ఎక్కడున్నాయ్  మన జగన్నాధ రధ చక్రాలు ?

కథ

         పద్మావతి నీలంరాజు

“పతితలారా , భ్రష్టులార  బాధాసర్ప ద్రష్టులార

ఏడవకండేడవకండి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాధ రధ చక్రాలు” శ్రీ శ్రీ నవసమాజం నిర్మించబడుతుంది అన్న ఆశతో కోట్లమంది ప్రజలు   ఎదురుచూస్తూనే    ఉన్నారు. కానీ ఆ ఎదురుచూపులు ఎదురుచూపులుగానే  మిగిలిపోయాయేమో అనిపిస్తుంది. బాధాసర్ప ద్రష్టులు పెరిగి పోతూనే ఉన్నారు. సమస్యల తరంగాలు మాత్రం ఎప్పటికప్పుడు ఎగసిపడుతూనే ఉన్నాయి. ఆ జగన్నాధుడు కదలివస్తాడన్న నమ్మకం తో ఆర్తుల, అన్నార్తుల చేతులు జోడించి చూస్తున్న  ఎదురుచూపులు కూడా అలానే ఉన్నాయి.

******************************

కారు మబ్బులు కమ్ముకోనున్నాయి. 80 కిలోమీటర్ల వేగంలో గాలి వీ స్తున్నది.  ముందుకు సాగాల్సిన బండి వెన్నకి పోతున్నది. నర్సయ్య బండి లాగా లేక పోతున్నాడు.

“ఒసేయ్! రత్తాలు  కాసంత బండి దిగి బెగ తొయ్యి. చటుక్కున ఇంటికాడకు పోవచ్చు” అన్నాడు.

“పిల్లగాడు ఒళ్లోనే తొంగోని ఉన్నాడు మావ, ఈడి  నెట్ల ఇడిసిపెట్టేది.”  

“పర్లేదు అమ్మి. ఆడి ని బండిలోనే పండబెట్టి బేగి దిగు.  తుఫానల్లే ఉంది, ఇప్పట్లో తగ్గేటట్టు లేదు”. అన్నాడు తలను కాస్త బండిలోంచి బయటికి పెట్టి చూస్తూ.

 “అవునయ్యా. నాకు శాన భయమేస్తావుంది. మనల్ని  ఈ రాతిరేలా ఈ బసవడు లాక్కుపోగలడంటావా “అనుమానం భయం కలగిలిసిన బెంగతో రత్తాలు  అన్నది.

“సూద్దాము లేవే ! అంత బెంగ పడమాకు”అంటూ తా నే బండి దిగి , బసవ వీపుని చరిచి “బసవ పోగలమంటావా”? అంటూ బండిని తోయడం మొదలుపెట్టాడు. అది చూసి రత్తాలు  తన ఒళ్ళో నిద్దర పోతున్న బిడ్డని బండిలోపల పడుకోపెట్టి, బండి దిగింది నర్సయ్యకి సాయం చేయడానికి.  

ఆ రోజు సంతలో ఉల్లిపాయలు అమ్ముకొని వచ్చిన కొంత రాఖం చేతబెట్టు కొని పట్నం కూరల సంత నుండి కాస్త పొద్దుకూకినాకనే బయలుదేరారు నర్సయ్య, రత్తాలు . వాళ్ళతో వాళ్ల  బిడ్డ  ఆరేళ్ళ రంగడు కూడా ఉన్నాడు. రంగడు ఆరోజు అయ్యా కాడ  కొన్ని పైసలు తీసుకొని గులాబీరంగు  పీచుమిఠాయి కూడా కొనుక్కొని తిన్నాడు. రత్తాలు తెచ్చిన జొన్న రొట్టెలు, రాగి సంకటి తోనే వాళ్ళ భోజనం అయిందనిపించారు.

ఆ రోజు రేడియో వార్తల్లో గుజరాత్ లో చెలరేగిపోతున్న బిపారిజోయ్ తుఫాన్ గురించి వార్తలు వస్తున్నాయి. మన కాడ అంతలా ఉండదులే  రాతిరికల్లా కొంపకెళ్ళిపోతాములే అన్న ధీమాలో చాల మంది  కూరలమ్మే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి నర్సయ్యకుడా చాల సేపు అమ్ముకొంటు కూర్చునే ఉన్నాడు . గాలి తిరగడం మొదలవగానే వె ళ్లిపోదామని త్వరపడ్డాడు.  

