రాకిట్ల పున్నమొచ్చిందని
ఆకిట్ల గుసోని అన్నో స్తడని
చెల్లెండ్లు ఎదురు చూస్తున్నరు
అన్న చెల్లెండ్ల ప్రేమంటే..
ఒక కొమ్మకే పూసిన దాసన్న పూలు
ఒక్కింట్ల వెరిగిన బంతి పూల లెక్క
కన్నొల్ల కన్నను మిన్న అన్నలే నాయే
కండ్ల నీరు గారకుండ చేతినడ్డం పెట్టీ
అత్త గారింట్ల కష్టాలు గుర్తు వట్టి
ఉన్న నేను చెల్లె అని ఓదార్పు నిస్తడు
ఆగమాగం అయితే అన్న యాది కొచ్చి
మనసు అల్కగ జేషి నవ్వు దెప్పీస్తడు
అమ్మ నాన్న కల్షి అన్ని అన్ననే అయితడు
అన్నా! అంటే సాలు ఉరికొచ్చి చూస్తడు
చెప్పి రాని ఆపతిని ఆదుకుంట అంటడు
కష్ట సుఖము పంచ అన్నకే ముందుగాల్ల
అన్నలున్న చెల్లెండ్లు అదృష్ట వంతులు
తోడ వుట్టిన తోడు ఉన్నదెంత భాగ్యము!