ఎర్రరంగు బురద

ధారావాహిక నవల 13 వ వారం

జరిగిన కథ: పుష్ప పద్మ హాష్టల్ పిల్లలు. హోలీ పండుగ సమయంలో బళ్ళె పుష్పకు ఫిట్స్ వస్తయి. డాక్టర్ తండ్రిని పిలవమంటే. తండ్రి చచ్చిపోయిండని. తాత వస్తడు. డాక్టర్ పద్మను వివరాలు అడిగితే.. తండ్రితో కలిసి వచ్చి లావుపాటి నోట్స్ ఒకటి చేతికిచ్చి. “మా నాన్న చెపుతుంటె, నేను రాసిన, ఇదొక జాతి చరిత్ర” అంటది పద్మ. డాక్టర్ కథ చదవడం మొదలు పెడతాడు. తండ్రి స్వార్ధానికి బలైన ఏదులు.. తన తల్లి మరణానికి కారణమైన తండ్రిని ద్వేషిస్తాడు. సవతి తల్లి కొడుకు అతనిని రెచ్చగొడుతుంటాడు.

ఏదులు తండ్రి సంగడు ఏదులు అక్కను బొంబాయికి పంపిండు. తనను చెల్లెను పట్టించుకోలేదు మేనమామ సాది పెద్ద చేసి పెండ్లి చేసిండు. ఏదులుకు ముగ్గురు పిల్లలు. వాళ్ళ పై కుట్ర చేసి ఏదులు భార్య నాంచారికి కరెంటు షాక్ తగిలిస్తారు. రత్నం సేటు చికిత్స చేయిస్తాడు. నష్టపరిహారం కొంత డబ్బు ఇవ్వాలనుకుంటడు సేటు. ఆడబ్బు కోసం ఏదులు తండ్రి సంగడి ఆలోచన తెలిసి సేటు. ఏదులు భార్య పిల్లల పేరు మీద చెక్కులిస్తడు. వాటితో ఇల్లు బాగుచేసుకుని. మామ ఊర్ల భూమి కొనాలనుకుంటడు ఏదులు.

కొడుకు తన డబ్బులు దక్కనియ్యలేదని పగబట్టిండు ఏదులు తండ్రి.  ఒకరోజు పగటిపూట ఇంటికొస్తూ దారిల మందను సరిచూసుకుంటన్న ఏదులు మీద పడ్డరు ఆయుధాలతో.. ఏదులును చంపి కూడా తప్పించుకున్నరు తండ్రికొడుకులు. నాంచారి ఒంటరిదైంది. ఏదులు కొడుకులతో ఎట్టి చేయించుకోవాలని అనుకున్నడు సంగడు. పెద్దకొడుకు నాగులును సంగనితో పంపింది. చిన్నకొడుకును హాస్టల్ల ఏసింది. సంగడింట్ల జీవిత పాఠాలు చదువుతుండు నాగులు.  వాన కురుస్తున్న రాత్రి

ఒంటరిగున్న నాంచారి ఇంటికి చేరిండు ఎంకులు. పక్క గుడిసెల గొల్లమల్లమ్మను తోడు పండబెట్టుకున్నది. ఇద్దరు కలిసి ఎంకులు పనిపట్టిన్రు. నాంచారి భయంతో జొరమొచ్చింది. తండ్రి వచ్చి తీసకపోయిండు.

నాంచారి పిల్లలతో కలిసి తండ్రి ఊర్లోనే ఉంటున్నది. నాంచారి పెద్దకొడుకు తల్లికి సాయంగా పనిచేసేవాడు. ఎప్పుడూ బడికి పోకుండా ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతి పరీక్షలు రాసిండు. ఫెయిల్ అయి కుంగిపోతుంటే తాత మిల్ట్రీ నారాయణ దగ్గరికి తీసుకొచ్చాడు.

————ఇక చదవండి——–

పోలీసులు తీసుకొచ్చి అనాథాశ్రమంలో ఏసిన్రు. అది మిషనరీ వాళ్ళది. అక్కడున్న వాళ్ళంతా రోజూ బైబిల్ చదవాలి చర్చికి పోవాలె. అక్కడ నావంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి తిండి దొరికింది, బట్ట దొరికింది. అందుల ఫాదర్ చాలా మంచి వాడు.. దయతో చూసేవాడు.. ప్రేమగా మాట్లాడేది. చర్చి స్కూల్ల చేర్చారు.