నర్సయ్య పట్నానికి దగ్గరలోనే  అంటే  ఆరు మైళ్ళ దూరంలోఉన్న, వేదుళ్లపల్లి లోనే ఉంటాడు. కొన్నిసార్లు కనకాంబరాలు, మల్లెపూలు అమ్ముకొంటాడు. రత్తాలు కూడా  ఇల్లిల్లు తిరిగి పండించిన కొన్ని కూరగాయలు, పూలు అమ్ముకొస్తుంది. చాల ఎళ్ల  తరువాత వాళ్ళకి రంగడు కలిగాడు. వాడిని చాలా మురిపెంగా చూసుకుంటారు. దగ్గిరలోనే ఉన్న జడ్పీ పాఠశాలలో కూడా వేశారు. ఇప్పుడు వాడు రెండోతరగతి. వెదుళ్ల పల్లి సముద్ర తీరానికి చాల దగ్గరలోనే ఉంది. అందుకే ఎక్కడ వాయుగుండం వచ్చినా , ఈ చిన్నఊరు గడగడ లాడిపోతుంది. సముద్రపు అలలు వెదుళ్లపల్లి ని తాకుతాయి.

గాలి తీవ్రతరమైంది. వర్షం జోరు పెరిగింది. బసవడు బండి లాగలేక పోతున్నాడు. రోడ్డు వెంబడిగా  ఉన్న చెట్లు  గాలి ఊపుకి ఏ  క్షణమైనా పడిపోతాయేమో అన్నంత వేగంగా ఊగుతున్నాయి. చీకటి గా ఉంది. నర్సయ్యలోను, రత్తాలు లోను భయం పెరుగుతున్నది. బండి తోయలేక రొప్పుతున్నారు. ఉన్నట్టుండి మెరుపులు వస్తున్నాయి. ఆ మెరుపులవెలుగులో దారిని వెతుకుతున్నారు వాళ్ళు. నర్సయ్య చూస్తుండగానే, పెళపెళ మని ఒక పెద్ద కొమ్మ విసురుగా వీళ్ల  బండి వైపుకి దూసుకొచ్చింది.  అంతే అంతా  అంధకారం ఎం జరిగిందో ఎవ్వరికి తెలియలేదు.

*************************

తలుపులు గాలికి కొట్టుకొంటున్నాయి . భవాని అమ్మఊయల  అనాద  బాలల ఆ శ్రమంలో కేర్ టెకర్ గ పనిచేస్తున్నది. ఆ రోజు ఆమెకు రాత్రి డ్యూటీ .

“తుఫాను లాగా ఉన్నది” అనుకొంటూ కిటికీలు మూస్తున్నది. ఒకే ఒక పెద్ద హాల్ లో వేసి ఉన్న పడకల మీద పిల్లలు నిద్దర పోతున్నారు. అది అనాధ బాలల  భవనం. ఈ మధ్యనే ఈ పిల్లలందర్నీ కొత్త గ కట్టిన  ఈ భవనం లోకి మార్చారు. ఇది కాస్త ఊరికి దూరంగా వెదురు తోటలవై పు ఉంటుంది. దగ్గరలోని పట్నం లోకి వేళ్లా  లంటే కనీసం అరగంటైనా   పడుతుంది. ఒక వాచ్మాన్ , ఇద్దరు వంటవాళ్లు  కూడా ఉన్నారు .  వర్షం చాల జోరుగా పడుతున్నది. భవాని పిల్లలను చూస్తూ ఆ హాల్లోనే తన పక్క పరుచుకొని పడుకోటానికి ఉపక్రమించింది.పెద్ద పెద్ద ఉరుములు కూడా వస్తున్నాయి.

టప టప మని నీళ్లు పడుతున్న శబ్దం ఎక్కువయింది. భవాని కి నిద్దర పట్టలేదు. ఆలా సీ లింగ్ నే చూస్తున్నది. కొద్దిసేపటికల్లా , సీ లింగ్ నుంచి  నీటిబొట్లు కారడం మొదలయింది. కొద్దిసేపట్లోనే సీలింగ్ నుండి ఒకవైపు నుండి నీళ్లు కారడం ఎక్కువయ్యింది. భవాని కి ఏమి చెయాలో అర్ధం కాలేదు. స్నానా ల గదిలో ఉన్న బకెట్ తెచ్చి నీళ్లు పడుతున్న దగ్గర పెట్టింది.

