చెడిన వ్రతం-దక్కిన ఫలితం!

కథ

   యలపర్తి అనురాధ

పులి లా ఉండే పుల్లయ్య ఒక్కసారి పిల్లిలా మారిపోయాడు.కారణం ఓ చిన్న జీవి ప్రపంచాన్నే వణికిస్తుంటే దాని ముందు తను ఒక లెక్కా అని వణికిపోతున్నాడు గజగజా.ఆ రోజు వాక్సినేషన్ వేయించుకోవాలని కొడుకు ‘లింగయ్య’ చెప్పాడు.అదేమి కర్మమో అంత దాకా బాగున్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్లాక ఆ దెయ్యం..ఆ మహమ్మారి బారిన పడుతున్నారని అప్పటికే ఆ నోట ఈ నోట విన్న అతనికి అడుగు ముందుకు పడటం లేదు.ప్రాణం మీద తీపి ఎవరికీ ఉండదు?ఇదంతా జనాల్లో వచ్చిన అపోహ అని చెప్పేవాడు లేడు. చెప్పినా వినేవాడు లేడు.రేపు ఉంటానో ఉండనో అని స్వీట్ షాప్ కి వెళ్లి తనకిష్టమైన బందర్ లడ్డుని కొనుక్కొని మనసారా తిందాం అనుకున్నాడు.కానీ ఈ లోపు కొడుకు ఎక్కడ కనిపిస్తే లాక్కుపోతాడో అనుకుని ఓ చెట్టు వెనక నక్కాడు.
సిన్సియర్ గా డ్యూటీ చేసే పోలీస్ కానిస్టేబుల్ ‘కనకయ్య’ కంట్లో పడింది ఈ దృశ్యం.
అసలే రోజులు బాగోలేవు. ఎక్కడ చూసినా ఉగ్రవాదులే. పిల్లలు టపాకాయలు కాల్చినట్లు వీళ్ళు బాంబులు పేల్చేస్తున్నారు.వీడెవడో అనుమానాస్పదంగా ఉన్నాడు. వీడిని సింహంలా వెంటాడాల్సిందే అనుకున్నాడు. జింక పిల్లలా సన్నగా,పీలగా ఉన్నాడు వీడు.బుద్ధులు మాత్రం వెధవవే.
ఈ కనకయ్య కంట్లో పడ్డాక నలుసు కూడా తప్పించుకోలేదు.వీడైపోయినట్లే అని మనసులోనే గట్టిగా జబ్బ చరుచుకుని కార్యసూర్యుడిలా కదిలాడు.
తియ్యటి లడ్డుని ఆనందంగా తిన్నాడు కానీ మళ్లీ కొడుకు నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న నిజం కళ్ళముందే భూతంలా నిలబడటంతో మనసంతా చేదుగా తయారయింది.
బుర్ర మీదున్న నాలుగు వెంట్రుకలను గట్టిగా పీక్కున్నాక ఓ ఆలోచన వచ్చింది.సినిమా హాల్ లో దూరితే కొన్ని గంటల దాకా ఎవరికీ కనిపించనని ఆలోచన వచ్చింది.
తస్సదియ్య.. జుట్టు లేకపోయినా తన బుర్ర బాగానే పనిచేస్తోందని నున్నటి తన బుర్రను ఒకసారి ఆప్యాయంగా పాముకున్నాడు.వెంటనే అటుగా వెళ్తున్న ఆటో ఎక్కేశాడు.
అయ్యో!వీడేమిటి ఇంత సడన్ గా ఇలా చేసాడు?..అనుకుంటూ తన బైక్ దగ్గరికి పరిగెత్తాడు కనకయ్య.
అయినా ఎక్కడికి పోతాడు? ఈ లోపు తను చేరుకోడూ. అసలే తనది ఉడుం పట్టు అనుకున్నాడు మనసులో.బండి మీద ఆ ఆటోని వెతుక్కుంటూ వెళ్ళసాగాడు.అతని కళ్ళు ఎక్స్ రే ల్లా పనిచేస్తున్నాయి పరిసరాలను స్కాన్ చేస్తూ.
ఆటో ఎంత పరిగెత్తినా బోరబండ దగ్గర ఆగాల్సిందే. ఈలోపు సర్రున పాము లెక్క జర జరా తానెల్లి పోడూ అనుకున్నాడు.
