సాహిత్యం పై ఆసక్తి చిన్నతనం నుంచి ఉన్నప్పటికీ ఉద్యోగ నిర్వహణ, కుటుంబ బాధ్యతలతో బిజీ జీవితం. పదవీ విరమణ తర్వాత చిన్నతనం నుంచి తనకు సాహిత్యం పై ఉన్న ఆసక్తిని మరింత పెంచుకుంటూ అనుభవాల సారాన్ని రచనలుగా మలిచారు. 60 ఏళ్లు దాటిన తర్వాత కలాన్ని పరుగులు పెట్టిస్తూ కథలు, కవితలు , నవలలు రాస్తూ పాఠకుల్లో మంచి గుర్తింపుని సాధించారు. ఆమే లలిత కుమారి గారు. లలితా వర్మగా ఆమె రాసిన కథలు, నవలలు పాఠకులకు సుపరిచితం. ఈ వారం తరుణి ముఖాముఖి లో ప్రముఖ రచయిత లలితా వర్మ గారి గురించి తెలుసుకుందాం.
మీ పరిచయం?
హైదరాబాద్ లో పుట్టి పెరిగాం. మా అమ్మానాన్నలు కీ.శేలు శ్రీమతి నాగలక్ష్మి, కీ.శేలు రామదాసువర్మ. నాన్న గారు ఆర్.టి.సి. లో టి.టి.ఐ. గా పనిచేసి రిటైర్ అయ్యారు. డ్యూటీ ఈజ్ గాడ్ అని నమ్మిన వ్యక్తి ఆయన. మేము అయిదుగురు సంతానం. నలుగురు ఆడపిల్లలం. అన్నయ్య ఒక్కడే. అమ్మానాన్న మమ్మల్ని చాలా ఆదర్శంగా పెంచారు. చదువుకుని ఎవరికాళ్ల మీద వారు నిలబడాలని చెప్పేవారు. నాన్నగారి ఉద్యోగరీత్యా నిజామాబాద్ లో స్థిరపడటం వల్ల మేమంతా నిజామాబాద్ లోనే చదువుకున్నాం. నేను బి.ఏ.బి.ఓ.ఎల్ అయాక వరంగల్ బి.ఎడ్. కళాశాలలో ఉపాధ్యాయశిక్షణ పొంది నిజామాబాద్ లో వివిధ జిల్లాపరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయినిగా ముప్పై సంవత్సరాలు పనిచేశాను. భర్త, పిల్లల కొరకు స్వచ్ఛంద పదవీవిరమణ చేసి హైదరాబాద్ లో స్థిరపడ్డాను. 1985 లో నా వివాహం, హైదరాబాద్ వాస్తవ్యులైన కృష్ణవర్మ తో జరిగింది. మీకు ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి ఎమ్.బి.ఏ. చేసి ప్రస్తుతం హైదరాబాద్ లో వర్చుసా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కోడలు డెంటిస్ట్. మనవరాలు 2nd standard లో ఉంది. అమ్మాయి, అల్లుడు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్. అమెరికాలోని మిషిగన్ లో స్థిరపడ్డారు. మనవడు 2nd స్టాండర్డ్ లో ఉన్నాడు. ఇది సంక్షిప్తంగా నా పరిచయం.
మీకు సాహిత్యం లో ఆసక్తి ఎలా కలిగింది?
నాకు చిన్నప్పటినుండీ తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. దానికి కారణం మా అమ్మానాన్నలే! అమ్మ నా తొలిగురువు. బడికివెళ్లేనాటికే అక్షరాలు, గుణింతాలు నేర్పించింది. పెద్దబాలశిక్ష చదవించేది. నాన్న హైదరాబాద్ వాసి… చదివింది ఉర్దూ, ఇంగ్లీష్ మాధ్యమాలు. తెలుగు అంత బాగా వచ్చేదికాదు.
