అంతే ఎప్పుడైనా!!

కవిత

అరుణ ధూళిపాళ

తాను నడిచే తోవలో
సలపరింపుల గాయాలతో
మనసుతో సహా దేహాన్ని
చెక్కుకుంటున్నా
తీరైన శిల్పమవ్వాలని..
నన్ను నేను కోల్పోయా
అలుపులేని శ్రమలో…

తరాల తీరని దాహం అతడు
దేనినో ఆశిస్తూ ఆ కళ్ళు
జేవురిస్తున్నాయి అసంతృప్తిగా..
నిలువెల్లా స్పృశిస్తున్నాయి..
దోచుకోవాల్సిన దానికై ఇంకా
వెతుకుతున్నాయి ఆరాటంగా

కడుపును మెలిపెట్టి తన్ని,
శరీరాన్ని చీలుస్తూ వచ్చి
అమాయక ప్రాణిలా
అవని మీద మరో అధికార రూపం…
స్వతంత్ర ఖైదును నేను..
నా చేతుల్లోనే అన్నీ జారిపోతుంటాయి
ఆ సంగతే నేను గమనించనంతగా…

తెలివి పాళ్ళు ఎక్కువే నాకు
నిరూపించా సమానత్వాన్ని..
అందుకే రుద్దుకున్నా బాధ్యతలను కూడా..
ప్రతీ క్షణం మొలిచే నా రెక్కలపై
ఇనుపపాదం మోపి
వికటంగా నవ్వుతూ తాను
అప్పుడూ..ఇప్పుడూ…ఎప్పుడూ!!!!

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కన్నీళ్ళు

మనమాట – మనబాట