“గుండె రగిలిపోతూ ఉంటే గూడు మేడా ఒకటేలే కాళ్లు బండబారి పోతే ముళ్ళు పూలూ ఒకటేలే ఎదురుగా పొంగే సంద్రం ఎక్కడో ఆవలి తీరం ఎదురీత ఆగదులే విధిరాత తప్పదులే”
గేయ రచయిత ఏ అంశాన్ని ఆధారంగా చేసుకుని రచించారు అన్న విషయాన్ని పక్కన పెడితే ఇది ఎంతో మంది జీవితాలకు అన్వయించ దగ్గ పదాల సముదాయం.( అంటే పాటలోని మిగతా భాగానికి ఈ వ్యాసానికి ఏ విధమైన సంబంధము లేదు . అందువల్ల పదాల సముదాయం అన్నాను.)
పుట్టింట్లో , మెట్టినింట్లో అష్ట కష్టాలు అనుభవించి , పొత్తిళ్లలో పసిబిడ్డతో బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టి , అనాధల తల్లిగా అందరి గుండెల్లో స్థానం సంపాదించి , ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక మహోన్నత స్త్రీమూర్తి సింధు తాయి గారి యొక్క ప్రస్థానం ఏమిటో తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో పింప్రీమోగా అనే గ్రామంలో 14 నవంబర్ 1948 వ సంవత్సరంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు . తండ్రి అభిమన్యు సాతె అనే ఒక గోసంరక్షకుడు . గో సంరక్షణ ద్వారా లభించే స్వల్ప ఆదాయంతో కుటుంబ భారాన్ని మోస్తూ ఉండేవాడు . వీరికి ఈ అమ్మాయి కంటే ముందే ముగ్గురు , నలుగురు సంతానం ఉండడం వల్ల ఈ బిడ్డను అనవసరమైన సంతానంగా భావించారు. వీరి తల్లి ఏమాత్రం ప్రేమ అందించకపోగా నానా రకాలుగా హింసిస్తూ ఉండేది.
ఇంట్లో అందరూ ఈమెను ‘ చింధీ ‘ అని పిలుస్తూ ఉండేవారు . చింధీ అంటే మరాఠీ భాషలో చిరిగిపోయిన గుడ్డ పీలిక అని అర్థం . దీనిని బట్టి తెలుసుకోవచ్చు ఆ బిడ్డ ఆ ఇంట్లో ఎంత నిరాదరణకు గురి అయింది అన్న విషయాన్ని . కాకపోతే తండ్రి మాత్రం చాలా ప్రేమగా చూసుకునేవాడు . భార్య ఎంత వారించినా వినకుండా కూతురిని పాఠశాలకు పంపించేవాడు.
చదువులో చక్కని ప్రతిభ కనబరుస్తూ ఉన్నప్పటికీ కూడా పదేళ్ల వయసులో నాలుగవ తరగతిలో ఉండగానే , ఆమె కంటే 20 సంవత్సరాలు వయసులో పెద్దవాడైన సమీప గ్రామ నివాసి అయిన శ్రీహరి సప్కల్ అనే గోసంరక్షకుడికి ఇచ్చి వివాహం జరిపించారు.
భర్త నుండి గాని అత్తింటి వారి నుండి గాని ఏ విధమైన ఆదరణ లభించకపోగా నానా బాధలు అనుభవిస్తూ కాలాన్ని నెట్టుకొస్తూ ఉండేవారు.
ఆమెలో సహజంగా ఉన్న తెలివితేటల వల్ల అనర్గళంగా మాట్లాడడం , కవితలు రాయడం చేస్తూ ఉండేది. ఈమె తెలివితేటలకు అసూయ చెందిన ఈమె భర్త ఈమె రాసిన కవితలను చించి కళ్ళముందే తగలబెట్టేవాడు. అతను చూస్తే తగలబెడతాడన్న బాధతో ఈమె తను రాసిన కవితల్ని అతడికి కనిపించకుండా అతడు వచ్చేలోపే గబగబా చించి, నమిలి మింగేస్తూ ఉండేది.