నడిస్తే మళ్ళీ ఎవరికైనా కనిపిస్తానేమో,కనిపిస్తే మళ్ళీ కొడుక్కి ఎవరైనా ఫోన్ చేసి చెప్పేస్తారేమోనని అనుమానం వచ్చింది.మరి ప్రతి వాడి దగ్గర సెల్ ఫోన్ ఏడుస్తోందిగా.సెకనులో సమాచారం చేర్చేస్తున్నారని దాన్ని గట్టిగా తిట్టుకొని మరో ఆటో ఎక్కాడు.
వీడు ఎన్ని ఆటోలు మారినా తను జలగలా వదలనే వదలడు తన పట్టును అనుకుని మళ్ళీ వెంబడించాడు అదే తన ధ్యేయమన్నట్లు.
అప్పుడు గమనించాడు పుల్లయ్య కనకయ్యను వీడేమిటి తన వెంట పడుతున్నాడు?కొడుకు సన్నాసి కానీ పంపాడా ఏమిటి?ఎలా వీడినుంచీ తప్పించుకోవటం?చూద్దాం. ఏదైతే అది అయిందని ‘విజేత’ థియేటర్ దగ్గర దిగిపోయాడు.
“ఆటకు ఇంకా వేళ కాలేదని వాచ్ మాన్ అడ్డుకున్నాడు. దానికింకా వేళఉందని తెలిసులే.నన్ను ఒకసారి లోపలికి పోనివ్వు” అన్నాడు చిటికెన వేలు చూపిస్తూ.
“పో!పోవయ్యా!రోడ్డు మీద కెళ్లు”అన్నాడు విసుక్కుంటూ.ఆడవాళ్ళలా లోపలికి వెళతానంతాడేమిటి అని కూడా అనుకోకుండా ఉండలేకపోయాడు.
“బాబ్బాబూ!ఈ ఒక్కసారికి
నన్నొగ్గెయ్.నీ పేరు చెప్పుకొని బతుకుతా. నిలవలేక పోతున్నా” అంటూ మెలికలు తిరుగుతున్న అతన్ని చూసి జాలి వేసి”సరే పో!” అని ఒప్పుకున్నాడు.
లోపలికి పోయినోడు ఎంతకీ రాడే. బయటికి కాపు కాసిన కనకయ్య ఆందోళన.
పుల్లయ్య ఇక బయటకు రాడని అర్థమై తను పోలీసునని చెప్పి లోపలికి వెళ్లి పుల్లయ్యను తీసుకు వచ్చి సెల్ లో పడేసాడు.
ఇంజక్షన్ వేయించుకోవటం ఇష్టంలేక,వ్యాక్సినేషన్ తప్పించుకోవటానికిదంతా చేశానని మొత్తుకున్నా వినలేదు కనకయ్య.
“వెధవ వేశాలెయ్యకు.నువ్వు ఉగ్రవాదివే అని తేల్చేశాడు అతని దగ్గర సెల్ తీసుకుని తన జేబులో పెట్టుకుంటూ.
‘ఓరి దేవుడో.ఓ సారి నీ సెల్ అన్నా ఇవ్వు.నా కొడుకుని రప్పిస్తా.ఆ తర్వాత నువ్వు ఏమి చేసుకున్నా నేనేమీ అనను”అని చాలా సేపు బ్రతిమాలుకున్నాక అతని గోల భరించలేక ఇచ్చాడు సెల్ ని.
విషయం విన్న లింగయ్య ఆఘమేఘాల మీద వచ్చి పడ్డాడు.
తండ్రి సంగతి అంతా వివరించి చెప్పాక ‘టీకా వేయించుకుంటానంటేనే వదిలిపెడతానని”ఒప్పించి విడిచి పెట్టాడు.
అలాగేనని మాటిచ్చి ఉసూరోమంటూ బయట పడ్డాడు.ఈ రోజు నా అదృష్టం బాగుంది లేకుంటే పోలీసోళ్ల చేతికి చిక్కాక బయటకు రాగలమా అనుకుంటూ.ఇద్దరూ ఇంటి దారి పట్టారు.ఆ లాఠీలతో కుళ్ళ బొడిచేసువాళ్ళు అక్కడే ఉంటే.దాని కన్నా కరోనా వచ్చి చచ్చిపోయినా ఫర్వాలేదు.దొంగగా ముద్ర పడితే ఇంకేముంది?జీవితం కళంకమై పోదూ..తృప్తిగా ఉంది ఇప్పుడు పుల్లయ్య మనసు..లింగయ్యకి కూడా..తండ్రి తో
వాక్సినేషన్ వేయించినందుకు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చిత్ర కళా స్రవంతి

ప్రకృతి The Nature