శకుంతల ధుష్యంతుల కుమారుడైన భరతుని పేరు మీదుగా మన దేశానికి భారత దేశమని పేరు వచ్చింది.
బ్రిటీష్ పరిపాలనలో భారతదేశం నలిగిపోతున్నపుడు 1905లో వందేమాతరం అనే పదం పుట్టుకువచ్చింది. భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అరబిందో ఘోష్ భారతమాత అనే పదానికి శ్రీకారం చుట్టారు. అప్పటి గుజరాత్ రాజకీయవేత్త రచయిత రేఎం కాన్షిరాం అసలు దేశభక్తి ఏమిటని అరబిందో ఘోష్ ని ప్రశ్నిస్తారు. అప్పుడు ఆయన తన ఇంటిగోడపైన వేలాడుతున్న బ్రిటీష్ పాలనతో భారతమాత మ్యాప్ ను చూపిస్తూ- ఇది మన భారతమాత చిత్రం. నగరాలు,నదులు, శరీరభాగాలు,ఈ ప్రాంతంలో నివసించే పిల్లలు పెద్దలు ఆమె నరాలు. ఆమెను తొమ్మిది విధాలుగా పూజించాలి అని చెబుతారు. కాగా ఆయన వ్యాఖ్యలే భారతమాత అవతరణకు నాంది పలికాయి.
బెంగాల్ సాహిత్యం నుంచి భారతమాత దేవతారూపాన్ని సంతరించుకుంది. కాళీ, దుర్గ, చండీలను బెంగాల్ ప్రజలు ఎక్కవగా పూజిస్తారు. ఆనంద్ మఠం ద్వారా ముందుగా భారతమాతకు ప్రచారం లభించింది.తర్వాత బకించంద్ర చటర్జీ వ్రాసిన వందేమాతరం గీతాన్ని భారతమాతకు ఆపాదించడం వల్ల మరింత ప్రచారం లభించింది. వాస్తవానికి ఆయన దుర్గాదేవిని ఉద్దేశించి, వందేమాతరం గీతాన్ని వ్రాశారు. రవీంధ్రనాథ్ టాగోర్ కు మేనల్లుడు, తొలి భారత ఆధునిక పెయింటర్ గా గుర్తింపు పొందిన అవనీంధ్రనాథ్ భారతమాతకు ఒక చిత్రరూపం ఇచ్చారు.ఆయన కూడా భారతమాతను దుర్గాదేవి రూపానికి దగ్గరగా ఉండేలా చిత్రించారు. అపుడు స్వాతంత్య్ర పోరాటంలో ఈ చిత్రాలను విరివిగా ఉపయోగించారు.అయితే అపుడు ముస్లీంలు కూడా దీన్ని వ్యతిరేకరించలేదు. కాగా,రానురాను ఈ చిత్రం భారతమాతకు పది చేతులున్నట్లు, సింహంపై స్వారీ చేస్తున్నట్లు రూపాంతరం చెందింది. భారతమాతకు వారణాసిలో, మహారాష్ట్రలోని దౌలతాబాద్ లో, హరిద్వార్ లో, ఆలయాలు వెలిశాయి. కాగా, ఆనాటి నుంచి దేశాన్ని భారతమాతగా గుర్తించిన ఆరాధించడం జరుగుతోంది. ఆర్.ఎస్.ఎస్ భారతమాత చిత్రాన్ని ఉపయోగించుకుంటుంది.
భారతమాత అనే పదం మాతృదేవతగా జాతీయ వ్యక్తిత్వానికి నిదర్శనం. దృశ్యకళలలో ఆమె సాధారణంగా ఎరుపు లేదా కుంకుమ పువ్వు రంగు చీరను ధరించి జాతీయ జెండాను పట్టుకుని ఉన్నట్టు చిత్రీకరించబడింది.
భారతదేశం వేదఘోషతో విలసిల్లిన ఈ వేదభూమి. “రత్నాల రాశుల రమణీయ శోభతో, ప్రసవించినట్టిదీ రత్నభూమి. మిసమిసలాడిన పసిడి పంటలతో, భాసురంబైనదీ భరత భూమి. విజయలక్ష్మీని గన్న వీరులందరితో వెలుగొందినట్టిదీ వీరభూమి. నిఖిల విఖ్యాత కళలకు నిలయమీభూమి. ఈ సద్భూమిలో హృదయం ఉప్పొంగేలా పుట్టించితివి. తదృణంబు తీర్చ వందనంబులు చేతుమో భరతమాతా!” అని మన పెద్దలు చెప్పింది ఎంతో సత్యవాక్కు! నిలుపుకోవాలి మనమందరం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.