రాత్రి పడుకోబోయే ముందు గట్టిగా నిర్ణయం తీసుకుంది జానకమ్మ. ఎంతకాలమని ఒంటరిగా నాలుగు గదుల మధ్య మాట మంచి లేకుండా పలకరింపుల కోసం కలవరించి పోతున్నది. పిల్లలిద్దరూ స్కూల్ కి వెళ్లి సాయంత్రం గాని రారు. తన మనసులో మాట పిల్లలకు ఎలా చెప్పుకోగలదు. ఇంటికి వచ్చేసరికి పెద్దదిక్కు ఇంట్లో లేకపోతే ఎలాగా అని కొడుకు కోడలు ఆలోచించరు. నానమ్మతో సరదాగా కబుర్లు చెబుదామని పిల్లలకి తెలియదు. పక్కింటి వాళ్ళు ఇరుగుపొరుగు వారితో అసలే పరిచయం లేదు.
కొడుకు కోడలు ఇంటికి రాగానే తన మనసులో మాట బయట పెట్టింది జానకమ్మ. ఇప్పుడు నీకేమైందని వెళ్ళిపోతాను అంటున్నావు. నువ్వు ఇంట్లో ఉంటే మాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. పిల్లలు ఇంటికి వచ్చేసరికి పెద్దదిక్కుగా ఉంటావనే కదా ఇక్కడికి పిలిపించాము అన్నాడు కొడుకు రమేష్.
ఇప్పుడు మీకు ఏమంత ఇబ్బంది వచ్చిందని వెళతానంటున్నారు. చూసేవాళ్లంతా మీ అబ్బాయి మిమ్మల్ని సరిగా చూడట్లేదు అనుకోవాలనా అన్నది కోడలు మాధవి.
ఈ వయసులో నేను ఒంటరిగా ఉండలేను. ఆ పల్లెటూర్లోనే ఒక్కదానినైనా పడి ఉంటాను. ఇరుగు పొరుగు అంతా మనకి తెలిసిన వాళ్లే. రోజు వచ్చి పలకరించి పోతుంటారు.
ఇంట్లో పనిమనిషి ఉన్నది అన్ని పనులు చేస్తుంది మీకు ఏమైనా కావాలంటే చెప్పి చేయించుకోండి అంతేకానీ వెళతానని మాత్రం అనకండి మరోసారి చెప్పింది కోడలు మాధవి.
కొడుకు కూడా అదే మాట చెప్పాడు.
మీరు ఎన్నైనా చెప్పండి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఒంటరిగా మూగదాని లాగా ఉండటం నాకు ఇష్టం లేదు అని కరాకండిగా చెప్పేసింది జానకమ్మ.
అమ్మ నేను చెప్పేది అర్థం చేసుకో. మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్తే పిల్లలు ఒంటరివాడైపోతారు పెద్ద దానివి నువ్వు వాళ్ళని కనిపెట్టి ఉండాలి కదా అన్నాడు సురేష్.
వాళ్లకి నాతో ఏం పని నాయనా స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తింటారు ఇక టీవీ ముందుగానే ఆ సెల్ ఫోన్ గాని పట్టుకొని కూర్చుంటారు. నాతో మాట్లాడటానికి వాళ్లకి మాటలే ఉంటాయి చెప్పు.
నేను చెప్పాలనుకున్న చెప్పాను.
నేను పల్లెటూరికి వెళ్లడానికే నిర్ణయించుకున్నాను అన్నది.
మాధవి భర్తని లోపలికి పిలిచింది. మీ అమ్మగారిని వెళితే వెళ్ళనివ్వండి. ఆమెకి మన పిల్లల్ని చూసుకోవడం ఇష్టం లేదు. ఆమె రేపు మంచాన పడితే మనం సేవలు చేయలేము. అక్కడికే పంపించేయండి. నెలకింటని డబ్బు పంపవచ్చు అన్నది.
జానకమ్మకు కోడలి మాటలు అర్థం అయినాయి. ఇన్నాళ్లు తన అవసరం ఉన్నది కాబట్టి ఉంచుకున్నారు. రేపు మంచాన పడితే చేయాల్సి వస్తుందని వెళ్లమంటున్నారు. పోనీలే వాళ్ల చేత చెప్పించుకోకుండా నేనే వెళ్దాం అనుకున్నాను అనుకున్నది మనసులో బాధగానే.
