చదవడం చిన్నతనం  నుంచే  ఇష్టం

బహుమతుల మణిప్రముఖ కథా రచయిత మణి వడ్లమాని

సామాజిక అంశాలు ఇతివృత్తంగా తీసుకుని సందేశాత్మకంగా కథలకు ముగింపు ఇచ్చే రచయితలకు కొందరు ఉంటారు. వారిలో మణి వడ్లమాని గారి పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. అనేక అంతర్జాల కథల పోటీల్లో బహుమతులు అందుకోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఆమె రాసిన  తొలి నవల “జీవితం ఓ ప్రవాహం”  పాఠకుల విశేషాదరణ పొందింది. ఆ తర్వాత ఆమె కలం నుంచి వెలువడిన  ‘కాశీపట్నం చూడరబాబూ’ జాగృతి వారపత్రిక లో ధారావాహికగా  ప్రచురితమయింది.  ‘ప్రయాణం’ నవల జీవితాన్ని వడబోసినట్టుగా  సాగుతుంది. హాస్య కథలు రాయడంతో ఆమె శైలి ప్రత్యేకం. ఈ వారం మణి వడ్లమాని గారి ఇంటర్వ్యూ తరుణిలో...

మణి వడ్లమాని

సాహిత్యాభిలాష బాల్యంలోనే కలిగిందా మీ తల్లిదండ్రులు, కుటుంబం గురించి చెప్పండి.
ఇంట్లో సాహిత్య వాతావరణం, తల్లిదండ్రులిద్దరూ సాహిత్యాభిమానులు కావడంతో చిన్నతనం నుంచే సాహిత్య గుభాళింపు తాకింది. నాన్నపేరి వెంకటేశ్వర శర్మ.  అమ్మ పేరి ప్రభావతి. మేం నలుగురు సంతానం. నాకు ఒక చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్ళు. మద్రాసులో పుట్టాను. ప్రాథమిక విద్యవరకు అక్కడే సాగింది. బాల్యం నుంచి మా అమ్మనాన్నల  ద్వారా పుస్తకాలు చదవడం అలవాటు అయింది.  నాన్నగారికి ఎందరో ప్రముఖ సాహితీవేత్తలతో పరిచయం ఉండేది. తెలుగు కథను  అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళిన  మహా రచయిత శ్రీ పాలగుమ్మి పద్మ రాజు గారు  భీమవరం లో నాన్నగారికి గురువులు.  వారి మధ్య గాఢమైన గురుశిష్య బంధం ఉండేది. ఆవిధంగా ముఖ్యంగా  కథా, నవలా సాహిత్యం పట్ల అభిలాష  పెరిగింది. ద్వివేదుల విశాలాక్షి గారు, నందుల సుశీల దేవి , యద్దనపూడి ,చలం ,అడవిబాపిరాజు అంటే చిన్నతనం లో బాగా ఇష్టంగా ఉండేది. తరువాత  యండమూరిగారు,వడ్డెర చండీదాస్ ,కాశీభొట్ల వేణుగోపాల్ ,ఖదీర్ బాబు  మొదలయిన వాళ్ళ  రచనలు  కూడా స్పూర్తి నిచ్చాయి.  హైస్కూల్, కాలేజీ జీవితం రాజమండ్రిలో సాగింది.  వడ్లమాని సత్యనారాయణ మూర్తి తో వివాహం తర్వాత హైద్రాబాద్ కు వచ్చాను.  పెండ్లి తర్వాత  అమ్మ లాంటి అత్త గారి   తోడ్పాటుతో నా సాహిత్యాభిలాష నిర్విఘ్నంగా కొనసాగింది.మాకు ఇద్దరు అమ్మాయిలు. చదువులు, పెండ్లీలు పూర్తి అయ్యి వారివారి జీవితాల్లో స్థిరపడ్డారు. నేను 2010 వరకు  ఒక ప్రముఖ కార్పొరేట్  సంస్థలో పని చేసి స్వచ్ఛంద పదవీ విరమణ  తీసుకున్నాను.