గాలి వాన పోటీపడుతున్నాయి. ఇంతలో కరెంటు కూడా పోయింది. ఎదో తెలియని భయం తో భవాని పిల్లల్ని లేపి నీళ్లు కారని వైపు   తీసుకెళ్లి కూర్చోపెట్టింది. అలా  చిన్నాని ఎత్తుకొని తీసుకొస్తుండగానే ,కటకటా మని శబ్దంచేస్తూ బాగా నానిపోయిన కొంత సీలింగ్ పెళ్ల లు పెళ్ల లు గా విరిగిపడిపోయింది. ఒక పెద్ద సిమెంట్ పెళ్ల భవాని భుజం మీద పడింది. ఆమె నొప్పితో పెద్దగా అరుస్తూ చిన్నాని కిందకు వదిలేసింది. దబుక్కున చిన్న కింద పడిపోయాడు. ఇంకో రెండు పెళ్ల లు వారిమీద పడడంతో, అక్కడ నుంచి వాళ్ళు కదల లేక పోయారు. చూస్తుండగానే సగం సీలింగ్ కూలిపోయింది.  

చీకట్లో ఏమైందో ఎవరికీ ఏమి తెలియటం లేదు. మెరుపులోచ్చినప్పుడల్లా పడిపోయినా శకలాలు మాత్రమే కనిపిస్తున్నాయి, ఒక మూల బిక్కు బిక్కు మంటూ పిల్లలు.  వంటవాళ్లు, వాచ్మాన్ జాడ లేరు.

గాలి హోరు, వర్షం చప్పుడు తప్ప ఆ చిమ్మ చీకటిలో ఇంకేమీ  తెలియటం లేదు.

***********************

గాలి హోరు, వర్షం చప్పుడు తప్ప ఇంకేమి వినిపించడంలేదు. టైం చూస్తే రాత్రి ఎనిమిదిఅవుతున్నది. కామాక్షి ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటుంది, తాలూకా ఆఫీస్ లో టైపిస్ట్. అందరు ఉన్న ఎవరూలేని ఒంటరి తనం.  అప్పుడే మొబైల్ రింగయింది.

 “హలో “అంటూ కామాక్షి ఫోన్ ఎత్తింది.

“మేడం , నేను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను , మీ సేవింగ్స్ అకౌంట్ లో ఎదో ప్రాబ్లెమ్ వచ్చింది అని చెప్పాడు ఒకతను అటువైపు నుంచి.

కామాక్షి లో గబరాట్ మొదలైంది. ఇంత సేపు బ్యాంకులు పని చేస్తాయా అనుకొంటూ “ఇప్పుడా మా అకౌంట్స్ వెరిఫై చేసేది”అంటూ అడిగింది.

“అకౌంట్స్  తేలెవరకు బ్యాంకు పనిచేస్తుంది మేడం  . మీకొక ఓటీపీ వస్తుంది కాసేపట్లో. నేను మీకు మళ్ళి  ఫోనెచేస్తాను. నాకు  ఓటీపీ చెబితే మీ అకౌంట్ ని చెక్చేయగలుగుతాము” అంటూ చాల నిజాయితీగా చెప్పి ఫోన్ కట్ చేసేసాడు.

 పదిహేనునిమిషాల్లోనే ఫోన్ మోగింది.

 అదే వ్యక్తి  “మీకొక నెంబర్ వచ్చున్టుంది . ఆ నెంబర్ కాస్త చెప్తారా, త్వరగా “.  కామాక్షిని తొందర పెట్టాడు, అసలే వర్షం, కరెంటు కూడా పోయింది. ఇదేదో అకౌంట్ వ్యహారం. కంగారుగా కామాక్షి “రాసు కొండి” అంటూ చిన్న కాండిల్ లో “88934”అని చెప్పింది”. అంతే  వెంటనే ఫోన్ కట్ అయింది.

