సుజిత్, వంశీ స్కూల్ బస్ దిగి కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరారు. సుజిత్ బెల్ కొట్టబోతూఉండగా వంశీ తల్లి కృష్ణవేణి వచ్చి “సుజిత్…ఇదిగో మీ బామ్మ గారు నీకు తాళం చెవి ఇమ్మన్నారు. ఆవిడ బయటికెళ్ళారు. డైనింగ్ టేబుల్ మీద పాలు, తినటానికి స్నాక్స్ పెట్టారుట. నువ్వు అవి పూర్తి చేసే లోపే వచ్చేస్తానన్నారు” అని చెప్పారు.
“ఈ టైం లో ఎక్కడికెళ్ళిందబ్బా బామ్మ?” అనుకుంటూ కాళ్ళూ చేతులు కడుక్కుని స్కూల్ బట్టలు మార్చి పాలు తాగేసి షటిల్ ఆడుకోవటానికి బయలుదేరుతుండగా, బామ్మ హడావుడిగా వచ్చింది.
“బామ్మా..నేను పాలు తాగేశాను. షటిల్ ఆడుకోవటానికెళుతున్నా” అని చెప్పి వెళ్ళిపోయాడు సుజిత్.
మరునాడు సుజిత్, బామ్మ ఇంచుమించు ఒకేసారి వచ్చారు.
అలా వారం గడిచాక, ఒక రోజు సుజిత్ కంటే ముందు వచ్చిన బామ్మ అతను స్కూల్ నించి వచ్చేసరికి తలుపు తీసి బయటే నిల్చుంది.
“ఓహ్ బామ్మా నువ్వింట్లోనే ఉన్నవా? రోజూ ఎక్కడికెళుతున్నావ్” అనడిగాడు.
కళ్ళు పెద్దవి చేసి, మొహం వెలిగిపోతూ ఎవరైనా వింటారేమో అని బామ్మ చుట్టూ చూస్తూ రోజూ తనెక్కడికి వెళుతున్నదో సుజిత్ చెవిలో రహస్యంగా చెప్పింది. “ఎవరికీ చెప్పకు. అందరినీ ఆశ్చర్య పరుద్దాం! సరేనా?” అన్నది.
సుజిత్ తలూపి బామ్మని అభినందన పూర్వకంగా హత్తుకుని, వదిలేసి ఆడుకోవటానికి వెళ్ళిపోయాడు.
@ @ @ @ @
బాగా తలనొప్పిగా ఉండి, మధ్యాహ్నం త్వరగా వచ్చేసింది సుజన. తన దగ్గర ఉన్న కీ తో తలుపు తీసుకుని లోపలికొచ్చి, ఇల్లు నిశ్శబ్దంగా ఉండే సరికి “అత్తయ్య ఎక్కడికెళ్ళారబ్బా! మధ్యాహ్నం బయటికెళుతున్నట్టు పొద్దునేమీ చెప్పలేదే! ఒంట్లో బాగాలేదా? హాస్పిటల్ కి ఏమయినా వెళ్ళారా?” అని ఆదుర్దాగా కృష్ణవేణి వాళ్ళ బెల్ కొట్టి అడిగింది.
“తెలియదు సుజనా! మూడు గం. లప్పుడు, నెల రోజుల నించి కీ మా ఇంట్లో ఇచ్చి వెళుతున్నారు. సుజిత్ వచ్చి తనే తలుపు తీసుకుని పాలు తాగి ఆడుకోవటానికి వెళుతున్నాడు” అని చెప్పింది.
వీళ్ళ మాటలు విని లోపల నించి కృష్ణవేణి కూతురు మల్లిక వచ్చి “బామ్మ గారు మొన్నొక రోజు మన ఎదురు ఫ్లాట్స్ లో ఉండే బంటి వాళ్ళ తాతగారితో కలిసి వస్తూ కనిపించారు. సరుకులకో, కూరలకో వెళ్ళుంటారనుకున్నాను. నేను ఇంటికొచ్చేసరికే బామ్మ గారు మీ ఇంట్లోకెళ్ళిపోయారు” అన్నది.
“కూరలకి, సరుకులకి ఆవిడ వెళ్ళటమెందుకు? ఆదివారం నాడు నేను, అంకుల్ వెళ్ళి తెస్తున్నాం కదా! అయినా ప్రతి రోజూ బయటికెళ్ళి తెచ్చేవేం ఉంటాయి” అని ఆశ్చర్యంగా, అనుమానంగా అనుకుంటూ లోపలికొచ్చింది.
సుజన లోపలికొచ్చాక, బామ్మ ఇంటికొచ్చింది. తలుపు ఓరగా తెరిచి ఉండటం చూసి..మనవడు వచ్చేసుంటాడు అనుకుంటూ లోపలికొచ్చేసరికి కోడలు సుజన కనిపించింది. “అప్పుడే వచ్చేశావేం? ఒంట్లో బానే ఉందా” అనడిగారు. “ఆ మాట నేనడగాలి. చెప్ప చెయ్యకుండా నెల రోజుల నించి మధ్యాహ్నం మూడింటికి ఎక్కడికెళుతున్నారు? బయట పనులు పెద్దావిడ చేత చేయిస్తున్నామని అందరూ మా గురించి ఏమనుకుంటారు? బంటి వాళ్ళ తాతగారు కూడా మీతో వస్తున్నారుట..ఎదురింటి మల్లిక చెప్పింది” అన్నది.
