మన మహిళామణులు

షకీరా బేగం

               షకీరాబేగం
ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నంలోని జూనియర్ కళాశాల లెక్చరర్,గా, ఆ తర్వాత ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్అయ్యారు.చక్కగా రాస్తారు.
కవిత్వం. రాయరు గానీ,ఇతరత్రా ఫీచర్స్ రాస్తారు.అంతేకాదుఅందమైన బొమ్మలు (Paintings) కూడా వేస్తారు.!
షకీరా బేగం విజయవాడలోని బిషప్ అజరయ్య హైస్కూల్ లో చదువుకుంది.
అది ఉన్నత ప్రమాణాలు గల గొప్ప పేరు వున్న పాఠశాల.స్కూల్లో చదువుతో పాటు చిత్రలేఖనం,శాస్త్రీయ సంగీతం, నృత్యం, వంటలు, కుట్లు, NCC, sports and games, తోటపని కూడ నేర్పేవారు…హైస్కూల్ కి పెద్ద rectangle భవనం
ఉండేది. మధ్యలో విశాలమైన పూదోట.ప్రతి తరగతికి ముందు పూదోట ఉండేది.
మిగతా విషయాలు వారి మాటలలో తెలుసుకుందాం.                 

నా పేరు షకీర బేగం. నేను బందరు, హిందూ కళాశాల అనుబంధ సంస్ధ అయిన శ్రీ పద్మావతి మహిళా హిందూ జూనియర్ కళాశాల, విశ్రాంత అధ్యాపకురాలిని.

మా స్వస్థలం బందరు. మాది సామాన్య మధ్య తరగతి కుటుంబం. మా తండ్రి గారు కీ శే శ్రీ సయ్యద్ లాల్ అహమ్మద్ గారు రెవిన్యూశాఖలో తహసిల్దారుగా సేవలందించారు. మిలిటరీ అనుభవం ఉన్న వారు, మాకందరికి చిన్నప్పటి నుండి క్రమ శిక్షణ, నిరాడంబరత, సమయ పాలన, పనిలో నిబద్ధత, పరిశుభ్రత, అనే అంశాలను దైనందిక జీవితంలో అలవర్చారు. ‘మానవత్వానికి మించిన మతం, కష్టించడానికి మించిన కులం లేదని’ వారు మాకు ఎపుడూ చెప్పేవారు. నేను చదువుకున్న విజయవాడ లోని బిషప్ అజరయ్య ఉన్నత పాఠశాలలో కూడ ఇంట్లో నాన్నగారు అలవరచిన నియమావళే ఉండడం వలన అవి నా శరీరంలో భాగమైపోయి నా తదుపరి జీవితంపై ఎంతో ప్రభావం చూపినాయి.

1954 లో పుట్టిన నాకు మూడు సంవత్సరాల వయసులో మా అమ్మ కాలం చేసింది. తల్లి ప్రేమకు నోచుకోని నన్ను, నాన్న గారే పెంచారు. ముస్లిం కుటుంబంలో ఆడ పిల్లలను బయటకు పంపడం, చదివించడం గగనమే. అయినా మా నాన్నగారు మా ఆరుగురు అక్క చెల్లెళ్ళనూ చదివించారు. మాకందరికి తొలి గురువు వారే.

బందరు హిందూ కళాశాలలో BSc చదివిన నేను, విశాఖపట్నం ఆంధ్రా యునివర్సిటీలో ఇంగ్లీషు లిటరేచర్ లో ఎమ్. ఎ చేశాను. వెనువెంటనే 1976లో శ్రీ పద్మావతి మహిళ హిందూ జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలిగా చేరాను.
నాన్నగారి వద్ద నేర్చుకున్న సంస్కృతి మంచి ఫలితాలను ఇస్తుందని గ్రహించిన నేను, విద్యార్థినులలో క్రమశిక్షణకు పెద్దపీట వేసాను. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. వీళ్ళ కు సులభరీతిలో మెటీరియల్ తయారుచేసి ఇచ్చి, వాళ్ళ ఉత్తీర్ణతకు కృషి చేసాను. అలానే మెరుగైన విద్యార్థినులకు, quotations పెట్టి material తయారు చేసి ఇచ్చాను. దీనితో వాళ్ళు అత్యధిక మార్కులు సాధించేవారు. ఈ చర్యలతో కళాశాల నిర్విఘ్నంగా English subject లో 100% ఉత్తీర్ణత సాధిస్తూ వచ్చింది.

