా మళ్ళీ సాధన చెయ్యడం మొదలెట్టారని వారు తెలియజేసారు.
అలా సాధన చెయ్యడం మొదలెట్టిన కొంత కాలానికి “మృణ్మయి” (మీను) అనే అద్భుతమైన చిత్ర కళాకారిణి వారికి గురువుగా దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని వారు ఆనందం వ్యక్తం చేసారు. మీను గారి ప్రోత్సాహంతో చిత్ర కళా నైపుణ్యం ఇంకో స్థాయికి పెరిగిందని వారు వివరించారు. వారికి ఉన్న ఆధ్యాత్మిక అభిరుచికి చిత్ర కళను జోడించి, ఈ మార్గం లో అభివ్యక్తీకరణ గావిస్తూ అనేక అద్భుతమైన చిత్రాలని సీత గారు సృష్టించారు.
శిల్పాలని తలపించేలా సీత గారి చేతిలో ఉద్భవిస్తున్న ఈ అద్భుతమైన చిత్ర కళా స్రవంతి అలలై, వరదలై ప్రవహించి, అంబరాన్ని తాకాలని మనస్పూర్తిగా కోరుకుందాము.