ఇప్పటివరకు మీరు రాసిన కథలు, నవలలు..
చదవడం  అంటే చిన్నతనం  నుంచే  ఇష్టం. ఆ ఇష్టమే  రాయడానికి  గల ఉత్ప్రేరకం అయింది. కవిత్వం కన్నా కథా రచన అంటేనే మక్కువ ఎక్కువ. కథ, నవల ప్రక్రియల్లో మాత్రమే నేను రాశాను.   కథలు రాయాలనే అభిలాషతో రాసిన తొలి కథ “కృష్ణం వందే జగద్గురుం” . ఈ కథ కౌముదిలో ప్రచురితమైంది. నా కథలు ప్రముఖ వార, మాస  పత్రిక ల తో పాటు విశాలాంధ్ర వారి దీపావళి సంచికలోనూ మరియు అన్ని ప్రముఖ  అంతర్జాల  పత్రికల లోను ప్రచురించబడి పాఠకుల మన్ననలు పొందుతున్నాయి. చాల కథలకు బహుమతులు కూడా వచ్చాయి. ఇప్పటి దాకా రాసిన కథల సంఖ్య దాదాపుగా డెబ్బై ఐదు పైనే, (75).  కొన్ని కథా సంపుటాలలో  కూడా  కథలు ప్రచురించ బడ్డాయి.,

 

మీరు చాలా కథా సంపుటాల్లో కథలు రాశారు. ఏయో సంపుటాల్లో మీ కథలు వచ్చాయో చెప్పండి. 
కథా రచయితలందరూ కలిసి తమ కథలను ప్రచురించడం అభినందించదగ్గ అంశం. నేను రాసిన కథలు ప్రముఖంగా   కొత్త కథ 2018, వంగూరి వారి ఫౌండేషన్  నుంచి వచ్చిన సంకలనాలలో   వరుసగా  నాలుగేళ్ల  నుంచి కథలు ప్రచురించబడ్డాయి. అచ్చంగా తెలుగు ప్రచురణలో ని కథా సంకలనం, అరవై మంది  రాసిన గొలుసు నవల, ప్రియమైన రచయిత  ల వారి సంకలనం  లో కూడ కథలు ప్రచురించబడ్డాయి.

మీకు బాగా గుర్తింపు తెచ్చిన, మీకు నచ్చిన కథలు కొన్ని చెప్పండి
వాత్సల్య గోదావరి, మాని క్వీన్, రెయిన్ బో టైలర్స్,జీళ్ళ సూరిబాబు,(ప్రముఖ రచయిత యండమూరి గారికి నచ్చిన కథలు) దేవ కాంచనం, ముళ్ళపూలు, ఆమె గెలుపు చినుకు మాస పత్రిక లోని వాడు – నేను లాంటి  మొదలయిన కథలు ఎంతో పేరు తెచ్చాయి. నేను రాసిన కథలన్నీ నాకు ఇష్టమై రాశాను.

మీకు నవల, కథ ఈ రెండింటిలో ఏదీ రాయడం ఇష్టం. 
ఎక్కువగా కథ రాయడానికి ఇష్టపడతాను. సంక్షిప్తంగా జీవితంలోని ముఖ్య ఘట్టాలను చెప్పడానికి కథ ద్వారానే వీలు అవుతుంది. ఇప్పటివరకు   దాదాపుగా ఎనభై కథలు రాశాను.  మూడు నవలలు  రాశాను.

మీరు రాసిన నవల గురించి, ఇప్పటివరకు వచ్చిన పుస్తకాల గురించి చెప్పండి. 

నేను రాసిన మొదటి నవల “జీవితం ఓ ప్రవాహం”  చతుర మాసపత్రికలో  ప్రచురితమయింది.  రెండవ నవల ‘కాశీపట్నం చూడరబాబూ’ జాగృతి వారపత్రికలో ధారావాహికగా  ప్రచురితమయింది. మూడవ  నవల  ‘ప్రయాణం’ ఆంధ్రప్రభ  దినపత్రిక ఆదివారం  లో ప్రచురితమైంది.  ఇప్పటి వరకు  నాలుగు పుస్తకాలు ప్రచురించాను. ఇందులో మూడు కథా సంపుటాలు కాగా ఒకటి నవల. మొదటి పుస్తకం  వాత్సల్య గోదావరి కథా సంపుటి, రెండవది  కాశీ పట్నం చూడరాబాబు  నవల, మూడవది మనం  కథా సంపుటి,  నాలగవది గెలుపు గాయాలు  కథా సంపుటి.

