జాగృతి

కథ

       కామేశ్వరి వాడరేవు

శాంతా, సూర్యం లు మధ్యతరగతి కుటుంబీకులు. సూర్యం ఏదో కంపెనీలో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. వారికి సుమా హిమ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. శాంత కూడా డిగ్రీచదువుకుంది కానీ ఉద్యోగం చేసే అవకాశం రాలేదు. భర్త తెచ్చే సంపాదనతో పొదుపుగా ఇల్లు ఈడ్చుకొస్తుంది. ఓ రోజు సుమ, హిమ స్కూల్ నుంచి హుషారుగా ఇంటికి చేరి ” అమ్మ….. అమ్మా… బాగా ఆకలవుతోంది. ఏం చేసినావ్ తినడానికి… శాండ్విచ్ చేసావా, నూడిల్స్ చేసావా… లేకపోతే నీ పాత కాలం నాటి జంతికలు సున్నుండలు చేశావా… ” అంటూ గలగల వాగుతూ వచ్చారు. వంటింట్లో ఉన్న శాంత ” వచ్చారా తల్లి! నా ప్రాణం తీయడానికి.. ఏ రోజు టిఫిన్లు ఆరోజు చేయలేనమ్మ. ఒకేసారి జంతికలు వేరుశనగ చెక్కలు చేసి పడేస్తానంటే ఒప్పుకోరు. రోజు ఒకటేనా అంటూ గోల్చేస్తారు. నేను ఎన్ని పనులన్నీ చేయగలను. బట్టలు ఉతకాలి,వంట చేయాలి . ఉదయం ఐదు గంటలు లేస్తే గాని పని తెలవట్లేదు. పనిమనిషి పొద్దెక్కి ఏడవుతే గాని రాదు. మిమ్మల్ని తయారుచేసి, మీకు డబ్బాలు సద్ది, మిమ్మల్ని మీ నాన్నను పంపేటప్పటికి నా తల ప్రాణం తోకకు వస్తోంది. మీ నాన్న ఉండి ఏం లాభం. ఒక్క పనిలో కూడా ఆసరా ఉండదు. ఎప్పుడు ఆఫీసు,ఆఫీసు పని అని గోల. బయట పనులే చేయనా ఇంట్లో పనిలే చేయనా. ఇవాళ ఈ మిక్సీ తగలడింది. దీన్ని రిపేర్ చేయించు కొని ఇప్పుడే వచ్చాను. ఇంతలో మీరు తయారయ్యారు. ” అంటూ విసుక్కుంది.
అమ్మ తీవ్రతను గమనించిన సుమ, హిమ మారు మాట్లాడకుండా ఫ్రెష్ అయ్యి వచ్చారు . అమ్మ చేసిన నూడిల్స్ తింటూ సుమ ” అమ్మా ఇవాళ మా ప్రోగ్రామ్స్ రిపోర్ట్ ఇచ్చారు. నాకు 80% వస్తే హిమా క్లాస్ కి ఫస్ట్ వచ్చిందిఎప్పటిలాగే.”అంది. శాంత కూడా చాలా సంతోషించి హిమని హృదయానికి హత్తుకుంది. ” కాసేపట్లో మీ నాన్నగారు వస్తారుఆఫీసు నుంచి. ఆయనకి చూపించి సంతకాలు పెట్టించుకోండి. “అంది. కానీ శాంతకి భయంగానే ఉంది. ఈసారి కూడా చిన్నది హిమ ఎప్పటిలాగే మొహం చిన్నపుచ్చుకుంటుంది. దాని కార్య కారణాలు తనకు కూడా తెలుసు.
తండ్రి సూర్యం ఆఫీస్ నుంచి రానే వచ్చాడు. వస్తూనే” శాంతా…శాంతా….. అని అరుస్తూనే ” కాస్త టీ తెచ్చి ఇస్తావా. బుర్ర బాగా వేడెక్కిపోయిఉంది.” అంటూ సోఫాలో కూలబడ్డాడు. శాంత గబగబా గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి అందించింది. ” టీ పెట్టాను ఇప్పుడే తెస్తాను ఉండండి” అంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఈ లోగా బెడ్ రూమ్
కర్టీను వెనకాల దాగిన సుమను చూచి ” ఇలా రా అమ్మా.. అక్కడ నిలబడ్డావ్ ఏమిటి, ఏమైనా చెప్పాలా” అంటూ దగ్గర తీసుకున్నాడు బుజ్జగింపుగా. తండ్రి పక్కన కూర్చున్న సుమ” నాన్నగారు ఇవాళ మా స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. నాకు 80% వచ్చాయి. హిమ దాని క్లాసు కు ఫస్ట్ వచ్చింది .’అంది. విన్న సూర్యం సుమని అభినందించాడు. కానీ హిమాని పిలవలేదు,పట్టించుకోలేదు. హిమ లోపలే నిలబడి ఉంది. ఇంతలో టీ తెచ్చిన శాంత చిన్న స్వరంతో ” హిమాని కూడా పిలవచ్చు కదా! అది మీ కూతురే గా. మీ ప్రవర్తనకి అది ఎంతో బాధ పడుతోంది. దాని విషయంలో ఎప్పుడూ మీరు చిన్న చూపుతోనే ఉన్నారు. చిన్న వయసు పిల్లలను బాధ పెడితే అది చాలా అనర్ధాలకు దారి తీయవచ్చు. మీరు మారేది ఎప్పుడో నాకు అర్థం కావడం లేదు. ఏదైనా తెగేదాకా లాగకూడదు… ” అంటూ విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది శాంత. ఇది ఎప్పుడూ జరిగే తంతే ఇంట్లో.