ఆ ఊరిలోని పలు కుటుంబాలు పశువుల సంరక్షణపై ఆధారపడి జీవిస్తూ ఉండేవి . పశువుల పేడతో పిడకలు చేసి అవి అమ్మగా వచ్చిన డబ్బు కుటుంబ పోషణకు కాస్త అదనపు ఆదాయంగా వె ల్లదీసేవారు అయితే ఆ ఊరిలోని స్థానిక నాయకుడు అటవీశాఖ తో కుమ్మకై వీరికి డబ్బు సరిగా అందకుండా చేసేవాడు . ఎంతగా చెప్పి చూసినా అతని వైఖరిలో ఏ విధమైన మార్పు కనిపించకపోవడంతో సింధుతాయి ఊరిలోని రైతులందరిని సంఘటితపరిచి అతనికి వ్యతిరేకంగా చిన్నపాటి ఉద్యమమే చేయడం జరిగింది. మీరు పోరాడుతున్న విధానం ఉన్నత ఉద్యోగుల వరకు వెళ్లడంతో కలెక్టర్ ఆ ఊరికి రావడం , సింధుతాయి వారికి పరిస్థితిని చక్కగా వివరించడంతో కలెక్టర్ ఆ నాయకుడికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆమె గర్భం ధరించి ఉన్నారు. ఆమెపై పగబట్టిన స్థానిక నాయకుడు ప్రతీకారకాంక్షతో వీరి భర్త వద్దకు వెళ్లి “ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నువ్వు కాదు నేను ” అంటూ చెప్పడంతో ఆమె భర్తతో సహా అత్తింటి వారందరూ ఆమెను దోషిగా పరిగణించారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతడు ఆమెను శారీరకంగా బాధించి , గర్భం ధరించి ఉన్న ఆమె పొట్టపై కాలితో బలంగా తన్ని, ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లి పశువుల పాకలో పడేశాడు .
పశువులు తొక్కి చంపాయి అన్న విషయాన్ని చిత్రీకరించడం కోసం వాటికి కట్టి ఉన్న తలుగులను విప్పాడు. ఆ రాత్రంతా ఆమె పశువులపాకలోనే స్పృహ కోల్పోయి పడి ఉంటుంది. అందులోనే ఆడపిల్లకు జన్మనిస్తుంది. మిగతా గోవుల నుండి ఏ విధమైన హాని వీరికి వీరికిగానీ , వీరి బిడ్డకుగానీ జరగకుండా ఒక గోవు రాత్రంతా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది.
స్పృహలోకి వచ్చిన వీరు తాను ఒక ఆడపిల్లకు జన్మనిచ్చానన్న విషయాన్ని తెలుసుకొని , బొడ్డు తాడు కత్తిరించడానికి కూడా ఏ విధమైన సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో పక్కన కనిపించే ఒక రాయిని తీసుకొని దానితో 16 సార్లు దానిపై దెబ్బలు కొట్టి దుర్భరమైన వేదనను అనుభవించి , తనను కాపాడిన గోమాతకు నమస్కరించి , పొత్తిళ్లలో పసిబిడ్డతో కాలినడకన పుట్టింటికి బయలుదేరుతుంది. చాలా ప్రయాసపడి పుట్టింటికి చేరుకున్నాక విషయం తెలుసుకున్న వీరి తల్లి ఆమెను నానా దుర్భాషలాడి మరోసారి కంటికి కనిపించకూడదంటూ , మొహం మీదే తలుపులు వేస్తుంది . పుట్టింటి తలుపులు కూడా మూసుకుపోయాయన్న విషయం అర్థం అయ్యాక వీరు పసిబిడ్డతో ఎటు వెళుతుందో కూడా తెలియని స్థితిలో బయటికి ప్రపంచంలోకె అడుగుపెట్టి పగలంతా యాచన చేస్తూ, రాత్రిళ్ళు ఎక్కడ ఉన్నా కూడా సరైన రక్షణ ఉండదనుకుని స్మశానంలో తలదాచుకుంటూ ఉంటుంది. గుక్కపట్టి ఏడుస్తూ ఉన్న పసిబిడ్డ ఆకలి తీరాలంటే ముందు తన కడుపునిండాలన్న విషయాన్ని గుర్తెరిగి చేతిలో చిల్లి గవ్వైనా లేకపోవడం వల్ల స్మశానంలో (కొన్ని కుటుంబాల్లో ఉన్న సాంప్రదాయం ప్రకారం ) వదిలి వెళ్ళిన బియ్యం పిండి , గోధుమ పిండితో రొట్టె చేసుకుని , చితి మంటలపై వాటిని కాల్చుకొని తిని , దానివల్ల వచ్చిన శక్తితో తన బిడ్డ కడుపు నింపుతూ ఉండేది. స్మశానంలో వదిలివేసిన బట్టలని కట్టుకునేది .
