మన శక్తి స్వాతంత్రమే! మన యుక్తి స్వాతంత్ర్యమే!

          లక్ష్మీమదన్

స్వాతంత్రం కొరకు పోరాడిన ఎందరో మహానీయులు అందరికీ నా పాదాభివందనాలు

ఈరోజు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామంటే దానికి కారణం వారి త్యాగఫలం…

ఆలోచన విధానాలలో తేడా ఉన్నా అందరూ నడిచి చేరుకోవాల్సిన గమ్యం ఒక్కటే అని వారంతా నిరూపించి ఈరోజు మనలను స్వతంత్రం దేశంలో హాయిగా ఉండేలా ఉంచగలిగారు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ పాలనలో మన భూమిలో మనం పరాయి వారిగా బ్రతికాం . ఎన్నో దౌర్జన్యాల పాలయ్యాము… రక్తపాతాలు జరిగాయి. ఎంతమందో ప్రాణాలు పోగొట్టుకున్నారు..కొన్ని పరిస్థితుల వల్ల మనవారే మనకు ద్రోహం చేయాల్సిన పరిస్థితులను కూడా ఎదుర్కొన్నాము… బ్రిటిష్ వారి ప్రలోభాలకు లొంగి లేదా వారు పెట్టే హింసలుగా తట్టుకోలేక మన రహస్యాలను వారికి చేరవేసిన విషయాలను కూడా మనం తెలుసుకున్నాము… ఏది ఏమైనా ఈ కాలంలో నిలబడి నాటి పరిస్థితుల గురించి మనం ఏ విధమైన నిందారోపణలు చేయలేము…. కానీ పరాయి పాలనలో బ్రతకము పరాయి పంచన చేరలేము మా దేశం మాకు కావాలి ఇది మా జన్మ హక్కు అంటూ ఒక్క త్రాటిపై నిలబడి పోరాడి తెచ్చుకున్న అందమైన మన స్వాతంత్రం మన స్వాతంత్ర్యం!!

కటిక చీకట్ల నుండి వెలుగు రేఖలు ఉదయించి మనల్ని పరవశింపజేసిన వేళ అదే ‘పంద్రాగస్టు‘ ! ఇది1947 ఆగస్ట్ 15 వ తేదీ అర్ధ రాత్రి మన దేశ ప్రజలకు విముక్తి లభించింది… ఈ దేశం మనది అని చెప్పుకోగలిగే గొప్ప సదవకాశం మనకు దొరికింది.. బ్రిటిష్ జెండా దిగిపోయి భారతీయ జెండా మూడు రంగులతో రెపరెపలాడిన శుభవేళ మనం ఎప్పటికీ మర్చిపోలేని సుదినం. మనం ఎన్ని పండగలు జరుపుకున్నా, అన్ని పండుగలో కల్లా ముఖ్యమైన పండగ ఇదే… దాస్య శృంఖలాల నుండి భారతావనిని విముక్తి చేసి మన పుట్టుకకు అర్థం తెచ్చిన మన దేశ వీరులను ఏ విధంగా కొలువగలము? మనసు నిండా వారిపట్ల భక్తి , కృతజ్ఞతా భావమే వారికి మనమిచ్చే నివాళి… అంతే కాకుండా ఆనాడు స్వరాజ్యం కొరకు ప్రజలు, గాంధీ వంటి నాయకులు కన్న కలలను నిజం చేయడం కూడా మన కర్తవ్యం…

గాంధీ గారు అహింస వాదంతో పోరాడారు…

ఒక్కొక్క ఉద్యమ నాయకుడు ఒక్కో రీతిగా వారి వారి సిద్ధాంతాలను రూపుదిద్దుకున్నారు…

బాలగంగాధర్ తిలక్ ” స్వరాజ్యం నా జన్మహక్కు” అన్నాడు…

సుభాష్ చంద్రబోస్ “జైహింద్” అన్నాడు…

మౌలానా హస్రత్ మోహాని ” క్విట్ ఇండియా” నినాదం చేస్తే అది సుభాష్ చంద్రబోస్ గారికి చాలా నచ్చింది…

స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం చాలా కీలకమైనది.

