అన్వేషి తన పడక మీద ఎడమ చేతితో వెతుకుతోంది! ఊహూ కనపడలేదు! ఆమె తల వైపు, కప్పుకునే బ్లాంకెట్ అన్నీ కళ్ళు మూసుకునే వెతికింది. చేతికి అందలేదు తను వెతుకుతున్న వస్తువు నిద్రమత్తు వదిలించుకుని ఒకసారిగా లేచి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులు పైన అంతా వెతికి ఏమైపోయిందబ్బా! అనుకుంటూ మొబైల్ కోసం వెదుకుతుంది.
లేవగానే ఎడమ చేయి నొప్పి పెడుతోంది ఎందుకు? అబ్బా !అనుకుంటూ చెయ్యి నొక్కి చూసుకున్నది. చప్పున గుర్తుకొచ్చింది. ఓ! రాత్రంతా మొబైల్ పట్టుకొని యూట్యూబ్ చూసి చూసి ఏ అర్ధరాత్రి దాటాకనో పడుకున్నాను కదా! కనీసం పావుకిలో బరువున్న మొబైల్ అన్ని గంటలు పట్టుకుంటే ఈ వయసులో నొప్పి పుట్టదా? అనుకుంటూ….
రోజూ అనుకుంటాను రేపటి నుండి సరిగ్గా సమయానికి అంటే 10 గంటల లోపే నిద్రకు ప్రయత్నించాలని…
కానీ రాదే ?ఎంతకూ నిద్ర రాకపోయేసరికి ఏం చేయాలో తోచక మళ్ళీ యూట్యూబ్ చూడటం… అలసిన కండ్లు, చెవులు, మెదడు ఎప్పటికో నిద్రలోకి జారడం, చేతిలో నుంచి మంచం కిందకు ముబైలు జారడం జరిగిందన్నమాట!
“ఎందుకింత మొబైల్ వ్యసన పరురాలినైనాను? దాన్ని రేపటి నుండి కింద హాల్లో పడేయాలి!లేదా చార్జింగ్ పెట్టకుండా… కొంతసేపు చూసి ఫోన్ చచ్చిపోతే నిశ్చింతగా నిద్రపోవచ్చు!” అనుకుంది. కానీ మంచినీళ్లైనా మరుస్తుందేమో, కానీ మొబైల్ ను చంటి పిల్ల వలె చంకనేసుకొని మరీ పడక గదికి చేరుతుంది అన్వేషి!
ఇదివరకైతే ఉదయమే లేవగానే కళ్ళు తెరిచి అరచేతులు చూస్తూ
కరాగ్రేవసతే లక్ష్మీ
కరమధ్యే సరస్వతీ
కరమూలేతు గోవిందా!
అని ధ్యానం చేసుకుని.. అరచేతిలో మొక్కుకొని,పడక దిగేదాన్ని. కాల కృత్యాలు వగైరాలు కానిచ్చి దినచర్యలో పడేదాన్ని. నిజంగా ఆరోజు చేయాలనుకున్న పనులన్నీ బద్ధకం లేకుండా చేసేదాన్ని.
అంతకుముందు ల్యాండ్ ఫోన్ లో అత్యవసరమైతే తప్ప ఫోన్ కాల్ చేసేదాన్ని! ఆ ఫోన్ ను ఎక్కువ ఉపయోగించక పోయేదాన్ని ! పోస్ట్ ఆఫీస్ లో మాత్రమే ఉత్తరాలు, ఇన్లాండ్ లెటర్లు,పోస్ట్ కార్డులు, ఎన్వలప్ లు ,పెన్నులు, పాళీలు, ఆకుపచ్చ సిరా, బ్లూ సిరా బుడ్లు కొనుక్కొని తెచ్చుకునే దాన్ని! ఎందుకంటే దగ్గర ఉన్న షాపులో ఈ సరంజామా దొరకకపోయేది.