మీ కథలకు చాలా బహుమతులు వచ్చాయని తెలుసు. ఏయో బహుమతులు అందుకున్నారో చెప్పండి
నేను  రాసిన కథలు  చాలా పత్రికలకు పంపిస్తుంటాను. అయితే అంతర్జాలంలో జరిగే కథల పోటీలకు ఎక్కువగా రాస్తాను. ఇప్పటివరకు నా కథలకు వచ్చిన బహుమతులు.. – గో తెలుగు.కాం వారి హాస్య కధల పోటీలు ప్రథమ బహుమతి వచ్చింది
–  ఫేస్బుక్  లోని  కధా గ్రూప్ నిర్వహించిన కధల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది.

 
–  అమెరికా  తెలంగాణ సంఘం(ATA) వారి  సావనీర్ కు పెట్టిన కథల పోటీలో  నా కధ కి మొదటి బహుమతి వచ్చింది.
– వంగూరి ఫౌండేషన్  వారు నిర్వహించిన కథల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది.
– విశాఖ సంస్కృతి  కథల పోటీలో బహుమతి వచ్చింది.
–  సహరి అంతర్జాల వార పత్రిక వారు నిర్వహించిన  కథల పోటీలో  బహుమతి వచ్చింది.
-. లేఖినీ సాహితీ సమాఖ్య  వారు నిర్వహించిన కథల పోటీలో  ప్రథమ బహుమతి వచ్చింది.

– తెలుగు డే కెనడా వారి  నిర్వహించిన కథల పోటీలో  బహుమతి వచ్చింది.
– ములకనూరు, నమస్తే తెలంగాణ నిర్వహించిన కథల పోటీలో తూరుపు సింధురాలు కథ కి 2000 బహుమతి

 పర్యాటక రంగం లో మీ అనుభవాలు, మీరు చూసిన ప్రదేశాలు, అనుభవాలు?
కొత్త ప్రదేశాలు  చూడటం చాలా  ఇష్టం. మన దేశం లోనే కాదు విదేశాలకు వెళ్ళినప్పుడు  కూడా అక్కడి ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు,  ఎక్కువగా  నది తీరాలు, సముద్రపు  ప్రాంతాలు  తిరగడం ఇష్టం. 2013లో కేదారినాథ్  యాత్ర కు వెళ్ళినప్పుడు జీవితంలో మరిచిపోలేని సంఘటన  జరిగింది.  మేము అక్కడ ఉండగా వచ్చిన జలప్రళయాన్ని కళ్ళారా చూశాను.  తిరిగి ప్రాణాలతో బయట పడటం  అదృష్టంగా భావిస్తాను.  ఆ అనుభవాన్ని  కథ గా మలిచాను.
ఆల్మోస్ట్ దేశము నాలుగు పక్కలా  పర్యటించాం. ఆ పర్యటన ఆధారంగానే ప్రయాణం  నవల  రాసాను. అది ధారావాహికగా  ఆంధ్రప్రభ  ఆదివారం  లో 2020 లో వచ్చింది. దానినే పుస్తకంగా  తేవాలని ప్రయత్నం చేస్తున్నాను.

మీరు చాలా సాహిత్యసంస్థల్లో సభ్యులుగా ఉన్నారు. ఆ సంస్థల పేర్లు చెప్పగలరా
సాహిత్యాభివృద్ధికి నా వంతు కృషి చేయాలన్న లక్ష్యంతో కొన్ని సంస్థలలో సభ్యురాలిగా చేరాను. లేఖిని , అక్షరయాన్ , అచ్చంగా తెలుగు వంటి సంస్థలో  సభ్యులు గా ఉండటం వల్ల ఇతోధికంగా  సాహిత్యా అభివృద్ధికి  తోడ్పడే అవకాశం లబించింది. అలాగే సాహిత్య సభలలో  పాల్గొనడం చాలా ఇష్టం.

నేడు సాహిత్య రంగంలోకి కొత్త గా వచ్చే రచయితలకు మీరిచ్చే సూచనలు, సలహాలు
నిజానికి  నేటి తరం వాళ్ళు చాల బాగా చక్కగా తమ భావాలను రాస్తున్నారు. కథలు  చదవడం, వినడం పిల్లలు చాలా చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త గా రాసే వారి కథలు చదువుతాను.  అందరూ బాగా రాస్తున్నారు.

ఎస్. యశోదాదేవి, ఇంటర్వ్యూ గ్రహీత

Written by S. Yashoda Devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మార్పు

మల్లెలార మౌనమేల