అమూల్యా

కథ

మాలా కుమార్

అమూల్యా… అమూల్యా…

రాణి పిలుపుతో చేతిలోని మందుల ట్రేను బల్ల మీద పెడుతూ ఏమిటన్నట్ల్లు చూసింది అమూల్య.

“నీ పేషంట్ నిన్ను కలవరిస్తున్నాడు. నువ్వే కావాలట” నవ్వుతూ చెప్పింది రాణి.

నాలుగురోజుల క్రితం ఆక్సిడెంట్ అయ్యిందని వంటినిండా దెబ్బలతో, రక్తం కారుతుండగా శరత్ ను తీసుకొచ్చారు. శరత్ ఒక  సినీనిర్మాత కొడుకు. రాత్రి స్నేహితులతో కార్ లో వస్తూ ఆక్సిడెంట్ చేసాడు. అదృష్ఠవశాత్తు వెనుక ఉన్న స్నేహితులకు దెబ్బలు ఎక్కువగా తగలకపోవటముతో శరత్ ను, ముందు కూర్చున్న ఇంకో స్నేహితుని దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆక్సిడెంట్ కాబట్టి కేస్ అవుతుందేమోననీ, పైగా దెబ్బలు కూడా ప్రమాదకరమైనవి కాదు కాబట్టి, నిర్మాతగా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న తనకు ఇబ్బందని శరత్ తండ్రి శరత్ ను అక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. అమూల్య సేవలతో చాలావరకు కోలుకున్నాడు శరత్.

అక్కడికి వచ్చిన అమూల్య చూసి, “ఎక్కడికెళ్ళావు? నాకు డ్రెస్సింగ్ చేయవా?” అడిగాడు శరత్.

“మీకు మేల్ నర్స్ డ్రెస్సింగ్ చేసి వెళ్ళాడు కదా!  ఈరోజు కూడా వేరే నర్స్ రాలేదు. నేను ఇంకో పేషంట్ ను చూసుకోవాలి. మీరు ఇలా చిన్నపిల్లలలా మారాము చేయకూడదు. మిమ్మలిని ఈరోజు డాక్టర్ గారు డిస్చార్జ్ చేస్తానన్నారు. నర్సింగ్ అసిస్టెంట్ మీ ఇంటికే వచ్చి డ్రెస్సింగ్ చేస్తాడు. జాగ్రత్తగా మందులు వేసుకుంటే తొందరగా కోలుకుంటారు” చిన్నగా మందలిస్తున్నట్టుగా అంది అమూల్య.

“ఓ నన్ను ఇంటికి పంపేస్తారా? నేను వెళ్ళను. వెళితే నువ్వు కనిపించవు” అన్నాడు శరత్ అలుకగా.

“బాగుంది నాకోసం ఉండిపోతారా? మీ అమ్మగారు మీకోసం ఎదురు చూస్తున్నారు”నవ్వుతూ అంది.

“మరైతే నేను ఫోన్ చేస్తాను. వచ్చి నిన్ను కలుస్తాను.సరేనా?” ఆశగా అడిగాడు.

అమూల్యా అన్న పిలుపు విని సరే  అని వెళ్ళిపోయింది అమూల్య.

పాపం అని కాస్త కరుణ చూపించి ప్రేమగా చూసుకుంటే ఇదో ఇలాగే అభిమానం పెంచుకుంటారు. కొందరు అడ్వాంటేజ్ తీసుకుంటారు.ఈ పేషంట్స్ తో ఇదే ప్రాబ్లం అనుకుంది అమూల్య.

శరత్ డిశ్చార్జ్ అయిన వారం రోజులకు, ఆసుపత్రి గేట్ దగ్గర గులాబీపువ్వు చేతపట్టుకొని కనిపించాడు. బయటకు వచ్చిన అమూల్యను చిరునవ్వుతో చూస్తూ గులాబీ అందించాడు. అమూల్య ఒక్క క్షణం తడబడి “ఏమిటిది?” అంది.

“గులాబీ. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ప్లీజ్ అక్కడ కాసేపు కూర్చొని వెళ్ళిపోదాము” కాఫీ షాప్ వైపు చూపిస్తూ రిక్వెస్టింగ్ గా అన్నాడు. కాదనలేకపోయింది అమూల్య.

