ఎక్సలెన్స్ excellence

20-8-2023 – తరుణి పత్రిక సంపాదకీయం – డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి పత్రిక సంపాదకులు

జీవితం అందంగా ఉండాలనుకుంటే నిరంతరం కృషి చేయాలి.
ఆకాశానికి నిచ్చెనలు వేయకున్నా, అగాధాల లోతులు చూడకున్నా
మనుషుల మైనందుకు మనదైన తరహాలో మనదైన పద్ధతిలో ఏదైనా మంచి పని చేయాలి అనే ఒక తపన అనేది ఉండాలి. అది సమాజ హితమైనదైతే మరీ మంచిది. అచీవ్మెంట్ ,ఛాలెంజింగ్ ఎక్స్లెన్స్,పవర్ఫుల్ అనే ఈ నాలుగులో ఎక్స్లెన్స్ అనేది స్వీకరిస్తే మనదైన కర్తవ్యం ఏమిటి అని ఆలోచించాలి.
అచీవ్మెంట్ అంటే ఏదైనా అనుకున్నది సాధించడం అని అర్థం . విజయాన్ని సొంతం చేసుకోవడాన్ని అచీవ్మెంట్ అంటాం. ఏది సాధించాలి?ఏంటి విజయం? అని ఎవరికి వాళ్లు ప్రశ్న వేసుకున్నప్పుడు సమాధానం కూడా అందులోనే దొరుకుతుంది. ఒక నిర్దిష్టమైన పనిని నిర్ణయించుకోవడం, సాధన దిశగా కష్టపడి పనిచేయడం తో విజయాన్ని సాధిస్తాం..


ఎక్సలెన్స్ excellence అంటే సమర్థత. మనం సాధించాలనుకున్న విషయం పట్ల సమర్థత కూడా ఉండాలి సాధించగలమనుకున్నదాన్నే ధ్యేయంగా పెట్టుకోవాలి. మనవైన శక్తి సామర్థ్యాలపై మనకు అంచనా ఉంటుంది కాబట్టి అంచనాలను మించి కోరికలు కోరుకోవద్దు ఆశల సౌధాలు కట్టుకోకూడదు. అది శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అనే మూడు విషయాలలోనూ! ఏ విధమైన ఆశయమైనా ఎంత మంచి ఆశయమైనా ఎంత గొప్ప ఆశయమైనా చేయగలమా లేదా అనే అనుమానం ఉన్నప్పుడు మానుకోవాలి. పూనుకునే ముందే ఆలోచించుకోవాలి.
ఇక పైన చెప్పిన నాలుగు అంశాలలో మూడవది చాలెంజింగ్, నాలుగవ వంశమైన పవర్ఫుల్ powerful అనేది . పవర్ఫుల్ అంటే శక్తివంతమైన అని అర్థం. మానసిక శక్తి,శారీరక శక్తి రెండు విధాలుగా శక్తివంతమైనవే. కానీ శారీరక శక్తి ఉన్నంత మాత్రాన మానసిక శక్తి లేకుంటే నిరుపయోగం అవుతుంది. మానసిక శక్తి ఉన్నంత మాత్రాన శరీరం సహకరించకున్నా నిరుపయోగమే అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని సాధించుకునే దిశగా కృషి చేయాలి. అప్పుడే చాలెంజింగ్ challenging అనేదానికి ఈ మూడు తోడవుతాయి.
Excellence ఎక్సలెన్స్ , శ్రేష్టత ఉత్తమోత్తమం సమర్థత అనే ఈ అర్థాలన్నీ ఈ శక్తులన్నీ అంతెలంతెలుగా, అంచెలంచెలుగా సాధించుకోవచ్చు. ఎక్స్లెన్స్ కు కావాల్సింది quality of being outstanding అంటారే ఇది కావాలి. ఇక్కడే తెలుస్తుంది, నాణ్యమైనటువంటి విషయాలు నాణ్యమైనటువంటి ఆలోచనలు నాణ్యమైనటువంటి చేతలు ఇవి శ్రేష్టతను తీసుకొస్తాయిఅని .
లలిత కళలు కావచ్చు నిత్య జీవన జీవితం లో చేసే పనులు కావచ్చు సాంఘిక సామాజిక రాజకీయ చైతన్యాన్ని కలిగించే ఏ విషయమైనా నైపుణ్యంతో చేయగలిగితే సాధించగలుగుతారు. బోధనా కళ తీసుకున్నట్లయితే ఏ పనికైనా శిక్షణ అనేది అవసరం శిక్షణకి కావాల్సింది బోధన ఈ రెండు సాధించాల్సినది కేవలం నైపుణ్యం తోనే.
మరి నైపుణ్యం సాధించాలి అంటే ఏం చేయాలి? కావాలనుకునే విషయానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. ఒక పిరియాడిక్ టేబుల్ లాగా సిద్ధం చేసుకోవాలి. అనివార్య కారణాలవల్ల ఏరోజైతే చేయలేక పోతారో ఆ రోజుటి పనిని మిగతా రోజులకు డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఏది కూడా వదలకుండా తను నేర్చుకోవాలనుకున్నటువంటి తాను సాధించుకోవాలనుకున్నటువంటి పనులను వదలకుండా చేయాలి అప్పుడే శ్రేష్టమైనటువంటి ఫలితాలను పొందుతారు.
అనగనగరాగమతిశయిల్లుచునుండు ,తినగ తినగ వేము తియ్యనుండు ,సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమన . ఎంతటి సత్యందాగుంది ఇందులో! పాడగా పాడగా రాగం చక్కగా వస్తుందంట, తినగా తినగా వేపాకు తీయగా అయిపోతుందంట. రాగం చక్కగా వస్తుందట. చక్కగా రావడం అంటే గీత గీసినట్టు రావడం అని కాదు. శృతి తో స్వరలయబద్ధంగా కుదరి శ్రావ్యమైన పాటుగా పాడగలగడం . వేపాకు తింటుంటే తీయగా అయిపోవడం అని కాదు దీని అర్థం. వేపాకు ఎప్పుడూ చేదే ! తినే నాలుక కు ఆ వేప ఆకును తినగా తినగా ఆ చేదుకు అలవాటైపోయి ఆ వేపాకు చేదు కాకుండా తెలియకుండా పోతుంది అని.అంటే చేసే పని ఎంత కష్టమైన పనైనా ప్రారంభ దశలో కష్టంగా ఉన్నా చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే తర్వాత చివరి వరకు సులభం అవుతుంది అని అర్థం .ఇంత చక్కటి నీతి పద్యాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఈసాధననే ఎక్సలెన్స్ వరకు ఎదగడానికి తోడవుతుంది. కాబట్టి పనులు చేయాలి అవి ఉత్తమమైన పనులుగా, శ్రేష్టమైన పనులుగా గొప్ప ఫలితాలు ఇచ్చేలా కృషి చేయాలి.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మల్లినాథ సూరి కళాపీఠం ;

ప్రతిభా పురస్కారాలు