కాలం విలువను గుర్తుచేసిన – ‘స్వప్నధార’

శాంతికృష్ణ గారి “స్వప్నధార” కవితా సంపుటిపై అరుణ ధూళిపాళ సమీక్ష

ముఖ పరిచయం లేని ఎంతో మంది సాహితీ మనస్సులను ఆత్మీయతా బంధంలో ముడివేస్తున్నది అంతర్జాలవేదిక. ఇందులో “తెలుగు సాహితీవనం” పేరుతో ఎంతోమంది కవిమిత్రులను, సాహితీప్రియులను కలుపుతూ, సమూహానికి కవితా గుబాళింపులు అద్దుతున్న సమూహ నిర్వాహకురాలు శాంతికృష్ణ గారి ‘స్వప్నధార’ కవితా సంపుటి గురించి కొన్ని ఆప్త వాక్యాలు..
విశ్వమంతా నిండిన ప్రేమ ప్రతీ మదిలో చిగురులు తొడుగుతుందని చెప్పిన శాంతిగారు ఆ ప్రేమ భాషకి కవితల సొబగులు దిద్దారు.
” కెంపుల సంద్రాలవుతున్నాయి/ వెన్నెట్లో మెరుస్తూ నిన్నటి సందెల్లో పలకరించిన/ నీ తలపుల మరకలన్నీ..”
సందె వేళ పలకరించిన తలపుల మరకలు కెంపుల సంద్రాలని చెప్పడం సందె కెంజాయ ప్రకృతి రమణీయతా దృశ్యాన్ని గోచరింపచేయడం..

“అలసిన రెప్పలు రచిస్తూనే ఉంటాయి/ ఎప్పటికీ అంతమవని ఓ ప్రేమ కావ్యాన్ని/ ఆనాటి మన తేనె సంతకాల సాక్షిగా”
ప్రేమికుల మధ్య ఉండే మధురమైన భావాలు తనివితీరనివి.. అవి తేనెలూరుతూ తరగని కావ్యమాలికలను అల్లుతూనే ఉంటాయి.

“ఆనంద వర్షమేమో/ రెప్పల మేఘాల నుండి చుక్కలు చుక్కలుగా…”
నిద్దురను దరిచేరనీయని ప్రియుని కలలలో కరిగి కనురెప్పల మేఘాలు ఆనందవర్షాన్ని కురిపిస్తున్నాయట.
ఇక్కడ పఠితులను ఆర్ద్రమైన భావుకతలో కట్టిపడేస్తారు శాంతి గారు..

“ప్రతిరేయి నిదురిస్తున్న అభిసారికనే నేను/
నీ కలల నెగళ్లలో చలి కాచుకుంటూ..”
ప్రతీరాత్రి నిద్దురలో ప్రియుని చేరే అభిసారికగా కలల్లో
తన తమకపు తడిని రగిలించుకుంటూ వియోగపు దూరాన్ని దూరంగా నెట్టేసే ప్రయత్నం చేసే ప్రేయసి..
అందమైన లోతైన వర్ణన ఇది..కవయిత్రి ఊహల పల్లకికి ఇదొక మచ్చుతునక..

” ఒడిసి పట్టుకున్న నీ స్వరం మాత్రం/ నా హృదిలో
ఒదిగిపోయిన నాదమవుతోంది”
తన చెలికాని మధురస్వరం గుండె గూటిలో ఒదిగిపోయి నాదంగా మారుతోంది…నిజమే కదా! పదే పదే ప్రియుని తలచుకునే ప్రియురాలికి మరో స్వరం వినిపించదు..

” నేను మాత్రం ఎదురు చూస్తున్నా/ ఏడవ ఋతువై నువ్వు వస్తావని..”
షడ్రుచుల సమ్మిళితమైన ఆరు ఋతువులు అందరి జీవితాలకు సహజమే..కానీ కవయిత్రి ఇక్కడ వీటికి అతీతమైన ఏడవ ఋతువుగా చెలికాని ఆగమనాన్నిఆశించడం ఊహల రెక్కలు కట్టుకుని ఆనందాన్ని సొంతం చేసుకోవాలన్న భావన అద్భుతం..

