ఆ వయసింకా రాలేదు

కథ

డా. వరిగొండ సురేఖ

        మరదలి పెళ్ళికని రెండు రోజుల సెలవుపై వెళ్ళి వచ్చిన సతీష్ కి శనివారమయ్యే సరికి , బోలెడంత ఆఫీసు పని మిగిలిపోయింది. అందునా , చేసేది గ్రామీణ బ్యాంకు ఉద్యోగం కావడం వల్ల , బోలెడన్ని అర్జీలు .తన విభాగం అయినా కాకపోయినా రైతులందరూవారి  వారి సమస్యలను తనకే చెప్పుకుంటారు.  ఉన్న వారందరిలో తను   కాస్త మనసున్న మనిషని వారి నమ్మకం . చేయగలిగింది ఏమీ లేకపోయినా , కాదనలేని మొహమాటం తనది . వారి అమాయకత్వానికి కొంత జాలేస్తుంది . వారి మూర్ఖత్వానికి అప్పుడప్పుడూ కొంత కోపం కూడా వస్తుంది. ఏదేమైనా , వారికి ఒనగూడే ప్రయోజనం మాత్రం చాలా సందర్భాలలో శూన్యం అనే చెప్పాలి.

          ప్రొద్దుట ఏడు గంటలనుంది ఈ ఆలోచనలతో పాటుగా ఆఫీసు కాగితాల్లో మునిగి ఉన్న తనతో “ ఎలాగైనా మా ఆఖరిది చాలా అదృష్ట వంతురాలండీ.” కాఫీ కప్పునoదిస్తూ సతీమణి శ్రీమతి శారదా సతీష్ చేసిన వ్యాఖ్య . అలా అని కాఫీ ఇచ్చి వెళ్ళిపోతుంది అని అనుకోవడం ఎప్పట్లాగానే  భ్రమే. తానిoకో కప్పుతో పక్కనే ఉన్న కుర్చీని లాక్కొని కూర్చొని “ ఎలా అయినా లహరి అదృష్టమే అదృష్టమండి . ఏమంటారు?” అనంది.

          దాన్ని ప్రశ్న అని అనుకోలేము . ఎందుకంటే , తన జవాబు ఆశించి ఏదీ అడుగదు. తాను చెప్పదలచుకున్న దాన్ని ‘బలపరచుకోవాలి’  అన్న బలమైన ఉద్దేశ్యం తో మాత్రమే తను ఏదైనా చెప్తుంది లేదా అడుగుతుంది . అందువల్ల తన జవాబు ‘అవును’ అని మాత్రమే అయి ఉంటుంది . ఒకవేళ ‘కాదు’ అని మనసులో ఆనిపించినా ఆ పదం యొక్క శబ్దo రూపాంతరం చెంది మౌనం గా రూపుదిద్దుకుంటుందే తప్ప కాదని బయటకి మాత్రం రాదు.

          అందుకని ఆవిడ వైపు చూసి ఓ చిరు నవ్వు రువ్వి కప్పులో కాఫీ ఓ గుటకేసి మళ్ళీ రాతలో పడ్డాను. ఆవిడ కూడా తన ఏక పక్ష చర్చా గోష్టి ని కొనసాగించడం మొదలు పెట్టింది.

          “ అసలు మొదట్నుంచి కూడా దాన్ని చేసుకోవడమే ఓ అదృష్టం గా భావిస్తున్నారండి .  వాళ్ళ అత్తగారైతే మరీనూ. ‘ఇటువంటి పిల్ల మా ఇంటికి రావడం నిజంగా మా భాగ్యం అనుకోండి’ అంటూ అందరికీ చెబుతోంది. అరవంకీ , వడ్డాణం , ఆవిడ అత్తగారి కాసుల పేరు అబ్బో దానదృష్టమే అదృష్టం కదండీ !” అంటూ లేచి నిలబడి తన  సమాధానం కోసం ఎదురు చూసింది.

