అమెరికాలో బామ్మ

కథ

     శ్రీరేఖ బాకరాజు

“అమ్మా తొందరగా రావే.. నేను ఈ సామానులు సూటుకేసులలో సర్దలేకున్నాను” అంటూ సంబరంగా పిలిచింది స్వప్న.

స్వప్న తన తల్లి దండ్రులతో కలసి న్యూయార్క్ కు ప్రయాణమౌతున్నారు, స్వప్న రెండు సంవత్సరాల క్రింద ఎం. స్ చేయడానికి అమెరికాకు వచ్చింది. ఎం. స్ అవ్వగానే మంచి కంపెనీ లో ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులను ఇండియా నుండి తనతో తీసుకెళ్లడానికి వచ్చింది. స్వప్న ఒక్కగానొక్క కూతురు కావడంతో అల్లారుముద్దుగా పెంచారు శర్మ కౌసల్యలు. శర్మ ..అదే స్వప్న నాన్నగారు తన తల్లియైన విశాలమ్మ ను ఒక్కర్తినీ ఇండియా లో వదలి వెళ్లడం ఇష్టం లేదు.

“అమ్మా నువ్వు కూడా మాతో అమెరికా రాకూడదూ? కౌసల్య కూడా నీకు తోడుగా ఉంటుంది.” అన్నాడు. స్వప్న కూడా “బామ్మా నువ్వు కూడా రా బామ్మా..నీకు అమెరికా బాగా నచ్చ్చుతుంది. కొత్త ప్రదేశాలు కూడా చూసినట్టుంటుంది..ఇక్కడ ఒక్కతివే ఏమి చేస్తావు..” అని అడిగింది గోముగా. విశాలమ్మ కు మానవలారంటే ప్రాణం. స్వప్న అమెరికా వెళ్ళేటప్పుడే “నన్ను వదిలి పోతావుటే..ఈ బామ్మ నీకు గుర్తుకు రాదా..” అని కళ్ళ నీళ్లు పెట్టుకోవడం స్వప్న కు ఇంకా గుర్తు.

“నా కెందుకీ ఈ అమెరికా గోలలు. ఎలాగో ఉంటాను ఇక్కడ. మీరు వెళ్లి రండి. నేను మీ మరదలు వాళ్లతో ఏవో పుణ్యక్షేత్రాలకు వెళ్లి కాలం గడుపుతాను” అంది. దానికి కౌసల్య శర్మలు ఇద్దరూ ఒప్పుకోలేదు. మొదలే ఆయాసంతో బాధపడుతుంటావు. నువ్వు మాతో అమెరికా వస్తే స్వప్న కారులో హాయిగా తిరగొచ్చు..పెద్దదానివి మాతో వచ్చినట్టుగా ఉంటుంది” అన్నారు. బామ్మ ససేమిరా అన్నా బామ్మను ఎలాగో అలా అందరూ కలిసి ఒప్పించారు.

ప్రయాణం రోజు రానే వచ్చింది. బామ్మకు విమానం అనగానే దిగులు పట్టుకుంది. ఒక వీల్ చైర్లో కూర్చోబెట్టి ప్లైన్ లో కి తీసుకెళ్లారు బామ్మను  “నేను ఎలా వెళ్తాను అమెరికాకు. ఈ విమానంలో వెళ్లాలంటే బోలెడు భయం. ఆమ్మో ఈ విమానం కుర్చీలు బాగోలేవు..” అంటూ నస పెట్టింది విమానంలో. విమానం పైకి లేచేటప్పుడు కలిగే ఇబ్బందికి

బామ్మ “ఆమ్మో ఇదేమి నొప్పిరా బాబోయ్” అంటూ చిన్నపిల్ల లా కేరింతలు కొట్టింది.

అందరూ విమానంలో టీవీలు చూస్తూ ఉంటే “ఇదేమిటి ఒక్కక్కరికీ చిన్ని టీవీలు ఉండడమేమిటి..నాకు కొంచం దాహంగా ఉంది. ఇక్కడ ఏమైనా కొబ్బరి తీర్థం దొరుకుతుందేమో కనుక్కో..” అంటూ స్వప్నను గిల్లింది. “బామ్మా అలాంటివి విమానంలో దొరకవు. దానికి బదులు పళ్ళ రసమో లేదా కాఫీ టీ లతో సరిపుచ్చుకో” అంటూ నవ్వుతూ నచ్చ్చజెప్పింది స్వప్న.

మొత్తానికి అందరూ న్యూయార్క్ చేరుకున్నారు. న్యూయార్క్లో శీతాకాలం అవుతూ ఉండడంతో కొంత స్నో పడింది. వెళ్ళగానే స్వప్న కౌసల్యలు కలసి అన్నం పప్పు వండారు. అందరూ కలసి అన్నం పప్పు పెరుగు పచ్చడిలతో భోజనం చేశారు. “రేపు అందరమూ కలిసి ఏవైనా ప్రదేశాలు చూడడానికి వెల్దాము” అంది. బామ్మ అయితే “ఈ మంచు ఏమిటి.. ఈ చలి ఏమిటి.. ఏదైనా గొంగళి ఉంటె ఇవ్వు. హాయిగా ఇంట్లోనే పడుకుంటాను. నేనైతే రాను” అంటూ రాగాలు తీసింది. దానికి స్వప్న “బామ్మా కొన్ని రోజులు పోయాక  నీకే ఇక్కడి వాతావరణం అలవాటు అవుతుందిలే..నీకిష్టమైనప్పుడే ఎక్కడికైనా బయటికి వెళదాం ” అన్నది..