సుజన తన పాటికి తను మాట్లాడుతుంటే, తనకేం సంబంధం లేనట్లు లోపలికెళ్ళి కాళ్ళు కడుక్కుని వచ్చి “టీ కలపనా” అనడిగారు. “అడిగిన దానికి జవాబు చెప్పరా? వస్తూ రోడ్డు దాటేటప్పుడు ఏ యాక్సిడెంటో జరిగితే మీ అబ్బాయి నన్ను కేకలేస్తారు” అన్నది.
అలా గద్దించినట్టు అడిగేసరికి బామ్మ గారు మనసు కష్టపెట్టుకుని బాధగా బయట మెట్ల మీద కూర్చున్నారు. స్కూల్ నించి వచ్చిన సుజిత్ బామ్మ అక్కడ కూర్చోవటం కనిపించి, ఏం జరిగిందని అడిగి తను కూడా బ్యాగ్ అక్కడే పడేసి బామ్మ పక్కనే కూర్చున్నాడు.
పిల్లవాడు ఇంకా రాలేదేంటని చూడటానికి బయటికొచ్చిన సుజనకి ఇద్దరూ మూతులు ముడుచుకుని అక్కడ కూర్చుని కనిపించారు. “బాగుంది సంబరం! అంటే తప్పు. ఏం చేస్తున్నారో చెప్పరు! వాడిది బాల్యం, మీది రెండో బాల్యం! ఉక్రోషాలకేం తక్కువ లేదు” అన్నది.
“నువ్వు బామ్మనేమన్నావ్? బామ్మ నా ఫ్రెండ్! ఆవిడని ఏమన్నా అంటే నీతో మాట్లాడను. చూడు పాపం ఎలా చిన్నబుచ్చుకుందో” అన్నాడు సుజిత్.
@ @ @ @ @
టెంత్ క్లాసులో స్కూల్ ఫస్ట్ వచ్చిన శకుంతల ఇంటర్మీడియెట్ చదువుతూ ఉండగా, ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేశారు. నలుగురి పిల్లల మధ్యలో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన శకుంతలకి, కుటుంబ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం లేదు మరి!
స్వతహాగా ఉన్న తెలివితేటలు చురుకుదనంతో ఉమ్మడి కుటుంబాన్ని సమర్ధంగా నడిపి ఇద్దరు ఆడపడుచుల పెళ్ళిళ్ళు చేసి, ఇద్దరు మరుదులని చదివించి ప్రయోజకులని చేసింది.
తన పిల్లలు జీవితంలో స్థిరపడి, బాధ్యతలన్నీ తీరాక..చిన్నప్పుడు చదువుకోలేక పోయాననే అసంతృప్తిని నెరవేర్చుకోవటానికి ఇంటికి దగ్గరలో ఉన్న కంప్యూటర్ సెంటర్ లో చేరి ఎమ్మెస్ ఆఫీస్, ఎక్సెల్ నేర్చుకుంటూ …తనకంటూ ఒక ఐడి క్రియేట్ చేసుకుని కూతురుకి మెయిల్స్ ఇవ్వటం, యూ ట్యూబ్ లో తను చేసే వంటలు లోడ్ చెయ్యటం నేర్చుకున్నది.
మనవడికి అవసరమైన స్టడీ మెటీరియల్ నెట్ లో వెదికి డెస్క్ టాప్ మీద పెట్టి వాడి ప్రాజెక్ట్ వర్క్ కి సహాయం చెయ్యాలనే తాపత్రయం లో ఉన్న శకుంతలని కోడలు నిగ్గదీసి అడిగేసరికి ఉక్రోషం వచ్చింది.
ఆఫీస్ నించి ఇంటికొచ్చిన కొడుకు రఘు, అమ్మ చిన్నబుచ్చుకున్న మొహం చూసి సుజనని అడిగాడు.
మధ్యాహ్నం నించి జరుగుతున్న ప్రహసనం అంతా చెప్పింది.
“దానికంత రాద్ధాంతం ఎందుకు” అని “అమ్మా నువ్వొక్క దానివే బయటికెళితే ఏ యాక్సిడెంట్ అయినా జరుగుతుందని భయపడుతోంది. ఇంతకీ ఎక్కడికెళుతున్నావ్” అని లాలనగా అడిగాడు.
శకుంతల కొడుకు లాప్ టాప్ తీసుకుని తన ఐడి ద్వారా కూతురుకి ఇచ్చిన మెయిల్స్, తన ఫైల్ లో ఆవిడ కుటుంబ నెలవారీ ఖర్చులు తయారు చేసిన ఎక్సెల్ షీట్…కొడుకు కొత్తగా కొనాలనుకుంటున్న “విల్లా” కి తను తయారు చేసిన బడ్జెట్ చూపించేసరికి, రఘుకి నోట మాట రాలేదు.
“ఎప్పుడు నేర్చుకున్నవమ్మా ఇవన్నీ? ఈ వయసులో మేమే తడబడుతున్నాం! అద్భుతం.. నీ దగ్గర మేం చాలా నేర్చుకోవాలి” అని ఇప్పుడర్ధమయిందా అమ్మ మధ్యాహ్నాలు ఎక్కడికెళుతున్నదో, ఏం చేస్తున్నదో అన్నట్టు భార్య వైపు చూశాడు రఘు.