కామాక్షి లో భయం మొదలయింది. మనసంతా ఎందుకో ఆందోళనగా ఉంది . ఆ చీకట్లోనే కిటికి దగ్గర గ నుంచొని బయటిక్ చూస్తున్నది. మధ్యమధ్యలో వచ్ఛే మెరుపులు గాలి, వాన ఎంత తీవ్రంగా ఉన్నాయో సూచిస్తున్నాయి. ఇరుగుపొరుగు లంతా తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉన్నారు. వీధీ  దీపాలు కూడా ఆరిపోయిఉన్నాయి. ఎక్కడ నర సంచారం లేదు.

 పది నిముషాలు కాలం జరగలేదు వెంటవెంటనే కామాక్షి మొబైల్ లో   టింగ్ టింగ్ మంటూ రెండు మెసేజులు వచ్చాయి. కామాక్షి కంగారుగా మొబైల్ ఓపెన్ చేసి చూసింది,.ఒకసారి 10,000/- రేండోసారి , 15,000/- ఆన్లైన్ షాపింగ్ కు ఆన్లైన్ పేమెంట్ జరిగినట్లు బ్యాంకు మెసేజ్.

కొద్దిసేపు ఏంజరిగిందో ఆమెకు అర్ధం కాలేదు. అర్ధమైన తరువాత కుప్పకూలిపోయింది. ఎందుకంటే ఆమె బాంక్  బ్యాలెన్స్ లో ఇప్పుడు  3000/- మాత్రమే ఉన్నాయి.

తుఫాన్ గాలి కానీ వర్షము కానీ ఆగలేదు, కామాక్షి కన్నీళ్లు ఆగటం లేదు. ఎవ్వరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియని అయోమయం బాధ . బయట ప్రకృతి విలయతాండవ చేస్తున్నది. ఆలా పొట్ట లోనే తన కా ళ్ళు ముడుచు కొని తనలో తానే రోదిస్తూ ఒంటరిగా ఆ చీకట్లో అలాగే పడుకుండి పోయింది ఆమె.  

***********************

తెల్లవారు జాముకి గాని తుఫాను తీవ్రత తగ్గలేదు. కొద్దీగ వెలుతురు రావడం మొదలయింది, . ఎర్రగా మెరిసిపోవాల్సిన సూరీడు మొఖం చాటేసి నట్టుగా, మబ్బులోనే ఉన్నాడు.  ఊరువా డ అంత భీభత్సంగా మారిపోయాయి. పోలీసులు రంగం లోకి దిగారు. మున్సిపాలిటీ వర్కర్స్ కూడా రోడ్ మీద తిరుగుతూ రోడ్ మీద పడిన చెట్లను తొలిగిస్తున్నారు, రెండు అంబులెన్సులు ఊరంతా తిరుగుతున్నాయి.

హై వే మీదుగా చెకింగ్ కు బయలుదేరిన ఒక పోలీస్ జీప్, చెట్టు కొమ్మకింద మనుసులున్నట్లు గమనించి అక్కడ ఆగింది. వెంటనే, ఇద్దరు వర్కర్స్ వాళ్ళతో పాటు వాన్ దిగారు. ఎసై గారు పురమాయించటంతో, వాళ్ళు కొమ్మను పక్కకు లాగి నిలబడ్డారు. ఎసై గారు అంబులెన్సు కు ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేసి , ఆ ఇద్దరు వర్కర్స్ ని అక్కడే నిలబడమని, అంబులెన్సులో ఆ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించమని చెప్పి , మిగిలిన బృందం తో ముందుకు వెళ్లారు.

ఆ ఇద్దరి లో ఉన్న ఒక యువకుడు  నరసయ్య  దగ్గరగా వచ్చి ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తూ , ఈయనకింకా ఊపిరి ఉందిరా, “ఆ యమ్మిని . ఆ పిల్లాడ్ని సూడు”,  అంటూ పురమాయించాడు .  రెండో వాడు అలాగే చూసి, వీళ్లకు కూడా ఊపిరాడుతున్నది, స్పృహ లేదంతే అంటూ  అవతలికి జరిగాడు. . మొదటి వాడు  నరసయ్యను ఇవతలకు లాగుతుండగా, నర్సయ్య జేబులోంచి ప్లాస్టిక్ సంచీలో ఉండగా చుట్టిన కొన్ని యాభైలు, పదుల నోట్లు కనిపించాయి. అంతే గుట్టు చప్పుడు కాకుండా ఆ పొట్లన్నీ తన నిక్కరు జేబులోకి తోసేసాడు.  మగతలో ఉన్న రత్తాలు కి అది కంట బడింది కానీ నోరెత్త లేక పోయింది. మూగగా కన్నీరు కార్చడం తప్ప దేవుడా ఏంటిలా చేసావు!” అని. .    