సైమన్ గో బ్యాక్ అని నినాదం యూసుఫ్ మెహర్ జీ ది

” సత్య మేవ జయతే” మదన్ మోహన్ మాలవ్య గారిది…ఇది మన జాతీయ చిహ్నం మీద కూడా ఉంటుంది.

” సారె జహాసే అచ్చా” అని మహ్మద్ ఇగ్బాల్ గారు అన్నారు…
ఇలా ఎంతోమంది ఎన్నెన్నో నినాదాలు చేసారు, ఎన్నో ఉద్యమాలు చేసారు.
అన్ని మతాలకు అతీతంగా జరిగిన పోరాటమే స్వాతంత్రోద్యమం…
నెత్తురు మరిగిన వీరులు యుద్ధ భూమిలో జడవరు. మన వీరులు ఆనాటి పోరాటాలలో వెన్నుచూపకుండా ముందుకెళ్లాలి, తూటాలకూ బలి అయ్యారు… వారంతా చేసిన పోరాటం ఎవరికోసం? జన్మభూమిని పరాయి పాలన నుండి విముక్తి చేయాలని, కన్న భూమి రుణం తీర్చుకోవాలని ఈ భూమి మీద పుట్టిన బిడ్డల భవిష్యత్తు కోరి వారు ఈ పోరాటాలు అవి! నిస్వార్థంగా జరిపిన వాళ్ళ ఉద్యమాలన్నీ బ్రిటిష్ వారి ని గడగడలాడించాయి. మన వీరులు సఫలీకృతులయ్యారు…
మరి మనం?

ఓ కవి సినిమా పాటలో ” స్వాతంత్ర్యం వచ్చెనని సంబర పడబోకొయ్” అన్నాడు… ఎంతమంది ప్రాణాలు అర్పణ చేస్తే మనం ఈరోజు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నాము? దానికి కృతజ్ఞతగా ఏం చేస్తున్నాం? ఏం చేయాలి?

మన వంతు కర్తవ్యం గా మనము మన దేశాన్ని కాపాడుకోవాలి. దేశభక్తిని చాటి చెప్పాలి. రాబోయే తరాలకు దేశం అంటే మట్టి కాదు ఈ మనుషులోయ్ అనే గురజాడ వారి మాటలను నేర్పాలి…
ఈరోజు గడుస్తుంది కదా అని నిద్రపోతే జరిగే ఎన్నో అనర్ధాలకి కారణమవుతుంది…”ఎవరో వస్తారని ఏదో చేస్తారని” అనే ఓ కవి మాటలని ఆచరించాలి ఎవరికి వారమే మనమంతా మన కర్తవ్యం గా నిలబడాలి… వందేమాతర గీతం మన హృదయాలలో నిలిచిపోవాలి… జనగణమన అనే గేయం మన గుండెలో గణ గణమని మ్రోగాలి… ప్రతి పౌరుడు మన జాతీయ జెండా గగనంలో రెపరెపలాడేలా మన వంతు బాధ్యతను నిర్వర్తించాలి. మన కీర్తి పతాకం మన జాతీయ జెండానే… జై హింద్ జై హింద్ జై హింద్….

ఈ సందర్భంగా ఒకప్పుడు మేము పాఠశాలలో జరుపుకునే స్వాతంత్ర దినోత్సవం నాకు గుర్తొచ్చింది. పాఠశాలలో ఒక నెల రోజుల ముందు నుండే పండగ వాతావరణం కనిపించేది… అన్ని రకాల పోటీలను నిర్వహించేవారు… తప్పకుండా అందరం ఎవరికీ నచ్చిన ఆటల్లో ఎవరికి నచ్చిన అంశాల్లో వాళ్ళము పార్టిసిపేట్ చేసేవాళ్లం…. అసలు స్కూల్ నుండి ఇంటికి వెళ్లాలనే ధ్యాస కూడా ఉండేది కాదు . ఆకలి దప్పిక తెలియక సాయంత్రం వరకు స్కూల్లోనే ఉండి ఎప్పటికో ఇంటికి చేరుకునే వాళ్ళం !

వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, ముగ్గుల పోటీలు, పరుగు పందెం, కబడ్డీ, కోకో, నిమ్మకాయ చెంచా ఇలా ఎన్నో ఆటలు పోటీలు నిర్వహించే వాళ్ళు. ప్రథమ ద్వితీయ ప్రోత్సాహక బహుమతులు ఉండేవి. వీటిని పంద్రాగస్టు రోజు బహూకరించేవాళ్ళు.. ఆ రోజు కోసం ఎంతో ఎదురుచూసే వాళ్ళము. అలా అందరూ ఆగస్టు 15 కోసం స్నేహితులతో ఎన్నో ముచ్చట్లు పెట్టుకొని ఆ రోజు కోసం ఎదురుచూసే వాళ్ళం….

మా ఉపాధ్యాయులు ఐదున్నర వరకు పాఠశాలలో ఉండాలని చెప్పేవాళ్ళు… అసలు రాత్రంతా నిద్రపోతే కదా ? ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా , ఎప్పుడెప్పుడు పాఠశాలకు వెళ్దామని ఆలోచన… అలా ఉదయమే లేచి , ఉన్న వాటిలో కొత్త బట్టలు ధరించి చక్కగా తయారై పాఠశాలకు వెళ్లేవాళ్ళం… జెండా గద్దె పై, జెండాను పాతినిచోట చక్కగా అలికి శుభ్రంగా ఉండేది.. మాకు తోచిన ముగ్గులను మేము వేసే వాళ్ళము . ఆ తర్వాత అందరూ పాఠశాలకు చేరుకున్న తర్వాత ‘ప్రభాతభేరి‘ జరిగేది .అంటే పాఠశాలలోని పిల్లలందరము ఉపాధ్యాయులతో సహా మొత్తం గ్రామం తిరగాలి. జాతీయ నినాదాలు చేసుకుంటూ “జై హింద్ జై హింద్ ” అని అంటూ , ” భారత్ మాతాకీ జై” అని అంటూ తిరుగుతుంటే మా మనసులు పులకరించిపోయేవి . ఆ రోజులు ఇప్పటికీ నా కళ్ళ ముందు కదులుతున్నాయి…
అలా మేము ప్రభాతభేరి నిర్వహిస్తూ ఊళ్ళో అన్ని ముఖ్యమైన వీధుల్లో సందుల్లో తిరుగుతుంటే, ఎవరి ఇంటి ముందు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల కోసం ఎదురుచూసే వాళ్ళు.. అలాగే మా ఇల్లు వచ్చేసరికి మా ఇంటి ముందు నాకోసం చూస్తూ మా తల్లిదండ్రులు కూడా ఉండేవాళ్ళు… వాళ్ళు కూడా మాతో గొంతు కలిపే వాళ్ళు . అలా ఊరంతా తిరిగి తిరిగి పాఠశాలకు చేరుకునే వరకు దాదాపు దాదాపు 10.30, 11 గంటలు అయ్యేది. అప్పుడు జెండా ఎగరవేసి శ్రద్ధ తో సెల్యూట్ చేస్తూ జాతీయ గీతం ఆలపించేవాళ్ళం. ఉపాధ్యాయుల ఉపన్యాసాలు శ్రద్ధగా విని.. తర్వాత బహుమతులను ఎంతో అపురూపంగా అందుకొని మురిసిపోయే వాళ్ళము.
తర్వాత ఇది పండుగ కాబట్టి అందరికీ బిస్కెట్లు పంచేవాళ్ళు ఆ బిస్కెట్ల కోసం ఎంత ఎదురు చూసేవాళ్ళమో ఇప్పుడు ఎన్ని తిన్నా పొందని ఆనందం అప్పుడు ఆ చిన్న బిస్కెట్లు తింటే దొరికేది… ఇవన్నీ తలుచుకుంటుంటే ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి… దేశభక్తి కూడా నరనరాన నిండి ఉండేది… మనం ఇలాంటి విషయాలను మన ముందు తరాలకు తీసుకెళ్తే దేశం పట్ల భక్తితో పాటు బాధ్యత కూడా తెలిసి వస్తుంది అని నా భావన…

జై హింద్ 🙏🙏🙏

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జాగృతి

‘తరుణి యూట్యూబ్ ఛానెల్ ‘