ప్రతిరోజూ తను బయటకు వచ్చే సమయానికి గులాబితో, చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యే శరత్ ను చూడగానే అప్రయత్నంగా అమూల్య పెదవులు విచ్చుకునేవి. శరత్ చిరునవ్వుల బాణాలు విరిబాణాలై అమూల్యను కలవరపెడుతున్నాయి. కలవారి బిడ్డడు అతని మీద ఆశ పడకూడదని వివేకం హెచ్చరించేది. వయసు వలపు ముందు వివేకం ఓడిపోయింది. శరత్ తో బయటకు అడుగేసింది. ఆ అడుగు తప్పటడుగని తెలుసుకునేందుకు ఎక్కువ రోజులు పట్టలేదు. భరించలేని ఆవేదన, ధుఃఖం, అవమానముతో, తిరిగి బయట ప్రపంచంలోకి అడుగేసే ధైర్యం లేక, దిక్కుతోచని స్థితిలో ఇంటికి వచ్చింది. కానీ లోపలకు వెళ్ళే ధైర్యం చేయలేక, వరండాలో కూర్చుండిపోయింది. బయటకు ఏదో  పని మీద వచ్చిన సరస్వతమ్మ అమూల్యను చూసి ఆశ్చర్యపోయింది. అమూల్య స్థితిని అర్ధం చేసుకుంది కానీ ఏమి మాట్లాడలేకపోతోంది.

“ఎవరక్కడా?” అంటూ బయటకు వచ్చాడు మోహనరావు. తలదించుకొని, సన్నగా వణుకుతూ నిలుచున్న అమూల్యను, బొమ్మలా మౌనంగా ఉన్న భార్యను ఓ క్షణం పరికించి చూసి “బయట ఎందుకు భాగోతం? లోపలికేడవండి” అని కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు.

అప్పుడు బయటకు వచ్చింది ఏడుపు అమూల్యకు. పెద్దమ్మా అని సరస్వతమ్మను కౌగలించుకొని బావురుమంది. అమూల్యను పొదివి పట్టుకొని లోపలికి నడిపించింది సరస్వతమ్మ. తనను ఒక్క మాట కూడా అనకుండా తిరిగి ఆదరించిన  పెద్దమ్మా, పెద్దనాన్నలు దేవతలలా కనిపించారు.

లోపలి గదిలోనే కుమిలిపోతూ కూర్చున్న అమూల్య, అమూల్యా అని పెదనాన్న పిలుపు వినిపించి, చిన్నగా బయటకు వచ్చింది.అక్కడ పెద్దమ్మ, పెదనాన్నతో పాటు గంభీరంగా ఉన్న ఒకాయన కూర్చొని ఉన్నారు.

“తన పేరు అమూల్య. నా భార్య చెల్లెలు కూతురు. రెండు సంవత్సరాల క్రితం మా మరదలు, తోడల్లుడు కరోనాతో పోయారు. అప్పుడు అమూల్యను మా దగ్గరకు తీసుకొచ్చాము. మొన్ననే ఇంటర్ పాసయ్యింది.అమూల్య చాలా సున్నిత మనస్కురాలు. తెలుగులో యం.ఏ చేసి తెలుగు లెక్చరర్ గా చేరుదామనుకుంది కానీ కరోనా సమయములో నర్స్ లు, డాక్టర్ లు చేసిన సేవ చూసి తనకు నర్స్ కావాలని కోరిక కలిగింది.  కాలేజీలు తెరిచేవరకుతన ప్రవృత్తి కాని వృత్తిలో చేరేముందు కొంచము అనుభవము వస్తుందని, అసలు చేయగలదో లేదో తెలుస్తందని నాకు తెలిసి డాక్టర్ ఆసుపత్రిలో నర్స్ ల కు సహాయము చేసేందుకుచేర్పించాను. అక్కడ చాలా శ్రద్దగా పని నేర్చుకుంటోంది. పేషంట్స్ తో చాలా ఓర్పుగా ఉంటోందని ఆ డాక్టర్ మెచ్చుకుంటుంటే మురిసిపోయాము. ఇంతలో ఓ త్రాష్టుడు తగిలి, దానిని ముంచిపోయాడు. మన పిల్లనినేనూ కాదంటే బజార్న పడుతుందని లోపలికి రానిచ్చాను. నీకు తెలుసు కదా మేము మా అబ్బాయి దగ్గరకు యు.యస్. వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేసుకున్నాము. పోనీ కాన్సిల్ చేసుకుందామనుకుంటే కోడలికి పురిటిరోజులు. మా వియ్యంకుడి ఆరోగ్య సమస్య మూలంగా వాళ్ళు వెళ్ళలేరు. మరి దీన్ని ఎక్కడ ఉంచి వెళ్ళాలో తెలీటము లేదు” అన్నాడు.