          “అవును’ అనేస్తే ఎంచక్కా కాఫీ కప్పు తీసుకుపోయి మళ్ళీ భోజనాల వేళ అయ్యేంతవరకు తనను ఆటoకపరచదు. ఈ లోపల పిల్లల్ని లేపడం , టిఫిన్లు చేయడం , వంట , బాక్స్ లు సర్దడం,  పనిమనిషి , ఆ పని ఈ పని అంటూ నిమిషం ఖాళీ దొరకదు పాపం . పోనీ దొరికినా ఆ సమయాన్ని తనకోసం కేటాయించుకుంటుందా అంటే ఇదిగో ఇలాంటి అనవసర విషయాలతో గడిపేస్తుంది . ఎంతైనా పాపం సగటు ఇల్లాలు. అని జాలి పడుతూ “ అవును నువ్వన్నది నిజమే” అని మరో సారి చిరునవ్వు రువ్వి ఖాళీ అయిన కాఫీ కప్పును అందించాను.

          అలా కాగితాలతో  కుస్తీ పూర్తి చేసి ఆఫీసు కెళ్ళి సాయింత్రం ఇంటికి  తిరిగొచ్చిన తనకు తలుపు తెరుస్తూనే  “ఏవండీ ! మీకో విషయం  తెలుసా ! లహరిని పై చదువులకి విదేశాలకు పంపుతారట. స్వయంగా వాళ్ళత్త గారే తనతో అందట . అది ఎంత మురిసిపోతోందో ..” చెప్పడం మొదలు పెట్టింది.

          వంటింట్లో నుండి టిఫిన్ పళ్ళెం తెచ్చి  చేతికందిస్తూ “ ఎంతైనా రాసి  పెట్టి ఉండాలండీ.   నేను డిగ్రీ చదువుతానంటే మీ వాళ్ళేమన్నారు. ఉద్యోగం చేయాలా ! ఊళ్ళేలాలా ! అన్నారు. మీ అమ్మగారైతే , మీ ఆయనకి ఉత్తరం  రాసుకోగలిగినంత చదువొచ్చిందిగా ఇంకా ఎందుకే పై చదువులు అంది . చూశారా ! దాని అత్తగారికి నా అత్తగారికి ఎంత తేడా ఉందో ..”

          ఈ సంభాషణ ని అర్జంటుగా ఆపకపోతే ఉరుము ఖచ్చితంగా మంగళం మీద పడుతుందని గ్రహించి “పోనీ లేవే ! అప్పటి కాలం వేరు , ఇప్పటి కాలం వేరు . అందునా ఇంకా దానికేం వయసొచ్చిందని” అన్నాను.

          ఇందులో శారద చల్లబడటానికి కావలసిన మాట ఏముందో నాకు తెలియదు కాని “నిజమే లెండి ! లహరి వయస్సెంత లెండి . నా పెళ్ళయ్యే సరికి నాదీ  చిన్న వయసే.  కాకపోతే అప్పుడాడపిల్లలందరికీ ఇంచుమించు అదే వయసులో పెళ్లయ్యేది.

          కాని ఇప్పుడు తరం మారింది . ఇపుడు ఇరవై దాటితే గాని పెళ్ళి చేసుకోవడం లేదు. ఇవాల్టి కాలానికి అది చిన్నా పిల్లే..” అని తనకి తనే సర్ది చెప్పుకొని వంటింట్లోకి వెళ్ళి పోయింది శారద.

* * *

          “పెళ్ళై మూణ్ణేల్లు దాటుతున్నా లహరి ఇంకా వంటింట్లో కి అడుగు పెట్టలేదట తెలుసాoడి! వాళ్ళత్త గారు, ఎంత మంచిది కాకపోతే ! పెళ్ళైన మూడే రోజే నన్ను వంట గదిలోకి తోసేసింది మీ అమ్మ. “పోమ్మ! శారద వెళ్ళి అక్కయ్యలకి సాయం చేయి అని!” కంచంలోని ఆవకాయ కన్నా ఘాటు గా ఉంది.

