ఈనాటి బాలసాహిత్యంలో టీనేజ్ పిల్లల కోసం వస్తున్న రచనలు చాలా తక్కువ. అలాంటి రచనలు చేస్తున్న కొద్దిమందిలో డా॥ వి. ఆర్. శర్మ గారిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరు రాసిన కానుక, ప్రయాణం, బాలవర్ధన్, రక్ష నవలలన్నీ టీనేజ్ పిల్లల కోసం రాసినవే. బాల సాహిత్యంలో వీరి రచనల్లో ఎక్కువగా టీనేజ్ పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఉండడం గమనించవచ్చు. వీరు ఎక్కువగా పన్నెండు నుంచి పదహారు, పద్దెనిమిది సంవత్సరాల పిల్లల కోసం రాస్తున్నారు. ఈనాటి ఈ వయసు పిల్లలు ఇష్టపడే అడ్వెంచర్స్, సాంకేతికతతో కూడిన కథా వస్తువు శర్మగారి రచనల ప్రత్యేకత.
గత జనవరిలో వీరి ‘బాలవర్ధన్’ పిల్లల నవల మంచి పుస్తకం సంస్థ ప్రచురించింది. ‘‘నేటినిజం’’ పత్రిక చక్కటి బొమ్మలతో సీరియల్‌గా ప్రచురించింది. ఆంగ్లంలో హారీపోటర్ నవల ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. మన తెలుగు జానపద సాహిత్యంలోని బాలనాగమ్మ కథకు, హారీపోటర్ కథా వస్తువుకూ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. కానీ ఈతరం పిల్లలకు హారీపోటర్ తెలిసినంతగా మన బాలనాగమ్మ తెలియదు. కనుక ఈ నాటి పిల్లలకు మన బాలనాగమ్మను ముఖ్యంగా అందులోని ‘బాలవద్దిరాజును’ పరిచయం చేయాలి. అదీ ఈనాటి పిల్లలకు దగ్గరగా ఉండేలా చెప్పాలి. ఈ ఆలోచనలోంచి రూపు దిద్దుకున్న పుస్తకమే బాలవర్ధన్ పిల్లల నవల. తెలుగు జానపద సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యంలో వున్న బాలనాగమ్మ కథను తీసుకొని, నేటి టీనేజ్ పిల్లలను దృష్టిలో పెట్టుకొని రాసింది ఆ పుస్తకం.
అపహరించబడిన తన తల్లిని, తండ్రిని వెతుకుతూ వెళ్ళి విజయం సాధించడం రెంటిలో ప్రధాన వస్తువు. మూల కథలో బాలనాగమ్మను అపహరించిన మాయల పకీరు బోలెడన్ని మాయలు, మంత్రాలు తెలిసినవాడు. నీతి నియమాలు లేని దుర్మార్గుడు, స్వార్థపరుడు. కానీ బాలవర్ధన్ నవలలో పోస్ట్‌మ్యాన్ రూపంలో వచ్చి, నాగమణిని అపహరించిన ‘‘మాయ’’ పాత్రను సృష్టించడంలో రచయిత మేధోశక్తి పాఠకులను అబ్బురుస్తుంది. మాయ ఓ మాంత్రికుడు కాదు. అసలు ప్రాణే కాదు. అతను ఒక యంత్రం. ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్.
నేటి సాంకేతిక యుగంలో వున్న టీనేజ్ పిల్లలు మాయలు, మంత్రాలు నమ్మేరకం కాదు. కాబట్టి రచయిత వాటి జోలికి పోకుండా సాంకేతికత వాడుకొని కొత్తగా ఈ కథను సాంతం నడిపించాడు.
