సమస్యలు సంగమించిన వేళ
దుఃఖపుటేరులు స్రవిస్తూ
సముద్రాలై ఎగుస్తుంటే..
అనగలరా ఎవరైనా కాలం అబద్ధమని..!!
ఆకలి చిచ్చు కాలుస్తున్న పేగులు
తడి ఎండిన గొంతులతో
కంటినుండి సెగలను చిమ్ముతుంటే..
చెప్పగలరా అంతా ఉత్తిదే అని..!!
కలిసి వుండే మనసులు కళలు తప్పి
దూరాలకు తలుపులు తెరిచి
నిర్జీవ పాత్రలుగా నడయాడుతుంటే..
సాహసం చేయగలరా సర్దుకోమని..!!
అలుముకున్న మోహావేశాలు
అధర్మాలకు నెలవులు కాగా
జీవితాలను ఛిద్రం చేస్తుంటే
శిక్ష లేదంటారా ఘోర నేరాలకు..!!
ఆస్తుల కోసం చేతులు చాపి
కన్నవారి గుండెలు అవిసిపోగా
ఆశ్రమాల బరువును పెంచుతుంటే
వదిలేయమంటారా ఇంకా జాలిపడి..!!
విడివడిన మనుషుల బంధాలు
వర్గాలకు విలువలు పెంచి
రక్త దాహాన్ని తీరుస్తుంటే
ఆపగలరా అవినీతి దారుల ఆగడాల్ని..!!
ఆగని జీవన చక్రంలో జరిగే నిజాలకు
మిగిలిన నీ కాలపు విలువ ఎంతో…?
తెలుసుకునే తెగువ ఉంటే
మారి చూపించు మనిషిగా..
మనసు శిల కరుగుతున్న కరుణగా….