అయినా మాకోసం చందమామ కథల పుస్తకాలు ప్రతీనెలా తెచ్చిచ్చేవారు. ఆ పుస్తకాలు చదవటం వల్ల తెలుగు భాషమీద ఇష్టం పెరిగింది. పెద్దయాక అమ్మ చదివే ఆంధ్రప్రభ వారపత్రిక, కోడూరు కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, రంగనాయకమ్మ నవలలు నేనూ చదవాలనుకునేదాన్ని. కానీ ఆ పుస్తకాలు అమ్మ నన్ను చదవనిచ్చేదికాదు. పాఠ్యపుస్తకాలే చదువుకోవాలని చెప్పేది. 10th పూర్తయాక ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి వారపత్రికలు, నవలలు చదవటం మొదలుపెట్టాను. సీరియల్స్ తో పాటు మాలతీచందూర్ శీర్షికలు నన్నుబాగా ఆకట్టుకున్నాయి. బి.ఓ.ఎల్ చదివేటపుడు కావ్యాలు చదువుతూ పద్యసౌందర్యాన్ని ఆకళింపు చేసుకునే రోజుల్లో… జాషువా, దాశరథి, సినారె, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, మొదలైనవారు రాసిన కవిత్వం బాగా ఆకట్టుకుంది. నాకూ ఏదైనా వ్రాయాలనే ఆసక్తి కలిగింది
మీరు సాహిత్యం పై మక్కువ చిన్నతనంలోనే పెంచుకున్నారు. కానీ మీరు 60ఏండ్లు నిండిన తర్వాత రాయడం ప్రారంభించారు. కారణం?
కాలేజీ రోజుల్లో కాలేజీ మాగజైన్ కొరకు వ్రాసిన కథ, కవిత అచ్చయాయి. ఆ ప్రోత్సాహంతో ఒక కథ వ్రాసి ఒకానొక పత్రికకు పంపాను. అది తిరిగిరావడంతో ఇంటిసభ్యులు, చుట్టుప్రక్కలవారు కొంతమంది గేలిచేయటం నన్ను బాధించింది. నాకు రాయటం రాదన్న నిర్ణయంతో మానేశాను. పెళ్లయాక ఇరువైపులా పెద్దకుటుంబాలు, ఉద్యోగ బాధ్యత, బదిలీలు కాకపోవడంవల్ల మావారు హైదరాబాద్ లో, నేను నిజామాబాద్ లో ఉద్యోగాలు కొనసాగించవలసిన అవసరం, పిల్లల బాధ్యత ఎక్కువగా నాపై ఉండటం వీటన్నింటివల్లా రచనా వ్యాసంగంపై దృష్టి సారించలేక పోయాను.
ప్రస్తుతం బాధ్యతలన్నీ నెరవేర్చిన పిదప నా 64 వ ఏట నాకు దొరికిన ఏకాంత జీవితాన్ని అర్థవంతంగా మలుచుకోవాలనిపించింది. అందుకే చిన్ననాటి ఆసక్తిని వెలికితీసి కథలు వ్రాయటం ప్రారంభించాను.
మీ రచనలు ఏయే పత్రికల్లో వచ్చాయి.?
మొదట ఫేస్బుక్ లోని ఒక సమూహంలో నా కథలు పోస్ట్ చేశాను. ఆ సమూహ నిర్వాహకులు, సభ్యులు, నన్నెంతగానో ప్రోత్సహించారు. ఆ తర్వాత వెనుదిరగలేదు. కథ, నవల, కవిత్వం ప్రక్రియలో రచనలు చేశాను.
సంఘంలో జరిగిన జరుగుతున్న సంఘటనలు గమనించినపుడు నాలో కలిగిన భావోద్వేగాలకు అక్షరరూపం ఇస్తున్నాను. నేటి సమాజంలో మృగ్యమవుతున్న మానవీయసంబంధాలు తిరిగి నెలకొనాలనేదే నా ఆకాంక్ష. నా రచనలు ఆ ఆకాంక్షను ప్రతిబింబిస్తాయి.
మీరు రాసిన పుస్తకాలు?
ఇప్పటివరకు నాలుగు పుస్తకాలు పాఠకులకు పరిచయం చేయగలిగాను.
1.అరుంధతి@70. కథలసంపుటి.
2. హవేలీ. నవల.
3. కలిసుందామా. నవల
4. గులకరాళ్లు. కవితా సంపుటి.
