బాల్యం అపురూప జ్ఞాపకం
బుడిబుడి నడకల ఆనవాల్లు
అమ్మ నాన్నల ఆప్యాయత
గుండెల పై ఆడించిన నాన్న
గోరుముద్దలు తినిపించే అమ్మ
గారాబం చేసే అమ్మమ్మ తాతయ్యలు
మా ఇంటి మహాలక్ష్మి అనే తాతనాన్నమ్మ
గిల్లికజ్జాలతో అన్నయ్య
అలిగి సాధించే చెల్లెలు
చీటికిమాటికి చిట్టి గొడవల తమ్ముడు
కాకి ఎంగిలి ,కటిప్ దోస్తుల బంధం
సరదా ఆటపాటల్లో అమ్మ చివాట్లు
చదువుల ర్యాంకులు తగ్గుతే
నాన్న కోపంపై నా అలకపాన్పు
నానమ్మ బుజ్జగింపులు
అయినా అది మా పుట్టిల్లు
ఆప్యాయతల హరివిల్లు
రక్త సంబంధాల అనుబంధం
పెళ్లి తర్వాత అత్తారిల్లు అంటేనే
అమ్మ బాబోయ్ అనే భయం
పుట్టిల్లు వదలాలంటే బెరుకు
ఎన్ని రోజులైనా పుట్టింటిపై అభిమానం
కారం మెతుకులు తిన్నా
తల్లి గారింటి పై తగ్గని మమకారం
పసుపు కుంకాలు, చీరసారెలతో పది పది కాలాలు చల్లగా ఉండాలని
సగౌరవంగా సాగనంపై పుట్టిల్లు
ఆడబిడ్డ దీవెనలు అన్నదమ్ములపై
ఆకాశమంత ప్రేమతో ఆశీస్సులు
పండగ పబ్బాలకు పుట్టిల్లు పైనే
కొట్టుమిట్టాడే ఆడబిడ్డల ప్రాణం
మెట్టింట్లో పుట్టిల్లు గౌరవం
కాపాడే ఆడబిడ్డలు….
ఇంటి పేరు మారినా
ఇంతులకు ఇసుమంతైనా తగ్గని పుట్టింటి ప్రేమ….