బంధాలు – బంధుత్వాలు

కథ

రాఘవరావు గేటు కేసీ,తన ఇంటి ముందు పెట్టి ఉన్న భార్య విశాల పార్థివదేహం కేసి మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు. నిన్నటి వరకు నవ్వుతూ తుళ్ళుతూ తమ మధ్య తిరిగిన తన విశాల ఇక లేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతోంది మనసు.

అయితే విశాల మరణించింది అన్న వార్త తెలిసి కూడా తమ బంధు వర్గం వాళ్ళు ఎవ్వరూ రాకపోవడం ఆయన మనసుని ఇంకా ఎక్కువగా బాధిస్తోంది.

లోపలి నుంచి తన కొడుకుల మాటలు వినిపించాయి.”పోన్లే అమ్మ అలా నిద్రలోనే చనిపోయింది, ఏదో అనారోగ్యంతో హాస్పిటల్, డాక్టర్లు అంటూ తిరగక్కర లేకుండా,” అది పెద్దవాడి గొంతు.

“అవునన్నయ్యా, ఈ రోజుల్లో హాస్పిటల్ కి వెళ్తే మాటలా? బోలెడు డబ్బు ఖర్చు. ఆ డబ్బే ఉంటే ఇంకో అవసరానికి పనికొస్తుంది,” అంటున్నాడు చిన్నోడు.

ఛీ,ఛీ కన్నతల్లి మరణం లో కూడా డబ్బు గురించి మాట్లాడుకుంటున్నారు తన కొడుకులు, ఎంత హేయమైన విషయం! బాధగా మూలిగింది మనసు. విశాల మొహం కేసి చూశాడు. నీవు నేర్పిన విద్య యే నీరజాక్ష అంటూ తననుచూసి నవ్వుతున్నట్టుగా అనిపించింది.

ఒక్కసారిగా గతంలోకి జారిపోయాడు రాఘవరావు.

“ఏవండీ మీ పిన్ని గారి అబ్బాయి పెళ్లి. పాపం మరీ మరీ పిలిచారు వెళ్లకపోతే బాగుండదండీ,వెళ్లి వద్దాం,” అంటుంది విశాల.

“చూడూ, ఇప్పుడు పెళ్లికి వెళ్లాలంటే, దగ్గర బంధువులం కనుక పిన్నికి, బాబాయ్ కి పెళ్ళికొడుకు కి అందరికీ బట్టలు కొనాలి. బోల్డు ఖర్చు. ఆడబ్బే ఉంటే మరో అవసరానికి పనికొస్తుంది. అసలే పిల్లలు ఎదుగుతున్నారు. వాళ్లకి బోలెడన్ని కొనాల్సి ఉంటుంది. ఒంటి చేతి సంపాదన.నువ్వు ఇలాంటి ఖర్చులన్నీ పెట్టకు,”తనే!

“అది కాదండీ, ఖర్చు అనుకుని మన వాళ్ళ ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు వెళ్లకపోతే బంధుత్వాలు ఎలా మిగులుతాయి అండీ? “

విశాలా,నన్ను విసిగించకు. బంధుత్వాలు కాదు ముఖ్యం.నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం. నేను సంపాదించే ప్రతి రూపాయి వాళ్ళ బాగు కోసమే అయి ఉండాలని నా తాపత్రయం. అర్థం చేసుకో, ఇక ఈ సంభాషణ ఇక్కడితో ఆపేయి,” అదీ తనే.

పాపం విశాల మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

తన పిల్లల భవిష్యత్తు అన్న తాపత్రయమే ఇంధనం గా తన బ్రతుకు బండిని నడిపాడు రాఘవరావు. బ్యాంకులో క్లర్క్ గా మొదలైన జీవితం గబగబా ముందుకు సాగుతూ ఒక ఐదు సంవత్సరాలలో ఆఫీసర్ హోదాలోకి వచ్చింది.

పిల్లల చదువులు పెరిగి, వాళ్ళు చదివే స్కూల్ మారింది. అలా ఖర్చు పెరిగింది. తన మనస్తత్వం మారలేదు.

“ఏవండీ మా బాబాయి గారు చనిపోయారుట, నాన్న ఫోన్ చేసారు.. మనం చూట్టానికి వెళ్లకపోతే బాగుండదు. మా బాబాయ్ పాపం మన పెళ్ళికి వచ్చి నాన్నకు సాయం కోసం పది రోజులు ఉన్నాడు.మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇప్పుడు మనం వెళ్లకపోతే బాగుండదండీ,”ఆఫీస్ నుంచి రాగానే చెప్తున్న విశాలను చూసి కోపం వచ్చింది రాఘవరావుకి.