ఇవికాక వివిధ కథా, కవితా సంకలనాలలో నా రచనలు చోటుచేసుకున్నాయి.
వివిధ అచ్చు పత్రికల్లో, అంతర్జాల పత్రికల్లో ముద్రించబడినాయి.
ఇప్పటివరకు మీరు అందుకున్న అవార్డులు, పురస్కారాలు:
చాలానే అవార్డు లు వచ్చాయి. వాటిలో కొన్ని
1. గిడుగురామమూర్తి పంతులుగారి జాతీయ స్మారక అవార్డు రెండుసార్లు లభించింది.
2. విశ్వసాహితీ నగదు పురస్కారం.
3. అమృతలత అపురూప అవార్డు. లభించాయి.
ప్రస్తుతం నేటి యువతకు సంబంధించి వ్రాసిన “తరుణిమ” అనే పెద్దకథ అముద్రితం.
భవిష్యత్తులో మరిన్ని మంచి రచనలు చేయాలని నా సంకల్పం.
మీరు తరచుగా పర్యాటక ప్రదేశాలుకు వెళ్ళుతుంటారు కదా! మీకు బాగా నచ్చిన ప్రదేశాలు?
కొత్త ప్రదేశాలు చూడాలన్న ఆరాటం ఎక్కువ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా నేను దర్శించిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కాశీ, సోమనాథ్, బుద్ధ గయ, ప్రయాగ, ఉత్తరాఖండ్, కేదారనాథ్, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి, ఉత్తరకాశీ, గుప్తకాశీ, హరిద్వార్, ఋషీకేశ్, తమిళనాడులో దాదాపు అన్నీ ఆలయాలు సందర్శించాను. సింగపూర్లూ పర్యటించాను.
ప్రస్తుతం అమెరికాలోని మిషిగన్ లో ఉన్నాను. ఇక్కడ వివిధ ప్రదేశాలు సందర్శించాం.
మనదేశంలో చార్ధామ్ యాత్ర, తమిళనాడు ఆలయాల సందర్శనం, మన తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలు వివిధ ప్రదేశాలు చూసినపుడు పొందిన అలౌకిక ఆనందం అంతులేనిది. ఆలయాల్లో శిల్ప సౌందర్యం, ఆలయనిర్మాణం చూస్తుంటే ఆనాటి శిల్పులకు శిరసు వంచి పాదాభివందనం చేయాలనిపించింది. ఎంత అద్భుతమైన కట్టడాలో!
జీవం ఉట్టిపడే శిల్పాలు! అంతుపట్టని రహస్యాలు!
ఒళ్లు పులకరిస్తుంది. ఆ అలౌకికానందంలో తాదాత్మ్యం చెందుతాము.
ఇక సింగపూర్ పర్యటన.. చిన్న దేశమైనా సాధించిన అభివృద్ధి, వారు పాటించే పరిసరాల శుభ్రత చూస్తుంటే అబ్బురమనిపిస్తుంది.
అమెరికా పర్యటన జనాభా తక్కువగాఉన్న పెద్దదేశం. ఇక్కడ నాకు బాగానచ్చింది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించడం, పరిసరాల పరిశుభ్రత దోహదంచేయడం! ఎన్ని మైళ్లు ప్రయాణించినా ఎక్కడా అపరిశుభ్రత కనిపించలేదు.
ఏ ప్రదేశానికి వెళ్లినా నీట్ నెస్ బాగా ఆకట్టుకుంది. మన దేశంలోనూ పరిశుభ్రత కు ప్రాధాన్యత ఇవ్వాలన్ని కోరుకుంటాను.
నేటి యువత కు మీరిచ్చే సందేశం?
నేటి యువత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నెన్నో రంగాల్లో ఎంతో ప్రగతి సాధిస్తున్నారు. ఆ ప్రగతికి నైతికవిలువలు తోడైతే అభ్యుదయం సాధించగలమనే విషయాన్ని గ్రహించాలి.
ఎంత ఉన్నత శిఖరాలకు చేరుకున్నా మన మూలం, మన ఊరు, మనకన్నతల్లిదండ్రులు, మన భాష, మన సంస్కృతి, వీటిని మరవద్దు.