సాహిత్యం కొన్ని విలువలకు కట్టుబడి ఉండాలి. అందులోనూ భావితరాలను ప్రభావితం చేసే బాలసాహిత్యానికి ఇది మరింత అవసరం. ఈ విషయంలోనూ శర్మగారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారనిపిస్తుంది. మూల కథలో మాయల ఫకీరు అందగత్తె అయిన బాలనాగమ్మను తన స్వార్థం కోసం ఎత్తుకుపోతాడు. కానీ ప్రస్తుత నవలలోని మాయ ఒక సామాజిక ప్రయోజనం కొరకు నాగమణిని అపహరిస్తాడు. మరో గ్రహంలో మరణించిన శాస్త్రవేత్త మెదడును చేర్చి తయారుచేసిన సూపర్ రోబోను గ్రహాంతర వాసులు ప్రయోగం నిమిత్తం భూగ్రహం మీదకు పంపిస్తారు. అలా ఓ వైరస్‌కు విరుగుడు మందు (వ్యాక్సిన్) కనిపెట్టడానికి వచ్చిన మాయ వీలయినంత త్వరగా పని ముగించుకొని తన గ్రహానికి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఇక్కడ ఎవరికీ కావాలని కీడు చేసే ఉద్దేశం మాయకు లేదు. అంతేగాక ప్రాచీ, బాలవర్ధన్ సంభాషణ ద్వారా మాయ మంచితనాన్ని మరింత వివరిస్తాడు రచయిత. మెదడు నిక్షిప్తం చేయబడడం వల్ల అనుబంధాలు, అప్యాయతలు కూడా తెలుస్తాయి మాయకు.
సప్త సముద్రాల ఆవల, మర్రిచెట్టు తొర్రలో వున్న చిలుకలో మాయల పకీరు ప్రాణం ఉన్నట్టు` రోబో మాయ ప్రాణం కూడా రిమోట్ చిలుక ఉంటుంది. దానిని సాధించడానికి బాలవర్ధన్ చేసిన సాహసోపేతమైన ప్రయాణం, చివరగా విజయాన్ని సాధించిన తీరును పాఠకులు చదివి తీరవలసిందే. కానీ మాటల్లో చెప్పడం సాధ్యం కాదు.
దీనిలో ప్రధాన పాత్రలన్నీ చాలా ఉదాత్తమైనవి. మొదటి అధ్యాయంలో కనిపించిన యాభై ఏళ్ళ ఆడమనిషి పాత్ర చిన్నదే అయినా అది కథను నేపథ్యం లోనికి నెట్టిన ప్రధాన పాత్ర. బాలవర్ధన్ తండ్రి కార్యవర్ధన్ కార్యశూరుడు. ప్రజా నాయకుడు. తెలంగాణ ఉద్యమ నాయకుడు. ఇక బాలవర్ధన్ పాత్ర చిత్రణలో ఒక క్రమపరిణామం కనిపిస్తుంది. ఆ పిల్లవాడు వీధిలో క్రికెట్ ఆడడంతో మొదలై, అడవిలో గాయపడ్డ పులి పిల్లకు సపర్యలు చేసి, సాహసోపేతంగా ప్రయాణించి, ప్రయోగశాలతో బాటు మాయను మట్టుబెట్టిన ధీరబాలుడు. తగినంత సాంకేతిక జ్ఞానం కలిగిన వాడు. గిరి, రాము అతనికి సహకరిస్తారు. బాలవర్ధన్‌కు సరిజోడు ప్రాచీ పాత్ర. ప్రాచీ, సంఘమిత్రలు కూడా అతని విజయానికి తోడ్పాటునందిస్తారు. మానవ పాత్రల చిత్రణలోనే కాకుండా రోబోల పాత్రల చిత్రణలో కూడా ఎన్నో విలువలు చూపించారు రచయిత.
‘‘ఈ ప్రపంచం లాక్ డౌన్ అంటూ తనకు తాను తాళం వేసుకోవడానికి కొంత కాలం ముందు…’’ అంటూ నవల ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రస్తుత ప్రపంచంలో కలకలం సృష్టించిన కరోనా వైరస్, వ్యాక్సిన్ మొదలైనవన్నీ సమర్థవంతంగా ఈ కథలో చొప్పించారు రచయిత. సాంకేతికత, సాహసాతోనే సరిపెట్టకుండా కథానుగుణంగా వర్తమాన చరిత్ర, రాజకీయాలు, ఉద్యమాలు, అడవులు, భౌగోళిక తెలంగాణను ప్రస్తావించడం వల్ల వాటిపట్ల రచయిత అభిమానం, అవగాహన స్పష్టమౌతుంది.
ఈ నవల ఎత్తుగడలోనూ, కథా కథనంలోనూ చాకచక్యంగా పరుగులు పెట్టిస్తారు రచయిత. పాత కొత్తల మేలు కలయికగా వి. ఆర్. శర్మ గారు ఈ కథను మలచిన తీరు అభినందనీయం.