దిక్కు? 

కథ

      పద్మావతి నీలంరాజు 

“ఒరేయ్ అబ్బిగా ! మన బతుకు తెరువు  ఇదేరా . నాకు ఊహ వచ్చిన కాడనుంచి చూతానే ఉన్న, మా నాయన ఈ బండిమీదనే తన బతుకీడ్చాడు. పోతాపోతా  ఈ బండిని నాకిచ్చిండు .” చెప్పుకు  పోత ఉన్నాడు సూరి  తన ఒక్కగా నొక్క కొడుకు అబ్బిగాడితో.

ఎదురుగ బండి ఉన్నది. దానికి దగ్గరలో కుక్కి నులక మంచంలో కాళ్ళు చచ్చు పడి పడున్నాడు సూరి .  మూడు రోజులయింది సూరిగాడు గంజి తాగి . పెళ్ళాం వదిలేసి పోయింది. తనతో ఈ బండి   ఏంటే  ఊళ్లు తిరగలేనని  చెత్త  ఏరుకొనే  ఎంకటేశుని  మనువాడింది. మూడేళ్ళ కూన అబ్బిగాడిని బండి ఎక్కించుకొని ఊరి పొలిమేర దాటాడు సూరి.

కాలం ఆగదు . ఎవరికోసమో పరుగులు పెడుతూనే ఉంటుంది. దానికి పక్క వాడితో పనిలేదు. ఎదుటి వాడితో పనిలేదు. దాని వేగంతో పరుగులైతే వాళ్ళు కొందరే. కుంటి  నడకతో దాని ఊపు అందుకోలేక అలసి వెనక బడి పోయేవాళ్లు మాత్రం కోట్లు. వాళ్ళలో సూరి కూడా  ఒకడు.

* * *

అబ్బిగాడికి పదేళ్లు వచ్చినాయి. బండి  తొక్కడం నేర్చుకున్నాడు. తన నాయన వెనకాలే తిరుగుతుంటాడు. బండిని దేవుడి పటాలతో నింపడం, ఆగరు బతి వెలిగించడం , కుంకుమ, ఏరుకొచ్చిన పూలను పటాలముందు చల్లడము చేస్తాడు. తెల్లారు జామునే లేచి బోరింగ్ నీళ్ల తో స్నానం చేస్తాడు.ఆ తరువాత పట్టెడు విభూతి ని నుదుటి మీద రాసుకొని నలిగిన ఒక తెల్ల చొక్కా నిక్కరు వేసుకొని బయలు దేరతాడు.  దీంతో వాడి  దినచర్య మొదలవుతుంది. సూరిగాడు బండి తొక్కుతుంటే, హుండీ డబ్బా ని జనం దగ్గరకు తీసుకెళ్లి డబ్బులు వేయించుకోవడం చేస్తాడు . అలా ఆ దేవుడు బండిని బతుకు తెరువు చేసుకున్నారు సూరి మరియు  అబ్బి.

“ఒరేయ్ అబ్బిగా ! ఒక రోజుకి ఒక్క ఊరే తిరగాలిరా . ఆ ఊళ్ళో బాపనోళ్ళు  కాడకు  వెళ్లావనుకో కాసింత నూకలు, తోటకూర  దొరుకుతాయి. కోమట్ల బజారుకెళ్లవనుకో దోసకాయ లాటివి దొరుకుతాయి. మన కారోజు తిండి గడిచి పోతది.”అంటూ అబ్బికి పాఠాలు  చెప్పేవాడు సూరి . ఎక్కడో ఒక చెట్టు నీడన బండి ని నిలబెట్టుకొని  ఆ  బండి చక్రాల కిందనే గుడ్డ పరుచుకొని పడుకునేవాళ్ళు.

