మన కళ్ళతో ప్రపంచాన్ని చూద్దాం !

29.7.2023 తపుణి సంపాదకీయం

డా. కొండపల్లి నీహారిణి

నగరవాసులకు ఇప్పుడు సమయం రోజుకు 24 గంటలు సరిపోవడం లేదు. సంవత్సరానికి 364 రోజులూ సరిపోవడం లేదు. ఎందుకు అంటే వేయిన్నొక్క కారణాలు వెతికి చెప్తారు ! కారణాలేవైనా ప్రొద్దున లేచినప్పటినుండి ఉరుకుల పరుగుల జీవితాన్ని లాఘవంగా లాగిస్తున్నారు. కళలకు నిలయమైన  భారతదేశంలో బహుళ ఖ్యాతి గడించిన తెలుగు వాళ్ళం మనం. కీర్తి పతాకాలెగురవేసిన కళాకారులున్న భాగ్యనగరం మనది. కానీ… కానీ యో బేగానీ యోగానీ ! అసలు విషయమేమిటంటే.. కంట్లో వత్తులు వేసుకుని చూసినా ”కళలు” కనిపించే పరిస్థితులు భవిష్యత్తులో ఉండవేమో అని అనిపిస్తుంది. ఇది నిజంగా నిజం ! తమ కళలను కాపాడుకోలేక పాట్లు పడుతున్న కళాకారులను, వారి సభలనూ చూస్తే తెలుస్తుంది. అబ్బే ప్లాట్లు కావండీ ! పాట్లు…. పాట్లు… అవే ఇక్కట్లు, కష్టాలు, బాధలు ! సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సభలకు వెళ్తే తేటతెల్లమవుతుంది. అదే, అంటే… తెలుస్తుంది అని అర్థం ! శాస్త్రీయ సంగీతాన్ని, నృత్యాన్ని పరిరక్షించుకోవాలని తపన పడ్తున్న వాళ్ళను, వాళ్ళు చేస్తున్న పద్ధతులనూ చూస్తే ఈ సత్యం బోధపడ్తుంది. ఇందులో… ఇంకా.. సాహిత్య సభల్లో మరీనూ!

సాహితీప్రియులు కొరవడుతున్న నేపథ్యంలో తెలుగు వాళ్ళమైన మనం మన తెలుగును రక్షించుకోవాలన్నది కాస్త ఆలోచించాల్సిన విషయమేనండోయ్‌ ! చించి… చించి… పారేయకండి. ఆఁ….! కాస్త కాస్త మెల్లెగా చించండి.. అదే ఆలోచించండి. గుడ్‌ !