“విశాలా ఇప్పుడు పిల్లల పరీక్షలు జరుగుతున్నాయి, అది తెలిసీ నువ్విలా

మాట్లాడటం ఏమన్నా బాగుందా? ఇప్పుడు మనం వెళ్లినా,వెళ్లకపోయినా చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు కదా?

ఇప్పుడు అంత దూరం బెంగళూరు వెళ్లాలంటే ఎంత ఖర్చు? మూడు నాలుగు రోజులు వెళ్తే పిల్లలు చదువులకు ఎంత ఇబ్బంది? ఇవన్నీ ఆలోచించావా?”అంటూ రాఘవరావు భార్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు.

పాపం అవకాశం దొరికినప్పుడల్లా తనకి బంధుత్వాల గురించి, నలుగురితో బంధం ఉండవలసిన అవసరం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉండేది విశాల.

కొన్ని సందర్భాల్లో డబ్బు కన్నా ‘నా’ అనే మనిషి యొక్క అవసరం ఎంత ఉంటుందో, ఇప్పుడు మనం ఎవరితోనూ సంబంధాలు ఉంచుకోకపోతే ఆ సమయంలో ఎంత చింతించాల్సి వస్తుందో అని చిలక్కి చెప్పినట్టు చెప్పింది.

అప్పుడు తనకి ఎక్కలేదు, మొద్దుబుర్ర. అప్పుడు తన దృష్టి అంతా తను, తన భార్య, తన పిల్లలు, వారి ఎదుగుదల అంతే.వేరే ఏ ఆలోచనా చేయలేదు.

కానీ ఇప్పుడు తన కళ్ళెతదురుగుండా తన విశాల నిర్జీవంగా ఉన్నప్పుడు తన మనసు ఆమె చెప్పిన ‘నా’ అనే ఆ ఒక్క వ్యక్తి కోసం వెతుకుతోంది. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అర్థం అవుతున్నాయి.

కానీ ఏం లాభం? ఇప్పుడు తన గతాన్ని మార్చలేడుగా?తనకే లేని బంధుత్వాలు ప్రేమలు తన పిల్లలకు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళని తను ఏనాడు ఎవరితోనైనా కలవనిస్తేనే కదా!

గతాన్ని కాదు గాని భవిష్యత్తును ఖచ్చితంగా మార్చాలి. ఇకనైనా తను మారాలి, ఈనాడు తను ఈ కొద్దిసేపటి నుంచి అనుభవిస్తున్న ఒంటరితనం రేపు తన పిల్లలు అనుభవించకూడదు, గట్టిగా నిర్ణయించుకున్నాడు రాఘవరావు.

విశాల దశదినకర్మలు పెద్ద ఆర్భాటం లేకుండానే గడిచిపోయాయి.వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, వారిలో కూడా చాలామంది ఆమె తరపు వారు, మమకారం చంపుకోలేక వచ్చినవాళ్లు. 

మరి కొంతమంది విశాల మంచితనం వల్ల ఆ చుట్టుపక్కల వారితో పెంచుకున్న స్నేహబంధం వల్ల వచ్చిన వాళ్ళు.

రాఘవ కొడుకులిద్దరికీ ఒక సంవత్సరమే వ్యత్యాసం. ఇద్దరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఒకేసారి పెళ్లిళ్లు చేసి కొడుకులు కోడళ్లు సంతోషంగా కళ్ళముందు తిరుగుతుంటే చూసి ఆనందించాలని ఎంతో కోరుకుంది విశాల. తను బ్రతికుండగా ఆ కోరిక తీరలేదు.

ఎన్నో సంబంధాలు చూసింది. తనకు నచ్చినవి విశాలకు నచ్చలేదు, విశాలకు నచ్చినవి తనకు నచ్చలేదు. ఇప్పుడు ఆ సంబంధాలలో విశాలకు నచ్చిన రెండు సంబంధాలు మళ్ళీ చూసాడు రాఘవరావు‌ అవి తనకు అప్పుడు సుతరాము నచ్చలేదు.

వాటిలో ఒకటి తన స్నేహితుడి కూతురు శ్రీవల్లి, ఇంకొకటి విశాల వాళ్ళ తరపు బంధువుల అమ్మాయి ఆరాధ్య.

అమ్మాయిలు ఇద్దరు బాగా చదువుకున్న వారు, చాలా అందమైన వాళ్ళు కూడా. కానీ వాళ్ళిద్దరివి ఉమ్మడి కుటుంబాలే. అలాంటి కుటుంబంలో అమ్మాయిని తెచ్చుకుంటే వాళ్ళ ఇళ్లల్లో జరిగే ప్రతి చిన్న వేడుకకు వెళ్లేందుకే తన పిల్లల సంపాదన సరిపోతుందంటూ వాటిని తను తోసిపొచ్చాడు.