******************

అనాధాశ్రమ్ చుట్టూ చాల మంది చేరారు . స్పృహ లేకుండా తీవ్రంగా గాయాలయిన భవానిని, ఆ చంటోడిని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ఆ అంధ పిల్లలందరిని తుఫాన్ షెల్టర్ కి చేర్చడం మొదలుపెట్టారు  కానీ ఒక్కరు కూడా ఆ కూలిపోయిన భవనం గురించి మాట్లాడం లేదు. ఆ భావన నిర్మాణం ఆలా ఎలా జరిగిందని ఎవరు ప్రశ్నించడం లేదు. కలెక్టర్ గారు హడావిడిగా వచ్చి జరుగు తున్న సర్వీస్ ని చూసి మరొక చోటికి పరిశీలనకు వెళ్లి పోయారు.  న్యూస్ రిపోర్టర్స్ మాత్రం అక్కడ జరుగుతున్న పని గురించి చెబుతున్నారు, ఆ కూలిపోయిన భవనము ను  ఒకే పనిగా టీవీ లో చూపిస్తూ.

టీవీ వార్తలను  చూస్తున్న ఒక పెద్దాయన  “అంతా  కలియుగం, ఎంత ఘోరం. దేవుడు లేడు. ”  అంటూ కాఫీ  చప్పరిస్తున్నాడు.

*****************

తెల్లవారుతూనే కామాక్షి హడా విడిగా వెంకటేశానికి ఫోన్ చేసి రాత్రి జరిగినదంతా చెప్పింది. వెంకటేశం ఆమెతో పాటె తాలూకా ఆఫీస్ లో స్టెనో.

“మీరు తొమ్మిదికల్లా రండి కామాక్షి గారు మనం బ్యాంకు వాళ్లకు కంప్లైంట్ చేద్దాం. వీలయితే పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ రాయిద్దాం “.

త్వరగా పనులుముగించుకొని ఆఫీస్ కి పరిగెత్తింది కామాక్షి .  బ్యాంకు కి వెళ్లారు,

“ఇది మేము ఏమి చెప్పలేము మేడం . ఈ మధ్య ఇలాటి సైబర్ నేరాలు బాగా జరుగుతున్నాయి . ఇది కనిపెట్టే టెక్నాలజీ మా దగ్గిర లేదండి” అంటూ చేతులు దులిపేసుకున్నాడు .

పోలీస్ స్టేషన్ లోను అదే పరిస్థితి  ఎదురయింది. సైబర్ క్రైమ్ డిటెక్షన్ సెల్ వాళ్ళకి మీ కంప్లైంట్ పంపుతాము అని అన్నారు తప్ప , ఆ డబ్బులు తిరిగొస్తాయన్న భరోసా ఎవ్వరు ఇవ్వ లేక పోయారు. నిస్త్రాణము గా వెన్నక్కి బయలు దేరింది “భగవంతుడా ఏమిటిలా చేసావు , మా వాడి ఫీజు నెల కట్టాలి ఇప్పుడు “ అని ఆ కనిపించని భగవంతుడి డి మీద ఆశ చావక  దారిలో బాబా గారి గుడి లోకి వెళ్లి అయన విభూతి పెట్టుకొని ఆఫీసు కి తిరిగేళ్లయింది.

***********************

ఇలా ఎన్నో ఎన్నెనో ప్రతి రోజు మన కళ్ళ ముందు జరుగు తూనే ఉన్నాయి.కొద్దిరోజుల తరవాత తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలను మరిచిపోవడానికి ప్రయత్నిస్తారు నిస్సహాయంగా.  కానీ అమాయకంగ మాత్రం ఎవరో వస్తారు, ఎదో చేసేస్తారు అంత బాగుపడిపోతుందన్న పిచ్చ్చి నమ్మకంతో ఉంటారు  . .  ఆ నమ్మకమే నడిపిస్తున్నదేమొ !.

 “మరి  ఎక్కడున్నాయొ   మన జగన్నాధ రధ చక్రాలు ? ఎక్కడ  ఆగిపోయాయో ?  

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దేవుడే గెలిచాడు

నానీలు