ప్రముఖ కవుల, కవయిత్రుల సన్మానసభల్లో, గొప్పవారి జయంతి, వర్ధంతి సభల్లో, పుస్తకావిష్కరణ సభల్లో, కవి సమ్మేళనాల్లో ప్రేక్షకులు లేక వెలవెల బోతున్న హాల్స్‌ ను (టాబ్లెట్‌ కాదండి – హాళ్ళు – సభా ప్రాంగణాలు) చూస్తే కడుపు తరుక్కుపోతున్నది. అయ్యో ఏమి గతి పడుతోంది మన తెలుగు సాహిత్యానికీ అని ! ఈ ఉపద్రవానికి కారణం మాత్రం తప్పకుండా కుటంబ పెద్దలే అని చెప్పక తప్పదు. హమ్మయ్య నేను మాత్రం కాదు అని తప్పించుకోకండి ! కొత్తగా రిలీజయిన సినిమాలకు ఎంత కష్టమైనా పంపిస్తారు. ఫ్రెండ్స్‌ తో కలిసి షాపింగులకూ, పార్టీలకు వెళ్ళనిస్తారు. ఇంట్లో టి.వి. చూడడానికి అనుమతిస్తారు. ఇంటర్‌ నెట్‌ లో చాటింగ్‌ చేస్తుంటే పట్టించుకోరు. ఇవన్నీ చూడగలిగిన, అనుమతించగలిగిన తల్లిదండ్రులు తమ పిల్లలను సాహిత్య సభలకు వెళ్ళమని ఎందుకు చెప్పరు? (వాళ్ళు వెళ్తే కదా!) ”నగరంలో నేడు” వంటి ప్రకటనలు దాదాపు అన్ని పత్రికల్లోనూ వేస్తారు. తెలుగు పత్రికా పాఠకులందరికీ ఈ విషయం తెలుసు. అయినా వెళ్ళరు, పంపరు. ”చెప్పేవాడికి వినేవాడు లోకువ” అనే లోకోక్తి అనుకుని తమను తాము లోకువ చేసుకోవడం ఇష్టం లేదా ఏంటి? ఆఁ! ఆ సభల్లో ఆ స్పీచ్‌ లు వగైరాలు ఎవరు వింటార్లే ! ఏం వెళ్తాం లే అని అనుకుంటున్నారేమో! కానీ, పాపం ఆ లోకోక్తికి కాలమెప్పుడో చెల్లిపోయినట్లనిపిస్తుంది నేటి సభలకు వెళ్తే ! కొత్త ఉక్తి చెప్పాలంటే ”వినేవాడికి చెప్పేవాడు లోకువ” అయ్యిందీనాడనిపిస్తుంది. ఓ సినిమా నాయకుడో అదే.. హీరోలు ! ఓ రాజకీయ నాయకుడో, లేదా ఓ రెండు రికార్డింగ్‌ డ్యాన్సులు ఉంటేనే గానీ సభలు కళకళ లాడుతున్నాయి” ప్రజల ఇంట్రెస్‌ అలా ఉందిప్పుడు ! (ప్రజలంటే మనమే కదూ!)

సభలను నిర్వహిస్తున్న సాహితీ సంస్థలు, వ్యక్తులు ఎంతో అభినందనీయులు. వారికి సంబంధిత వ్యక్తులో, మిత్రులో, బంధువులో ఆయా సభలకు వస్తున్నారు. ఆ సదరు కవుల అభిమానులో తప్పనిసరి తప్పించుకోక వస్తున్నారంతే గాని మరోటి గాదు. మనకు తెలియని కొత్త విషయాలేమైనా తెలుస్తాయనో లేదా సాహితీ వేత్తలకు సంస్థలకు ఎంకరేజ్‌ మెంట్‌ లా … ఓ ప్రోత్సాహంగా ఉంటుందనో వెళ్ళే వాళ్ళెంతమంది ? ఇంట్లో టి.వి.కి అతుక్కుపోకుండా అలా ప్రపంచాన్ని మన కళ్ళతో చూద్దాం అన్న ఆలోచనెంతమందికుంది! అబ్బే లేదు. పూర్తిగా తగ్గిపోయింది.