అనుకోకుండా ఒక రోజు సూర్యం ఆఫీస్ నుంచి వస్తుంటే స్కూల్ హెడ్మాస్టర్ గారు కనిపించి ” మీ చిన్నమ్మాయి హేమ చదువులోనూ ఆటల్లోనూ, అన్ని యాక్టివిటీస్ లోను ప్రథమంగా నిలుస్తోందండి. ఆ అమ్మాయిని మీరు చాలా చక్కగా ప్రోత్సహిస్తున్నారు. ఈ సంవత్సరం మా స్కూలు వార్షికోత్సవంలో మీ అమ్మాయిని సత్కరించాలని అనుకుంటున్నాము. కలెక్టర్ గారు ముఖ్యఅతిథిగా వస్తారు. నీకు కబురు వస్తుందనుకోండి,ముందుగాతెలియజేస్తున్నాను” అని చెప్పి వెళ్ళిపోయారు.
ఇంటికి వచ్చిన సూర్యానికి హిమ గురించి హెడ్మాస్టర్ చెప్పిన మాటలే మెదులుతున్నాయి. మనసు ఎందుకో కలవర పడుతోంది. తనకి తను స్వగతంలోకి వెళ్లాడు. ” ఆడపిల్లగా పుట్టిందని హిమని నెగ్లెట్ చేస్తున్నానా… రెండవసారి మగ పిల్లవాడు కావాలని తనకి బలమైన కోరిక ఉండేది. తన తల్లి తండ్రి కూడా అదే కోరుకున్నారు వంశోద్ధారకుడు కావాలని. కానీ ఆడపిల్ల పుట్టింది.. ఎందుకో నిరాశ కలిగింది… దానితో తనకి హిమ మీద శ్రద్ధ తగ్గింది. సుమని చూసినట్టు హిమ ని చూడలేకపోయాడు. ఆడకి మగకి భేదాలు చూస్తూ వచ్చాడు. తను చదువు సంస్కారం ఏమయ్యాయి. తన తల్లి ఒక ఆడదే తన భార్య ఒక ఆడదే. వారే లేకపోతే సంసారం అనేదే ఉండదు కదా. ఇదంతా భగవంతుడు సృష్టి. దాన్ని అంగీకరించటమే మన విధి. ఆమధ్య హిమకు డెంగ్యూ జ్వరం వచ్చి హాస్పిటల్ పాలైతే తను కొంచెం కూడా శ్రద్ధ చూపలేకపోయాడు. అన్ని శాంతే చూసుకుంది. తన హాస్పిటల్ కి వెళ్తే హేమ తనకేసి దీనంగా చూసేది. కానీ తను పట్టించుకోలేదు. తన ఇంగితం అయిపోయింది. ఇవాళ హెడ్ మాస్టర్ చెప్తే కానీ తెలుసుకోలేకపోయాడా. అక్కడికి శాంత ఆస్తమాను చెబుతూనే ఉండేది. మీరు ఇద్దరినీ సమానంగా చూడట్లేదు. అది పిల్లపై ప్రభావం పడుతుంది.’అని. మగ పిల్లలు ఉన్న తండ్రుల బాధలు తన కొలీగ్స్ ద్వారా వింటూనే ఉన్నాడు. వాళ్లు ఎదిగిన తర్వాతే ఎన్ని బాధలు పెడుతున్నారోచెప్తూనే ఉన్నారు.కానీ తెలివి రాలేదు. ఇప్పటికైనా నా మనసు మేల్కొంది. ” అనుకున్నాడు సూర్యం. రాత్రి నిద్ర పోతున్న హిమ దగ్గరికి వెళ్లి తలా,బుగ్గలు నిమిరి ” నా బంగారు తల్లి ” నా వజ్రాల మూట ” అని మురిసిపోయాడు
మర్నాడు స్కూలు సభలో కలెక్టర్ గారి ద్వారా అవార్డు అందుకున్న హేమ ఆర్తిగా ముందు సీట్లో కూర్చున్న తండ్రి వైపు చూసింది. కలెక్టర్ గారు సూర్యాన్ని నివేదిక మీద పిలిచి ” ఇంత తెలివైన అమ్మాయిని కన్న మీరు ఎంతో అదృష్టవంతులు. అమ్మాయికి ఎంతో భవిష్యత్తు ఉంది. ఈ రోజుల్లో అన్నిట్లో అమ్మాయిలే ముందుంటున్నారు. మీరు కాస్త గైడెన్స్ ఇచ్చి ప్రోత్సహిస్తే ఈ అమ్మాయి నాలా కలెక్టర్ అవడానికి ఛాన్స్ ఉంది. మీ ప్రోత్సాహం ఒకటే కావాల్సింది. “అని అన్నారు. ఆ మాట విని తనలో తానే ఎంతో సిగ్గు పడిపోయాడు. కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. అవి పశ్చాత్తాపానికి గుర్తులేమో! హిమనీ అక్కున చేర్చుకొని మౌనంగానే అభినందించాడు. కింద నుంచి ఇదంతా చూస్తున్న అక్క సుమ, తల్లి శాంత ఎంతో ఊరట చెందారు.
* ఆడపిల్ల ఎప్పుడు భారం కాదు, మరో సృష్టికి ఆధారం కూడా.*

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జీవితానుభవాలే రచనలుగా…

మన శక్తి స్వాతంత్రమే! మన యుక్తి స్వాతంత్ర్యమే!