” ఆర్డర్! ఆర్డర్ !”జడ్జిగారి కేకతో కోర్టు హాలులో కోలాహలం కాస్త తగ్గింది.
ఇది అన్నదమ్ముల మధ్య జరుగుతున్న కేసు అయినా నిజానికి చాలా ప్రాచుర్యం పొందింది. ఈ మధ్య కాలంలో ఏ కేసుకి లేనంత కవరేజ్ మీడియాలో జరిగింది. అందువల్ల కోర్టు హాలు అంతా జనంతో నిండిపోయింది.
ఫాస్ట్ ట్రాక్ కోర్టుల మూలాన ఒక్కరోజులోనే హియరింగ్, జడ్జిమెంట్ జరిగిపోతున్నాయి.
“మిస్టర్ రవీంద్ర’ చెప్పండి మీరు ఎందుకు మీ తమ్ముడు పై దావా వేశారు?” ప్రశ్నించాడు లాయర్ విశ్వనాథం గారు.
“సార్ ,మేము ఇద్దరం అన్నదమ్ములం, నేను ఆస్తిలో వాటా కోసం దావా వేశాను,” రవీంద్ర చెప్పాడు.
” మిస్టర్ సురేంద్ర, మీరు మీ అన్న గారికి ఆస్తిలో వాటా ఇవ్వాలి కదా? ఎందుకు కోర్టుకెక్కారు? అడిగారు లాయర్.
“సర్, నేను చెప్పేది వినండి. మా తల్లిదండ్రులు రెండు సంవత్సరాల క్రితమే ఆస్తి పంపకాలు చేశారు. ఎవరి వాటా వారికి ఇచ్చారు. ఇంకా జ్యేష్ట భాగం అంటూ అన్నయ్య కు కాస్త ఎక్కువే ఇచ్చారు కూడా. కాదంటాడేమో అడగండి తననే,”చెప్పాడు సురేంద్ర.
“ఏమయ్యా రవీంద్రా, మీ తమ్ముడు చెప్పేది నిజమేనా?
” ఆ…..అంటే అది నిజమే అనుకోండి,” సన్నగా నసిగాడు రవీంద్ర.
మరి ఇంకెందుకు అయ్యా కేసు వేశావు?” కోపంగా అడిగారు లాయర్.
” నేను చెప్తాను సార్, మా అన్నయ్య కుటుంబం అందరికీ బాగా దుబారాగా ఖర్చు చేయటం అలవాటు. అమ్మానాన్నలు ఎప్పుడూ చెప్తూనే ఉండేవారు ఇలాగైతే భవిష్యత్తులో చాలా కష్టపడతారు అని, కానీ వారి మాటలు పట్టించుకోలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నాడు,” సురేంద్ర చెప్పాడు.
” అసలు ఇంతకీ ఏం జరిగింది? వివరంగా చెప్పండి,” అడిగారు జడ్జిగారు.
“చెప్తాను సార్, మా అమ్మానాన్నలు వారి జీవితం అంతా చాలా కష్టపడి తొమ్మిది ట్యాంకుల నీరు కూడ పెట్టగలిగారు.
వారుచనిపోయేటప్పుడు అందులో ఐదు ట్యాంకులు మా అన్నయ్యకు, నాలుగు ట్యాంకులు నాకు పంపకం చేశారు.
మీకు తెలుసు కదా ప్రభుత్వం కూడా నీటి రేషన్ గత కొంతకాలంగా చాలా తగ్గించింది. మన జీతంలో 10 శాతం మాత్రమే నీటి రేషన్ ఇస్తోంది. అంచేత నేను మా కుటుంబం అందరమూ నీటిని ఎంతో పొదుపుగా వాడుతూ రేషన్ తోనే సరిపెట్టుకుంటున్నాం.
అత్యవసరాలకు మాత్రమే మా వాటాగా వచ్చిన ఆస్తి లోంచి వాడుకుంటున్నాం. అలా మా దగ్గర ఇప్పటికింకా మూడున్నర ట్యాంకుల నీరు ఉంది,” గర్వంగా ఓ సారి అందరి వైపు చూశాడు సురేంద్ర.
“ఓ అవునా గ్రేట్, ఇంతకీ ఈ గొడవ దేని కోసం? అడిగారు లాయర్ గారు .