దేవాలయాలు ,బస్సు స్టేషన్లు , రైల్వే స్టేషన్లలో యాచిస్తూ ఒకరోజు జీవితంపై విరక్తి కలిగి బిడ్డను తన పొట్టకు ఒక గుడ్డతో బిగించి కట్టుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందామని వెళుతుంది . ఇంతలో వీరికి “ఆకలి ఆకలి ” అంటూ ఒక వృద్ధుడు మూలుగుతూ ఉండడం వినిపిస్తుంది . వీరు అది విని ఆ శబ్దం వచ్చిన దిక్కుకు వెళ్లి అతడిని గుర్తించి , తన దగ్గరు న్న రొట్టె ముక్కతో అతడి ఆకలి తీరుస్తుంది . అప్పుడు వీరి మనసులో ఒక దృఢమైన సంకల్పానికి బీజం పడుతుంది . నేను పుట్టింది చావడానికి కాదు పదిమందిని బ్రతికించడానికి అని అనుకొని ఆత్మహత్య ఆలోచనను విరమించుకొని , బ్రతుకు పోరు కొనసాగిస్తుంది . బస్సు స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా వదిలేసిన అనాధ పిల్లలు ఎందరో వీరికి తారసపడడం , వారిని చేరదీసి తన కన్నబిడ్డ లాగే చూసుకోవడం , వారి ఆ లనపాలన కోసం మరింత శ్రమ పడడం జరుగుతూ ఉంటుంది . చక్కని గాత్ర సౌందర్యం ఈమెకు దైవ దత్తంగా అబ్బిన విద్య . దానితో బస్సుల్లో , రైళ్లలో చక్కని పాటలు పాడుతూ, భిక్షాటన చేస్తూ ఉండేది . రానురాను కాస్త అడుగు ముందుకు వేసి” నేను కొంతమంది పిల్లల్ని పోషిస్తూ ఉన్నాను . వారి వాగోగుల కోసం నాకు చాలా డబ్బు అవసరం అవుతుంది . ధర్మం చేయండి” అంటూ వాళ్లకు పరిస్థితిని వివరించి చెప్పడంతో, వీరి ఔన్నత్యాన్ని గుర్తించిన ఎంతోమంది తమకు తోచినంత వేస్తూ ఉండేవారు . ఆ సొమ్ముతో పిల్లల అవసరాలన్నింటిని తీరుస్తూ ఉండేవారు . తాను కన్న బిడ్డ తన వెంటే ఉంటే పేగు బంధంతో మిగతా పిల్లల్ని సరిగా చూసుకోలేనేమోనన్న అనుమానంతో ‘ శ్రీమంత్ దగ్దు షేత్ హల్వాయి ‘ అనే సంస్థకు తను జన్మనిచ్చిన కుమార్తెను అప్పగించి “ఈ బిడ్డను మీరు చూసుకోండి , మిగతా పిల్లల్ని నేను చూసుకుంటాను ” అంటూ చెబుతుంది. క్రమక్రమంగా వీరి వద్ద 2000 మంది పిల్లలు చేరడం జరిగింది . వీరికి 250 మంది అల్లుళ్ళు , 30 – 40 మంది కోడళ్ళు , 1000 మంది మనవళ్లు , మనవరాళ్లతో చక్కని కుటుంబ ఆనందాన్ని పొందుతున్నారు. వారికి తిండి ఒకటే కాదు చదువుసందెలు కూడా చెప్పించాలన్న ఆశయంతో మరింత శ్రమ పడేవారు . వీరి మహోన్నత ఆశయాన్ని గమనించిన కొంతమంది ప్రముఖులు ఆర్థిక సహాయం అందించడంతో క్రమక్రమంగా విరాళాలు వరదలా వచ్చి పడడంతో కొన్ని అనాధ ఆశ్రమాలను స్థాపించి , వారిని పాఠశాలలో చేర్పించి, చక్కని విద్యాబుద్ధులు అందించడం , తన అనుభవ సారాన్ని జోడించి వారికి చక్కని వ్యక్తిత్వ వికాస మెళకువలను నేర్పించేవారు. ఎంతోమంది డాక్టర్లు , ఇంజినీర్లు , లాయర్లు , చార్టెడ్ అకౌంటెంట్లు , ఐ. ఏ. ఎస్ . , ఐ. పి. ఎస్ . కావడం జరిగింది . వారిలో ఒకరు సింధుతాయిపై పి. హెచ్. డి. కూడా చేస్తూ ఉన్నారు . కొంతకాలం గడిచిన తర్వాత యాచన నచ్చకపోవడంతో ప్రోత్సహించే కొందరు వ్యక్తులతో ” మీరు ఒక సభ ఏర్పాటు