” ఇచ్చా మరణం ” కొంతమంది సాదువులు , గురువులు కోరుకుని ,సాధించారు. మరి అది తప్పు కానప్పుడు ” ఆత్మహత్య” కూడా ఇచ్చామరణమేనా?సాధువులు, గురువులు ఒక పరిపూర్ణత అనుభవించి, మోక్ష దృష్టి తో కోరుకున్నది” ఇచ్చా మరణం”
కానీ జీవితం లో , ఒక నిస్తేజపు, చీకటి క్షణాలలో , నిరాశ, నిస్పృహ కమ్ముకున్న కాలంలో, ఒక బాధా పూరిత నిర్ణయం ఆత్మహత్య. నిన్నటి వరకు స్నేహితులతో జపాన్, దక్షీణ కొరియాలలో సున్నా నుండి మొదలై వాళ్ళు సాధించిన అభివృద్ధి గురించి గొప్పగా మెచ్చు కున్న శ్రీహర్ష ఈ రోజు ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలను బడికి పంపేటప్పుడు వాళ్ళు రోడ్డు దాటేటప్పుడు, స్కూల్ బస్ దిగేటప్పుడు తీసుకోవలసిన రకరకాల జాగ్రత్తలు పిల్లలకు రోజు చెప్పే చెప్పే అమల నాలుగు రోజుల క్రిందట ఆ పిల్లలను వదిలేసి ఆత్మహత్య చేసుకుంది.
రోజురోజుకూ ఆత్మహత్యల సంఖ్య ఎందుకు పెరుగుతున్నది? ఏమీ జరుగుతున్నది? ఎలా ఆపగలం?కారణాల గురించి ఆలోచిస్తే ముందుగా మన మనస్సుకు తట్టేది ఒకటే. భరించలేని ఒత్తిడి. మన జీవితం లో ఆ ఒత్తిడికి లో నైనప్పుడు, నిస్తభతతో వున్న హృదయం మన లో వున్న శక్తి ని తక్కువగా అంచనా వేస్తుంది. ఒక సహాయం కోసం ఆక్రోశించేలా చేస్తుంది. జీవితం బాధాకరం గా మారుతుంది.
“ఇంక చాలు ఈ జీవితం. ఇక ముగింపు పలుకుదాము ఈ జీవితానికి” అనిపిస్తుంది.
ఆర్థిక పరమైన , విద్యాపరమైన ఒత్తిళ్లు, సమస్యలు బంధుత్వ సమస్యలు, కుటుంబ పరిస్థితులు ఇలాంటి అనేక సమస్యలు చుట్టుముట్టినప్పుడు, వాటిని అధిగమించలేక, దారి తోచని స్థితి లో , మానసిక క్షోభకు, అల్లా కల్లోలానికి గురవుతారు. ఆత్మహత్య లే తమ సమస్యకు పరిష్కారం గా భావిస్తున్నారు. కానీ, ఆ సమయంలో వారిని విమర్శించకుండా , తప్పా, , ఒప్పా అని విశ్లేషించకుండా , వారి మాటలను మనస్సుతో విని , వారిని అర్థం చేసుకునే వారు కానీ, ఒక సంస్థ కానీ వుంటే వారు ఆ ఆలోచనలనుండి బయటకు రాగలుగుతారు. ఆత్మహత్య ఆలోచనలలో వున్న వారికి, ప్రజలందరికీ ఇలాంటి సహకారం చాలా అవసరం.
రోషిణి అనే ఒక సంస్థ ఆపదలో వున్న మరియు సంక్షోభ పరిస్థితిలో వున్న ఎవరికైనా ఉచిత మరియు గోప్య మైన భావోద్వేగ సహాయాన్ని అందించే స్వచ్చంద సంస్థ. ఎవరు ఎన్నిసార్లయినా కాల్ చేయవచ్చు. ఫోన్ కాల్ వ్యవధిపై పరిమితి లేదు.
రోషిణి ఈ రంగంలో 25 సంవత్సరాల సేవలను పూర్తి చేసింది. ఈ సంస్థలో 70 మంది శిక్షణ పొందిన వాలంటీర్లు వున్నారు. వీరు కళావతి నివాస్ , సింధీ కాలనీ , సికింద్రాబాద్ లో ఉదయం 11 నుండి రాత్రి 9 గంటల వరకు కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వారం లో అన్నీ రోజులు అంటే 7 రోజులలో ఎప్పుడైనా ఏ వ్యక్తులైనా రోషిణి హెల్ప్ లైన్ కు ఫోన్ చేయవచ్చు.. లేదా వ్యక్తిగతం గా సందర్శించ వచ్చు. మాకు 2 హెల్ప్ లైన్ లు వున్నాయి. ఇవి వారం లోని అన్నీ రోజులలో ఉదయం 11 నుండి రాత్రి 9 గంటల వరకు తెరచి వుంటాయి. సుశిక్షితులైన మా వాలంటీర్లు కాల్స్ తీసుకుంటారు. వ్యక్తిగతం గా సంప్రదించిన లేక ఫోన్ లో సంప్రదించిన వారితో ఒక ఆత్మీయ నేస్తం గా కౌన్సెలింగ్ చేస్తాము. అవసరమైతే, వారి అనుమతి, అంగీకారం ను అనుసరించి వారిని మానసిక నిపుణులకు పరిచయం చేస్తాము
Roshini ని ఇక్కడ ఇచ్చిన హెల్ప్ లైన్ నంబర్స్ వుపయోగించి సంప్రదించవచ్చు.
.814 20 20033 / 814 20 20044
కేంద్రంలో ముఖాముఖి
లేదా ఇమెయిల్ ద్వారా – roshnihelp@gmail.com
రోషిణి యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్:
వెబ్‌సైట్: roshnitrusthyd.org
Facebook : రోషిణి NGO
Instagram: రోష్నిహెల్ప్లైన్
యూట్యూబ్ : https://www.youtube.com/channel/UCbqf_Y_qia40WChqwb1wTVA
వ్రాసినవారు :నిర్మల భాగవతుల
రోషిణి వాలంటీర్