అక్కడే చదువుకున్న. నాకు కొత్త జీవితం మొదలైంది. కొత్త లక్ష్యాలు ఏర్పడ్డాయి. నేను చిన్నప్పటి నుండి పెద్దగా తెలివైన వాడిని కాను. కానీ చాలా మొండిగా ఉండేవాడిని. చదువు చురుకుగా సాగినా పోటీపడి ఉద్యోగం సాధించలేను అనిపించింది. అందుకే సైన్యంలోకి పోవాలనుకున్నా.. మా సార్లు, చర్చి ఫాదర్ మాకు కావలసిన సలహాలు ఇచ్చారు. కాలేజీల ఎన్.సి.సి.ల చేరిన ఆ ట్రైనింగ్ నాకెంతో ఉపయోగపడింది. సెలక్షన్లకు అటెండయిన మిలిటరీలకు పోయిన. తర్వాత అప్పుడప్పుడు ‘ఆశ్రమానికి’ వచ్చేవాడిని.

 ఒకసారి యుద్ధంలో ఈ రెండు కాళ్లు పోయినాయి దావకానల ఉండగా ఆ యుద్ధ బాధితుల్లో భర్తను పోగొట్టుకున్నామే నాకు సేవ చేసింది. ఆమెకు ముందే ఒక బిడ్డ ఉన్నది. ఆ బిడ్డకు నేనంటే చాలా ఇష్టం. నాలో తన తండ్రిని చూసుకునేది. ఆమెని పెళ్లి చేసుకున్న. ఆమెది కూడా ఈ ఊరే. ఆ తర్వాత మాకు ఒక కొడుకు పుట్టిండు. మేము నలుగురం ఒక చిన్న కుటుంబం సంతోషంగా ఉండే వాళ్ళం. ఆ ఊరి దొరకు భర్తను పోగొట్టుకున్న ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. యుద్ధంలో భర్తను పోగొట్టుకున్న ఆమెను లోబర్చుకోవాలనుకున్నాడు. కానీ మేమిద్దరం పెళ్లి చేసుకునే సరికి ఏమీ చేయలేకపోయాడు. నాకు మిల్ట్రీ పెన్షన్ వచ్చేది. యుద్ధంలో కాళ్లు పోయినందుకు నాకు ప్రభుత్వం కొంత భూమిని కూడా ఇచ్చింది. అది కూడా ఊరి దొరకు ఇష్టం లేదు. అందుకని ఒక ఎండాకాలం రాత్రి మేమంతా పండుకొని నిద్రపోతున్నప్పుడు, మూసి ఉన్న తలుపులకు బయట నుండి గొళ్ళెం పెట్టి, మా ఇంటికి నిప్పు పెట్టించిండు. నేను ఆ రాత్రి ఇంట్లో ఫ్యాన్ తిరిగినా ఉక్కపోతగా ఉందని ఇంటెనుక పెరట్ల వేపచెట్టు కింద పండుకున్నాను. ఇల్లు కాలుతూ మంటలు చెలరేగి వేడి తగులుతుండగా మెలుకువ వచ్చి నిద్ర లేచాను. అందరినీ కేకలేస్తూ పిలిచాను, ఏడ్చాను, మొత్తుకున్నాను. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మంటలు ఆర్పింన్రు. నా భార్య పిల్లలు నాకు దక్కలేదు. పైగా నేనే వాళ్లను ఇంట్లో పెట్టి ఇంటికి నిప్పు పెట్టానని పోలీసులకు తన మనుషులతో చెప్పించాడు ఆ ఊరి దొర. దొరకు భయపడి ఊళ్లో వాళ్ళు ఎవరు నోరు ఇప్పలేదు. కోర్టు నాకు పదనాలుగు సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. కానీ పది సంవత్సరాలు గడిచిన తర్వాత నా నడవడికను గమనించి ముందే వదిలేశారు.

జైలు నుండి విడుదలైన తరువాత, ఎక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు తిరిగి ఈ ఊరికే వచ్చాను. అప్పటికి దొర పరిస్థితి దిగజారింది పక్షవాతంతో మంచం పట్టాడు. నా ఇల్లు కాలిపోయిన చోట దొర తన పశువులను కట్టేసుకున్నాడు. నా సంగతి తెలిసిన ఇద్దరు ముగ్గురు గ్రామస్తులతో కలిసి దొర దగ్గరికిపోయినాము.

నన్ను చూసి దొర బాధపడ్డడు “నేను నీకు అన్యాయం చేశాను. కనుకనే ఇలా మంచం పట్టాను. నా పాపానికి తప్పకుండా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నీ భూమిని నీ ఇంటిని నువ్వే తీసుకో..” అంటూ కొడుకుతో సంబంధించిన దస్తావేజులు తెప్పించి నాకు ఇచ్చాడు.

 పదిహేనేళ్ల క్రితం ఆ భూమిని ప్రభుత్వానికి పాఠశాల నిర్మించడానికి ఇచ్చేశాను. మిత్రుల సాయంతో ఇక్కడ ఈ చిన్నషాపు పెట్టుకొని బతుకుతున్నాను.

 జైలు కెళ్ళడంతో  పెన్షన్ ఆగిపోయింది. దొర కొడుకు మంచివాడు. జరిగిన విషయాన్నంతా సాక్షాధారాలతో వివరాలన్నీ మిలిటరీ హెడ్ ఆఫీస్ కు పంపాడు. నేను నిర్దోషినని నిరూపించడానికి సాయం చేశాడు. తర్వాత మళ్లీ పెన్షన్ వస్తోంది.

“మనం మనుషులుగా పుట్టినందుకు బతికున్నంత కాలం ఏదో ఒకటి చేయాలి. అది మన భృతి కోసమే కాదు, నలుగురికి కోసం కూడా మనం బతకాలి మనం. ప్రతి రంగంలోనూ వ్యక్తిగతం, సామాజికం రెండు ఉంటాయి.

మనిషి సంఘ జీవి ఒంటరిగా బ్రతకలేడు కదా.. కనుక ఈ సమాజం కోసం మనం ఎంతో కొంత చేయాలి. ఈ సమాజం మనకు ఎంతో కొంత, ఏదో ఒక రూపంలో సాయం చేస్తుంది, కష్టాల్లో ఆదుకుంటుంది, పాఠాలు నేర్పుతుంది. ఈ సమాజానికి మనము ఎప్పుడూ రుణపడి ఉంటాము, ఇందులో రుగ్మతలు ఉంటాయి, విజయాలు ఉంటాయి, ఓటములు ఉంటాయి. ఓటమి నుండి పాఠం నేర్చుకోవాలి. రుగ్మతులకు ఔషధాలు కనిపెట్టాలి. ఈ సమాజంలో బ్రతుకుతున్న మనకు సమాజంలో దోషాలను తొలగించే బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. ఎవ్వరి జీవితం వడ్డించిన విస్తరి కాదు గుర్తు పెట్టుకో”.

 “మిల్ట్రీ నారాయణ మెమోరియల్ స్కూల్ల రాత్రిపూట నీలాంటి పిల్లల కోసమే ఇద్దరు సార్లు ట్యూషన్ చెప్తారు. రోజూ నువ్వు కూడా వచ్చి చదువుకో..” అన్నాడు. నాగుల వైపు ప్రేమగా చూస్తూ..

“నేను పదో తరగతి పరీక్షలు అందులోనే రాసిన..” అన్నాడు నాగులు.

“ఆ బడి ఈ సారు పేరు మీదనే ఉన్నది..” అన్నాడు వీరన్న.

నాగుల్ కి ధైర్యం వచ్చింది “మిలిటరీ నారాయణ సార్ అంటే మీరే నన్నమాట..” అన్నడు చేతులు జోడించి. అవునన్నట్టు నవ్వుతూ తలూపిండు నారాయణ.

“సార్ రోజూ మీ దగ్గరకు వస్తా.. మీ షాపుల కాసేపు పనిచేస్తా.. మీరు మంచి సుద్దులు చెప్తున్నరు. మీరు మాట్లాడుతుంటే ఇంకా ఇనాలనిపిస్తుంది..” నాగుల్.

“సరేలే.. ఇక్కడి నుండి క్లాసుకు పోవాలె మరి.. అట్లయితే రా.. రేపు మంతచి కథ చెప్త రాపో..” అన్నడు నారాయణ.

“వెల్లొస్తం సార్.. మీ పని చెడగొట్టనట్టున్నం.. నమస్తే..” అన్నడు వీరన్న.

“సరే సార్ నేను రేపొస్తా..” అని చెప్పి తాత వెంట ఇంటికి బయలుదేరిండు.