సూరి రోగాన పడ్డాడు. కాళ్ళు చచ్చుపడ్డాయి. తిరగ లేక పోయాడు. మూడు రోజులనుండి ఆలా ఆ నులక మంచంలోనే పడివున్నాడు. అబ్బిగాడిని చూసి కళ్లనీళ్లు పెట్టుకుంటున్నాడు. ఆ ఊరు  చేరి  వారంరోజులయింది. ఊరి చివరకున్న మైదానంలో సూరీలాంటోళ్ళు గుడిసెలేసుకొని అక్కడే ఉంటున్నారు. తన బండితో అక్కడికి చేరుకున్నాడు అతి కష్టం మీద. మనిసి సాయం, మాటసాయంతో వాళ్ళమధ్య ఈ వారం రోజులు లాకోచ్చాడు . ఇక సూరి కి శక్తీ లేదు. తాను మళ్ళి బండి తొక్క గలనన్న నమ్మకము పోయింది.  అందుకే తాను ఇప్పటివరకు చేసిన పనినే అబ్బి ని కూడా చేయమని చెబుతున్నాడు.

* * *

ఎదురుగ బండి. ఎర్ర రంగు సగం, పసుపురంగు  సగం ఉండి  ఎర్రటి కుంకుమ బోట్లతో దేవుడి మందిరంలా చేయబడిన గూడు  రిక్షా బండి. అందులో సాయిబాబా,అయ్యప్ప, వేంకటేశ్వరస్వామి, లక్ష్మి దుర్గ ఆంజనేయస్వామి  ఇలా ఎంతో మంది దేవతల పటాలున్నాయి. కుంకుమ,  పసుపు  చల్లుతుండడంవలన పటాలన్ని ఎర్రగా పచ్చగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడా సాంబ్రాణి పొగ వలన నల్లగ మసి పూసినట్లుగా  ఉంది.

సూరి ఇక తాను లేవలేనని, మళ్ళి తిరగలేనని  తెలిసిపోయింది. “నీకా  దేవుడే దిక్కురా! ఆ సామి  సల్లగా సూడాల! ఈ సాములు కూసంత పైసలు వేయాలా ! మంచం కాడనుంచి లెగు.  తానం సేయి.  అయ్యప్ప సాములిచ్చిన పంచ చొక్కా ఆడ ఉన్నాయి. అవేసుకో. ఊరిమీదకెళ్ళు. దేవుడు సల్లగా సూస్తే టీ  నీళ్లకు కాసింత పైసలొత్హాయి. లెగు  తొరగా పో!”అంటూ అబ్బిని తొందర చేసాడు.

అబ్బిగాడికి మనసేమి బాగాలేదు. అయినా సూరి సెప్పినట్లే చేసి మార్కెట్ సెంటర్ లో కెళ్ళి బండి ని రోడ్ కి పక్కాగా నిలబెట్టి హుండీ డబ్బా పట్టు కొని నిలుచున్నాడు.

“వీళ్ల కేమి పని లేదు. దేవుణ్ణి కూడా బజారున పెట్టి  అడుక్కొంటున్నారు.! అంటూ ఒక పెద్దమనిషి చీదరించుకొంటూ పక్కకు తొలిగిపోయాడు.

“నాకి పూజ చాల్లే “‘అని అనుకొంటూ ఒక రూపాయి ని ఆ హుండీలోవేసి తన దగ్గరున్న రెండు దోసకాయలు వేంకటేశ్వరస్వామి పటం  ముందుంచి,,” చకచక  వెళ్ళిపోయింది

కూరలమ్మే లచ్చిమి . అలా చాల సేపు అక్కడే నిలబడ్డాడు. వేసిన వాళ్ళు వేశారు. వేయని వాళ్ళు లేదు. అయినా అబ్బులికి ఇవేమి పట్టటం  లేదు. అయ్య మీద దిగులు తప్ప. మద్దానం వేళకి హుండీలో పదిరూపాయలు పడ్డాయి. వెంటనే రెండు బన్నులు  కొనుక్కొని మైదానం వైపు వెళ్ళాడు.

