మనిషి మాట నేర్చుకున్నప్పటినుంచి కోటలు కట్టుకునేదాకా ఎదిగిన క్రమానికి తోడు ఎవరనుకున్నారు ? ప్రకృతి. ప్రకృతి చెప్పిన పాఠాలు కొన్ని చెప్పని పాఠాలు కొన్ని వంట పట్టించుకున్నాడు కాబట్టి, ఎక్కడెక్కడ తాను పెత్తనం అధికారం చెలాయించగలడో అక్కడ ఆధిపత్యాన్ని చూపించాడు.
ఆకాశానికి నిచ్చిన లేచాడు సముద్రం లోతులు చూశాడు. భూగోళం చుట్ట వచ్చేసాడు ఆధునికతను తన గుప్పిట పట్టుకొని ఆడిస్తున్న నాటకాలు ఇన్ని అన్ని కాదు.
మేడలు కట్టుకొని, కార్లను కొనుక్కొని, సొంత విమానాలను సిద్ధం చేసుకుని నడుపుకుంటూ, నడిపించుకుంటూ ఎంతో ముందుకు వెళుతూనే ఉన్నాడు. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో గొప్పలను ప్రదర్శిస్తూనే ఉన్నాడు.విశ్వాన్ని దున్నేస్తూ అంతర్జాల అక్షరాలను మొలిపిస్తున్నాడు. అంతా తన మాటే వినాలని ఆటాడిస్తున్నాడు. అన్నీ తనకే తెలుసు అని అందలాలెక్కేస్తున్నాడు.
అయితే , ఇవన్నీ తెలిసీ ఏదో మొండి వైఖరితో ఉంటారు జనం. వితండవాదనలతో, గుణాలమారితనం కలిగి ఉండే మానవ నైజం ఉన్నదే అది అంతుపట్టనిది.బంగారు నిధులూ, బ్యాంకు బ్యాలెన్స్ లూ ఎన్నున్నా కానీ మానవత్వం , మంచితనము,మనిషితనము అనేవి లేకుంటే ఏం సాధించినా ఏ లాభం లేదు. బతుకు ఖాతా లో పడాల్సినవి ఇవికాదు. నలుగురి ఆప్యాయత, నాలుగు మంచిమాటలు వెంట ఉండాలి.
కొందరు హంస తూలికా తల్పం పై నిద్రిస్తారు, కొందరు పట్టు పరుపుల మీద పవళిస్తారు. కొందరు కటిక నేల మీద కూడా పడుకుంటారు. నిద్ర అవస్థ లేకుండా ఉండాలి. అంతే ! మనసు ప్రశాంతతను కలిగి ఉండాలి అంతే!
ఏవేవో అకృత్యాలు చేస్తుంటారు. ఏది చేసినా కడుపుకు ఇంత కూడే తినేది. చివరికి మట్టిలో కలిసేది ఖాళీ ఒంటితోనే!
వర్తమాన వార్తలు మనసున్న వాళ్ళను కలచివేయాలి. వర్గాలుగా విడిపోయి మనుషులమని మరిచిపోయి, హత్యలూ మానభంగాలు చేయటం ద్వారా వాళ్ళు చివరకు ఏం సాధిస్తారు? నేరం ఒకరిమీద ఒకరు వేస్తున్నా నిజాన్ని గమనిస్తే అక్కడ బలయ్యింది స్త్రీ కదా! ఇంత అమానుషమా?
ఇలాంటి అన్యాయాలను అందరూ ఖండించాలి . అసమానతలు కూల్చేయాలి . కారణాలు లోలోతులనుండి వెలికి తీయాలి.
ఇకముందు ఇలాంటి వి జరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనుషుల్లో పరివర్తన వచ్చేలా అందరూ సంయమనం తో కలుపుకు పోవాలి.
ప్రకృతి నుండి నేర్చుకున్న పాఠాలు ఏంటివో, ఎలానో ఓమారు ఆలోచన చేసి, వైపరీత్యాల పరిణామాలు గుర్తుకు తెచ్చుకోవాలి . ఎటునుంచి ఎటొచ్చీ …. ఆడవాళ్ళ నే కష్టాలపాలు చేస్తున్న దుర్మార్గాలను అరికట్టాలి. బాధితులకు రక్ష, బాధ్యులకు శిక్ష ఇదే ప్రస్తుత తక్షణ కర్తవ్యం!!