” ఎందుకో../జారే కన్నీటికిపుడు/ నీ పేరే పెట్టాలనిపిస్తుంది..” ఈ పంక్తుల్లో..చెలి మదిలో ఆపలేని దుఃఖానికి కారణం చెలికాడు… అందుకే జారే కన్నీటికి ఆపేరే పెడతానంటోంది..
మరో వాక్యంలో,
“జారే కన్నీటి చుక్కనడుగు/ కనుపాపలోని నీ రూపుకి
నిత్యాభిషేకం చేయడానికి/ తాను సజీవ నదిగా మారిందని….”
వియోగవేదన కంటినుండి నిరంతర స్రవంతిలా ప్రవహిస్తూనే ఉంది…విరహంతో వేగే ప్రేయసీప్రియుల దుఃఖాన్ని సహజంగా మలిచారు కవయిత్రి.

“కొన్ని గురుతులంతే/ కాలాన్ని కూడా ప్రశ్నిస్తూనే ఉంటాయి/ కరిగిపోయిన క్షణాలను లెక్కించుకుంటూ..”
ప్రతీ మనిషి జీవితంలో సంతోషం, బాధ సమానంగా ఉంటాయి. ఏది జరిగినా కాలం ఆగిపోనిది. కరిగిపోతూనే ఉంటుంది. మంచి చెడుల జ్ఞాపకాలు మిగిలిపోతాయి..అంటూ కాలం విలువను ఎరుకపరిచారు శాంతి కృష్ణ గారు..ఇక్కడ ఒక వైరాగ్య భావనను పాఠకుని మదిలో ఉదయింపజేస్తారు..

“నమ్మకానికి, అపనమ్మకానికి మధ్యన జీవించలేక/
మనసు నిశ్శబ్దంలో తనను తాను దగ్ధం చేసుకుంటోంది.”
మనిషి మనసు దేన్ని నమ్మాలో, దేన్ని నమ్మకూడదో తెలియని అనిశ్చిత స్థితిలో ఎప్పుడూ డోలాయమానమే.
అటువంటి సమయంలో ఎవరినీ అనలేక, ఎటూ చెప్పలేక మనసు మూగదై తన్ను తాను దహించుకుంటుంది. ఇది మానవులకు చాలా సందర్భాల్లో అత్యంత సహజమైన విషయం… దాన్ని
తనదైన శైలిలో కళ్ళకు కట్టినట్లు వర్ణించారు రచయిత్రి.

“మళ్ళీ ఒకసారి కనిపించవా/ తేల్చుకోవలసిన అనుబంధపు లెక్కలు/ ఎన్నో మిగిలి ఉన్నాయిక్కడ..”
ప్రేయసి దూరమైన తన ప్రేమికుని ఆనవాళ్ళను వెతుక్కుంటూ, ఏ వైపుగా వస్తాడో అని ఎదురుచూస్తూ,
ఒక్కసారి కనిపించమని బతిమిలాడుతోంది. ఎందుకంటే చెలికాడు అర్ధాంతరంగా వదిలివేసిన అనుబంధాలు అసంపూర్తిగా ఇంకా మిగిలే ఉన్నాయి..ఆ లెక్కలు తేలాలట… ఎంత ఆవేదనో? కొలువలేనంత దుఃఖభారమది.

” అర్థం కాని ప్రశ్నలెన్నో ఉదయిస్తూనే ఉంటాయి/ ఇంతటి శూన్యానికి చిరునామా ఏదని..”
తన ఎడబాటు కలిగించిన శూన్యం అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు ఆలవాలం.. ఆ శూన్యంలో ఏర్పడిన వెత తీర్చలేనిది..అంటూ కవయిత్రి శాంతికృష్ణ గారు ప్రేయసి విరహతాపాన్ని మనసులను హత్తుకునేలా సహజ సౌందర్య శైలిలో వర్ణించారు.

ఎవ్వరిలోనైనా ఊహల జగత్తు స్వప్నంలో సాక్షాత్కరిస్తుంది. కన్నీళ్లు, ఆనందాలు, అచేతనావస్థలో భ్రమలుగా చైతన్యం పొందుతాయి. వాటిని ఎంతో అందంగా చిత్రీకరించారు శాంతికృష్ణ గారు.. ఆమె కలం నుండి స్వప్నం ధారలుగా వరదలై పొంగింది అనడానికి ఆమె కవితలే ఉదాహరణలుగా చెప్పవచ్చు..ఇంకా ఇలాంటి మధురోహల చిత్రాలు ఆమె కలం నుండి కవితలుగా మనముందు రూపం ధరించాలని ఆశిస్తున్నాను…

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జాతీయానికి సామెతకు గల భేదం ఏమిటి?

దిక్కు?