16వ. శతాబ్దంలో జాతుల పట్ల ఇతర కుల మతాల పట్ల వర్ణ వివక్షను పితృస్వామ్య భావాలను ఎదుర్కొని పురుషులతో సమానంగా కవిత్వం రచించిన విదుషీమణి ఆతుకూరి మొల్ల.
ఆతుకూరి మొల్ల కవయిత్రి.తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణం రంచింది. ఈమె కుమ్మరి కుటుంబంలో జన్మించింది. మొల్ల శ్రీ కృష్ణదేవరాయలు సమయం 16వ.శతాబ్దానికి చెందినదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైనది. రమణీయమైనది. 16వ.శతాబ్దానికి చెందిన ఏకామ్రనాధుడనే చరిత్రకారుడు తన ప్రతాపచరిత్రలో మొల్లను పేర్కొన్నాడు. అందులో పేర్కొన్న సాంఘీక పరిస్థితులను బట్టి మొల్ల సుమారుగా శ.1581కి ముందుగా జీవించి ఉండేదనిపిస్తుంది.ఆమె తిక్కన సోమయాజీకి, భాస్కరునికీ, ప్రతాప రుద్రునికి సమకాలీనురాలు కావచ్చును కూడాను. ఈమె కులా వంశ సంజాత.ఇంటిపేరు ఆతుకూరి,కులం కుమ్మరి.మొల్ల అని వ్యవహరింపబడుచున్నది. ఈమె తండ్రి కేతన శెట్టి. ఈమె ఆజన్మబ్రహ్మచారిణి అని చెప్పెదరు. మొల్ల స్వస్థలం కడప జిల్లా, కడప జిల్లా గోపవరం మండలం గోపవరం గ్రామం. ఈ గ్రామం కడప పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో బద్వేలుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈమె ఈ ప్రాంతానికి చెందిన మొల్ల రామాయణంలోని ఈ క్రింది పద్యం ద్వారా తెలుస్తుంది.
“కావ్య సంపద క్రియలు నిఘంటువులును
గ్రామం లేనియు నెఱంగ, విఖ్యాత గోప
వరపు శ్రీకంఠ మల్లేశు వరముచేత- నెఱిఁ
గవిత్వంబు జెప్పగా నేర్చుకొంటి”.
మొల్ల తాను శ్రీ కంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పింది.వాటి ఆధారంగా వాజ్మయ మూలాలు మొల్ల స్వతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్నతనంలో తల్లిని కోల్పోగా తండ్రి కేసన శెట్టి ఆమెను గారాబంగా పెంచెనని తెలుస్తోంది. ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టం.చివరిదాకా తండ్రి ఇంటి పేరునే ఉపయోగించడం మొల్ల పెళ్లి చేసుకోలేదని అనుకోవచ్చు. మొల్ల రామాయణము ఆరుకాండలలో 871 పద్యాలతో కూడుకుంది. ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజులలో రాసిందని ప్రతీతి. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా ఉంది.
ఈమెపై పోతన కవితా ప్రభావము ఎక్కువగా కలదు. “పలికేడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట”….. అని పోతన చెప్పిన మాదిరిగానే ఈమె రామాయణము నందు “చెప్పమని రామచంద్రుడు, చెప్పించిన పలుకుమీద జెప్పిదనే నెలపుడు నిహపర సాధన, మీపుణ్య చరిత,తప్పు లెంచకుడు కవుల్” అని పల్కినది. సర్వ గుణకరుడు శ్రీరాముని చరితమును ఎందరెన్ని విధముల రచన గావించినను నవ్యతకలిగి వీనులవిందై, యమృతపు సోనల పొందై యలరారుచుండుట తానీ గ్రంథమును చేపట్టుటకు కారణం అని చెప్పినది. తనకు శాస్త్రీయమైన కవిత్వ జ్ఞానము లేదని భగవద్ధత్తమైన వరప్రసాదం వల్లనే కవిత్వం చెబుతున్నానని ఆమె అన్నది. మొల్ల రామాయణం సంస్కృతంలో శ్రీ వాల్మీకి విరచితమయిన శ్రీమద్రామాయణమును ఆధారంగా చేసుకొని తేట తెలుగులో వ్రాయబడిన పద్య కావ్యము. మొల్ల రామాయణంలో కంద పద్యాలు ఎక్కువగా ఉండటం వల్ల కంద రామాయణం అనడం కూడా కద్దు.తాను రచించిన రామాయణమును నాటి రోజుల్లో అనేక కవులు చేయుచున్న విధముగా ధనము, కీర్తిని ఆశించక ఏ రాజులకును అంకితము నివ్వలేదు. ఇది ఆమె యొక్క రామభక్తికి నిదర్శనం.
“ఉన్నాడు లెస్స రాఘవు
డున్నాడితే కవుల గూడియురుగ తీరునై
యున్నాడు నిన్ను గొనిపో
నున్నాడిది నిజము
నమ్ము ముర్వి తనయా!”
ఈ పద్యం ఆమె ప్రతిభకు గీటురాయి,పద్య నైపుణ్యానికి నిదర్శనం.కవితా సరస్వతి కి మొల్లరామాయణం కంఠహారం అని చెప్పవచ్చు.