మనవడి ముఖంలో హుషారు చూసి వీరన్నకు కూడా గుండె బరువు తగ్గింది నాగులు మళ్లీ దారిలో పడ్డట్టే అనుకున్నడు.

 పరీక్ష ఫెయిల్ అయిన దగ్గర నుండి ముఖం వేలాడేసుకుని ఉన్న కొడుకును చూసి నాంచారి కూడా భయపడింది. కానీ ఎవరితో చెప్పలేదు. కొడుకుని ఏమీ అడగలేదు. పొద్దుపోయి తాత మనవడు కలిసి హుషారుగా రావడం ఆమెకు కూడా సంతోషమైంది. వివరమేమిటో ఏమీ అడగలేదు నాంచారి.

కానీ వీరన్న బిడ్డకు చెప్పిండు “రోజూ సాయంత్రం నాగులు పక్క ఊరికి పోతడు, భయపడకు. వీలుంటే నేను కూడా పోతా వాడికి తోడు” అన్నాడు

తెల్లవారిన దగ్గర నుంచి నాగులు రోజువారీ పనులు చేస్తనే ఉన్నా.. నారాయణ చెప్పిన మాటల మీదే అతని ధ్యాసంతా ఉంది. ఎన్నడూ లేనిది సాయంత్రము ఎప్పుడు అవుద్దా అని ఎదురు చూసిండు. అన్నట్టుగనే సాయంత్రం అయ్యేసరికి వీరన్న కూడా నాంచారి దగ్గరికి వచ్చి, నాగులను తీసుకొని నారాయణ దగ్గరికి బయలుదేరిండు.

దారిలో తాతా మనవడు ఏమి మాట్లాడుకోలేదు. వీరన్న ఏదో అడగాలనుకుని కూడా, మనవడు ఏదో ఆలోచనలో ఉండడం చూసి, తన ప్రయత్నం మానుకున్నడు.

“నమస్తే సార్..” తాతా-మనవడు ఇద్దరు ఒకేసారి అన్నారు.

 “ఆ రండి రండి.. వచ్చారా..” అంటూ తన దగ్గర ఉన్న ఇద్దరు గిరాకీలకి అడిగింది ఇచ్చి పంపించేశాడు.

“సార్ ఇయ్యాల ఏదో కొత్త కథ చెప్తా అన్నరు కదా.. ఏదైనా పని చెప్పండి, నేను చేస్తుంటా.. మీరు కథ చెప్పండి” అన్నడు నాగులు

“నువ్వు చేసే పని ఏం లేదులే ఇప్పుడు. కానీ ఏదైనా ఉన్నప్పుడు చెప్తాను” నారాయణ.

“మరి కథ..” అన్నడు నాగులు.

“చెప్తాను. కథ చెప్తానులే.. ఇదిగో.. ఈ రోజు నీకు చెప్పే కదా నిజంగా జరిగింది నాగులు. ఒక విషయం గుర్తు పెట్టుకో మన కష్టాలు సమస్యలు చాలా చిన్నవి. మనం ఇవే పెద్దవి అనుకుంటాం. చాలామంది పరిష్కారం లేని సమస్యలనుకొని భయపడతారు, దిగులు పడతారు. ఇంకా ఈ బతుకు వేస్ట్ అనుకుంటూ.. ఆత్మహత్యలకు పాల్పడతారు. కానీ అసలు జీవన్మరణ సమస్యలు వేరే ఉంటాయి. ప్రతి సమస్యకు పరిష్కారం పక్కనే ఉంటది. మనమే వెతుక్కోగలగాలి.. వెతికే సామర్థ్యాన్ని బట్టి పరిష్కారాలు లభిస్తాయి. అవి వారి వారి వివేకాన్ని బట్టి, ప్రతిభను బట్టి ఉంటాయి. అందుకు ఉదాహరణే నేను ఈరోజు చెప్పే కథ” నారాయణ..

 “సార్ ఈరోజు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు నా మొద్దు బుర్రకవి ఎక్కట్లేదు కానీ కథ చెప్పండి మీరు” అన్నాడు నాగులు.

“అట్లా అనకురా సారు చెప్పేది విను అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చెయ్యి” అన్నాడు వీరన్న. “నువ్వు ఆగు తాతా.. కథ విందాం. మీరు కథ చెప్పండి సార్ ” నాగులు.

—-సశేషం—

Written by Jwalitha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శుక్రవారపు లక్ష్మీదేవి పాట

తెల్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ధీర వనిత – వీర గున్నమ్మ