మనం తినే ఆహారం సురక్షితమైన మరియు అత్యంత శక్తివంతమైన ఔషధం లేదా నెమ్మదిగా పనిచేసే విషం.
ఔను నిజం. మన భోజన అలవాట్లు, మనకు మన పూర్వీకులు,తాత ముత్తాతల నుంచి జెనెటిక్ గా కూడా సంక్రమిస్తాయట.
అలాగే మన పెద్దలు మనం నివసించే ప్రదేశం యొక్క భౌగోళిక స్వరూపం, వాతావరణం మరియు అక్కడ పండే పంటలు, వీటి ఆధారంగా ఒక రకమైన ఆహార పద్దతులు ఏర్పాటు చేశారు.
కానీ ఈనాడు మనం మన చుట్టూ రకరకాలుగా ఆకర్షిస్తున్న, మనది కాని ఆహారం తింటూ, అనారోగ్యాన్ని కొంటున్నాం.
ఏం చేస్తాం, ఉరుకుల పరుగుల జీవితంలో, నిలబడి వంట చేసుకునే సమయం లేదు.
బైట ఎక్కడా మనం తినవలసిన మన భోజనం దొరకడం లేదు. ఇదే కదా సమస్య?
నేను కూడా స్వయంగా ఎదుర్కొన్న ఆ సమస్యకు
పరిష్కారంగా నేనే ఒక భోజనశాల ప్రారంభించాను మన హైదరాబాద్ నగరంలో.
నా పేరు విద్యుల్లత. 20 సంవత్సరాలకు పైగా వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో ఆంగ్ల భాష బోధకురాలిగా పని చేసాను. ఒక సమయంలో ఆ ఉద్యోగం విరమణ చేశాను.
బోధన తర్వాత నాకు అంతే ఇష్టమైన మరొక అంశం వంట. అందుచేత ” కడుపునిండా” అనే పేరుతో ఒక క్లౌడ్ కిచెన్ ప్రారంభించాను. ఆర్థిక లాభాపేక్ష ప్రధాన ధ్యేయంగా కాక, మంచి ఆరోగ్యకరమైన ఆహారం పది మందికీ అందించే ఉద్దేశంతో నేను ఇది ఆరంభించాను.
నా ఈ ఆహారశాలలో, మన ఇంటి వంట, అమ్మ చేతి వంట లభ్యమౌతుంది.
నాణ్యమైన పదార్థాలు వాడుతూ, అదే సమయంలో వినియోగదారుల జేబులకు ఎక్కువ భారం కాకుండా ఉండేలా నేను నడుపుతున్నాను.
మా “కడుపునిండా” లో మనం ఇంట్లో వండుకునే
చవులూరించే చింతపండు పులిహోర
కమ్మనైన దద్దోజనం
పొగలుకక్కే పొంగలి
వంటివే కాక రోజూ భోజనం లోకి కావలసిన
పప్పు, కూర, సాంబారు, రోటి పచ్చడి వంటివి వండిస్తాను.
బొబ్బట్టుకి తోబుట్టువులాంటి బెల్లం చపాతీ మా ప్రత్యేకత.
ఇంకా ఆంధ్రమాత – ఆవకాయ
శాకాంబరీ దేవి ప్రసాదం – గోంగూర
మరియు టమాటా,పండుమిర్చి,చింతకాయ, ఉసిరికాయ, అల్లం, నిమ్మకాయ, కాకరకాయ, కొత్తిమీర, ములక్కాడ పచ్చళ్ళ తో మీ ఉదరాన్ని అదరహో అనిపించే భోజనం కూడా మా దగ్గర లభిస్తుంది.