ఆయన అమూల్య వైపు చూసాడు. సన్నగా, సుకుమారంగా, అమాయకంగా ఉంది. తల వంచుకొని నిలబడింది.ఈ ఆడపిల్లలు ఎంత అమాయకులు. ఎంత తొందరగా ఎదుటివాడి మాయమాటలు నమ్మి మోసపోతారు అనుకుంటూ “నర్స్ గా చేయాలని తనకి ఆసక్తి ఉందన్నావుకదా!  నర్సింగ్ కోర్స్లో చేర్పిద్దాము. అసలు నర్స్ గా రోగులకు సేవ చేయాలనుకోవటము ఎంత గొప్ప ఆలోచన. నర్స్ అంటే ఎవరు అమ్మ. అమ్మలాగా ఒక రోగికి పసిపాపకు చేసినట్లుగా సేవ చేస్తుంది. మన సాంప్రదాయంలో అసలు స్త్రీలను కన్నెత్తే చూడరు. శక్తి స్వరూపిణిగా, అమ్మలా పూజిస్తాము. అమ్మను వేరే దృష్ఠి తో చూడగలమా? మరి అమ్మలా సేవ చేసే నర్స్ లంటే ఎందుకో మన సమాజం లో కొంతమందికి చిన్న చూపు. మోహన్ నీకు అభ్యంతరం లేకపోతే, మీరు వచ్చే వరకు మా ఇంట్లో ఉంచు. నా క్లినిక్ లో సహాయం చేస్తుంది” అన్నాడు.

మోహనరావు అమూల్యతో “ఈయన కల్నల్ రావ్. మిలిట్రీలో డాక్టర్ గా చేసి, ఈ మధ్యనేరిటైర్ అయ్యాడు. ఇంటి దగ్గర చిన్న క్లినిక్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాడు. నా బాల్యస్నేహితుడు. మేము వచ్చే వరకు వాళ్ళింట్లో ఉంటావా?” అడిగాడు.

అమూల్య చిన్నగా వచ్చి, మోహనరావుకు, కల్నల్ రావుకు పాదనమస్కారం చేసింది.

మోహనరావు, సరస్వతమ్మ యూ.యస్ వెళ్ళారు. అమూల్య కల్నల్. రావు ఇంటికి మారింది. కల్నల్.రావుగారి భార్యసావిత్రిగారి అభిమానంలో కొద్దికొద్దిగా తన అపరాధభావము నుంచి బయటకు వస్తోంది. రోజూ ఉదయముసావిత్రికి  ఇంటి పనిలో సహాయము చేస్తుంది. కల్నల్. రావ్ సాయంకాలం క్లినిక్ చూసుకుంటాడు. ఉదయం మిలిట్రీ హాస్పిటల్ కు, ఎక్స్ సర్వీస్ మెన్ కు వైద్యసేవ అందించేECHS  Poly Clinic లో ఉచితముగా సైనికులకు సేవలందిస్తుంటాడు. కల్నల్ తో పాటు అమూల్య కూడా ECHS, MH (మిలిట్రీ హాస్పెటల్) కు వెళుతోంది. అక్కడ సైనికులను, డాక్టర్ లను, నర్స్ లను చూస్తుంటే చాలా ఆరాధనా భావం కలుగుతోంది అమూల్యకు. వారి స్పూర్తి తో తను కూడ నర్స్ ట్రైనింగ్ చేసి MH లో నర్స్ లా చేరాలని భావించింది. అందుకే ఓ రోజు కల్నల్. రావు ఖాళీగా ఉన్న సమయములో “సర్, నేను మిలిట్రీలో నర్స్ గా చేరాలని అనుకుంటున్నాను. దానికి ఏమి చేయాలో మీరు గైడెన్స్ ఇవ్వగలరా? ప్లీజ్” రిక్వెస్టింగ్ గా అడిగింది.

