మాకన్నులు నిను కళ్ళారా చూసినది మొదలు
నీవే మా ప్రపంచమై కదులుతోంది మా కాలం….
ఉదయపు రెప్పల వాకిలి తెరవగానే
హాయిగా నిదరోయే నీఅందాలమోము పై
నా ప్రేమనంతా ఓముద్దుగా కురిపించితేనే గాని
నామనసుకు తెల్లారకపోయేది….
మాకండ్ల పంటవై నీవెదుగుతూ
నీ లక్ష్యం వైపు అడుగులిడుతూ సాగే వేళ
నిను వీడే క్షణాలు మమ్మెంత నరకయాతనకు గురిచేస్తాయో మేమూహించలేము…
రెక్కలొచ్చిన పక్షివై నీవెగురుతూ ఈ అమ్మానాన్నలపై నీవు కురిపించే చల్లనిప్రేమే
మమ్మల్ని కడదాకా ఆనందంగా సాగేలా ఊతమిస్తుంది నాన్న….
నీవనుకున్న నీజీవితం
ఏ ఒడిదుడుకులు లేకుండా రహదారిలా సాగుతూ
ఎన్నో అందాల పూలతరువుల స్నేహహస్తాలు నీకు నీడనివ్వాలని…
నీగమనం నిలువెత్తు విజయానికి ప్రతీకగా వేవేల దీపకాంతులతో భాసిల్లాలని మనసారా దీవిస్తూ….
ఎల్లప్పుడూ మా పంచప్రాణాలు
నిండైన ఆశీస్సుల కాంతి తరంగాల రక్షణ వలయాలై
నీ చుట్టూ తిరుగాడుతూనే ఉంటాయి కన్నా…
అప్పుడప్పుడూ నీవొచ్చిపోతూ మాకు మిగిల్చే జ్ఞాపకాలలో మునిగితేలుతుంటామిక
మా ఆయివులు వాయువులలో కలిసే వరకు…