ఒంటరి పోరాటం

కథ

    కట్టెకోల విద్యుల్లత

ఇప్పుడు ప్రఖ్యాత సినీ సంగీత కళాకారులు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఐన ఉదిత్ నారాయణ్ గారు “ఉత్తమ ఫ్యూజన్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్” అవార్డుని ప్రకటిస్తారు.

మైక్ లో యాంకర్ ఎనౌన్స్ మెంట్ వినగానే ఒక్కసారిగా ఎలర్ట్ అయింది వింధ్య. ఔను మరి ఈ కేటగిరీలో తన కూతురు ‘ఆశ్వి’ నామినేట్ అయింది. అదీ మన దేశంలో సంగీతం లో అత్యుత్తమమైన అవార్డు గా పేరు పొందిన గీమా అవార్డ్ లలో. ( GIMA stands for global Indian music awards)

నామినేట్ అయిన వారి అందరి పేర్లు చదువుతున్నారు.”అండ్ నౌ ది అవార్డ్ గోస్ టు” ఉదిత్ నారాయణ్ గారు తీసుకున్న ఆ పది సెకండ్ల విరామం పది సంవత్సరాల లా తోచింది వింధ్య కు. ఆశ్వి వైపు చూసింది. తను కాస్త కూడా కంగారు పడటం లేదు, ప్రశాంతంగా ఉంది. అది చూసి కాస్త స్థిమితపడింది తల్లి మనసు.

“గోస్ టు కుమారి ఆశ్వి ” తన ఫేవరెట్ సింగర్ ఐన ఉదిత్ నారాయణ్ గారి గళంలో అందంగా తన కూతురు ‘ఆశ్వి’పేరు వినిపించగానే మైమరచి పోయింది వింధ్య. తన చిరకాల వాంఛ నెరవేరింది.

హాల్ లో అందరూ కరతాళ ధ్వనులతో తన కూతుర్ని ఆశీర్వదిస్తోంటే ఆ క్షణంలో తన జీవితం సఫలమైన ఫీలింగ్ కలుగుతోంది తల్లిగా.

“16 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కర్నాటిక్, హిందుస్తానీ సంగీతాలతో పాటుగా పది రకాల ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేర్చుకుని ఔరా అనిపించే విధంగా సంగీతం లో కొత్త ఒరవడిని సృష్టించింది ఆశ్వి. దీనితో పాటు పాప్ మ్యూజిక్ కూడా కలిపి ఫ్యూజన్ చేస్తూ తను చేస్తున్న ఆల్బమ్స్ ఇప్పుడు సంగీత ప్రపంచాన్ని, ప్రపంచం లోని యువతను ఉర్రూతలూగిస్తోందంటే అతిశయోక్తి కాదు. నువ్వు ముందు ముందు సంగీతం లో అత్యున్నత శిఖరాలకు చేరుకుంటావు ఆశ్వి, అందులో సందేహం లేదు. నీకు మా అందరి ఆశీస్సులు, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటాయి. నిన్ను కన్న తల్లి దండ్రులు అదృష్టవంతులు,” ఎంతో ఆనందంగా ఆశ్వి ని గుండెలకు హత్తుకుని, ఆమెను పొగడ్త లతో ముంచెత్తారు ఉదిత్ జీ.

తనను మాట్లాడమని మైక్ ఇచ్చారు ఆశ్వి కి.  “వేదికనలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా ఈ ఉన్నతికి, నా ఈ జీవితానికి కారణమైన మా అమ్మ ను మీ అందరి పర్మిషన్ తో స్టేజ్ మీదకు పిలవానుకుంటున్నాను, అమ్మా ప్లీజ్,” ఊహించని ఈ పరిణామానికి విస్తుపోయినా, తేరుకుని స్టేజ్ మీదకు వెళ్ళింది వింధ్య.

“నేను ఈ రోజు ఇలా మీ అందరి ముందూ నిల్చుని, నిజానికి జీవించి ఉన్నానంటే దానికి మా అమ్మ కు నేను ఋణపడి ఉన్నాను. నాకు తల్లీ తండ్రీ, గురువు స్నేహితురాలు అన్నీ తానై పెంచింది మా అమ్మ వింధ్య.

థాంక్యూ అమ్మా, ఇంతకన్నా ఏమీ చెప్పలేను. కానీ ఈ మాట నా జీవితం లోని ప్రతీక్షణం చెప్తూనే ఉంటాను. ఆడపిల్ల నాకు వద్దంటూ, వదిలేసిన ఓ నాన్నా, ఈ ప్రోగ్రాం కనుక మీరు చూస్తున్నట్లైతే ఇకనైనా మారండి. ఆడపిల్ల కూడా ఏదైనా సాధించగలదు సరైన ప్రోత్సాహం ఉంటే,”  ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ తల్లి తో కలిసి గబగబా కిందకు వచ్చేసింది ఆశ్వి.

ఆశ్వి చెప్పిన మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తర్వాత ప్రోగ్రాం కంటిన్యూ ఔతుండడంతో ఆ వైపు దృష్టి మరలింది.

మరుసటి రోజు ఉదయం తన ఇంటర్వ్యూ తీసుకునేందుకు వచ్చిన విలేఖరి అడిగిన మొదటి ప్రశ్న తన తండ్రిని గురించి అవడం ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదు ఆశ్వి కి. తను ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉంది.