1980 లో మొదలైన నా వైవాహిక జీవితం, 1986లో అపశృతి పలికి ఇద్దరు చిన్నారులతో ఏకాకి నయ్యాను. ఇది నన్ను చాలా కృంగదీసింది. మూడు సంవత్సరాలు మానసికంగా అనారోగ్యానికి గురి అయ్యాను. ఒంటరిగా జీవచ్ఛవంలా గడిపాను. అయినా పిల్లల ఎడల నా బాధ్యత మరచిపోలేదు. బంధువుల సహాయమూ ఆశించలేదు. క్రమం గా ఆత్మపరిశీలన చేసుకుని, పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, ఉన్నత విద్యావంతులను చేయాలనే ధృడ సంకల్పానికి వచ్చాను. అడుగు ముందుకు వేసాను. అంతే మళ్లీ వెనుతిరిగి చూడలేదు.
మొదట్లో బజారు పనులు చేసుకోవడం అంటే ఏడ్పు వచ్చేది. మెల్ల మెల్లగా అలవాటయిపోయాను పనులన్నీ చేసుకోవడానికి. అదే సమయంలో నాకు కళాశాల ప్రిన్సిపల్ గా పదోన్నతి వచ్చింది. మరి ఒంటరితనం గుర్తు కు కూడ రాలేదు.

1989లో ప్రధాన అధ్యాపకురాలుగా పదోన్నతి పొందిన నేను, నా ఇంగ్లీషు సబ్జెక్టులో 100% ఉత్తీర్ణతకు చేపట్టిన చర్యలను అన్ని సబ్జెక్టులకు వర్తింపచేసి, అందరి సహకారంతో సత్ఫలితాలు సాధించాను. ప్రిన్సిపాల్ గా నా విధులు నిర్వర్తిస్తూ, ఇద్దరు ఆంగ్లఅధ్యాపకుల posts ఖాళీగా ఉండడం వలన ఆ ఇద్దరు చేయవలసిన పని కూడ కనీసం పాతిక సంవత్సరములు నేనే చేసాను. కెమిస్ట్రీ పోస్ట్ ఖాళీగా వుంటే, విద్యార్థులు నష్టపోకుండా నాలుగు సంవత్సరములు కెమిష్ట్రీ చెప్పాను. అలా ఏ పోస్ట్ ఖాళీగా వున్నా విద్యార్థుల ప్రయోజనార్ధం ఆ సబ్జెక్టు చెప్పాను. ప్రతి శనివారం చివరి రెండు గంటలు సాహిత్య, సాంస్కృతిక అంశాలకు, కళలకు కేటాయించాను. ఫలితం గా విద్యార్ధులు ఏ పోటీకెళ్ళినా బహుమతులు గెలుచుకుని వచ్చేవారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో మా కళాశాల నిర్విరామంగా కొన్ని సంవత్సరాలు అత్యధిక ఉత్తీర్ణతా శాతం నమోదు చేసి, బందరు పట్టణములో, కృష్ణాజిల్లాలో ప్రధమ స్థానం కైవసం చేసుకుంటూ వచ్చింది. నా ఈ కృషిని గుర్తించిన అప్పటి ఇంటర్మీడియట్ కమీషనర్ గారు నన్ను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో , కృష్ణ జిల్లా డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్కమిటీలో సభ్యత్వమిచ్చి గౌరవించారు. పట్టణంలో పలు సంస్థలు గుర్తించి గౌరవించాయి.
ఇది వృత్తి గురించి అయితే, ఇక ప్రవృత్తి రీత్యా సాహిత్యాన్ని ,కళలనూ బాగా ఇష్టపడతాను . చిన్ననాటి నుండి కూచిపూడి నాట్యమంటే చాలా యిష్టం. నేను నేర్చుకోలేకపోయినా నా పిల్లలకు నేర్పించాలని దృఢ నిశ్చయం తీసుకున్నాను. వాళ్ళకూ నచ్చడం వల్లే నా ఆశయం తీరింది. చిన్నప్పటి నుంచి వాళ్ళు కూచిపూడి నేర్చుకున్నారు.
నా కుమార్తెలిద్దరు ఇంటర్మీడియట్ వరకు నా వద్దనే ఉండి చదువుకున్నారు. పై చదువులకోసం నాకు దూరమైనపుడు, జీవితంలో ఒక్కసారిగా శూన్యం చోటుచేసుకుంది. ఈ శూన్యం నుండి బయటపడడానికి, కళలపట్ల చిన్నప్పటినుండి నాకున్న ఆసక్తిని ఉపయోగించుకున్నాను. పైంటిగ్ చేయడం, వివిధ వస్తువుల నుపయోగించి కళాకృతులను, అనేక రకాల కుట్లు అల్లికలతో గృహాలంకరణ వస్తువులను తయారుచేయడం మరల మొదలు పెట్టాను. ఈనాడు పత్రిక వసుంధరలో వివిధ రకాల కుట్ల మీద నేను చేసిన కళాకృతులు , వివరాలు ప్రచురించారు. అలాగే తెలుగు విద్యార్థి అనే మాస పత్రికలో సామాజిక సమస్యల మీద వ్యాసాలు వ్రాసాను. నా మరో వ్యాపకమైన తోటపని మీద శ్రద్ధ పెట్టాను.