          “ఒక్కొక్కరు ఒక్కో రకం . పాపం . నువ్వు మూడు రోజులకే బరువెత్తుకున్నావు. లహరి ఇంకా బాద్యతలందుకోవట్లేదు. కంగారు దేనికీ ! ఇంకా వయసు రావాలి.” అన్నాను .

          “ నిజమేలెండి ! దాని వయసెంత ?” నిర్లిప్తంగా అంది శారద.

* * *

          “ఏవండీ!” తన వాక్యం పూర్తి కాక ముందే అడిగాను . “లహరి గురించేనా?!” అని పడక గదిలో సైతం ఆవిడ దాని ఊసు వదలక పోవడం ఒకింత అసహనానికి గురి చేస్తుండగా విసుగ్గా అడిగాన్నేను.

          నా భావాలేనే మాత్రం గ్రహించనట్లుగా “అవునండి , భలే కనిపెట్టారే. మూడు రోజులైందట. అది వంట మొదలెట్టి . ఏ మాత్రం కుదరట్లేదట వంట. అయినా కూడా వాళ్ళ అత్తగారoదట. ‘లహరి నువ్వెలా చేసినా మాకు బానే ఉంటుంది ఎందుకు భయపడతావు’ అనoదట.  అని చెప్పిన శారద మళ్ళీ “మీ అమ్మగారు ..” మొదలెట్టేసరికి“ఇంకా వయసు రాలేదు కాని నాకు నిద్ర వస్తోంది. నువు పడుకో” అని చెప్పి అటు వైపుకి తిరిగి పడుకున్నాను.

* * *

          రోజూ మధ్యాహ్నం లంచ్ బాక్స్ తినే ముందు శారద కి ఫోన్ చేసి తను తినదో లేదో అడగటం అలవాటు తనకు. కమ్మగా వండిపెడుతూ నేను సుష్టుగా భోo చేయాలి అని తాపత్రయపడుతూ ఉదయాన్నే  ఎన్నో ఒత్తుడులను ఎదుర్కొంటూ కష్టపడే భార్య ని కనీసం తినేముందు అయినా గుర్తు చేసుకోవడం కనీస ధర్మమనిపించుకుంటుంది అనిపిస్తుంది.

          ఫోన్ చేయగానే “ఏమోయ్ తిన్నవా ? అని నేనడిగెలోపే ఏవండీ తిన్నారా అని అడుగుతుంది. ఇది రోజూ వారి ఆనవాయితీ కాని ఈ రోజూ దానికి భిన్నంగా “ఏవండీ ! లహరిని వాళ్ళత్తగారు కూర సరిగ్గా చేయలేదు , పప్పు ఉడక లేదు అని కోప్పడిందట. పెళ్ళైన ఏడు నెలలకి మొదటిసారి ఆవిడలా కొప్పడే సరికి దీనికి ఏడుపొచ్చేసిందట . అది ఏడ్చేసరికి మళ్ళీ ఆవిడే వచ్చి సముదాయించి ‘ఇలా కాదమ్మ , ఇలా వండాలి’ అని చెప్పిందట”. అని ఉద్వేగం తో చెప్పింది శారద 

          “పోనీలే ! నువ్ భోo చేశావా ? అని అడిగాను . ఆ మాటకి నొచ్చుకొన్న  శారద “సారీ అండి . రోజూ మొదట మిమ్మల్ని నేనే అడిగేదాన్ని . ఇవాళ అది మానేసి ఏదేదో మాట్లాడాను. మీరు తిన్నారా ?” అనడిగింది. 

          శారద ప్రేమకి, అమాయకత్వానికి నవ్వొచ్చింది. అలాగే లహరి విషయం గుర్తొచ్చి , ఇపుడిప్పుడే   వయస్సోస్తోంది అనిపించింది.

* * *

         ఓ ఆదివారం తీరుబడిగా కాఫీ తాగుతూ “ఏంటీ మధ్య లహరి విషయాలేమీ చెప్పట్లేదు. కొత్తగా విషయాలేవీ లేవా !” అనడిగాను. “ఎందుకు లేవు ! కాని ఎప్పుడూ దాని గురించే చెబుతున్నానని ఫీల్ అవుతున్నారేమో అని చెప్పట్లేదు. నిన్న ఫోన్ చేసి చెప్పిందీ .. వీళ్ళ పెళ్ళి రోజుకి ఆవిడ వజ్రాల నెక్లెస్ ఇస్తానని చెప్పిందట ఎంతైనా డబ్బున్న వారు”.

