అరుణిమ సిన్హా ఓ పడి లేచిన కడలి తరంగం

“ఇసుక తిన్నెలెదురైనా ఏ గిరులు తిరిగి పొమ్మన్నా లోయల్లో దిగిపోయినా పాయలుగా విడిపోయినా ఆగిపోదు నీ నడక ఆ గమ్యం చేరేదాకా తరంగిణి ఓ తరంగిణి”

గుండెల నిండా ఊపిరి నింపే ఇటువంటి స్ఫూర్తిమంతమైన పాటలు వింటున్నప్పుడు కొన్ని విలక్షణమైన వ్యక్తిత్వాలు , కొంతమంది విశిష్టమైన వ్యక్తులు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటారు.
అటువంటి విశిష్టమైన వ్యక్తులలో అరుణిమ సిన్హా ఒకరు .

దుండగుల దురాగతంలో తన కాలును పోగొట్టుకున్న జాతీయస్థాయి వాలీబాల్ మాజీ క్రీడాకారిణి అయిన వీరు తమ 25 వ. ఏట ప్రపంచంలోని అత్యున్నత శిఖరమైన ఎవరెస్టును అధిరోహించిన భారత దేశపు మొట్టమొదటి దివ్యాంగ మహిళ.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం , అంబేద్కర్ జిల్లాలోని ఒక గ్రామంలో 1988 జూలై 20 వ . తేదీన అరుణిమ సిన్హా జన్మించారు తండ్రి సైనిక శాఖలో , తల్లి వైద్య శాఖలో ఉద్యోగులు . వీరికి ఒక సోదరుడు ఒక సోదరి ఉన్నారు . బాల్యం నుండి వాలీబాల్ క్రీడ పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు, వ్యాయామ ఉపాధ్యాయుని ప్రోత్సాహంతో వాలీబాల్, ఫుట్ బాల్ క్రీడల్లో చక్కని ప్రతిభను కనబరిచి , అనేక విజయాలు సాధించి , పథకాలను కూడా పొంది జాతీయ జట్టులో స్థానం సంపాదించారు . క్రీడల్లో ఉన్న నైపుణ్యానికి చదువును జతప రిస్తే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయన్న ఉద్దేశంతో ఎం. ఏ. పూర్తి చేసి ఆ తర్వాత ఎల్. ఎల్.బి. కూడా చేశారు .ఎల్.ఎల్.బి చేస్తున్న రోజుల్లో ఆర్మీలో ఉద్యోగ నియామకం కోసం దరఖాస్తు చేయగా అందులో జన్మ తేదీలో కాస్త తప్పు దొరలడం జరుగగా, ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారులు సవరిస్తారన్న సలహాతో 2011 ఏప్రిల్ 11 న. లక్నోకు రైలులో బయలుదేరారు.

ఆ రైలు ప్రయాణమే వీరి జీవితాన్ని పెను విషాదంలోకి నెట్టివేసింది. లక్నో నుంచి ఢిల్లీకి ‘పద్మావతి ‘ ఎక్స్ప్రెస్ జనరల్ కంపార్ట్మెంట్లో వీరి ప్రయాణం సాగుతూ ఉండగా బరేలి సమీపానికి రైలు చేరగానే ముగ్గురు దొంగలు హఠాత్తుగా ఆమె మెడలోని బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించారు . బహుశా సైనిక నేపథ్యం రక్తంలో ఉండడం కారణంగానేమో ఈమె వారిని తీవ్రంగా ప్రతిఘటించడంతో దుండగులు రైలు నుంచి ఆమెను కిందికి తోసేశారు. ఆమె పక్క ట్రాక్ పై పడ్డారు. ఆ సమయంలో ట్రాక్ పై రైలు వస్తోందని ఆమె గమనించేలోపే రైలు రావడం , కుడికాలు పైనుండి దూసుకెళ్ళడం అన్నీ రెపపాటులో జరిగిపోయాయి . ఆ రాత్రంతా ఆమె రక్తమో డుతూ రైలు పట్టాల పైనే పడి ఉన్నారు. తెల్లవారాక సమీప గ్రామస్తులు ఆసుపత్రిలో ఆమెను చేర్పించారు. ఆ రాత్రి 49 రైళ్లు ట్రాక్ ను దాటినట్లుగా తెలిసింది. ఆ ప్రమాదంలో కుడికాలు తొడ ఎముక తీవ్రంగా దెబ్బతినడం, వైద్యులు మోకాలు కింది భాగాన్ని తొలగించడం అన్ని క్రమక్రమంగా జరిగిపోయాయి. వైద్య సదుపాయాలు అంతగా లేని ఒక స్థానిక ఆసుపత్రిలో మత్తు మందు లేకుండా శస్త్ర చికిత్సను అనుభవించిన దుర్భర స్థితి.