జానకమ్మ పల్లెటూరికి ప్రయాణమైంది. ఇండియా రాగానే ఇరుగుపొరుగు వారంతా చుట్టుముట్టి సంతోషంగా పలకరించేసరికి ఆమెకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అయింది.
మాధవి ఇంటికి రాగానే పిల్లలు చదువుకోకుండా ఆడుకోవడం మొదలుపెట్టారు. వాళ్లని అదుపులో పెట్టే నానమ్మ కూడా ఇంట్లో లేదు. అయినా జానకమ్మ మాట వాడు వినరు. ఏమైనా అంటే ఎదురు తిరిగి సమాధానం చెప్తారు. తల్లి ఇంటికి రాగానే నానమ్మ అలా చేసింది ఇలా చేసింది అంటూ చాడీలు చెప్తారు. అభిమానం లేని చోట ఎంత కాలం ఉండగలదు.
జానకమ్మకి వాళ్లందర్నీ చూసేసరికి సంతోషం కలిగింది. మిమ్మల్ని అందర్నీ చూసి ఎంత కాలం అయింది. మీకోసమే తిరిగి వచ్చాను అనగానే వాళ్ల ముఖాల్లో కూడా సంతోషం తొంగి చూసింది.
ఇల్లంతా శుభ్రం చేయించి జానకమ్మ తనకు నచ్చిన వంటలు చేసుకునేది. అమెరికాలో ఫ్రిజ్లో పెట్టినవే కోడలు వేడి చేసి పెడుతుంది. తనకి ఇష్టమైన వంటలు ఎప్పుడూ తిని ఎరుగదు. ఇక్కడ తనకి స్వేచ్ఛ ఏది వండుకున్నా పక్కవారికి పెట్టండి తినదు.
సాయంత్రానికి జానకమ్మ స్నేహితులంతా చేరారు. అమెరికా ముచ్చట్లు అన్నీ చెప్పింది. మీరు ఏమైనా అనుకోండి అక్కడ ఉంటే నాకు ముళ్ళ మీద ఉన్నట్లే ఉంది. సరైన తిండి దొరకదు. కాలక్షేపం కోసం మనుషులే కరువైనారు. ఇరుగుపొరుగువారు అసలే కనిపించరు. కొడుకు కోడలు పిల్లలు ఉదయం వెళ్తే సాయంత్రానికి గాని తిరిగి రారు. ఒక గుడి లేదు. ఒక ధ్యానం లేదు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తుంటే నన్ను రమ్మనరు. ఒంటరిగా ఇంట్లోనే మగ్గిపోయేదాన్ని. అందుకే వచ్చేసాను అన్నది.
మంచి పని చేశావు. నువ్వుంటే మాకు కొండంత అండ. కష్టం సుఖం నీతో చెప్పుకుంటాం. కూర్చొని కబుర్లు ఆడుకుంటాం. ఏమీ తోచకపోతే అలా గుడికి వెళ్లడం. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా అన్నారు ముక్తకంఠంతో.
అందరూ వచ్చినా మనోరమ మాత్రం రాలేదు. మనోరమ వివరాలు అడిగింది. కోడలు సరిగ్గా పట్టించుకోదుట. వేళకి
తిండి పెట్టదుట. జ్వరం వస్తే మందులు లేక అలాగే మంచంలో పడుకుని ఉంది. ఆ కొడుకు ఒక అసమర్ధుడు. భార్య మాటలు విని తల్లిని పట్టించుకోడు. అలాగా అంటూ మనోరమైన తలుచుకుని చాలా బాధపడింది జానకమ్మ.
సాయంత్రం అందరికీ టీ లతోపాటు స్నాక్స్ అందించింది. రేపు మనం అందరం ఒక తీర్మానం చేసుకుందాం ఇదే వేళ్ళకు రమ్మని చెప్పింది.
జానకమ్మ చెప్పబోయే తీర్మానం ఏమిటో అని అందరి మనసులో ఆదుర్దాగా ఉంది. మర్నాడు సాయంత్రం నిన్నటి లాగే జానకమ్మ స్నేహితులంతా వచ్చి చేరారు.