సూరి అలానే పడున్నాడు. అబ్బి నులక మంచాన్ని చెట్టు నీడలోకి లాగి అయ్యను లేపాడు. తనకు ఆనించుకుని కూర్చోబెట్టుకొని ఆ బన్ను ని తినిపించాడు. కాసిని నీళ్లు తాగించాడు. సూరికి అది పసించలేదు. వెంటనే భళ్లుమని వాంతి చేసుకున్నాడు.  అబ్బి కి ఏమి చేయాలో తోచలేదు. అయ్య ని  అలాగే చూస్తూ కూర్చుండి  పోయాడు.  రాత్రి కెప్పటికో అబ్బికి కునుకు పట్టింది. ఆ నులక మంచం పక్కనే నిద్దరలోకి ఒరిగిపోయాడు.

ఒక రాత్రి వేళా సూరి కి కాళ్లతోపాటు గుండె కూడా బిగుసుకుపోయింది. ఎప్పుడో తెల్ల వారు జాముకి అబ్బికి అయ్య లేపినట్లనిపించి లేచాడు. అయ్య ని చూస్తే ఊపిరి తీస్తున్నట్లనిపించలేదు. అబ్బికేమి తోచలేదు. ఎదో తెలియని బాధ. కొంత అర్థమయినట్లు కొంత అర్థం కానట్లు.  ఆ కాయాన్ని అలాగే వదిలేసి బండి తీసుకొని ఆ చీకట్లో కలిసి పోయాడు.

* * *

మరొక ఊరు చేరుకున్నాడు. అక్కడ చాల సందడిగా ఉన్నది. అక్కడ బాబా గారి గుడి మెట్ల మీద పడుకున్నాడు. తన బండి ని ఆ మందిరం వెనకే ఆపివుంచాడు. ఆ రోజు ఏమి చేయాలనిపించలేదు. బాబా మందిరం లో దొరికిన ప్రసాదం తో పొట్ట నింపుకొని ఆ రాత్రి  ఆ మందిరం మెట్ల మీదనే నిద్దరపోయాడు దిగులుగా. తెల్ల వారు జామున అబ్బికి మెలుకువచ్చింది.

అయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ,“నీకా దేవుడే దిక్కు”.

ఊరికి కొద్దిదూరంలో బైపాస్ రోడ్ నుంచి కొంచెము  కిందకు దిగితే అయ్యప్ప స్వామి గుడివస్తుంది. అక్కడెవరో ఒకరు తనకు కొంచం తినడానికి ఇవ్వకపోరు అనుకొంటూ బండి ని తొక్కుకుంటూ బయలు దేరాడు అబ్బి.

ఆకలి,ఆవేదన,తో బండి ని తొక్కే  శక్తి లేనట్లు అతి బలవంతంగా లాగుతున్నాడు. బైపాసురోడ్డు ఎక్కాడు.  మసక చీకట్లలో ఎదురుగ వస్తున్న బండీ లేమి సరిగా కనిపించటంలేదు. దూరంగా పెద్ద లైటు,  హార్న్ వినిపించాయి తప్పఇంకేమి కనిపించలేదు అబ్బి కి. బండి పక్కకు తీయ బోయాడు , మైలు  రాయికి కొట్టుకుంది.

బండి ని తొక్కుతున్న అబ్బిగాడు రోడ్ మీద కు పడిపోయాడు. వేగంగా వస్తున్నా లారీ కి బ్రేక్ వేసే సమయం కూడా కాలం ఇవ్వలేదు. లారీ తో పాటె కాలం ముందుకెళ్ళిపోయింది.  ఆ  కాలం పరుగులో దెబ్బలు తగిలి సొమ్మసిల్లి రోడ్ మీద పడివున్నాడు అబ్బి.

సూరీడు వచ్చాడు. చీకట్లను  తరిమేశాడు. తన వెలుగులో అబ్బిగాడి రక్తాన్ని ఈ ప్రపంచానికి చూపించాడు. అబ్బి గాడి కి కొద్దీ దూరం లో బోల్తా పడి అన్ని భాగాలూ ఊడిపోయిన  దేవుడి బండి. అయ్యప్ప పటం  ఒక దిక్కున, వెంకటస్వామి పటం  ఒక దిక్కున , అమ్మోరి పటం చెల్లా చెదురై  రోడ్డు మీద పడి  కనిపించాయ ఎర్రగా. ఆ పటాలకు దగ్గరగా అబ్బికూడా రోడ్ మీద పడివున్నాడు.