ఇప్పుడు రాఘవరావు ఆ  ఇద్దరు అమ్మాయిలతోనూ వాళ్ళ తల్లిదండ్రులతోనూ మాట్లాడాడు. తల్లి చనిపోయింది కనుక ఈ సంవత్సరం పెళ్లి చేయకూడదు,

కానీ ఈ లోగా స్నేహం పేరుతో తనూ తన కొడుకులు తరచూ వాళ్లను కలుస్తామని తద్వారా తన కొడుకులకు ఉమ్మడి కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, అనుబంధాలు అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. అదృష్టవశాత్తు వాళ్లు ఒప్పుకున్నారు.

అలాగే అతను తీసుకున్న ఇంకొక ముఖ్యమైన నిర్ణయం ఈ సంవత్సరం అంతా తన, విశాల యొక్క బంధు వర్గాన్ని కలవటం. తమ

బంధువులలో రెండు మూడు కుటుంబాల వారు ఆర్థిక స్థితి సరిగ్గా లేని కారణంగా పిల్లలకు సరైన చదువు చెప్పించలేకపోతున్నారని వాళ్లకు సాయం చేస్తే బాగుంటుందని విశాల చెప్పిన మాటలు గుర్తొచ్చాయిరాఘవరావుకి.

ఇప్పుడు నిజానికి తను ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నాడు. కొడుకులు కూడా అంతే. కనుక  ఇప్పుడు ఆ పని చేయడానికి పూనుకున్నాడు.

దానివల్ల కొంత బంధువులలో మంచి పేరు తెచ్చుకునేందుకు పునాది వేసుకోవచ్చు అని ఆలోచన. అలా ఒక మూడు కుటుంబాలలోని ముగ్గురు పిల్లలు చదువుల బాధ్యత పూర్తిగా తను తీసుకున్నాడు.

అలాగే తన స్నేహితులు, బంధువుల ఇళ్లలోని ప్రతి శుభ,అశుభ కార్యక్రమాలకు తప్పకుండా హాజరవ్వడం మొదలుపెట్టాడు. తను వెళ్లడమే కాకుండా వీలైనప్పుడల్లా తన కొడుకులను కూడా బలవంతంగా నైనా తీసుకువెళ్లడం చేశాడు.

ఇదంతా చూస్తూ కొడుకులు మొదట్లో తండ్రి తో వాదులాడటం , విసుక్కోవడం చేశారు. కానీ శ్రీవల్లి, ఆరాధ్యల పరిచయం, వాళ్ళ ఇళ్ళకి వెళ్లి వస్తూ ఉండడం వల్ల అలా మనవాళ్లు, బంధువులు అంటూ అందరూ కలిసి ఉండడంలోని ఆనందాన్ని వాళ్లు కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకున్నారు.

ఇన్ని సంవత్సరాలు తాము ఏమి కోల్పోయారో అర్థం అవుతోంది వాళ్ళకి.

అంతటితో ఆగలేదు రాఘవరావు.తమ ఇంటి దగ్గరలోని వృద్ధాశ్రమానికి వారానికి ఒక రోజు వెళ్లి అక్కడి వారితో ముచ్చటిస్తూ, వారి యోగక్షేమాలు కనుక్కుంటూ, వాళ్లకు కావాల్సిన చిన్న చిన్న అవసరాలు తీర్చడం లాంటి పనులు కూడా చేయడం మొదలెట్టాడు.

అలా కేవలం తన బంధువులు,ఐనవాళ్లే కాక ఇంకా పెద్దదైన, విశాలమైన కుటుంబాన్ని పొందాడు.

విశాల సంవత్సరీకం అయిన వెంటనే పంతులు గారితో మాట్లాడి తన కొడుకుల పెళ్లిళ్లకు ముహూర్తం పెట్టించాడు.

ఇప్పుడు అతని ఇంట్లో నిశ్చితార్థం దగ్గర్నుంచి పెళ్లి వరకు ప్రతి వేడుక బోలెడు మంది బంధువులు స్నేహితులతో కళకళలాడుతూ అంగరంగ వైభవంగా జరుగుతోంది.

మన చుట్టూ మన వాళ్లు అనేవాళ్ళు , మన కుటుంబం అంటూ ఉంటే అందులో ఎంత ధైర్యం, ఆనందం ఉంటుందో ఇప్పుడు అర్థమైంది రాఘవరావుకి.

కళ్యాణ మండపం దగ్గర పెట్టిన విశాల ఫోటోలో నుంచి తనను చూస్తూ సంతోషంగా నిండు హృదయంతో నవ్వుతున్నట్లు అనిపించి  కళ్ళలో నీళ్ళు తిరిగాయి రాఘవరావుకి.

Written by Vidyullata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వ్యాపారం – జీవన వ్యాకరణం

మధురమైన జ్ఞాపకం