కలల ధామం

6 – 8 – 2023 తరుణి సంపాదకీయం

కళాధామాలను చూస్తాము కదా ఈ కలల ధామం ఏంటి? కళల లాగే కలలు కూడా కళ కళలాడాలి.
మనిషికి తన కాళ్ళ మీద తాను నిలబడడం నేర్చుకున్న తర్వాత తనదైన అస్తిత్వం కోసం పరితపించాలి. స్త్రీలైనా పురుషులైనా. ఎవరి స్థాయికి తగినట్టు ఎవరి వీలును బట్టి వాళ్ళు బ్రతుకులు సాగిస్తూ ఉంటారు. జీవశాస్త్రజ్ఞుల నిర్ధారణ ప్రకారం విడతలు విడతలుగా క్రమ పరిణామం చెందినటువంటి మానవ జన్మ ఈ భూమండలం పైననే సకల ప్రాణకోటిలో సర్వోత్తృష్టమైనటువంటిది. అటువంటప్పుడు తనదైన తెలివిని ఒక నవ్య జీవన దశకు ఎదగడం కొరకు తప్పకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఈ ప్రయత్నాల కొరకు ఆలోచనలు చేయాలి, ఊహించాలి. ఏదో తెలుసుకోవాలన్న తపన ఏదో గొప్ప కార్యం చేయాలనే ఒక ముందడుగు వంటివి మానవ ప్రయత్నంగా చేయాలి. వీటినే మనం కలలు కనడం అంటాం. రాత్రివేళ నిద్రలో వచ్చే కలలు పగటివేళ ఉన్నత దశకు చేరుకోవడానికి కనే కలలు కలలు ఏవైనా ఒక మార్గంలో నడిపించడానికే.
లేనిదే ఇన్ని రకాల శాస్త్ర పరికరాలను కనుక్కొని ప్రయోగాలు చేయలేరు. సముద్రాంతర్భాగంలో , భూపరితలానికి దిగువ ఉండే ఉపరితలం పైన గల వాటిని చూడగల పెరిస్కోప్ ను కనుగొన్నా, వాతావరణ పీడనం కొలవడానికి ఉపయోగించే ‘భారమితి’ అనే బెరామీటర్ ను కనుగొన్నా , గాలి వేగాన్ని గాలి దిశను కొలిచే యానెమోమీటర్ కనుక్కున్నా శోధించేతత్వంతోనే! బోధనలోంచి వచ్చిన తెలివిడే కావచ్చు, అభ్యాసంలోంచి వచ్చిన కృషి కావచ్చు కానీ ఏదో సాధించాలి ఏదో కొత్తదనం చూపించాలి, ప్రజోపయోగమైన కార్యక్రమాలను చేయాలి అనే ఆరాటం ఉండడం వల్లనే ఆ విషయం పైననే పదేపదే ఆలోచించి ఆలోచించి ఒక స్థిర రూపానికి రావడానికి మనసు నుంచి మెదడుకు సంకేతాలు వెళ్ళడాన్నే ‘కలలు’అని ఒక నిర్వచనాన్నివ్వవచ్చు.