వివిధ పత్రికలో వచ్చిన రచనలు

B Tech తరువాత, నా కుమార్తెలిద్దరు అమెరికాలో MS చేసారు. వెంటనే ఉద్యోగంలో చేరి అక్కడే స్థిరపడిపోయారు. పెద్ద పాప రేష్మ AECOM అనే సంస్థలో one of the Directors గా, చిన్న పాప సుష్మ Medtronic అనే సంస్థలో Senior scientist గా సేవలందిస్తున్నారు. చిన్నప్పుడు పది సంవత్సరాలు కూచిపూడి శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకున్నవారు అమెరికాలోని భారతీయ చిన్నారులకు కూచిపూడి శాస్త్రీయ నృత్యం నేర్పుతూ, నృత్య వ్యాప్తికి కృషిచేస్తున్నారు. పిల్లలనిద్దరిని కులమతాలకు, కట్నకానుకలకు అతీతంగా ఆదర్శ వివాహలు చేసాను.

షకీరాబేగం వేసిన పేయింటింగ్స్ మచ్చుకు రెండు

2012 లో ఉద్యోగ విరమణ చేసిన నేను, నా పిల్లల వద్దకు US వచ్చి వారికి చేదోడుగా ఉంటూ, వివిధ రకాల కళాకృతులకు ఆకారం ఇస్తున్నాను. క్రింది చిత్రాలన్నీ ఉద్యోగవిరమణ తరువాత నా చేతుల్లో ఆకారం దాల్చిన కళాకృతులు. తోటపని చేస్తున్నాను. ఇక్కడి తెలుగు అసోషియన్ వారు నిర్వహించే కార్యక్రమాల్లో వారి ఆహ్వానం మేర పాల్గొని వారిచ్చిన అంశము మీద ఉపన్యసిస్తూ ఉంటాను. సాంస్కృతిక, కళా రంగ పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఉంటాను.

షకీరాబేగంగారి బయోగ్రఫి పుస్తక రూపంలో

కళాశాలలో వేలసంఖ్యలో విద్యార్థుల జీవితాలను చక్కబెట్టాను అనే తృప్తి, నా ఇద్దరు కుమార్తెలను ప్రయోజకులను చేసాను అనే తృప్తి నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నిజం చెప్పాలంటే ఒకింత గర్వంగా కూడ ఉంటుంది. కాని Single mom గా జీవించడం సులువు కాదు. అది కత్తి మీద సాము చేయడమే. ఎన్నో సమస్యలు, మరెన్నో అవాంతరాలు. మన సమస్యలతో పాటు సమాజంలో మరికొన్ని సమస్యలను కూడ ఎదుర్కొనవలసి వస్తుంది. దృఢ సంకల్పం, ఆత్మస్తైర్యాలను ఆయుధాలుగా చేసుకుని ముందుకు నడవాలి. నిత్యం ఏదో ఒక వ్యాపకంతో శరీరానికీ, మనసుకు పనిపెట్టుకోవాలి. అపుడే మనల్ని చూచి జాలి పడే వారు, మనల్ని చూచి అసూయపడేలా మనం బ్రతకగలుగుతాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

పూలవనం