ఏదైనా సాధించాలనుకుంటే ఒక నిబద్ధత్తత, క్రమశిక్షణ తప్పనిసరి

డా|| “జయ”ప్రద రామమూర్తి

ఉభయ తెలుగు రాష్ర్టాల్లో మొట్టమొదటి వేణువాద్య కళాకారిణి డా|| జయప్రద రామమూర్తి ఇటీవల వరంగల్లో జరిగిన భక్త రామదాసు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ఆమెతో పాటు గోష్ఠి గానంలో పాల్గొన్న పాలకుర్తి సుమనస్విని సరదాగా ముచ్చటించారు….

సుమనశ్రీ, డా. జయప్రద రామమూర్తి

మీ సంగీత ప్రయాణం గురించి వివరించండి :

నాకు సంగీతంలో అధికారిక విద్య ఏమీ లేదు. సంగీతమనేది ఒక వారసత్వ సంపదగా వచ్చింది. మా అమ్మ ప్రేమా రామమూర్తిగారు. కర్ణాటక గాత్రంలో సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. సుమారు 40 దేశాలలో కచేరీ చేశారు.  అలా పుట్టినప్పటి నుండే సంగీతంతో నా ప్రయాణం మొదలయింది.

మీకు వేణువు ఎందుకు నేర్చుకోవాలనిపించింది?

చెప్పాలంటే నేను వేణువు నేర్చుకోలేదు. మా ముత్తాత గారు ‘శ్రీనివాస శాస్త్రి’గారు ఫ్లూటు వాయించేవారు. ఆయన వకీలు. ఆయన వాయించిన ఆ వంద ఏళ్ల నాటి వేణువును అమాంతంగా వాయించాను. నా అంతట నేనే అలా వాయిస్తూ ఫ్లూటు నేర్చుకున్నాను.  12వ ఏట నా మొదటి ప్రదర్శన ఇచ్చాను, సికింద్రాబాద్ గణపతి ఆలయంలో. అయితే వేణువు వాయించడంలో నా ఆసక్తిని చూసి మా అమ్మగారు నన్ను చెన్నైలోని పద్మశ్రీ “నటేశన్ రమణి” గారి వద్ద ఫ్లూటును అభ్యసించడానికి పంపారు. ఆయన, నా వేణువాదన విని, ‘ఇంత బాగా వాయిస్తున్నావు కదా! నీకు ఇంకా ఏమి నేర్పించాలి?’ అని అన్నారు. కానీ, నేను నేర్చుకునేది చాలా ఉందని ఆయనతో అన్నాను.  ఆయన వద్ద శిష్యరికం చేశాను.

మీ విద్యాభ్యాసం గురించి వివరించండి…

మా నాన్నగారు శ్రీ వెంకటరమణ రామమూర్తి. BARC (బాబాఆటామిక్ రిసర్చ్ సెంటర్)లో సైంటిస్ట్ గా పనిచేసేవారు. ఆయన కాలం చేసిన తరువాత మా అమ్మకు కుటుంబాన్ని నడపడం ఎంతో కష్టం అయింది.  అందుకే, తన పిల్లల్ని బాగా చదివించాలనుకుంది. ‘నేను కూడా బాగా చదివేదాన్ని. సివిల్స్ సాధించి IAS కావాలన్నది నా కల. కానీ, విధి రాతను మనం తప్పించుకోలేము కదా!  అందుకే ఫ్లూటిస్ట్ ను అయ్యా! (నవ్వుతూ….) నేను, ఉస్మానియా యూనివర్సిటీ నుండి కామర్స్ లో పి.హెచ్ డి చేశాను. నేను కంప్యూటర్ ప్రోగ్రామర్ ని కూడా.

మీరు అందుకున్న అవార్డులు, ప్రదర్శనల గురించి….

నాకు సంగీతంలో ఏ డిగ్రీలు లేవు! సరాసరి అవార్డులే. నేను స్టేట్ అవార్డ్, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా, “నేషనల్ అవార్డ్ ఫర్ మ్యూజిక్ ఎక్సలెన్స్”, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చేతులమీదుగా అందుకున్నాను.