అన్నయ్యలకు, నాయనకు, అమ్మకు ఉత్తరం రాస్తే ఇన్లాండ్ లెటర్ పూర్తిగా నింపి, చుట్టుపక్కల కూడా రాసి, మడతపెట్టిన చోటు అతికించే దగ్గర మాత్రం వదిలి, మొత్తం నింపే దాన్ని! ఇప్పుడు మొబైల్ అరచేతిలో ఉన్నా, మూలకు దుమ్ము కొట్టుకున్న డిజైన్ కుట్టిన కవర్ వేసుకొని బద్దకస్తురాలైన పిల్లి వలె ముడుచుకుని పడి ఉంటుంది… కానీ దాని తెరతీయనే తీయను! ఎందుకు? ముచ్చట్లు అయిపోయాయా? ఎందుకు? మాటలు రాక స్తబ్దంగా అయ్యాను? పొడిపొడిగా రెండు మాటలు మాట్లాడి మళ్లీ చేస్తానని ఫోన్ క్రెడిల్ చేస్తున్నాను. మనసు ఎండిపోయిందా? మమతలు మాయమైపోయాయా? బంధుత్వాలు ఏవీ? అడుగంటి పోయాయా? ఏమిటీ మార్పు?ఎంతోమందిమి ఇలా ఎందుకయ్యాం?
నాగరీకతకు నాంది పలుకుతూ.. మొబైల్, ఐపాడ్, లాప్ టాప్, కంప్యూటర్లు పోస్టాఫీసుకు పోనక్కర లేకుండా చేసింది.
అనుకుంటూనే పాత జ్ఞాపకాలలోనికి జారిపోయింది అన్వేషి!
మా ఊళ్లో ఎంత బాగుండేది. పొద్దున్నే వ్యవసాయ నౌకరు వచ్చి, పెద్ద దర్వాజా కొట్టగానే దానికున్న ఇత్తడి గంటల చప్పుడుకు మెలకువ వచ్చేది. పాలు పిండేందుకు ఇత్తడి తప్పేలా అందులో కొంచెం నీళ్లు పోసిచ్చి, చిన్న ఇనుప మూకుట్లో వేరుశనగ పొట్టు, గానుగ పట్టితే వచ్చే తెలకపిండి, తౌడు, ఉప్పు, ఉలువలు దాణా తెచ్చి,
అమ్మ నౌకరికిచ్చి అతనితో కూరగాయాలు, పచ్చి మిరపకాయలు, తెమ్మని, అలాగే ఆరోజు చేయవలసిన పనులన్నీ చెప్పి అక్కడే నిలబడి ఉండేది. అతను పాలు పిండి తీసుకుని వచ్చి పందిరి కింద ఉన్న ఉట్టిలో పెట్టి పశువులను విడిచి, పాకను శుభ్రం చేసి, తీసుకొని చేన్లోకి వెళ్లిపోయేవాడు. చెంబులతో నీళ్లు, పీటలు, బొగ్గు కచ్చికలు పెరట్లో పెట్టి, తాను ముఖం కడుక్కొని బొగ్గుల పొయ్యిలో బొగ్గులు వేసి, చిత్తుకాగితాలతో అగ్గిపుల్లతో నిప్పులు చేసి, చాయ్ కెట్టిల్ కుంపటి మీద పెట్టేలోగా ఒక్కొక్కరే కుటుంబ సభ్యులందరం దాని చుట్టూ చేరిపోయేవాళ్ళం. చలికాలం అయితే కుంపటికి కాస్త దగ్గరగా, మిగతా కాలాల్లో కాస్త ఎడంగా కుంపటి చుట్టూ పీటలు వేసుకొని కూర్చునేవాళ్ళం.
నాయనకు ఎప్పుడూ చమత్కారంగా మాట్లాడటం అలవాటు. అలానే అమ్మ తో మోహినీ దేవి స్వయంగా వచ్చి ఆ అమృతం పంచినా వద్దని నీ చేతి చాయ్ నే తాగుతాం… అంతే కాదు ఆమెకీ జర్మన్ సిల్వర్ గ్లాస్ లో పోసి ఇవ్వు! అమృతం- గిమృతం జాంతానై అని శుభ్రంగా నీ చేతి చాయ్ కోసం రోజు మన ఇంటికి వస్తుంది మాలాగా! అనేవారు.
ఛాల్లేండి ! సంబడం! పొద్దున్నే ఈ చాయ్ స్తోత్రాలేమిటీ? అనేది అమ్మ!
అలా చాయ్ ప్రహసనం ముగించి ఎవరి పనుల్లోకి వారు వెళ్ళిపోతే ఆ ఉదయం శుభోదయమే కదా!