           ఈ సారి పాపం శారద మా అమ్మని ఈ విషయంలో పోల్చలేదు. మా కుటుంబం ఎంత కష్టపడితే పిల్లలందరం ఓ స్థాయి కి వచ్చామో మా అమ్మ శారద కి చాలా సార్లు చెప్పింది. మా అమ్మ చెప్పక పోయినా ఆవిడ చేసిన త్యాగలకి ఆవిడంటే అమితమైన గౌరవం శారదకి. అందునా కష్టం సుఖం  తెలిసి పెరిగిన పిల్లయ్యే సరికి మా ఇంట కాని నాతో కాని ఎప్పుడూ ఆర్థిక పరమైన విషయాల గూర్చి ఇతరులతో ఏనాడూ పోల్చినది లేదు. నన్ను సాధించిoది లేదు. 

*****

         ఇంటికి రాగానే గలగలా మాట్లాడే శారద ఈ రోజూ మౌనంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలుగ జేసినంది. “ఏమోయ్! ఎందుకంత డల్ గా ఉన్నావ్ . కొంపతీసి లహరికేమైనా అయ్యిందా !” మనసులో అనుకుంటున్న మాట అసంకల్పితంగా బయటకనేశాడు .

          “ఛ ! ఛ ! దానికేం కాలేదు. మా అమ్మా నాన్నలకే ..” అంటూ సగంలో ఆగిపోయింది శారద.

          “అయ్యో! ఏంటీ , ఎపుడు , ఎలా అయింది ?” ఏదో జరగకూడని ప్రమాదం జరిగిoదేమోనని అనుమానపడుతూ అడిగాడు.

          “మీరు మరి ఊహించకండి . మా వాళ్ళందరూ నిక్షేపంలా ఉన్నారు . ఆరోగ్యంగా ఉన్నవారిని మీ ఆలోచనల్లో ప్రమాదంలో పడవేయకండి.” రవ్వంత కోపంగా అంది శారద.

          “మరి నువ్వు అలా నానుస్తూ అనేసరికి అలా అనుకోవాల్సి వచ్చింది . అయినా మీ నాన్న లహరి పెళ్ళి లో కూడా అన్నారు నా నలుగురు అల్లుళ్ల లో పెద్ద అల్లుడు బంగారం అని. కట్నం కూడా తీసుకొని ఈ అల్లుడు ఆయనకి దశమ గ్రహం కాక దశావతారం అని ఆయనే చాలా సార్లు అని ఉన్నారు . మరి నువు విని ఉన్నావో లేదో..” తన అత్తామామ గార్ల పట్ల తనకున్న అభిమానాన్ని , నిజాయితీని  నిరూపించుకునే ధోరణిలో అన్నాడు.

          “అయ్యో! మీ మంచితన్నాన్ని శంకించింది  ఎపుడూ లేదు. లహరి విషయమై ఇపుడూ బాధంతా..” అసలు విషయంలోకి వస్తూ చెప్పింది శారద.

          “ అదేమిటీ? దాని వైభోగానికి లోటు వచ్చిందా ? లేక అత్తగారి విపరీత అభిమానానికి దీని కళ్ళు నెత్తికెక్కాయ? అయినా అదాలాంటి పిల్ల కాదే! నా కళ్ల ముందు పెరిగిన పిల్ల. ఒక్కోసారి అనిపిస్తుంది నిన్నగాక మొన్న మన కళ్ళ ముందు రెండు జడలు , పొట్టి గౌను వేసుకు తిరిగిన ఆ చిట్టి బొమ్మ కేనా పెళ్ళయింది అని..” పాత జ్ఞాపకాలు మదిలో మెదలగా కళ్ళలో  అనుకోకుండా తడి చేరింది.