అప్పటి కేంద్ర యువజన క్రీడా శాఖ మంత్రి ‘ అజయ్ మకేన్ ‘ రెండు లక్షల నష్టపరిహారం , ఉద్యోగం ప్రకటించారు. భారతీయ రైల్వే సంస్థ ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించింది.

2011 ఏప్రిల్ 18వ తేదీన ‘ఆలిండియా మెడికల్ సైన్సెస్ ‘ లో చేరడంతో పూర్తిగా కోలుకోవడానికి నాలుగు నెలల సమయం పట్టింది.

పోలీసు శాఖ ఈ ప్రమాదాన్ని మొదట ఆత్మహత్యగా అనుమానించింది . కానీ దాన్ని వీరు తీవ్రంగా ఖండించారు.

ఈ సంఘటన జరిగిన తర్వాత సమాజమంతా ఈమెపై సానుభూతి చూపడం మొదలుపెట్టారు. వజ్ర సంకల్పంతో దూసుకెళ్లే మనస్తత్వం ఉన్నవాళ్లు సానుభూతిని ససేమిరా భరించరు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది భరించలేని వీరు జీవితంలో ఏదైనా సాహస కార్యం చేయాలని ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చారు . దానిలో భాగంగానే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలన్న నిర్ణయం తీసుకోవడం ,దీనికి వీరి సోదరుడు మరియు శిక్షకుని సహకారము మెండుగా ఉండడంతో ‘టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్’ లో సభ్యురాలుగా చేరి శిక్షణ తీసుకోవడం జరిగింది.

ఉత్తర కాశీలో జరిగిన శిబిరంలో ఎవరెస్టును అధిరోహించిన తొలి భారతీయ మహిళ అయిన బచెంద్రిపాల్ వద్ద అరుణిమ సిన్హా మెళకువలు నేర్చుకున్నారు . 2013 వ సంవత్సరం , మే 21వ తేదీన ఆమె ఎవరెస్టు శిఖరాన్ని ఉదయం 10 గంటల 5 నిమిషాలకు చేరుకున్నారు .ఇది Eco Everest Expedition లో భాగంగా టాటా గ్రూప్ సంస్థలు స్పాన్సర్ చేసిన కార్యక్రమం .
అరుణిమ సిన్హా జీవితం లో పెను సవాళ్లు వస్తే ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలని చెప్పే సందర్భంలో, క్రికెట్ ప్లేయర్ ఉదాహరణ ఇస్తూ,
తనకు సంక్రమించిన క్యాన్సర్ వ్యాధిని లక్ష్యపెట్టకుండా ఏదైనా సాధించి తీరాలనే తలంపుతో విజయాలను కైవసం చేసుకున్న భారత క్రీడాకారుడు యువరాజ్ సింగ్ తనకు ఆదర్శమని చెబుతారు.

అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్ లక్నోలోని అరుణిమ సిన్హా నివాసంలో ఏర్పాటైన కార్యక్రమంలో ఆమెకు 25 లక్షల చెక్కిన అందజేశారు . ఇందులో 20 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున , 5 లక్షలు సమాజ్ వాదీ పార్టీ తరఫున అందజేయడం జరిగింది . అరుణిమ సిన్హా తన కృషి , సంకల్ప దీక్షతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారని ముఖ్యమంత్రి మరియు భారత క్రీడా శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఆమెను కొనియాడారు.