చేయండి . అందులో నేను నా ఆశయము , నేను చేసే పనులు అన్ని మాటల ద్వారా వివరిస్తాను . అప్పుడు ఎవరైనా ఏదైనా సహాయం చేయదలుచుకుంటే ఆ విధంగా చేయండి ” అంటూ చిన్ననాటి నుండి అనర్గళంగా మాట్లాడటం , కవితలల్లడం తనకు దైవదత్తంగా అబ్బిన విద్య కావడం వల్ల వారితో ” భాషన్ సే మై రేషన్ ఖరీదు రహా హూ” అంటుంది. వీరు చేసిన సామాజిక సేవకు గుర్తు గా ఎన్నో అవార్డులు వరించాయి . పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా మీరు దీనికి ఎలా స్పందిస్తున్నారు అని విలేకరులు ప్రశ్నించగా “చాలా సంతోషం . ఈ అవార్డు నా పిల్లలు మరింత మంది ఆకలి తీర్చే అవకాశాన్ని నాకు ఇచ్చింది . ఇంతమందిని అక్కున చేర్చుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అవార్డు అంకితం ” అంటూ తన ఔన్నత్యాన్ని మాటల ద్వారా కూడా చాటారు . అనంత్ మహాదేవన్ గారు వీరి జీవిత చరిత్రను ‘ మీ సింధు తాయి ‘ అనే పేరుతో చలనచిత్రంగా తెరకెక్కించారు. ఈ చలనచిత్రం ‘ ఇంటర్నేషనల్ కేన్స్ ఫెస్టివల్ ‘ లో ప్రదర్శితమైంది. మహారాష్ట్ర సమితి వారు వీరిపై ఉన్న గౌరవంతో వీరిని అమెరికా దేశానికి తీసుకెళ్లి సభలో మాట్లాడమన్నారు .సబ్కాల్ పోరాట వివరాలు 18 మే 2016 వ సంవత్సరంలో ‘ ఆప్తిమిస్ట్ సిటిజెన్’ అనే వార పత్రికలో ప్రచురించబడింది .వీరు
జన్మనిచ్చిన కుమార్తె పెరిగి పెద్దవారై ఇప్పుడు మరో అనాధాశ్రమానికి నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. వీరి సేవల గురించి ఆ నోట ఈ నోట విని ఒకరోజు ఒక 80 సంవత్సరముల వృద్ధుడు వీరి సదనానికి వచ్చి ఆకలిగా ఉంది భోజనం పెట్టమని అర్థిస్తాడు. ఆమె మౌనంగా అతడికి భోజనం పెడుతుంది. భోజనం ముగించాక అతడు ఇంత ఉన్నతంగా ఇంత మందిని అక్కున చేర్చుకోవడానికి కారణం ఏమిటి అంటూ ఆమెను ప్రశ్నిస్తాడు . దానికి సమాధానంగా ఆమె తన భర్త తనను గర్భంతో ఉన్నప్పుడు పొట్ట మీద తన్ని ఇంట్లో నుండి గెంటేశాడనీ, బిడ్డతో తాను సాగించిన ప్రయాణం మొత్తం అతడికి వివరిస్తుంది. దానితో అతడు క్షమించమంటూ ఆమె కాళ్ళ మీద పడి విలపిస్తాడు . దానికి ఆమె బాధ పడాల్సిన పని ఏమీ లేదనీ, ఆరోజు అతను ఆ విధంగా ప్రవర్తించడం వల్లే ఈరోజు 2000 మంది బిడ్డలకు తల్లి కాగలిగాననీ, అంత గొప్ప ఆనందం కలుగడానికి అతడే కారణం అంటూ వివరిస్తుంది. సదనంలోని మిగతా పిల్లలందరినీ పిలిచి అతడు తన పెద్ద కొడుకనీ, ఇక నుండి అతడు కూడా తమతోనే ఉంటాడనీ, అందరూ అతడిని తమలో ఒకరిగా ఆదరించాలనీ చెబుతుంది. అతడిని చూసిన క్షణంలోనే గుర్తుపట్టిన ఆ మహోన్నతమూర్తి మారు మాట్లాడకుండా మిగతా బిడ్డల్లాగా అతడిని కూడా ఆదరించి కడుపునిండా భోజనం పెడుతుంది . ఆ వృద్ధుడే ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన ఆమె భర్త .
‘ క్షమయా ధరిత్రి ‘ అన్న సూక్తికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న మహోన్నతమూర్తి.