          “నిజమేనండి ! దాన్ని తీసుకు బజారుకెడితే , తెలియని వారు మీ అమ్మాయా ? అని  అడిగేవారు. మీరు కూడా కాదు నా మరదలు అని చెప్పకుండా , అవునండి మా అమ్మాయే అనే వారు. అసలు ఆ మాట కి మా నాన్న ఎంత పొంగిపోయే వారు అనుకున్నారు… “ అని శారదా కూడా భూతకాలంలోకి వెడుతూ వెడుతూ హఠాత్తుగా ఏదో గుర్తొచ్చి వర్తమానంలోకి వచ్చి

          “ ఉదయం కూడా నాన్న అదే మాట అన్నారు. నా పెద్దల్లుడు ఈ రోజూకి నన్ను తండ్రిలా ఆదరిస్తాడు, అభిమానిస్తాడు. ఏమి లేని ఆనాడు నానుంచి ఏది ఆశించలేదు అంతో ఇంతో  ఉన్న  ఈ రోజూ ఏదీ అడిగింది లేదు. ఆడంబరంగా పెళ్ళి చేసిన చిన్న అల్లుడికి  మాత్రం చిన్న చూపే అని నొచ్చుకున్నారు..”  అంది బాధగా.

         “ఏమయిందో వివరంగా విషయం చెప్పు!”  సినిమా మొదలెట్టి అరగంట అయినా కథలోకి రాని సినిమాని చూస్తున్న ప్రేక్షకుడి వలె  అసహాననికి గురవుతూ  అడిగాడు.

          “ ఏం చెప్పాలండీ? తమ్ముడి పెళ్ళికి శుభ లేఖ ఇవ్వడానికి వెళ్లారుట అమ్మ నాన్న. వీళ్ళు వచ్చారని తెలిసి కూడా కనీసం మర్యాద కైనా లహరి అత్తగారు గది నుండి బయటకి రాలేదుట. ‘మా అత్తగారు ఇలా చేస్తారనుకోలేదక్కా.. అమ్మా , నాన్న ఎంత బాధ పడ్డారో ..’ అంటూ లహరి ఫోన్లోనే ఏడ్చేసిందండి. అమ్మ,నాన్న తరువాత లహరి , తమ్ముడు ఇలా ఒక్కొరూ ఫోన్ చేసే బాధ పడేసరికి.. ఉదయం నుండి అదోలా ఉండి..”

          శారద మౌనముద్ర కి కారణం అప్పటికి అర్థమైఅయితే..వయసొచ్చిoదన్నమాట…నువ్వేమి బాధపడకు అది వారి సంస్కారం , మావయ్య తో నేను మాట్లాడుతాలే.. అని కాస్త ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాను. మొదటి మాట మెదడు చేరాలేదేమో , రెండవ మాట కి మాత్రం మనసు తెలికపరచుకుoదేమో శారద “ ఉండండి  మళ్ళీ వేడిగా కాఫీ తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది.

* * *

          పెద్దాడి ఇంజనీరింగ్ మూడో సెమిస్టర్ మార్కులు అతి సిరీయస్ గా పరిశీలిస్తున్న తనతో మాట్లాడుతున్న ఫోన్ పెట్టేసి హడావిడిగా తన వద్దకి వచ్చి “ఇది తెలుసాoడి?” అని అడిగిన శారద ఖచ్చితంగా లహరి విషయమే చెప్పబోతోందని అర్థమై ఆ మాటే ఆడిగాను.

          “భలేవారండి ! భలే కనిపెట్టేశారు. ఎలాగైనా మీరు మేధోవoతులు..” అని తెలివితేటలు ఏ మాత్రం అవసరం లేని ఇలాంటి విషయాలకి ప్రదర్శించిన తన తెలివితేటలకి మురిసిపోతూ..