నాకు నా భర్త ఇచ్చిన ఆస్తి ఉన్నది. నేను ఖర్చు పెట్టుకుంటే అడిగే వారు లేరు. మనం అందరం పెద్దవాళ్లమయ్యాం. మన బిడ్డల మీద ఆధారపడి వాళ్ళ చేత మాటలు పడటం, వాళ్లకి అడ్డుగా ఉన్నామని అనిపించుకోవడం ఎందుకు. నిత్యం మనస్పర్ధలతో కలిసి ఉండే కన్నా దూరంగా మమతా అనుబంధాలతో ఉంటే మంచిదనిపిస్తుంది.
రేపటి నుంచి మనమందరం ఇక్కడే మా ఇంట్లోనే కలిసి ఉందాం. మీకు ఏదైనా సహాయం చేయాలనిపిస్తే చేయవచ్చు. మనం పదిమంది కూడితే ఏమైనా సాధించవచ్చు. మనలాంటి వృద్ధాప్యంలో ఎవరు బాధపడకూడదు. మనోరమను కూడా మనలో చేర్చుకుందాం. మనమే ఒక ఆశ్రమాన్ని నడుపుకుందాం. ఏమంటారు అంటూ అందరూ వైపు చూసింది.
మీ నిర్ణయం బాగుంది జానకమ్మ!
మాకు అదే పరిస్థితి వచ్చి పడింది. నువ్వు చెప్పినట్లుగానే మాట కోసం పలకరింపు కోసం ముఖం వాచిపోయాం అనుకో. ఇలాగైతే మనం స్వేచ్ఛగా గుడికి గోపురానికి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఎవరికైనా సహాయం చేయొచ్చు. కావాలనుకుంటే మన వాళ్లు మనల్ని చూడటానికి రావచ్చు. మనం పది మంది కలిసి ఇక్కడే ఉందామన్నారు.
వాళ్లందరి మాటలు నచ్చాయి తనలాంటి వారెందరో వృద్ధాప్యంలో కొడుకు కోడలు చూపే అశ్రద్ధకు గురి అయ్యి మానసికంగా బాధపడుతున్నారు. పనికిరాని వాళ్ళగా చూస్తున్న కొడుకు కోడలు బుద్ధి చెప్పాలంటే ఇదే మంచి నిర్ణయం. అందరినీ కలిపి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది జానకమ్మ.
వాళ్లంతా సోదర సోదరీమణుల్లాగా పలకరింపులు చేసుకుంటూ ఎవరికి చేతనైనా సాయం వాళ్లు చేస్తూ ఉన్నారు.
మనోరమ్మకు జ్వరం తగ్గాక జానకమ్మ ఇంటికి వచ్చింది. నాక్కూడా మీ ఇంట్లో స్నానం ఇస్తారా అడిగింది.
మేమే నిన్ను ఆహ్వానించాలి అనుకున్నాం. తప్పకుండా మనోరమా.
నువ్వు కూడా వచ్చి మాతో పాటే ఉండు. నువ్వు ఏమీ డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు వస్తాయి. ఉన్నదాంట్లోనే మనమందరం కలిసి వండుకొని తిందాం కబుర్లు చెప్పుకుందాం మంచి మాటలు మనసు మనోధైర్యంతో గడపవచ్చు అన్నది జానకమ్మ.
మరుసటి రోజు నుంచి వృద్ధులంతా జానకమ్మకు అండదండలుగా నిలబడుతూ వారి జీవితాలను కూడా సద్వినియోగం చేసుకున్నారు.
తల్లులు తీసుకున్న నిర్ణయానికి కొడుకులు కోడళ్ళు ముందు సంబరపడిన,, ఏదో ఒకనాడు వాళ్లకి అదే రోజు వస్తుందని విచార పడక తప్పలేదు.
ఒక పలకరింపు మనసులో గాయాన్ని మాన్పుతుంది. ఒక పలకరింపు మనోధైర్యాన్ని ఇస్తుంది. ఒక పలకరింపు చిరునవ్వుల్ని చిందిస్తుంది. ఒక పలకరింపు జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది.
జానకమ్మ తో పాటు వాళ్ళందరూ పలకరింపుల పాటలో మునిగి తేలిపోయారు.