అనుభవాలు నేర్పిన పాఠాలు మనిషిని ఏ వైపుగా అడుగులు కదపడానికి ప్రేరేపిస్తాయి అన్న విషయం వారి వారి ఆలోచనలను బట్టి ,వారి వారి పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది . అరుణిమ సిన్హా సమాజ సంక్షేమం కోసం తన జీవితం అంకితం చేయాలని నిశ్చయించుకొని , పేదవారికి మరియు సమర్ధులైన వారికి ఉచిత స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభించాలనుకున్నారు. అవార్డులు, సెమినార్ల ద్వారా లభించిన ఆర్థిక సహాయాలను ఆమె అదే సంస్థకు వినియోగించడం మొదలుపెట్టారు. అకాడమీకి ‘ షాహిద్ చంద్రశేఖర్ వికలాంగ్ అకాడమీ’ అని పేరు పెట్టారు.
అరుుణిమ సిన్హా’ బోర్న్ అగైన్ ఆన్ ద మౌంటెన్ ‘ అనే పుస్తకాన్ని వ్రాశారు . ఈ పుస్తకాన్ని 2014 సంవత్సరము డిసెంబర్ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.

2017 సంవత్సరంలో భారత దేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ ‘ అరుణిమ సిన్హా ను వరించింది.

భారతదేశంలో ‘ అర్జున్ ‘ అవార్డుతో సమానమైన ‘ టెన్సింగ్ నార్కే’ పర్వతారోహణ అవార్డు కూడా అరుణిమ సిన్హా కు లభించింది.

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అనంతరం అరుణిమ సిన్హా 7 ఖండాల్లోని ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు . 2014 సంవత్సరం నాటికి ఆసియా , యూరప్, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా , ఆఫ్రికా , ఉత్తర అమెరికాలో ఆరు శిఖరాలను అధిరోహించారు. రష్యాలోని 5, 642 మీటర్లు (18,510 అడుగులు) ఎత్తుగల మౌంట్ ఎల్బర్స్ (యూరప్ ) శిఖరాన్ని
, టాంజానియా (ఆఫ్రికా) లోని 5, 895 మీటర్లు ( 19,341 అడుగులు) ఎత్తుగల కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు . విన్సన్ పర్వతాన్ని అధిరోహించిన ప్రపంచంలోని మొట్టమొదటి దివ్యాంగ మహిళగా చరిత్ర సృష్టించారు.

కాలును కోల్పోయి అనుభవించిన శారీరక వేదన కంటే రైలు ప్రమాదాన్ని ఆత్మహత్యగా భావించడం తనను తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందని , సమాజం తనపై జాలి చూపించడం తనను తీవ్రంగా కలిసి వేసిందని , ఏదైనా సాధించి తీరాలన్న సంకల్పానికి అదే బీజం వేసిందని చెబుతారు అరుణిమ సిన్హా!

సింహం ఆకలితో చావనైనా చస్తుంది గాని గడ్డి మేయదు అన్న చందంగా ఆత్మగౌరవం మెండుగా ఉన్న ఇటువంటి మనుషులు జాలిని , చిన్న చూపును ససేమిరా భరించలేరు . ఎన్ని అవరోధాలు ఎదురైనా , ఎంత ఓటమిపాలైనా మౌనంగా భరిస్తారే తప్ప ఎట్టి పరిస్థితులలోనూ బయటపడడానికిగాని , ఓటమినంగీకరించడానికిగానీ సిద్ధంగా ఉండరు. ఇటువంటి మనుషులు మన చుట్టూ అతి సామాన్యుల్లో కూడా కనిపిస్తూ ఉంటారు . ఆత్మగౌరవం అనేది స్థాయితో ఎంత మాత్రం ముడిపడిన అంశం కాదని , అది కేవలం మనసుకు మాత్రమే పరిమితమైందనే విషయాన్ని మనం చాలా సార్లు , చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం . ఇంతగా దృఢమైన వ్యక్తిత్వం సమాజంలో ప్రతి ఒక్కరికి ఉండకపోయినా , వీరిని స్ఫూర్తిగా తీసుకుంటే కొంతవరకైనా సమస్యల్ని తట్టుకొనే శక్తి అలవడుతుంది. జయహో అరుణిమ సిన్హా!!


పద్మశ్రీ చెన్నోజ్వల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వ్యాకరణం – జీవన వ్యాపారం

మహిళా స్ఫూర్తి- మహోన్నత వ్యక్తిత్వం