ఈ ఊరగాయలు బైట మార్కెట్ లో కొనకుండా, నాకు తెలిసిన ఒక వైశ్యుల కుటుంబం వారికి చెప్పి స్వయంగా చేయించుకోవడం తో, వారికీ వ్యాపార అవకాశం కలుగుతుంది. నేనూ నాకు కావాల్సినవిధంగా అవి చేయించుకోగలుగుతున్నాను.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉప్పల్ లో ఒకటి,
ఎస్ ఆర్ నగర్ లో మరొకటి,ఈ రెండు బ్రాంచీలు నడుస్తున్నాయి. రెండు శాఖలు కూడా స్విగ్గీ, జొమాటో ల్లో 4.3 రేటింగ్ లో ఉన్నాయి అని చెప్పడానికి గర్విస్తున్నాను.
వీలైతే త్వరలో కొండాపూర్ ప్రాంతంలో మూడవ శాఖ ప్రారంభించాలనే ప్రయత్నం.
ఐతే ఒక మహిళగా నా ఈ ప్రయాణం అంత సులభంగా ఏం జరగలేదు.వెన్నుతట్టి ప్రోత్సాహించిన వారి కంటే , భయపెట్టి, వెనక్కి లాగేవారే ఎక్కువ. థాంక్స్ టు మై అల్లుడు, నాకు ధైర్యం ఇచ్చి , నా వెనుక నిల్చుని నన్ను ముందుకి నడిపాడు. నా పిల్లల సపోర్ట్ ఎనలేనిది.
జీవితం లో ఏదైనా కొత్తగా ప్రయత్నించి తమను తాము నిరూపించుకోవాలనుకునే మహిళలకు నేను చెప్పేది ఒక్కటే. మీ పై మీకు విశ్వాసం, ఏదైనా ఎదుర్కోగలననే ధైర్యం ఇవి స్త్రీ జాతికి స్వతః సిద్ధమైన లక్షణాలు. అవి ఉండటం వల్లనే మనం ఒక బిడ్డకు జన్మనిచ్చి పెంచగలుగుతున్నాం
ఇది మర్చిపోవద్దు. జంకు గొంకు లేక ముందుకు సాగితేనే జీవితంలో గెలుపు సాధ్యం.
నా ఈ క్లౌడ్ కిచెన్ లో నేను పెట్టుకున్న ఒక రూల్ – కేవలం మహిళలకే ఇందులో ఉద్యోగం. మన చుట్టూ చాలా మంది స్త్రీలు ఆర్థిక అవసరం లో ఉంటారు. వారికి నా సంస్థ లో ఉద్యోగం కల్పించి, నాకు చేతనైనంతగా మహిళా సాధికారత దిశగా ప్రయత్నం చేస్తున్నాను.
వండేది, ఆపై ఫుడ్ ప్యాకింగ్ చేసేది, ఫోన్ లో ఆర్డర్ రిసీవ్ చేసుకుందుకి, అన్ని చోట్లా మహిళలే.
2 బ్రాంచీలు కలిపి 10 మంది మహిళలకు నేను ఉపాధి కల్పించగలగడం నా అదృష్టం గా భావిస్తున్నాను.
మహిళలకు మహిళలే శతృవులు లాంటి మాటలు అబద్ధం గా నిరూపిస్తూ, మహిళా శక్తిని ప్రపంచం గుర్తించేలా నడుచుకుంటూ, మనమంతా ఒకరికి ఒకరు గా ఉన్న రోజున ఈ ప్రపంచం స్వర్గధామం గా మారదా?
ప్రయత్నిద్దామా?
చివరగా “కడుపునిండా” ముఖ్యాంశాలు స్థూలంగా చెప్పాలంటే :
- స్వచ్చమైన తెలుగింటి భోజనం
- పూర్తి శాఖాహారం
- శుభ్రత, స్వచ్చత, నాణ్యత
- స్విగ్గీ జొమాటో ల్లో లభ్యం
మీ ఇంట్లో జరుపుకునే పుట్టిన రోజు వేడుకలు, పూజలు వంటి వాటికి ఒక 40 మందికి మించకుండా కాటరింగ్ ఆర్డర్ లు స్వీకరిస్తాము.