ఎంత ఆశ్చర్యం ఏ తీగలు లేకుండా సమాచారాన్ని ఒకరి నుంచి ఒకరికి పంపే వైర్లెస్ ని ఎలా కనుక్కోగలిగాము? యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే డైనమో వంటి సాధనం మనిషి మెదడు కదా కనుక్కున్నది. అయితే ఇవన్నీ విద్వత్తు విద్యుత్తు లా ఉన్న వాళ్ళకి శాస్త్ర విజ్ఞానాన్ని ఒడిసిపెట్టిన వాళ్ళకి మాత్రమే సాధ్యం . ఇవి కాకుండా వేరే ఎన్నో విషయాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. కళలు కావచ్చు,భాషా సాహిత్యాలు కావచ్చు,సంఘ సేవ చేసే దృక్పథమూ కావచ్చు . ఇలా ఎన్నో ..ఎన్నెన్నో …సంగతులు హృదయంగమమై మనిషిని ఒకచోట నిలవనివ్వవు ఏదో చేసి సాధించాలన్న తపన ఉన్న మనిషిని అసలే నిలవనివ్వవు అవే పదేపదే అనుకోవడం మూలాన కలలు గా వస్తాయి ఇవి సాధించుకోవడమే మనిషి విజయం. ” పట్టు పట్టరాదు పట్టి విడువ రాదు /పట్టనేని బిగియ పట్టవలెను ” అని వేమన ఊరికే చెప్పలేదు. పట్టుదలకు విజయసంకేతమే కల. మరి దుస్వప్నాల మాటేమిటి? సందేహంలోనే జవాబు ఉంటుంది.
పారదర్శకంగా ఆదర్శప్రాయంగా మంచి కలలు వస్తాయి ,సాధించుకుంటాము . దాన్నే మనం కళాధామం అనేలా కలల ధామం అని చెప్పుకున్నాం.
Let Your Dreams Be Bigger than Your Fear అనే వాక్యం పదేపదే గుర్తు చేసుకోవాల్సిన వాక్యం.
నిష్కపటంగా స్నేహభావంగా సరదాగా ప్రయోజనకరంగా ఉల్లాసభరితంగా ఉన్నప్పుడు పరిసరాలను అలా తయారు చేసుకున్నప్పుడు మంచి కలలే వస్తాయి. ప్రపంచంలో ఎందరో గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు ఉత్తమమైన వ్యాపారవేత్తలు ఉన్నారు .నథింగ్ నుండి సమ్ థింగ్ చేసినటువంటి వాళ్ళను మనం చూసాం ,చూస్తున్నాం. స్వచ్ఛమైన మనస్తత్వంతో కృషి తత్వంతో జ్ఞానాన్ని పంచుకోవడం జ్ఞానాన్ని గడించడం ఈ రెండు సమతుల్యంగా నడుపుకుంటూ నైపుణ్యాలతో దాతృత్వం స్వభావంతో ఉన్న ఎందరో భారతీయ ఆధ్యాత్మిక వేత్తల ను తత్వవేత్త లను మనం చూసాం.
విద్యార్థులు ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని పెద్ద కలలు కనాలి ఆ కలలను సాకారం చేసుకోవడానికి శ్రమించాలి.
ఒక డాక్టర్ వృత్తిని ఒక టీచర్ వృత్తిని వృత్తిని చూసినప్పుడు విద్యార్థి దశ నుండే ఒక ఆదర్శాన్ని అలవర్చుకోవాలి. పిల్లల్ని అడిగితే చిన్నప్పుడు, నేను పోలీస్ అవుతాను నేను టీచర్ని అవుతాను నేను పైలెట్ అవుతాను నేను డాక్టర్ని అవుతాను అంటూ రకరకాల వృత్తులను గురించి వాళ్ళకి ఏమీ తెలిసి తెలియని వయసులోనే చెప్తూ ఉంటారు వాళ్ళ ఆసక్తిని గమనించి ఆ వైపుకు అడుగులు వేసే పరిస్థితులను కల్పించాలి గాని నువ్వు తప్పనిసరి డాక్టర్ వే కావాలి నువ్వు తప్పనిసరి పోలీస్ ఆఫీసర్ వే కావాలి అని బలవంతం చేసినట్లయితే ఆ పిల్లలలో ఉండే సహజత్వం కోల్పోతారు. కొందరిలో చిన్నప్పుడు కలిగినటువంటి భావాలు అవే స్థిరంగా ఉండవు. పెరుగుతూ ఉంటే వారి ఆ ఆశయాలు ఆదర్శాలు మారుతుంటాయి . ఒక వయసు .. యుక్త వయసు వచ్చినప్పుడు చదువు నిర్ణయించుకునేటువంటి ఒక నిర్దిష్టమైన సమయం వచ్చినప్పుడు తప్పనిసరి వాళ్ళలో ఉన్న ఇష్టానికి తగినటువంటి వృత్తికి సంబంధించిన చదువులోకి పయనించే లాగా చేయాలి. ఇక అప్పటినుంచి సుస్థిర రూపాన్ని సాధించుకునే కలలనే కంటారు.
కష్టాలు వస్తాయి సమస్యలు అవుతాయి అడ్డంకులు ఉంటాయి వీటన్నింటినీ అదిగమించే ధైర్యాన్ని పిల్లలకి కలిగించాలి. కలల విషయము కేవలం పిల్లల కొరకే కాదు పిల్లల గురించే కాదు వయసుతో నిమిత్తం లేకుండా తన శారీరక శక్తి ఉన్నంతవరకు ఏదో ఒకటి మంచి పని చేసే దిశగా అడుగులు వేసేలా ప్రతి ఒక్కళ్ళు కలలు కనాలి … కలలను కనాలి .. కలలను సాధించుకోవాలి …కలల ధామం లో విహరించాలి.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భాగ్యం స్వగతం

జాతీయానికి సామెతకు గల భేదం ఏమిటి?