ఆనాటి బొగ్గు కచ్చికే పేస్ట్ గా రూపాంతరం చెందింది. ఆనాటి కుంపటి మారి, కిరసనాయిలు పంప్ స్టవ్వు, బత్తీల స్టవ్వు, కరెంటు స్టవ్, తర్వాత గ్యాస్ పొయ్యి , సోలార్ స్టవ్ గా మారింది. అది సాంకేతికత తెచ్చిన పెనుమార్పు!
ఇప్పుడు ఎవరికి వీలైనప్పుడు వారు చాయ్ చేసుకుంటారు.. కూర్చొని అందరూ ఒకసారి చాయ్ తాగే అవకాశమే దొరకడం లేదు.
నాయన పొలానికి వెళ్లి “దుక్కి మంచిగా దున్నారా? లేదా? పొలం నాటుకు సిద్ధమైందా!” అని కామచేను పొలం చుట్టూ తిరిగి, చేలోకి వెళ్లి, కూరగాయలు తెంపించి, ఎరుకలి బుట్టలో నింపించుకొని జీతగాండ్లకు పనులు పురమాయించి ఇల్లు చేరే సరికి 8:00 గంటలు కొట్టేది. నేరుగా బావి మీదకు వెళ్ళి తానే స్వయంగా నీళ్లు చేదుకొని స్నానం చేసి, ధోవతి గట్టిగా పిండుకొని, సంధ్యావందనానికి చెంబులో నీళ్లు పట్టుకొని, సంధ్య వార్చుకొని నిత్యానుసంధానం చేసుకొని, రామాయణ పారాయణం చేయడానికి వాలు కుర్చీలో కూర్చొని ఆనాటి పారాయణం ముగించేలోగా ఆరేగింపు చేయమని అమ్మ పిలుపు!
ఇంతటి నడక- వ్యాయామము కొత్త రూపుదాల్చి, సాంకేతిక పరిణామంలో… యంత్రాల సహాయంతో నాలుగు గోడల మధ్య, స్వచ్ఛమైన గాలి పీల్చక చేసే వ్యాయామం కిందకు చేర్చుకున్నాం!
తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచిన అమ్మ, ఇంట్లో మిగతా పెద్దవారు 12 గంటల దాకా ఇంటెడు చాకిరీ చేసి, వంటచేసి, మగవాళ్ళంతా ఒకవైపున- పిల్లలకు ఒకవైపు పీటలు, కంచాలు, మరచెంబులలో మంచి నీళ్లు, గ్లాసులు అన్ని సిద్ధం చేసి వారి భోజనమైపోగానే వంటిల్లు సర్ది కాసేపు ఒక కునుకు తీసేవారు పెద్దవాళ్లు.
వేసవి సెలవులలో చిన్న వారంతా దాగుడు మూతలు, తొక్కుడు బిళ్ళలు, అష్టా చమ్మా, ఓమన గుంటలు, కచ్చకాయలాడుతూ కాలక్షేపం చేసేవారు. పెద్దవారు పచ్చీసు ఆడేవాళ్లు….
క్రికెట్ట్, ఆన్ లైన్ ఆటలు, వీడియో గేమ్ లొచ్చి, ఈ ఆటలన్నీ నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకొని పోయి, బొర్ర బాబులూ, బొజ్జ అమ్మాయిలుగా ఊబకాయంతో వచ్చే జబ్బుల బారిన పడుతున్నారు… నాగరికులైనాం! కదా! నాజూకుతో పనేం ఉంది?