వీరు చేసిన సామాజిక సేవకు 750 అవార్డులు వరించాయి . అందులో కొన్నిటి వివరాలు:
సామాజిక సేవ విభాగంలో 2021 వ . సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు వరించింది.
భారత రాష్ట్రపతి నుండి 2015 వ. సంవత్సరంలో నారీ శక్తి పురస్కారం
డాక్టర్ డి. వై . పాటిల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పూణే నుండి 2016 వ .సంవత్సరంలో గౌరవ డాక్టరేట్.
ఒకార్డ్ ఫౌండేషన్ నుండి 2016 వ . సంవత్సరంలో సోషల్ వర్కర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
అహ్మదీయ ముస్లిం శాంతి బహుమతి 2014 లో
సామాజిక న్యాయం కోసం మదర్ థెరిస్సా అవార్డు 2013 లో
2013లో ది నేషనల్ అవార్డ్ ఫర్ ఐకానిక్ మదర్.
2012 సంవత్సరంలో సి. ఓ. ఈ. పి . గౌరవ పురస్కార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణే అందించింది.
మహిళా శిశు సంక్షేమ రంగంలో మహారాష్ట్ర ప్రభుత్వం సామాజిక కార్యకర్తలకు అందించే అహల్యాబాయ్ హోల్కర్ అవార్డు 2010 లో
మరాఠీ వార్తాపత్రిక లోక్సత్తా 2008 సంవత్సరంలో హుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందించింది.
1996లో దత్తక్ మాతా పురస్కార్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సునీత కళానికేతన్ ట్రస్ట్ అందించింది.
సహ్యాద్రి హిర్కాని అవార్డు.
రాజై అవార్డు.
శివ లీల మహిళా గౌరవ అవార్డు.
2000 మంది అనాధ పిల్లలకి తల్లి కావడం , వారి ఉన్నతిని చూసి ఆనందించడం తనకు జీవితంలో మరచిపోలేని గొప్ప అనుభూతి అనీ కాకపోతే ఇటువంటి దుర్భరమైన పరిస్థితి ఎవరకీ రాకూడదనే ఈ మహోన్నత మాతృమూర్తి 4 జనవరి 2022 వ. సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణేలో గుండెపోటుతో శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.
వీర అనుభవించిన బాధలను ఒకసారి మొదటి నుండి ఆలోచిస్తే ఎన్నో ప్రశ్నలు మన మదిలో మెదులుతూ ఉంటాయి. పుట్టుకతోనే చింధీ అంటూ ఆ పసిబిడ్డ ఆత్మగౌరవం మీద క్షణక్షణం దెబ్బకొడుతూ ఉండే కంటే ఆ బిడ్డకు జన్మనివ్వడం అవసరమా అనీ, చక్కని తెలివితేటలు కలిగిన బాలికకు పెళ్లి పేరుతో విద్యాహక్కును దూరం చేయడం , 20 ఏళ్ల వయసు తేడా ఉన్న వ్యక్తికిచ్చి కట్టబెట్టడం ఒక్కసారిగా పూర్ణమ్మ కథను గుర్తుకు తెచ్చింది (కాకపోతే వజ్రం కంటే పదునైన వీరి వ్యక్తిత్వం వీరి ప్రయాణానికి అంతులేని శక్తినిచ్చింది) ప్రతీకారంతో రగిలిపోయే స్థానిక నాయకుడు వేసిన అపవాదును ఆమె భర్త గానీ , అత్తింటి వారుగానీ ఒక్క క్షణం కూడా ఆలోచించకపోవడం మనిషి ఎటువైపు అడుగులు వేస్తున్నాడు అన్న ప్రశ్నలు అయోమయంలో పడేస్తున్నాయి. నాణానికి బొమ్మా బొరుసూ వలె సమాజంలో మంచి చెడు రెండు సమపాళ్లలో విస్తరించి ఉన్నాయనీ, అదే గనుక లేకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనీ, చేతులెత్తి నమస్కరించాల్సిన మహోన్నతులు పురుషుల్లో కూడా లెక్కకు మిక్కిలి ఉన్నారనీ, కుండెడు పాలలో ఒక్క విష బిందువు కలిసి మొత్తం పాలను విషపూరితం చేసినప్పటికీ , పాలనే తప్పు పట్టడం సరికాదనీ మనం గ్రహించాలి.
దుర్భరమైన వేదనల నుండి తనను తాను మహోన్నత శక్తిగా మార్చుకున్న వీరి ప్రస్థానం ఎందరికో స్ఫూర్తివంతం. ఆ మహోన్నత మూర్తికి శతకోటి వందనాలు సమర్పిస్తూ…