శర్మ అయితే “నాకైతే ఎండల నుండి కొన్ని రోజులు ఉపశమనంగా ఉంది ఇక్కడ ” అన్నాడు.

కొన్ని రోజులకు బామ్మకు జెట్లాగ్ పోయి న్యూయార్క్ అలవాటు అవ్వడంతో బాగా అనిపించసాగింది.

ఒకరోజున ఉదయాన్నే లేస్తూ బామ్మ “స్వప్నా ఈ రోజు అదేదో పెద్ద దివిటీ పట్టుకున్న శిల్పం దగ్గరకు వెల్దామే ” అన్నది. “అదా బామ్మా దాన్ని స్టాచూ  అఫ్ లిబర్టీ  అంటారు.. తప్పకుండా వెళ్తాము ” అన్నది. బామ్మలో వఛ్చిన మార్పుకు అందరూ చాలా సంతోషించారు.

స్టాచు  అఫ్ లిబర్టీ కి బయలు దేరుతుండగా బామ్మా మళ్ళీ గారాలు పోతూ

” అమ్మాయి స్వప్నా ..అక్కడికి వెళ్లడం కష్టమా.. పైకి వెళ్ళాక నాకు కళ్ళు తిరుగుతాయేమో.. ఆమ్మో నేను రానులే..మీరు వెళ్లి రండి..” అంది. స్వప్న “ఏమి కాదు బామ్మా..నీకు ఏమి కాకుండా చూసుకునే బాధ్యత నాది. నేను నీ  పక్కనే   ఉంటాగా.. ఇప్పటికి నేను చాలా సార్లు వెళ్లి వచ్చ్చాను. పై నుండి సముద్రాన్ని చూస్తుంటే చాలా బాగుంటుంది. నువ్వు మాతో రావాల్సిందే ” అంటూ మారాం చేసింది. “ఏమో అమ్మా మా కాలంలో ఇలాంటివేమీ లేవుగా” అంటూ సణుగుతూ బయలుదేరింది బామ్మ.  స్టాచూ పైకి వెళ్లే వరకూ స్వప్న చేతిని పట్టుకునే ఉంది. స్టాచూ చూసిన తరువాత బామ్మ కు ఎంతో బాగా అనిపించింది. “ఫరవా లేదే.. బాగానే ఉంది ఇక్కడ అంది”.  ఈ ట్రిప్ బామ్మకు నచ్చ్చినందుకు స్వప్నకు సంతోషం కలిగింది.

ఇలా న్యూయార్కులో నాలుగైదు ప్రదేశాలు చూసారు. ప్రతీ ప్రదేశంలో బామ్మ కు కొత్త అనుభవాలు జరిగాయి. కానీ బామ్మకు అన్నీ కొత్తగా ఉండడంతో బాగానే ఎంజాయ్ చేయగలిగింది. చూస్తుండగా శర్మ దంపతులు ఇండియాకు వెళ్ళే రోజు వచ్చింది. ఎయిర్పోర్ట్లో బామ్మ స్వప్నలు కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. “అమెరికా ఎంత బాగుందో స్వప్నా.. నిన్ను అమెరికాను వదలి వెళ్లబుద్ధి కావడంలేదు. నువ్వు ఇచ్చిన ధైర్యంతో న్యూయార్క్ చూసాను..మళ్లీ ఎప్పుడొస్తానో నిన్ను చూడడానికి అంది బామ్మ. “మళ్ళీ స్వప్న పెళ్లికి వచ్ఛే సంవత్సరమే” అంటూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అన్నాడు శర్మ నవ్వుతూ.

Written by SriRekha Bakaraju

శ్రీరేఖ బాకరాజు
నా స్వీయ రచన: రాగ మాధుర్యం
పుట్టిన ప్రదేశం : హైదరాబాద్ తెలంగాణ
ప్రస్తుతం : టొరంటో కెనడా
చదువు: ఆంధ్ర మహిళా సభ, రెడ్డి ఉమెన్స్ కాలేజీ ఇంటర్ బి స్సీ, గోల్డ్ మెడలిస్ట్ ఎం స్సీ మాథెమాటిక్స్ మరియు ఎం.ఫీల్ మ్యాథమెటిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ
 
వృత్తి : సాఫ్ట్వేర్ ఇంజనీర్
ప్రస్తుతం : ఇన్వెంటరీ కంట్రోల్
కళలు : కర్ణాటక సంగీతం , హిందూస్థానీ సంగీతం మరియు సితార్ లో ప్రావీణ్యం  
తెలుగు భాష అంటే ఇష్టం.
కథలు కవితలు పాటలు రాయాలంటే
సరదా. నా రచనలకు బహుమతులు కూడా వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చంద్రయాన్ -3 ఓ విజయ యాత్ర

వ్యాకరణం – జీవన వ్యాపారం