“ఏముంది సార్, మా అన్నయ్య కుటుంబం తమ నెల రేషన్ కాకుండా, ఆస్తిగా సంక్రమించిన నీటిని కూడా డబ్బుల లాగా ఖర్చు చేశారు. ఇప్పుడు వారి దగ్గర కాస్త కూడా నీటి నిల్వలు లేవు.
అందుకని నా వాటా లోంచి భాగం కావాలని అడిగాడు. నేను కుదరదు అనడంతో కోర్టుకెక్కాడు. ఇదేమైనా న్యాయమా మీరే చెప్పండి జడ్జిగారూ,” మొర పెట్టుకున్నాడు సురేంద్ర.
” ఏం రవీంద్రా,మీ తమ్ముడు చెప్పింది నిజమేనా? నిజం చెప్పు ,”గద్దించారు లాయర్ గారు.
“అంటే, అవును సార్ నిజమే. నేను ఎప్పటికప్పుడు నీటి పొదుపు గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. మా ఇంట్లో వాళ్లకి కూడా చెబుతూనే ఉన్నాను. కాని ఆచరణలో పెట్టలేకపోయాము సార్. నీటి వినియోగాన్ని తగ్గించుకో లేకపోయాము.
దయచేసి ఒక ట్యాంక్ నీరు మా తమ్ముడి వాటా లో నుంచి నాకు ఇప్పించండి. ఇకపైన ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటాను, ప్లీజ్ సర్” వేడుకున్నాడు రవీంద్ర.
కోర్టులో అందరూ జడ్జి గారి కేసి చూసారు తీర్పు కోసం.
“రవీంద్ర తన వాటా నీటిని విచ్చలవిడిగా వాడటమే కాక పక్క వారి (తమ్ముడి)వాటాలోంచి పొందగలగడం హక్కుగా భావించాడు. ఇది చాలా పెద్ద నేరం.
ఇప్పటికే ఇటువంటి వారి వలన మన దేశంలో 50 శాతం పైగా ఎడారిగా మారిపోయింది.
ఇక ముందు ముందు ఏమి జరుగుతుందో తెలియదు. గ్లాసు నీటి కోసం యుద్ధం చేసే రోజులు ఇటువంటి వారి వలనే రావచ్చేమో!
ఈ నేరానికి అతనికి, కుటుంబానికి జీవిత ఖైదు విధించాలి .
కానీ మొదటి తప్పుగా భావించి మన దక్షిణ భారత దేశంలో కొత్తగా ఏర్పడిన ఎడారి ప్రాంతానికి ఇతడిని బదిలీ చేయవలసిందిగా, ఇతడి 10 శాతం రేషన్ ఇచ్చే నీటిలో నుంచి రెండు శాతం కత్తిరించ వలసిందిగా ప్రభుత్వానికి రాస్తున్నాం. ఈ శిక్ష అతి త్వరలో అమలయ్యేలా చూడవలసిందిగా కూడా కోరుతున్నాం. ఇంతటితో ఈ కేసును క్లోజ్ చేస్తున్నాను,” జడ్జిగారు తీర్పు వెలువరించారు.
అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న కోర్టు హాల్ అంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది.
ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచాడు రవీంద్ర. “బాబోయ్ ,ఇది కలా! ఎంత భయంకరంగా ఉంది. నిజమే, తమ్ముడూ, అమ్మవాళ్ళు నాకూ నీటి పొదుపు గురించి పదే పదే చెప్పినా ఏనాడూ చెవికి ఎక్కించుకోలేదు.
ఈరోజు వార్తల్లో కూడా చెప్పారు 2050 కల్లా భారత దేశంలో 52 శాతం ఎడారిగా మారిపోతుందని. ఆ రెండూ కలిసి కలగా వచ్చాయేమో. ఇకనుంచి నేను మారుతాను మా పిల్లలని మారుస్తాను.
సింకులో బ్రష్షు, షేవింగ్ చేసుకోవడం, షవర్ తో స్నానం చేయటం మేమంతా మానేయడమే కాక మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి వారి చేత కూడా మాన్పిస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ .
మార్పు ఈరోజు నుంచి, ఈ క్షణం నుంచి నా నుంచే మొదలు పెడుతున్నాను అని మగ్గులో నీళ్లతో మొహం కడుక్కుని నిద్ర లేచాడు రవీంద్ర.