ఇక నా ప్రదర్శనల విషయానికి వస్తే, రష్యా, అమెరికా, బ్రిటన్, నెదర్ లాండ్స్, బంగ్లాదేశ్, స్పెయిన్ మొ|| దేశాలలో ప్రదర్శనలు ఇచ్చాను. ఇంకా చెప్పాలంటే మన దేశంలోని మారుమూల ప్రాంతాలలో నేను ఎక్కువగా ప్రదర్శిస్తుంటాను.

నేను బంగ్లాదేశ్ లో ప్రదర్శించడానికి వెళ్ళినప్పుడు హరిప్రసాద్ చౌరాసియాగారు సీనియర్ ఆర్టిస్టు, నేను జూనియర్ ఆర్టిస్టును. అప్పుడు నా వేణువును విని ఎంతో మెచ్చుకున్నారు. ఆయన నన్ను బేస్ ఫ్లూట్ ని శోధించమని చెప్పారు.  అందుకు నాకు వరల్డ్ రికార్డ్ కూడా దక్కింది.

మీ సినీ ప్రయాణం గురించి వివరించండి.

సినీ రంగంలో నా ప్రవేశానికి కారణం కీరవాణిగారు. అంతకుముందు ఆయనతో కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ చేసాను. నేను తిరుపతిలో స్వామివారిని దర్శించుకొని వచ్చాను. అప్పుడే నాకు కీరవాణిగారు కాల్ చేసి “ఓం నమ వేంకటేశాయ”లో నువ్వు వాయించాలి ని అన్నారు. అది నిజంగా ఆ వేంకటేశ్వర స్వామి కటాక్షంగా నేను భావిస్తున్నాను. ఆ తరువాత నాకు “వకీల్ సాబ్”, “బాహుబలి-2” సినిమాలో అవకాశం వచ్చింది.

మీరు  సంగీతానికి సంబంధించిన ఏవైనా అకాడమిక్ బాడీలలో సభ్యులుగా ఉన్నారా?

నేను “ఉత్తరా సెంటర్ ఫర్ ఫర్మామింగ్ ఆర్ట్స్” (యు.సి.పి.ఏ)కి పౌండర్ డైరెక్టర్ ని, ఇదీ భరత నాట్యం గీతా గణేశన్ గారితో కలిసి స్థాపించాను. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆర్టిస్ట్ మెంబర్ ని.

మీరు ఇన్ని ప్రదర్శనలు ఇస్తున్నారు కదా. ఇవి కాకుండా ఏవైనా దేవాలయాలకు / సంస్థలకు, మీరు సంగీత సేవ చేస్తున్నారా?

నేను కంచి పీఠం, మైసూరు దత్త పీఠం, శ్రీశైలం, యాదాద్రి మొ|| ఆస్థాన విద్వాంసురాలిని.

మహిళా ఫ్లూటిస్టులు చాలా తక్కువగా ఉన్నారు కదా. దానికి కారణం ఏమై ఉండవచ్చు? మీ అభిప్రాయం.

సాధారణంగా మనం చూసే వేణువు, ఆడవాళ్లు వాయించడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆడవారి అరచేతి పరిమాణం చిన్నగా ఉంటుంది. నేను నా కోసం ప్రత్యేకంగా వేణువును తయారు చేయించుకుంటాను. అలాగే వేణువాదన చేయడానికి చాలా బలం రావాలి. కానీ, వీటన్నిటీ అధిగమిస్తూ ఎంతో మంది మహిళలు ఫ్లూటు నేర్చుకోవడంలో ఆసక్తి చూపాలని కోరుకుంటున్నాను.

వర్ధమాన కళాకారులకు మీరు ఇచ్చే సూచనలు…

ఫ్లూట్ అనే కాదు, మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఒక నిబద్ధత్తత, క్రమశిక్షణ తప్పనిసరి. ప్రతి నిత్యం సాధన చేయాలి. ఈ కాలం పిల్లలకు తల్లిదండ్రులు చాలా కళలు నేర్పిస్తున్నారు. అది మంచిదే కానీ, ఆ అన్నిటిలో పిల్లలకి ఏది సరైనదో తెలుసుకొని ఆ ఒక్క రంగంలో ఎక్కువగా కృషిచేస్తే మంచిదని నా అభిప్రాయం.

ఇంటర్వ్యూ గ్రహీత సుమనశ్రీ

 

Written by Sumana Sri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పూలవనం

మార్పు