ఆనందాలు

       కామేశ్వరి

ప్రతి మనిషి జీవితంలో అడుగడుగునా ఆనందంతో ఉండాలని కోరుకుంటాడు. కావాలి కూడా. లేకపోతే జీవితం నిస్తేజమైపోతుంది. ప్రపంచం కూడా మనకి ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండాలని కోరుకుంటాం . ఇరుగుపొరుగు వారు, బంధుమిత్రులు, ఆఖరికి మనం పెంచుకునే జంతువులు, మొక్కలు కూడా ఆనందంగా జీవించాలని కోరుకుంటాము . ఇలా మన చుట్టూ ఉన్న ఎన్నో ఆనందాలను తలుపుకుని జీవిస్తే గాని తృప్తి ఉండదు. ఆనందంగా ఉండడం వల్ల ఆయుష్షు కూడా పెరుగుతుంది అంటారు. ఇది నిజం కూడా. కానీ ఆనందం అంటే సరైన అవగాహన లేదు మనకి. ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టు ఆనందాల కోసం పరుగులు తీస్తాం. కానీ ఆనందం మనకి నాలుగు రకాలుగా రోజువారి జీవితంలో అనుభవిస్తూ ఉంటా. కానీ అది ఏ క్యాటగిరీకి చెందిందో ఎనలైజ్ చేయము. తెలియదు కూడా.
మొదటిది శారీరిక ఆనందం :– బాహ్య శరీరానికి సంబంధించినవి. మన బట్టలు, తిండి, నివాసం, ఆటలు, నిద్ర డ్రింకింగ్,స్మోకింగ్ డ్రగ్స్ తీసుకోవడం ఇవన్నీ శారీరక ఆనందం కోసం చేస్తాం. ఒకసారి ఆలోచిస్తే ఇవన్నీ ఆ క్షణంలోనే ఆనందాన్ని ఇస్తాయి. మితిమీరితే వెగటు నిస్తాయి. ఇవి ఆనందానికి స్థిరంగా ఉంచవు. కానీ వీటిని అంతు పొంతు లేకుండా కోరుకుంటేనే ఉంటాం.
రెండవది మానసిక ఆనందం:— ప్రకృతిని తిలకించడం, సంగీతం వినడం, సినిమాలు చూడటం, ఆటల పోటీలు చూడడం, ఫంక్షన్లు, సెలబ్రేషన్లు, తీర్థయాత్రలు, విహారయాత్రలు ఇవన్నీ మానసిక ఆనందానికి సంబంధించినవే. దీనివల్ల శరీరము, మనస్సు కూడా అలసిపోతాయి. ఇవి కూడా తత్కాలంలో ఇచ్చే ఆనందాలే.
వృత్తి( బుద్ధి) ఆనందం:– దీనిని ఇంటలెక్చువల్ హ్యాపీనెస్ అంటారు. ఇది మన జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. పుస్తకాలు చదవటం ద్వారా, అవేర్నెస్ స్పీచెస్ వినడం ద్వారా, పెద్దల అనుభవాల ద్వారా పొందవచ్చు. జ్ఞానం ద్వారా మనలో విచక్షణ,విచారం మొదలవుతుంది. మనం రోజు చేసుకునే పనులలో కూడా ఆనందాన్ని గమనిస్తాం. నిర్వేదంగా ఉన్న మనస్సు శక్తిని పుంజుకుంటుంది. పనిచేసే సామర్ధ్యత పెరుగుతుంది. . ప్రతి పని యాంత్రికంగా చేయడం వలన మర్మంగా దాగి ఉన్న ఆనందాన్ని పొందలేకపోతున్నాం. వర్తమానంలో జీవిస్తూ చేయాలి. ఈ యాంత్రిక జీవితంలో దాని పూర్తిగా మర్చిపోతున్నాం.
నాలుగవది ఆత్మానందం :– సేవ ద్వారా, దానధర్మాల వలన, విద్య గరపడం వలన, వికలాంగులకు అనాధలకు సహాయం అందించడం ద్వారా మనసుకి సంతృప్తికరమైన ఆనందం లభిస్తుంది. ఇవన్నీ మానవ జన్మ ధన్యత చేసుకోవడం కోసమే కదా. ఇందులోనే ఉంది నిజమైన ఆనందం. గాంధీజీ, మదర్ తెరిసా లాంటివారు, ఎన్నో ఎన్నో ఎన్జీవోలు, రామకృష్ణ మిషన్ లాంటి ఎన్నో మఠాలు దీనికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
మనుషుల శారీరక పోలికలు, సంపాదనలు, కష్ట సుఖాలు, కీర్తి ప్రతిష్టలు ఎవరివి ఒకలాగా ఉండవు ఇతరులను చూసి అసూయ పడటం కానీ, ద్వేషించడం కానీ, రంగు రూపం చూసి అసహ్యించుకోవడం కానీ చేయకూడదు. ప్రతి మనిషి భగవంతుడు సృష్టిలో ఒక భాగమే. నేను నేను లాగ ఉన్నాను. వాళ్లు వాళ్ల లాగా ఉన్నారు అని నిరంతరం మనసుకి నచ్చ చెప్పుకోవాలి. కానీ వచ్చిన దానితో తృప్తి పొందక లేని దానికి ఆర్రుచులు పోవడం ఎక్కువైపోయింది. ఆనందాన్ని వాళ్ళు చేజేతులా పాడు చేసుకుంటున్నారు. అందుకే ఈ అంతుపంతులేని జబ్బులు, మానసిక రోగాలు. లోకంలో మనిషి మనిషికి ఒక కథ. అందువలన దేనితో పోల్చుకోకుండా మనకి ఇదే ప్రాప్తం అని మనస్ఫూర్తిగా, నిశ్చయంగా ఉండటం అలవాటు చేసుకోవాలి.ఆనందంగా ఉండడానికి మనస్సును అదుపులో ఉంచుకుని దాని మంచి చెడ్డలను తరచి తరచి చూసుకోవాలి. మనసు పట్టుకోకపోతే ఆనందం కూడా దక్కదు. పై చెప్పిన ఆనందాలు నాలుగు సోఫానాలు వంటివి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అందులోని నిజ నిజాలు తెలుసుకుంటూ పై మెట్టుకు చేరాలి. అప్పుడే నిజమైన ఆనందాన్ని పొందుతాం. లేకపోతే బొక్క బోర్లా పడి దేనికి కొరగాము. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో
“ప్రశాంత మనసు కలవాడే ఆత్మానందమును పొందగలడు.” అని బోధించాడు. అంటే నీ అంతరాత్మ చెప్పినదే నీకు ఆనందాన్నిస్తుంది. అలాగే ఉందామా మరి…..

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రభాత కమలం

ఆపాత మధురాలు part-14