” ఔనండీ, 17 సంవత్సరాల క్రితం మా అమ్మకు పెళ్లి జరిగింది. ఒక సంవత్సరం కల్లా నేను పుట్టాను. మొదటి బిడ్డ నైన నన్ను చూసి ఎంతో మురిసిపోయింది మా అమ్మ. కానీ ఆడపిల్ల అయినందువల్ల నన్ను చూడటానికి కూడా మా నాన్న రాకపోవడంతో షాకైంది. ఉయ్యాలలో వేసినప్పుడు (బారసాల) కూడా వాళ్ళ వాళ్ళు ఎవరూ రాలేదు. 3 నెలల వయసున్న నన్ను తీసుకుని తనే వెళ్ళిందిట నాన్న వాళ్ళ ఇంటికి.

ఎవరూ తనకు ఆహ్వానం పలకలేదు. పైగా మా నాన్న నన్ను 5 వ అంతస్తు నుంచి కిందకి విసిరేసారుట. నాది గట్టి ప్రాణం, మా కింద ఇంట్లో అంకుల్ నన్ను కాపాడారు. ఆ తర్వాత నేను పాల కోసం ఏడుస్తుండగా అమ్మ దగ్గర్నుంచి లాక్కుని వేరే గదిలో పడేసారుట, ఆకలితో ఐనా చచ్చిపోకపోతానా అని. లోపల నేను , బైట మా అమ్మ ఏడుస్తూ ఉన్నాం.

ఏడుపు ఆగిపోవడంతో చూసేందుకు తలుపు తీయగానే,నన్ను ఎత్తుకున్న మా అమ్మ కు అల్టిమేటం ఇచ్చారు ” అది ఉంటే నీ జీవితంలో నేను ఉండను, ఎవరు కావాలో నిర్ణయించుకో” అని.

మా అమ్మ నన్ను ఎంచుకుని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆ నిర్ణయాన్ని మొదట్లో మా అమ్మమ్మ వాళ్ళు కూడా హర్షించలేదుట. పాపం కూతురి జీవితం గురించి భయం కదా వాళ్ళకి. కానీ మా అమ్మ మాత్రం ఒంటరిగా, ధైర్యంగా జీవించింది. ఎవరేమనుకున్నా లెక్క చేయకుండా నన్ను పెంచి ఇంత దాన్ని చేసింది.

ఇంతకీ మా నాన్న ఏదో అనామకుడు,అనాగరికుడు, చదువులేని వాడు కాదండోయ్, డాక్టర్ గిరీ వెలగబెట్టారుట! మరి అంత చదువుకున్న అతనికి తెలియదా పుట్టిన పిల్లలకు లింగం నిర్ధారించేది పురుషుల జన్యువే అని? తెలిసినా నిజాన్ని అంగీకరించలేని పురుషాహంకారం!!

తను సరదాగా నేర్చుకున్న సంగీతంతో ఏదో స్కూల్ లో సంగీతం టీచర్ గా చేరింది. అమ్మకు నిజానికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఏ పని చేస్తున్నా, తను పాడుతూనే ఉండేది. అలా నాకు అమ్మ కడుపులో ఉన్నప్పుడే సంగీతం అబ్బిందేమో. నేను మాట నేర్చుకున్నప్పుడే పాట కూడా నేర్చుకున్నానని చెబుతుంది తను. అలా సంగీతంలో నాకు ఆసక్తి కలగడంతో ఎంతో సంతోషించింది అమ్మ. మా మామయ్య కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. మంచి గురువుల వద్దకి నన్ను పంపించారు. ఇప్పుడు నేను 3 రకాల ఓకల్ మ్యూజిక్,పది రకాల ఇన్స్ట్రుమెంట్  అలవోకగా నేర్చుకున్నానంటే అందులో నాతో సమానంగా, చెప్పాలంటే, నాకన్నా ఎక్కువగా మా అమ్మ కృషి, ప్రోత్సాహం ఉన్నాయి.

నా పేరు,’ఆశ్వి’ కూడా తను ఎంతో ఆలోచించి సరస్వతీ దేవి యొక్క నామాల లోంచి వెతికి పెట్టింది. ఎదురులేనిది అని కూడా అర్థం అట నా పేరుకి. ఆడపిల్ల అయినందువల్ల నన్ను వొదిలేసిన మా నాన్న లాంటి మగవారికి గుణపాఠంగా, ఏదో ఒక రంగంలో అద్భుతమైన శక్తిగా నిలిచేలా నన్ను పెంచాలని మొదటి రోజునే నిర్ణయించుకుందిట మా అమ్మ.

చిన్న వయసులోనే ఒంటరి గా జీవిస్తున్న మా అమ్మను పెళ్లి చేసుకుంటామని, తనతో పాటు నాకు కూడా మంచి జీవితం ఇస్తామని ఎందరో మగవాళ్ళు తనను కోరినా, వాటిని తృణీకరించి, నాకోసం ఒంటరిగానే జీవించింది. ఈనాడు నేను సాధించిన ఈ విజయం మా అమ్మ లాంటి ఎందరో స్త్రీలకు స్ఫూర్తి, మా నాన్న లాంటి మగవారికి ఒక గుణపాఠం కావాలని కోరుకుంటున్నాను.

ఈ అవార్డును మా అమ్మ కు అంకితం ఇస్తున్నాను. ఇంతటితో తృప్తి పడకుండా, ముందు ముందు ‘గ్రామీ'(ప్రపంచం లనే  సంగీతానికి అత్యున్నత మైనది) అవార్డు కూడా కైవసం చేసుకుని, మా అమ్మ చేసిన త్యాగానికి నిజమైన నివాళి ఇవ్వాలనేది నా జీవితాశయం,” ఆవేశంగా చెప్తున్న కూతురిని చూస్తూ తన ఒంటరి పోరాటానికి సార్థకత చేకూరినట్లు భావించింది వింధ్య.

Written by Vidyullata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గొప్పింటి విందు

మహిళామణులు