పుట్టి పెరిగిన ఇల్లు పరాయిదై పోయి
తోడ బుట్టిన బంధాలు తృణ ప్రాయమై
కొత్త ఇంటి లోన మమత కొరకు చూసి
బంధాల సంకెళ్ళ బిగుతుగా తోస్తుంటే
ఆడ పిల్లలు అనిరి ఈడ కాదు నెలవని
ఆడుకున్న బొమ్మలు ఆ ఇంటిలో ఉంటే
ఈడు వచ్చినాక ఈడ కాదు పొమ్మని..
ఎర్క లేని అయ్య చేతిలో పెట్టి అప్పగించి
ఊరవతల దాకా సాగనంపిరి ఏడ్సుకుంట
చెయ్యి పట్టిన పెనుమిటినే దిక్కని తల్షే
గోముగా జూసేటి నాన్న లేక పాయె
గావురం జేషేటి అమ్మ కాన రాక పాయె
గెల్కి కయ్య మాడే తోడ వుట్టినోల్లు లేకపాయె
ఇంటెనుక పూసిన దాసన్న పూలే వి
ప్రేమ కురిపించే గొట్ట మల్లె పూలేవి
బాసాండ్లు బట్టలు సుప్రభాతం పల్కే
అందరికీ అమర్చేటి యంత్ర మాయే
అలుపు సొలుపుల మాట ఎవ్వరింటారు
మనసు సల్ల వడే మాటెవరు చెప్తారు
గోడుమని ఏడ్చిన వినే గోడలేవి?
ఉన్న ఇల్లు యిడిషి ఎందుకు పోవాలె
ఆడిబతుకుల ఎందుకీ తేడాలు..
నిన్న నాది అనుకుంటే నేడు కాదనిరి
అడిగి పోవాలంట ఆత్మ గుంజుతుంటే
ఏమి దేవుడివయ్య కనికరం లేదయ్య
నిత్తే మల్లె పూలు యాదికి రావట్టే
గుంజకు గట్టేసిన ల్యాగ గుర్తు కొచ్చే
బంతి పూలు పిలిచే బత్కమ్మ కోసం
గన్నేరు రమ్మనే దోడు మంటుందని
ఎప్పుడు పోతనో ఆ ఇంటికి నేను!
రాకిట్ల పున్నమ ఎప్పుడొస్తదో అని
ఆకిట్ల కూసోని లెక్క కడుతుంటే ..
కండ్ల నీళ్లు జారీ కాళ్ళు తడిసెనని
భూమి తల్లి కి జెప్తి గోసనంత