అదృశ్యం

కథ

వరిగొండ సురేఖ

పడక్కుర్చీలో దీర్ఘాలోచనలో మునిగిఉన్న నరసింహమూర్తికి భార్య అడుగులు చేతిలో మజ్జిగ గ్లాసుని, గడియారంలో తొమ్మిది గంటలని గుర్తు చేశాయి. ఇరవై ఏళ్ళుగా ఏ ఒక్క రోజు తప్పని దినచర్య. నర్సింహమూర్తి, తన నలభైవ ఏట నుండి రెండోపూట భోజనం మానేశారు. సాయం వేళల్లో ఏదైనా అల్పాహారం. రాత్రిపూట సరిగ్గా తొమ్మిదింటింకి గ్లాసుడు మజ్జిగ. ఇంట్లో ఉన్నంతసేపు గడియారం చూసుకునే అవసరం నర్సింహమూర్తికి ఏనాడు కలగలేదు.

సాయంత్రం ఐదున్నరకి ఇంటికి రాగానే బట్టలు మార్చుకుని ముందు గదిలో పడక్కుర్చీలో కూర్చుంటారు. అలా కూర్చున్న మూడు నిమిషాలలో చేతిలో పొగలుగక్కే కాఫీని పెడతారు జానకమ్మ. ఏడు గంటలకు స్నానం. ఏడున్నర కి అల్పాహారం తొమ్మిదింటికి గ్లాసుడు మజ్జిగ తాగి సరిగ్గా రాత్రి పది గంటలకి తమ పూర్వీకుల నుండి సంక్రమించిన పట్టె మంచంపై నడుం వాలుస్తారు. తిరిగి ఉదయం ఐదు గంటలకి నిద్ర లేస్తారు. కాఫీ, తర్వాత ఎనిమిది గంటలకి ఉపాహారం. తొమ్మిదింటికి క్యారెజ్ తీసుకొని బడికి బయలుదేరడం. తనకి అవసరాలు తీర్చబడడమే తప్ప ఏ రోజూ ఎలా తీరుతున్నాయి అన్న ఆలోచనే రాలేదు.

ఇవాళ ఉదయం తన మిత్రుడు సహాధ్యాయి సుధాకరం సహచరిని కోల్పోయిన వార్త విన్నప్పటి నుండి మజ్జిగగ్లాసు అందుకునే పడక్కుర్చీ ఖాళీ అయినా,మజ్జిగ అందించే మట్టి గాజులు నిష్క్రమించినా ఆవరించే శూన్యాన్ని అధిగమించి జీవితాన్ని కొత్తగా ఆరంభించటం సాధ్యమా అన్న ఆలోచన తనని ఉదయం నుండి ఆందోళనకి, ఆవేదనకి గురి చేస్తోంది.

“ఏవిటండీ! ఇంకా ఉదయం విచారంలోంచి బయటపడలేదా?” గ్లాసు చేతికందిస్తూ అడిగింది జానకమ్మ. సమాధానానికై ఎదురు చూడకుండా . “ఏవిటండీ! పంపిన దేవుడు తిరిగి పిలిస్తే పోకుండా ఉంటామా!? ముందు వెనక అంతే. పోయిన వారు ధన్యులు. ఉన్నవారు భగవంతుడి ఆరాధనలో కాలం గడుపుతూ ఆయన ఆజ్ఞ కోసం వేచిచూడాలి. జంట జీవితం ఒంటరిదైతే భగవంతుడి తోడు కోరాలే కాని ఈ వయసులో అలవాట్లు అవసరాలు ఎలా అనికాదు. అనవసరంగా ఆరోగ్యంపాడు చేసుకోక నేను ఇచ్చినన్నాళ్ళు మజ్జిగ తాగండి. ఇవ్వలేని రోజున మీరే కలుపుకుతాగడం అలవాటు చేసుకోండి.” అని చిరునవ్వుతో వెడుతున్న ఆవిడని “మరి తాగేవారు లేకపోతే…” అని అడగాలి అనుకొని దొరికి దొరకని సమాధానం మనసుని చేరగా మజ్జిగ మరింత రుచిగా అనిపించింది నర్సింహమూర్తికి.

 

Written by Varigonda Surekha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బాలవర్ధన్‌ ఓ కొత్త ప్రయోగం!

తొలి మహిళా కార్టూనిస్టు