ఎక్కడ సభకు వెళ్ళినా 50 నుండి 70 ఏళ్ళ వయస్సున్న వాళ్ళు మాత్రమే కనిపిస్తుంటారు. ఎందుకలా ? యువత ఎందుకు ఇష్టపడటం లేదు? వారు కోరుకుంటున్నదేమిటి? మనం అవలోకించాల్సిన విషయమే ఇది! ఎం.బి.బి.యస్‌., ఇంజనీరింగ్‌, ఐ.టీ., సైన్స్‌ విద్యార్థులు ఇష్టపడడం లేదంటే ఇంతో అంతో అర్థముంది. వాళ్ళకు సమయం దొరకడం లేదంటేనో, ఇంట్రస్ట్‌ లేదంటేనో కాస్త వదిలేయవచ్చు. కానీ, తెలుగు మీడియంలో చదివే కాలేజీ స్టూడెంట్స్‌, మరీ తెలుగు బి.ఏ., ఎం.ఏ. చేసేవాళ్ళు కూడా సాహిత్య సభలు అటెండ్‌ కావడం లేదంటే ఆశ్చర్యమేస్తుంది. మన కవులు రచయితలందరు వారి టీనేజీ అదేనండీ 12, 13 ఏళ్ళ వయస్సులోనే కవితలు, కథలు వ్రాసిన వారున్నారు! అంతేగాక తెలుగు బోధించే టీచర్లు, లెక్చరర్లు కూడా ఇందుకు దూరమేమీ కాదు! ఎంత ఉద్యోగాలు చేసుకునే వారైనా మనమంతా తెలుగు వారిమే కదా! ప్రతిరోజూ వెళ్ళకపోయినా కనీసం నెలకు ఓ రెండు సార్లైనా తెలుగు సాహిత్యసభలకు వెళ్ళాలి కదా! ఊహూఁ! వెళ్ళరు. అవి బోర్‌ గా ఉంటాయనుకుంటారు. అది చాలా తప్పుడు ఆలోచనన్న విషయం ఒకసారి ఆ సభకు వెళ్తేగానీ తెలుస్తుంది. ఎంత బావుంటాయో! ఉపన్యాసాలు బోర్‌ అనీ, ఊకదంపుడుగా ఉంటాయనీ అనుకోవద్దు! ఎన్నో హాస్యోక్తులు, ఛలోక్తులు విసురుతూ మంచి ఉపన్యాసాలు ఇచ్చేవారున్నారు. ఎన్నో కొత్త విషయాలను శ్రోతలకు అందించే మంచి వక్తలున్నారు. వింటే ఎంతో లోకజ్ఞానం వస్తుంది. మానవ విలువలు తెలుస్తాయి. హృదయం స్పందిస్తుంది. ఆనందం లభిస్తుంది. చక్కని తెలుగు వీనుల విందుగా ఉండి మీకు తృప్తినిస్తాయి. కుటుంబ సభ్యులంతా కలిసి పెళ్ళిళ్ళకు ఏవేవో ఫంక్షన్లకు వెళ్తుంటారు. అక్కడ ఎంతో సమయం గడుపుతుంటారు. (కొందరికి ఇష్టం లేకపోయినా, బలవంతంగానైనా) అవి నిరుపయోగ మైనవని ఉద్దేశ్యం కాదు. కానీ, ఆ విధంగానే మంచి ఉపయోగకరమైన సాహిత్య సభలకు వెళ్ళి హాయిగా చక్కని తెలుగును విని సంతోష పడవచ్చు కదాని ! ఇంట్లో పెద్దలు, కాలేజీల్లో, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, లెక్చరర్స్‌ వీటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అవునంటారా? కనీసం నెలకో రెండు సభలకైనా వెళ్ళాలని ఒక నియమం పెట్టుకుంటే తప్ప అది సాధ్యపడదు. మనతో మరో ఒకరినో, ఇద్దరినో వెంటబెట్టుకెళ్తూ సాహిత్య సభలను జయప్రదం చేయాల్సిన బాధ్యత, అట్లే లలిత కళలను పోషించుకునే బాధ్యత నగరవాసుల పైన ఎంతైనా ఉంది. అవసరమూ ఉంది.

పాశ్చాత్య ప్రభావాలకు, ఫ్యాషన్స్‌కు లోనై యువతలో ఉన్న శక్తి అడుగంటిపోతున్నది. మన మూలాలేవో కదులుతున్నాయ్‌. వాటిని కూలనివ్వకండి! తస్మాత్‌ జాగ్రత్త ! తెలుగు తెమ్మరలను ఆస్వాదించండి! తెలుగును అచ్చంగా బ్రతికించుకునేందుకు సారథులు కండి!

”దేశభాషలందు తెలుగు లెస్సు కాకుండా, ఒకప్పటిలాగే ‘దేశభాషలందు తెలుగు లెస్స” అని గర్వంగా చెప్పుకునే బంగారు భవితనివ్వండి !!

మన కళ్ళతో ప్రపంచాన్ని చూద్దాం ! ఏమంటారు ?

—– —–

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆతుకూరి మొల్ల

ఆడి విల్ల