వ్యవసాయ నౌకర్లు మోదుగు ఆకులు తెచ్చి మనసాలలో పోసేవారు, చొప్ప పుల్లలు సన్నగా చీల్చి చక్కగా శుభ్రం చేసి విస్తర్లు కుట్టేందుకు తయారుచేసి పెట్టుకునే వారు పెద్దవాళ్లు! వేసవికాలంలోనే అలా విస్తర్లు కుట్టాలి! లేకపోతే ఆకులు దొరకవు! ఫలహారాల కోసం చిన్న అంట విస్తర్లు, రోజూవారీ భోజనాల కోసం- మామూలు సైజు విస్తర్లు, మొగ్గల విస్తర్లు- శుభ కార్యాలకోసం; తద్దినం రోజు భోక్తలకోసం- పెద్ద విస్తర్లు కుట్టేవారు. శుచికి-శుచీ,
ఖర్చులేని సౌకర్యం-
ఈనాడు మనమేమో విస్తర్లను మాయం చేసి ,యూజ్ అండ్ త్రో [ use & throw] ప్లేట్లు, థరమాకోల్ ప్లేట్లనువాడుతున్నాం. బోలెడు ఖర్చు పెట్టి… వాటికీ తరతరాల చరిత్ర ఉంది! ముందు అట్టకు సిల్వర్ ఫాయిల్ అంటించిన ప్లేట్స్ , తర్వాత తామరాకుల పళ్ళాలు, తర్వాత అరటి బెరడుతో చేసిన విస్తర్లు, తర్వాత ప్లాస్టిక్ పేపర్ తో చేసినవి, బ్రౌన్ పేపర్తో చేసిన వాటితో సాంకేతిక అభివృద్ధి పొందామా?…
పర్యావరణ కాలుష్యమా? అనే ఆలోచన పర్యావరణ వేత్తలు చేస్తూ ఉండగానే వామనుడు- త్రివిక్రముడి వలె బ్రహ్మాండమంతా వ్యాపించి పోయాయినట్టు ఈ డిస్పోజబుల్ సరంజామా వ్యాపించి పోయాయి. ఇవేనా అంటే కానేకాదు! ఇంకా చాలా ఉన్నాయి. బఫే భోజనాలలో ఫైబర్, సిరామిక్, బొక్క, ప్లాస్టిక్ పళ్లాలు మరియు ప్లాస్టిక్ గ్లాసులలో తింటున్నాము. ఎంగిలి మంగలాల కూడు తింటే రోగాలు రాక చస్తాయా? నాగరికతతో పాటు రోగాలు పెంచుకుంటున్నాము.
కొంచెం వయసులో ఉన్న వాళ్ళు సాయంత్రం ఎక్కా బుడ్డీలు, కందిళ్లు, లాంతర్లు, గాజు బుగ్గలు బూడిదతో తుడిచి, బత్తీల కొడిని నలిపి, గ్యాస్ నూనె నింపి, చీకటి పడే వేళకు దీపాలు వెలిగించేందుకు సిద్ధంగా పెట్టేవారు.
పడమటి మనసాలలో ఆముదం లేదా నూనె పోసి, ఇత్తడి చెమ్మెలతో దీపాలు వెలిగించేవారు. వెలిగించి,
సరస్వతి నమస్తుభ్యం
అంటూ నమస్కారాలతో సంస్కారం , సంస్కృతి నిలుపుకున్నాము.
సాంకేతికత అనే వరద వచ్చి నూనె దీపాల నుండి, గ్యాస్ నూనె, దాని నుండి కరెంట్ వరకు లాభనష్టాలు తెస్తూ పోటెత్తింది…
ప్రార్థనలు, సంప్రదాయ పడికట్టులు మరిచి ఎడతెగని సాగతీత సీరియళ్ళకు అలవాటుపడ్డారు సగటు మహిళా మణులు టీవీల రాకతో… అంతకుముందు రేడియోలో ప్రభాత గీతాలు, దేశభక్తి ప్రబోధితాలు, భక్తి రంజని వినేవారు అది కాస్తా ఇప్పుడు దూరదర్శనాలే చూస్తున్నారు… కాని సూర్యోదయ దర్శనాలు లేవు పిల్లాది మేరకు…
అవును మర్చిపోయాను! సూర్య నమస్కారాలు చేసి, గోధుమపిండి- బెల్లం -నెయ్యి కలిపి సూర్యుడికి నివేదన చేసి, అందరికీ ప్రసాదంగా పెట్టేది అమ్మ! అది ఔషధమయ్యేది… సూర్యరశ్మి D విటమనులను అందించి ఆరోగ్యాన్నిచ్చేది. సాంకేతికతతో సహజసిద్ధమైన ఆరోగ్య రక్షణలు, రోగనిరోధక చర్యలు తగ్గిపోయి, జబ్బులు వచ్చాకనే మందులు తీసుకోవడమనే నాగరికులమైనాము.