జనం గుమికూడారు. కానీ ఎవరికీ తెలియదు ఈ అబ్బి ఎవరో. ఆ దేవుడి పటాలు మాత్రం తమ ఉనికి చాటుకొంటూ రోడ్ పక్కన కనిపించాయి.అక్కడ గుమికూడిన జనం లోంచి బయటికొచ్చాడు అయ్యప్ప దీక్షలో ఉన్న   రాజా రామ్ “బాల నివాస్ ”స్థాపకులు . వెంటనే వాళ్ళ సంస్థ కార్యదర్శికి ఫోన్ లో చెప్పాడు అంబులెన్సు పంపమని. పావుగంటలోనే అంబులెన్సు అక్కడకు చేరింది. అబ్బిని హాస్పిటల్ కి తరలించారు. కూడా రాజా రామ్  వెళ్ళాడు. అబ్బి కి వెంటనే డాక్టర్ అటెండ్  అయ్యాడు. సెలైన్ పెట్టడం జరిగింది. అయిన గాయాలకు కట్టు  కట్టారు.

డాక్టర్ రాజారామ్ ని ,”ఈ అబ్బాయి కి ఆక్సిడెంట్ అయింది.పోలీసులకి చెప్పారా,” అని  అడిగాడు .

“వాళ్ళకి కూడా తెలియ పరచాను, ఏరియా ఇన్స్పెక్టర్ ఇక్కడకు వస్తుండాలి”,  అని బదులి చ్చాడు. వాళ్ళ మాటల్లోనే ఏరియా ఇన్స్పెక్టర్  సయ్యద్ అక్కడకి చేరుకున్నాడు. ఫార్మాలిటీస్ అన్ని అయినా తరువాత ఈ పిల్లవాడిని అనాధాశ్రమా ని కి చేరుస్తానన్నాడు.

“లేదు ఇన్స్పెక్టర్ గారు , ఈ అబ్బాయి ని మా సంస్థ దత్తత తీసుకుంటుంది,” అని చెప్పి “మీరు కావాల్సిన ఫార్మాలిటీస్ పూర్తి చేయండి”,  అని అన్నాడు.

కొద్దీ సేపటి కల్లా  అబ్బి కి  స్పృహ వచ్చింది. అబ్బి కి కాస్త జరిగింది అర్ధమయింది.  అన్నం  తినిపించాడు రాజారామ్ పక్కనే ఉండి . అబ్బి కి  అయన దేవుడల్లే కనిపించాడు. చేతులెత్తి నమస్కరించాడు.

“నీ పేరేంటి నాయన ,”అని పలకరించారు.

“నా పేరు అబ్బి”.

“ఓ అలాగ మీ నాన్న ఏంచేస్తుంటాడు !”

“ఆ పడిపోయిన దేవుడి బండి మాదే  నండి “.

“ అయ్యో! అది మొత్తం విరిగిపోయిందే !”అంటూ విచారం వ్యక్తపరిచాడు

“మరి  నీ నాన్న ఎక్కడ!”.

అబ్బి కి  ఏడుపొచ్చింది . ఏడుస్తూ చెప్పాడు “అయ్యకేమయిందో తెలవదు. రెండురోజుల క్రితమే  అయ్య పలక లేదు, మంచం మీద అలాగే పడివున్నాడు. నాకేమి తెలవల. నేనొచ్చేసాను”.

రాజారామ్ కి అసలు విషయం  అర్ధమయింది. ఇంకేమి అడగలేదు . ఆ రోజు హాస్పిటల్లో ఉంచి మరునాడు  తన ఇంటికే తీసుకు పోయాడు.

అబ్బి ని స్కూలు కి పంపే ఏర్పాట్లు చేయసాగాడు రాజారామ్.

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కాలం విలువను గుర్తుచేసిన – ‘స్వప్నధార’

ఎర్రరంగు బురద