కవితా వాహిని..

కథ

       అరుణ ధూళిపాళ

ఉదయం సరిగ్గా నాలుగు గంటలు….
ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్.. అలారం అదేపనిగా మోగుతోంది. ఆ చప్పుడుకి అమాంతం కళ్ళు తెరిచిన కవిత “అప్పుడే నాలుగయ్యిందా? నిద్ర పోయినట్టుగానే లేదు” అనుకుంటూ అలారం గొంతు నొక్కేసింది. బద్ధకాన్ని పక్కకు నెట్టి, లేచి బ్రష్ చేసుకొని మెల్లగా తలుపు తెరుచుకొని బయటకు వచ్చి నడక మొదలుపెట్టింది. సరిగ్గా రామాలయం వద్దకు రాగానే మనసులోనే స్వామికి దండం పెట్టుకొని ” ఇలా ఇంకా ఎంత కాలమయ్యా!” అని రోజులాగే అనుకుంటూ బాధగా వెనుతిరిగి ఇల్లు చేరుకుంది. కిలోమీటరు దూరంలో ఉన్న రామాలయం వరకు నడక సాగించడం రోజూ ఆమెకు అలవాటు. ఇంతలో వచ్చిన పనిమనిషి రంగమ్మ తన పనుల్లో నిమగ్నమైంది. వంటింట్లోకి వెళ్లి రెండు కప్పుల కాఫీ కలుపుకొని వచ్చి, రంగమ్మకు ఒక కప్పు ఇచ్చి తానూ సోఫాలో కూర్చుంది కవిత కాఫీ తాగుతూ ఒంటరితనం తోడుగా…. “కవిత వింటుందా లేదా?” అని పట్టించుకోకుండా రంగమ్మ ఇరుగుపొరుగు విషయాలు ఏవేవో చెప్తూనే ఉంది. కానీ కవిత మనసు శూన్యంలోకి చూస్తోంది. ఎక్కడో ఆలోచిస్తోంది.
మరీ పెద్దది కాకపోయినా రెండు గదులు, ఒక హాలు, ఒక కిచెన్ లతో ఒద్దికగా ఉంటుంది ఆ ఇల్లు. ఎక్కడి వస్తువులు అక్కడే చలనం లేకుండా ఉంటాయి ఎప్పుడూ. ఆ విషయంలో కవితకు శ్రద్ధ చాలా ఎక్కువ.
ఇంటి ముందు కొన్ని పూలకుండీలు వచ్చినవారిని మర్యాదగా పలుకరిస్తుంటాయి. ఆ ఇంటికి వచ్చిపోయే
వారి సంఖ్య తక్కువే. ఎందుకంటే కవిత ఎవరితోనూ ఎలాంటి చనువు పెంచుకోదు. జరిగిన అనుభవాలు అలాంటివి. అందుకే కొత్తగా బాధను కనుక్కోవడం ఆమెకు ఇష్టం లేదు. ప్రాణానికి ప్రాణంగా భావించి పెద్దలను ఒప్పించి తనను ప్రేమ వివాహం చేసుకున్న భర్త
అయిదు సంవత్సరాల క్రితం ఆక్సిడెంటు రూపంలో దూరమయ్యాడు. తనకు పెళ్లి అయిన తర్వాత రెండు సంవత్సరాలకే మనుమడిని చూడకుండానే అమ్మ , నాన్న ఒకరి వెంట ఒకరు పద పద మన్నట్టు నెలల వ్యవధిలో మరణించారు. తన దుఃఖాన్ని గొంతులో పూడ్చిపెట్టి తమకు కలిగిన ఒక్కగానొక్క కొడుక్కి ఉద్యోగం రాగానే తండ్రి లేని లోటు లేకుండా ఉన్నంతలో మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. హఠాత్తుగా ఓ రోజు “ఆఫీసులో తనకు ఒక మంచి అవకాశం వచ్చిందని, డాలర్ పిలిచిందని అదృష్టం తన్నుకొచ్చిందని, కోల్పోతే మళ్ళీ ఇంకెప్పుడూ రాదని, కవితను కూడా రమ్మని, ఒంటరిగా ఉండొద్దని” ఎంతో ప్రేమగా అనునయించి చెప్పాడు. వాడి ప్రేమకు కట్టుబడి వెళ్లాలని ఉన్నా ఎందుకో సాహసం చేయలేక పోయింది. కొడుకు, కోడలు కన్నీటి పర్యంతమవుతూ విడిచిపోలేక అదృష్టాన్ని కాదనుకోలేక మధనపడుతూ రెండు సంవత్సరాల క్రితం విదేశాలకు వెళ్ళి పోయారు. ఒకరి కోసం ఒకరు ఆగిపోకుండా జీవితంలో ముందుకు నడవాలన్నదే కవిత అభిమతం. అందుకే వారి నిర్ణయాన్ని స్వాగతించి “నీవు రాకుంటే మేము వెళ్ళము” అని కొడుకు భీష్మించుకుంటే లాలనగా నచ్చచెప్పి పంపించింది. అప్పటినుండీ జ్ఞాపకాల సహవాసంతో రోజులు వెళ్లదీస్తూ ఉంది కవిత. భర్త పెన్షన్ కొంత, కొడుకు పంపించే డబ్బులు కొంత.. వీటితో జరుగుబాటుకు లోటు లేదు. ఉదయం లేవగానే వాకింగ్ చేయడం, పేపర్ తిరగేయడం, పుస్తకాలు చదవడం, ఫోనుతో కొంత కాలక్షేపం చేయడం, సాయంత్రం ఇంటికి దగ్గరగా వుండే దుర్గాదేవి ఆలయానికి వెళ్లి వచ్చి పోయే వారిని చూస్తూ ఓ గంటసేపు గడపడం కవిత దినచర్య. అప్పుడో ఇప్పుడో మిత్రులో, బంధువులో ఫోన్ చేస్తూ ఉంటారు. ఉన్న ఒక్క అన్నయ్య ఎప్పుడూ వ్యాపారం పనుల్లో బిజీగా ఉంటాడు. అతనికి చేదోడు వాదోడుగా వదిన కూడా అకౌంట్స్ చూస్తుంది. వాళ్ల పిల్లలిద్దరూ ఉన్నతంగా స్థిరపడ్డారు. అందుకే రావడం చాలా తక్కువ. అప్పుడప్పుడు తనే వెళ్లివస్తుంది. రాఖీకి మాత్రం నేనున్నానని గుర్తుకు తెస్తాడు.
” పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్లు పోయినోళ్ళ తీపి గురుతులు” అంటూ పక్కింటి టి. వి లోంచి వినిపిస్తున్న ‘మనసు కవి’ ఆత్రేయ గారి పాట కవితను వాస్తవంలోకి లాక్కొచ్చింది. పక్కింటి రామారావు గారికి పాత పాటలు ఎంతో ఇష్టం. అందుకే ఉదయాన్నే టివి లో పెద్ద సౌండ్ పెట్టి వింటుంటాడు. ఎందుకో కవిత పెదవులపై పేలవమైన నవ్వొకటి తెలీకుండానే వచ్చింది. ఆయనకేం బాగానే రాస్తారు. గుండెలకు హత్తుకుంటారు. కానీ ఉన్నోళ్లు పోయినోళ్ళ తీపి గురుతులు కారు. ఆ గురుతులతో బతుకుతున్న జీవచ్ఛవాలు అనుకుంది బాధగా. నిరాసక్తంగా అలాగే వెనక్కి వాలి పేపర్ చూస్తూ ఉండగా ” నవలా రచయితలకు ఆహ్వానం” అన్న శీర్షిక దగ్గర చూపులకు బ్రేకులు పడ్డాయి. ‘మహతి’ అనే సంస్థ వారు ఆ సంస్థ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న పోటీ అది. నిర్వాహకులు వారి తల్లి జ్ఞాపకార్థమై నిర్వహిస్తున్న పోటీ.
కవితలో మళ్లీ గతం చిగురించింది. కాలేజీలో చదువుతున్నప్పుడు మ్యాగజైన్ లో తాను రాసిన చిన్న కథ ప్రచురించబడింది. అధ్యాపకులు అందరూ మంచి రచయిత్రి కాగలిగే లక్షణాలు నీకున్నాయని మెచ్చుకున్నారు. ఆ తర్వాత వాటిమీద అంత దృష్టి పెట్టకపోయినా అప్పుడప్పుడు తీరిక దొరికినప్పుడు వ్యాసాలు, కథలు రాస్తూ పత్రికలకు పంపేది. వాటిల్లో 5, 6 వరకు ప్రచురించబడ్డాయి కూడా. ఇక పెళ్లి తర్వాత ఆ ఆలోచనకు స్వస్తి పలికింది. భర్త అంటుండేవాడు “ఊరికే ఉండకపోతే ఆ అలవాటును కొనసాగించ రాదూ !” అని. అయినా ఆ ఆసక్తి తనలో కలుగలేదు. ఈ ప్రకటన చూడగానే ఆమెలోని రచయిత్రి మేల్కొంది. ‘ఏం రాయాలా?’ అని ఆలోచిస్తూ “నా అనుభవాలనే నవలగా రాస్తే?” అనుకుంది. వాళ్ళిచ్చిన గడువు ఇంకా నెలరోజులు ఉంది. అనుకున్నదే తడవు రాయడం మొదలు పెట్టింది. దాదాపు 20 రోజులు పట్టింది రాయడానికి. తన జీవితమే కాబట్టి “కవితా వాహిని” అని పేరు పెట్టింది. దాదాపు ఒక నెలన్నర తర్వాత ఫలితాలు ప్రకటించారు. ఎన్నుకున్న మూడు నవలల్లో ఈ నవల మొదటి స్థానాన్ని పొంది విజేతగా నిలిచింది.
ఆ సంస్థవారు ఫోన్ చేసి అభినందిస్తూ వచ్చేవారం జరిగే సన్మానసభకు రావల్సిందిగా ఆహ్వానించారు.
పెద్ద వేదిక. దాదాపు 100మందికి పైగా హాలు నిండిపోయి ఉంది. బెరుకు బెరుకుగా లోపలికి అడుగు పెట్టగానే పుష్పగుచ్ఛాన్ని అందిస్తూ “అభినందనలు మేడం రండి” అంటూ సంస్థ వారు దగ్గరుండి వేదిక మీదకు తీసుకెళ్లారు. మిగతా ఇద్దరు విజేతల్లో ఒక రచయిత్రి , రచయిత వున్నారు. ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకున్నారు. అంతా కొత్తగా ఉంది. అందరి కరతాళ ధ్వనుల మధ్య 25 వేల రూపాయల నగదు బహుమతిని, ప్రశంసా పత్రాన్ని, శాలువతో వారి సత్కారాన్ని పొందింది. నిర్వాహకులు ఇప్పుడు ప్రథమ బహుమతి విజేత అయిన “కవితావాహిని” రచయిత్రి కవితగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అని ప్రకటించారు. కవిత పై ప్రాణాలు పైనే పోయాయి. అయినా తప్పదు కనుక ధైర్యం కూడగట్టుకొని మెల్లగా అడుగులు వేస్తూ మైకు చేతికి అందుకుంది.
” సభకు నమస్కారం. ఇలాంటి రోజు ఒకటి నా జీవితంలో ఒక మరపురాని అనుభూతి జ్ఞాపకంగా మిగిలిపోతుందని కలలో కూడా ఊహించలేదు. ఒక సాధారణ మహిళగా దినచర్య గడుపుతున్న నాకు నాలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఒక మంచి అవకాశం కలిగించిన ‘మహతి’ సంస్థకు సదా రుణపడి ఉంటాను. ఇక్కడ వేసిన మొదటి అడుగుతో ఇకముందు నా ప్రజ్ఞను ఇంకా మెరుగు దిద్దుకునే దిశగా సాగుతాను. జీవితం చాలా చిన్నది. కాలంతో మన ప్రయాణం ఆగదు. అది ఎంత ముళ్ళ బాట అయినా అక్కడే ఆగిపోకూడదు. దీనికి ఆడ, మగ అనే తారతమ్యాలు లేవు. మును ముందుకు నడవడమే మనిషి కర్తవ్యం” అంటూ ముగించింది. చప్పట్లహోరులో
ఆనందంతో కన్నులు చెమ్మగిల్లుతుండగా కృతజ్ఞతా పూర్వకంగా చేతులు జోడించి అందరికీ నమస్కరిస్తుండగా మసకబారిన కళ్ళకు ఎదురుగా చప్పట్లు కొడుతూ గర్వంగా తన వైపే చూస్తున్న కొడుకూ కోడలు నవ్వుతూ కనిపించారు.

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

పలకరింపు.