         “ పాపం మేరేజ్ డే కదా అని లహరి ,అతను కలిసి గుడికెళ్ళి , సినిమా కెళ్ళి తరువాత బయట డిన్నర్ చేద్దామని అనుకున్నారట. వీళ్ళు బయల్దేరేదాక ఉండి తీరా బయల్దేరే ముందు ‘నాకు చేత కావట్లేదు వంట, మిగిలిన పని  చేసి వెళ్ళు ,అసలే పనమ్మాయి రాలేదుకదా అనందట’ చూశారా ఎలాంటిదో ఆవిడ . మొదట్లో వెన్న లాంటి మాటలాడి ఇప్పుడేమో వెన్ను దీని విరిగేలా చాకిరీ చేయిస్తోంది. ఏ రాయైనా ఒకటే అన్నట్టు ఏఅత్తగారైనా అత్తగారే. అంది కోపం ఆవేశం తన్నుకు రాగా శారద.

          శారద ఉక్రోషానికి నవ్వొచ్చి “ఎందుకోయ్ బాధపడతావ్. ఇప్పటికీ పూర్తిగా వయసొచ్చింద”న్నాను.

          “వయసొచ్చిoదా?ఎవరికి? లహరి పుట్టిన రోజూ రావడానికి ఇంకో నెల సమయం ఉంది. అయినా వయసు రాలేదు , వచ్చింది  అని అంటూ ఉంటారు. వయసుకి జరుగుతున్న వాటికి  ఏంటండీ   సంబంధం. పరిణితి వస్తుందనా ? నా తలకాయ” ఆవేశంగా అంది శారద.

          “పిచ్చిదానా! నేను వయసొచ్చిందoది లహరికి కాదే . వాళ్ళత్తగారికి” ఈ సారి తన్నో వెర్రి వెధవని చూసినట్లు చూసింది శారద.

          “మీకేమైనా మతి పోయిందా ? వాళ్ళత్తగారికి వయసు రావడమేమిటి ? వయసు మీద పడటం జరుగుతుంది..” అంది రవ్వంత విసుగుతో.

          “నేను సరిగ్గానే అన్నాను . పెళ్ళైన కొత్తలో ఆవిడ లహరి పై ఆప్యాయతను కురిపించింది. వరాల వెల్లువను తలపింప చేసింది. అప్పటికి లహరికి ‘కోడలు’ అన్న పదవి ఎలా కొత్తదో ఆవిడకి అలానే ‘అత్తగారి’ హోదా కొత్తది. కోడలిగా లహరి కి వయసు అనుభవమూ ఎలా లేవో ఒక్కగానొక్క కొడుకు అవడం చేత ఆవిడకి అత్తగారి గా అనుభవమూ , వయసు రాలేదు.  మా అమ్మ కి నీకంటే ముందే ఇద్దరు కోడళ్ళకి అత్తగారై ఉండటం చేత నీకు కోడలిగా వయసు రానప్పటికీ ఆవిడ ఆపాటికే అపార అనుభవము గడించి ఉంది.

          “ మునుపు ఆవిడ అత్తగార్ల బడిలో శిశు తరగతి ఇపుడు కళాశాల స్థాయి. అందుకే అన్నాను ఇన్నాళ్ల కి అత్తగారిగా  ఆవిడకి ఆ వయసొచ్చిoది అని..” తన పరిశోధనా సిద్ధాంతo అర్థమైంది అన్నట్టు తలుపుతూ శారద కూడా తన  నవ్వుతో శృతి కలిపింది. 

* * *

          “ఏవండీ ! ఇవాళ లహరికి వాళ్ళ అత్తగారికి మధ్య పెద్ద యుద్దమే జరిగిందట. లహరి కూడా ఏ మాత్రం తగ్గక మాటకి మాట సమాధానం ఇచ్చిందట.. అయితే మీ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు లహరి క్కూడా  వయసు వచ్చినట్టేనా..” అంటూ ముత్యాల  దొంతరులు  రాలినట్టు నవ్వుతున్న శారద తో తనూ హాయిగా నవ్వేశాడు.

(2013 లో ఆకశవాణి వరంగల్ కేంద్రంలో ప్రసారమైంది)

Written by Varigonda Surekha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వంటింటి కళ

చిరుప్రాయం