సరే అది వదిలేసి, సాయంత్రాలు పడమటి మనసాలలో తుంగ చాపలు పరిచి, నిలువెత్తు ఇత్తడి చెమ్మెలో ఒత్తులు వేసి వెలిగించి, రుద్రాక్షమాలతో అలంకరిస్తే … మా ఇంటి వైభవమే వేరు ! సరస్వతీ పీఠాలు సిద్ధం చేసుకుని ఇంట్లోని మగవారు భాగవతం చదువుతుంటే వినే సంప్రదాయం క్రికెట్ కబళించి వేసిందనే చెప్పవచ్చు!
ఏదో దేశం- మరేదో దేశంతో ఆడితే పందేలు కాస్తూ చూసి ఆనందించి, కబడ్డీ ఆటను కందకంలో పూడ్చేసి , ఒళ్ళు పెంచేసి, తర్వాత తీరిగ్గా జిమ్ములకు డబ్బులు తగలేసి, ఘనమైన బొజ్జలను తగ్గించుకోవాలని, పెద్దవారూ… చిన్న పిల్లలు వీడియో ఆటలలో.. మునిగిపోయి కోపం, ఉక్రోషంతో, కేకలు పెడబొబ్బలు పెడుతూ, సాయంకాలపు చల్లని పిల్ల గాలి పీల్చకుండా, పైసలు ఖర్చుపెట్టి ఏసీ [ A C; cooler] లలో గాలిని కొంటూ… మేము నవనాగరికులమైనాము!
నీరు తోడడాలు, పిండి రుబ్బడాలు, కింద కూర్చొని కట్టెల పొయ్యి మీద వంటలు, లేక ముద్దుగుమ్మలు గుమ్ములైపోతున్నారు… నీటి పంపులు, వాటర్ ప్యూరిఫైయర్లు, బోర్ పంపుల అమరిక వాటికి తోడుగా నిలిచాయి.
పెళ్ళి చూపులకు వస్తే అమ్మాయికి హార్మోనియం వస్తుందని అబ్బాయి బంధువులకు చెప్పవచ్చని తల్లిదండ్రులు హార్మోనియం నేర్పించేవారు ఆట- పాట… ఆరోగ్యానికి మంచిదని, కంప్యూటర్ కాస్తా హార్మోనియాన్ని మాయం చేసింది.
స్ట్రాలర్లు వచ్చి, చంటి పిల్లలను ఒడినుండి దూరం చేసింది… వాట్సప్ , ఫేస్ బుక్, మెసెంజర్ , ట్విట్టర్ లాంటి సోసల్ మీడియా వచ్చి గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు చదవడం మాన్పించింది…
కానీ మరక మంచిదే అన్నట్టు పుస్తకాల చదువు తగ్గినా సాహిత్యావలోకనం సమూహాల ద్వారా ఎక్కువ అయిందనే చెప్పాలి! ఎందరికో రచనాసక్తిని పెంచింది. వాట్సాప్ ఎందరి కవులనో సమాజానికి పరిచయం చేసింది.
యూట్యూబ్ మాత్రం నిద్రను మాయంచేసి, వింత జబ్బులను అంటకడుతున్నది… ఫేస్బుక్ సమయాన్ని మాయంచేసి, వ్యక్తిగత విషయాలు వేదికకు చేర్చింది… టేప్ రికార్డులు కొంత మంచే చేసాయని చెప్పొచ్చు! మనుషులు మరుగైనా వారి మధురమైన స్వరాన్ని దాచిపెట్టింది… నడుము, మెడనొప్పులెన్ని వచ్చినా, ఉద్యోగాలతో బ్యాంకు ఖాతాలు నిండిపోతున్నాయి కంప్యూటర్ల ఉద్యోగాలతో…
లాభ-నష్టాలతో సాగుతోన్న సాంకేతికాభివృద్ధిని స్వాగతించక తప్పదు…
కొత్తొక వింతా కాదు- పాతొక రోతా కాదు!
నూనె దీపాలను వదిలి – గ్యాసునూనె దీపాలు వెలిగించినప్పుడే ఆహ్వానించాం! ఇక సోలారు దీపాలను ఆమోదించలేమా?
కాలంతో పాటు మారుతూ… సాంకేతికతను ఆహ్వానిస్తూనే … అతి సర్వత్ర వర్జయేత్ అనే సూత్రాన్ని పాటిస్తే మనమే నాగరికులం ! నాగరికత మన స్వంతం ! ఏమంటారు? ఔనంటారా? కాదంటారా?
రంగరాజుపద్మజ