కాకి పిల్ల…..

తరుణి సంపాదకీయం

మనుషులకూ కాకులకు మధ్య సంబంధం ఏమున్నదో కాని ఎన్నో ఉపమానాలలో ఎన్నో జాతీయాలలో, సామెతలలో , నానుడులలో కాకి చాలా కనిపిస్తుంది. కాకిలా అరవకు అనీ , కాకమ్మ కబుర్లు చెప్పకు అనీ , కాకి గోల అనీ, కాకి కాకే కోకిల కోకిలే అనీ, కాకి తెలివి అనీ, ఒక కాకి చస్తే పది కాకులు వచ్చి కావుకావుమని అరుస్తూ ఏడుస్తాయనీ , ఒక్క మాట కాకితో కబురంపితే చాలు వచ్చి వాలుతాను అనీ ఇలా చాలా రకాలుగా చాలా చోట్ల వేరువేరు రకాలుగా కాకి మన జీవితాల్లో పెనవేసుకున్న పక్షి !
అన్నింటి కన్నా “కాకి పిల్ల కాకికి ముద్దు” అనే నానుడి చాలా ఉపయోగిస్తుంటారు జనులు. కాకి నిజం గా తన పిల్లలను ముద్దు చేస్తుందా? ఎవరైనా చూసారా?  పైగా కాకి జాతిగాని వేరే పక్షైన కోకిల అనే పక్షి తన గుడ్లను కాకి గూట్లో వదిలి వెళ్తుంది అనీ కాకే సాగుతుంది అనీ అంటారు. ఇంటి మీదనో కాంపౌండ్ వాల్ మీద నో కాకి నిలుచుని అరిస్తే ‘ అదికో కాకి అరుస్తుంది మనింటికి ఎవరో చుట్టాలు వస్తారు’. అని కూడా అంటుంటారు. ఇక కొన్ని చోట్ల కొందరు, పిండాలు పెడితే కాకులే వచ్చి ముట్టాలనీ అనడమూ చూస్తాం. ‘అబ్భో కాకి నలుపు’.

‘అనే మాటనూ కొందరు రేసిస్టులు అలవోకగా పడవేస్తుంటారు. లోకులు పలుగాకులు ఏమైనా అంటారు , అనగలరు. అదిగో …చూసారా !!! ఇలా మాటల్లో అలా అలా వచ్చేస్తుంది కాకి మాట చూసారూ!!  జీవితంలో ఎవరూ తోడు లేని వారిని ‘ఏ కాకిఅంటూ ఈ కాకి పోలికనే తీసుకుంటుంటారు.
ఇదంతా చెప్పవచ్చింది ఎందుకంటే, కొంతమంది తమ పిల్లలను ముద్దు చేయడమైనా ప్రేమించడమైనా చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ‘కాకిపిల్ల కాకికి ముద్దు‘ అనే సామెతను రూపపరంగానే తీసుకుంటారు కానీ, మరో విధంగా కూడా వింతగా కనుపిస్తారు.
తల్లి తండ్రుల పోలికలతో నల్లగా ఉన్నా, పీలగా ఉన్నా, లావుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా ఎలా ఉన్నా ఆ అమ్మానాన్నలకు అందంగానే కనిపిస్తారు
అందుకే ఈ మాట మాటలు ప్రసిద్ధం గా వింటుంటాం.
కానీ, ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే రూపం గురించే కాదు గుణం గురించి కూడా ఈ సామెత ను అన్వయించుకోవచ్చు.
తమ కొడుకో కూతురో వాళ్ళ వయసు లో ఉన్న బంధువుల మధ్య తమ పిల్లలే
గొప్ప వాళ్ళన్నట్టు, తెలివైన వారన్నట్టు భావిస్తారు. ఈ భావననే వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక కూడా ఉంటుంది. దీనితో ఎన్నో అపార్థాలు సృష్టిస్తున్నారు. నా కూతురు చాలా మంచిది చాలా తెలివైన అమ్మాయి అనే కళ్ళతోనే చూస్తూ అల్లుడి పనులమీద తక్కువ చూపుతో ఉంటారు. సమయం వచ్చినప్పుడల్లా ఈ భావాలు సూదులవుతాయి సదరు అబ్బాయి కి .
మా కొడుకే గొప్ప కోడలు కన్నా అని సందర్భాలు లేకున్నా కాకున్నా ఏదో ఓ రకంగా అంటూ మాటల ఈటెలు విసురుతుంటారు. ఇవే కదా చల్లగ సాగే సంసారాలు లో చిచ్చులు పెట్టేవి, మనశ్శాంతి లేకుండా కల్లోల పరిచేది! నోటితో నువ్వు తూ నొసలుతో వెక్కిరించినట్టు చాలా నే చేస్తుంటారు .
దీనివల్ల అవతలి వారి మనోభావాలు దెబ్బతినే అవకాశముంది.ఈ‘కాకిపిల్లలు‘ ఏకాకి పిల్లల‘ కూడా ఏకాకులు‘ కావద్దు అని అనుకుంటే అంతా బాగుంటారు.‘ఏకాకులు‘ అంటే కాకులు నాలుగు కాకులతో కలిసి ఉండే కాకి వంటి జీవితమూ కాదు కదా అని అనేలా ఉండే ఒంటరి జీవితం అని అర్థం అన్నమాట. కాబట్టి నలుగురిలో మంచి వాళ్ళమని అనిపించుకుందా. కాకి పిల్ల నే కాదు ఎవరి సంతానాన్నైనా గౌరవం గా చూసి ఈ సామెతను మార్చేద్దాం!! మీరేమంటారు?

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బాధ్యతలను విస్మరిస్తున్నారా???

మహిళామణులు