“మిలిట్రీ హాస్పిటల్ లో నర్స్ గా చేయటమంటే మాములుగా సివిల్ లో చేసినట్లు కాదు. యుద్దం జరిగేట్టప్పుడు బార్డర్, అంటే యుద్దం జరిగే చోట కాదు బేస్ హాస్పిటల్ లో ఉండాల్సి వస్తుంది. కొన్ని సార్లు ఫారన్ వార్ జోన్ కు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మధ్య ISIS (ఇరాక్, ఇరాన్ యుద్దంలో) లో 46 మందిమన నర్స్ లను ఆపేసారు. వారిని మన ప్రభుత్వం చాలా కష్టంగా తిరిగి తీసుకొచ్చింది. అది వారి అదృష్టం. మరి అలాంటి ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఒక సైనికునిలా పోరాడాల్సి వస్తుందనుకో! త్యాగాలు చేయాల్సి వస్తుంది. చాలా వత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. కాకపోతే వకటి మటుకు చెప్పగలను, మన మిలిట్రీ హాస్పిటల్ లో పని చేసే నర్స్ లకు చాలా గౌరవము ఇస్తారు. ఒక సిపాయి కూడా వారిని చులకనగా చూడడు మన మిలిట్రీలో నర్సింగ్ ఆఫీసరేకానీ చిన్న కేడర్ వారు లేరు. డైరెక్ట్ గా ఆఫీసర్ గా రిక్రూట్ చేసుకుంటారు. నర్స్ ను ఓ అమ్మలా గౌరవంగా చూసుకుంటారు. .స్త్రీలను గౌరవించాలి అనే మన సాంప్రదాయాన్ని మన మిలిట్రీవారు పాటిస్తారని గర్వంగా చెప్పగలను.జననీ, జన్మ భూమిశ్చ! అన్నది మా నినాదము. మరి ఆలోచించుకో” అన్నాడు.

ఒక్క నిమిషము కూడా ఆలోచించకుండా “నేను చేరుతాను. దానికి ఎలా అప్లై చేయాలో చెప్పండి” అన్నది స్థిరంగా.

“ముందుగా NEET ఎంట్రెన్స్ ఎక్జాం రాసి పాసవుతే మెడికల్ ఎగ్జాం, ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి. అప్పుడు BSN (Bachelor of Science in Nursing) నాలుగు సంవత్సరాల కోర్స్ AFMC (Armed Forces Medical College) పూణే లో చేయాలి. ఇప్పుడు మన సికింద్రాబాద్ లో కూడా మిలిట్రీ డెంటల్ కాలేజ్ తెరుస్తున్నారని విన్నాను. ఇక ప్రవేశపరీక్ష తెలంగాణాలో సికింద్రాబాద్ లో, ఆంధ్రాలో వైజాగ్ లో రాయవచ్చు” అని వివరంగా చెప్పాడు కల్నల్. రావ్.

నాలుగు సంవత్సరాల తరువాత పూణే AFMC ఆవరణలో అమూల్య పాసింగ్ ఔట్ పెరేడ్ కు ఆహ్వానితులుగా వచ్చారు మోహనరావు, సరస్వతమ్మ, కల్నల్. రావ్, సావిత్రమ్మలు. అమాయకముగా ఒక మోసగాడి వలలో పడి, దారి తప్పబోయి తప్పించుకున్న ఓ చిన్నికూన, ఈ రోజు గర్వంగా, ధీమాగా తలెత్తుకొని పెరేడ్ చేసి బాడ్జ్ ధరిస్తుంటే ఉద్వేగంగా, కనులారా వీక్షించారు. పెరేడ్ తరువాత మార్చ్ చేసుకుంటూ వచ్చి, తన తప్పునుక్షమించి, తన జీవితాన్ని సరిదిద్దిన దేవతలు నలుగురికీ భావోద్వేగముతో సెల్యూట్ చేసింది అమూల్య!

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అక్షర తేజం

బిడ్డా…. గిట్లుంటది..!