అభినందన మందారమాల తాండ్రపాపారాయుడు సినిమా లోనిదీపాట. చిత్ర దర్శకులు శ్రీ దాసరి నారాయణరావుగారు.
1986 సంవత్సరంలో విడుదలైంది. ఈ పాట రచయిత శ్రీ సినారె గారు, సంగీత దర్శకులు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు, గానం కే.జే.ఏసుదాసు ,పి .సుశీల గార్లు .నాయకానాయకులు శ్రీకృష్ణంరాజు, జయప్రద గార్లు.
పాటలోకి వెళ్తే-
అభినందన మందారమాల … నాయకాగ్రేసరుడికి మందార మాలలతో ఘనస్వాగతం అంటూ నాయిక నాయకున్ని అభినందిస్తూ స్వాగతించే అందమైన సన్నివేశం. స్త్రీ జాతికీ ఏనాటికీ … స్త్రీ జాతి మొత్తం ఎల్లవేళలా స్మరిస్తూ, ఆరాధించే ఒక గొప్ప వీరాగ్రేసరులైన మీకు అభినందనల స్వాగతం అంటూ ,అతనిపై తనకు గల అభిప్రాయాన్ని ,గౌరవాన్ని, ఆరాధనను తెలియజేస్తూ- అతడు తనను వరించిన క్రమాన్ని అత్యంత అనురక్తితో ,గౌరవంతో, అద్భుతంగా వర్ణిస్తూ- అలాంటి వీరాధివీరున్ని వర్ణ రంజితపు పూల జల్లులతో సాదరంగా ఆహ్వానించగా-
వేయి వేణువులు నిన్నే పిలువగ.. ఒక్క వేణు గానంతోనే మైమరిచే మనసు ఆ దిశగా ఆకర్షితమౌతుంది.
అలాంటి వెయ్యి వేణువుల స్వర రవళులు పిలుస్తుంటే సర్వం మరచి తన్మయత్వంతో అటువైపే అనుసరిస్తారు కానీ నీ అడుగులు నా వైపే మొగ్గు చూపి నన్నుఅనుసరించాయన్న నాయకుడితో
వెన్నెల కన్నెలు నిన్నే చూడగా. .. వెన్నెల అంటేనే ఆహ్లాదం, సౌందర్యాలకు ప్రతీక .అందాన్ని వర్ణించడానికి చంద్రుడు ,వెన్నెలను ఉపమానంగా తీసుకోవడం (కావ్య లక్షణం) సర్వసాధారణం.ఒక్క వెన్నెల కన్నే ఎంతో అందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది. అలాంటి ఎంతోమంది వెన్నెల కాంతలు నిన్నే చూస్తుండగా అంటే అన్ని అందాలు నిన్నే అలరిస్తున్నాకూడా నీ మనసు నన్నే వరించడం నా అదృష్టం అంటూ నాయిక ఆనందంతో తన కృతజ్ఞతలు తెలుపుతుండగా, తిరిగి అతడు ఆమెపై తనకు గల అనురాగాన్ని, ఆప్యాయతను తెలిపే క్రమంలో-
నా గుండెపై నీవుండగా. .. నా గుండెల్లో నీవు కొలువై ఉండగా స్వర్గమే భూమి మీదకు దిగివచ్చిందా ! తుమ్మెదల వంటి కేశసౌందర్యంతో అలరారే ఓ భామినీ ! నీకివే నా అభినందనలు అంటూనే ,అందం ,వినయశీలం కలబోసిన ఓ మంజుల భాషిణీ
( మృదుభాషానిపుణా) అందుకో నా అభినందనలు అనగా –
వెండి కొండపై వెలసిన దేవర… వెండి కొండపై అంటే హిమగిరులలో కొలువైన ఓ స్వామి! మీ చల్లని కరుణార్ద్ర చూపులతో నెల (వంక) రాజు ఎంతో కాంతులీను తున్నాడంటూ పరమేశ్వరుడితో పోల్చగా అతడు స్పందిస్తూ-
సగము మేని లో ఒదిగి దేవత…
ఒళ్ళంతా చిరు సిగ్గు తొణకిసలాడగా శరీరంలో సగభాగమై ఒదిగి అలరించే ఓ దేవీ ! నీకివే నా అభినందనలు అంటూ – పరస్పర ప్రశంసలతో మమేకమైన ఆ ఇరు హృదయాల సంగమ ప్రతిస్పందనల నడుమ ఆనందతరంగపు లయాత్మకమైన నర్తనానికి అభినందనలు అంటూ అద్భుతంగా సాగిన ఈ పాటకు ప్రాణం పోసి నటించారు నాయికానాయకులు శ్రీకృష్ణం రాజు, శ్రీమతి జయప్రద గార్లు. నాయకుడి లక్షణాలన్నీ కలిగి తన గంభీర హావభావాలతో కృష్ణంరాజు గారు ,రాసిపోసిన సౌందర్యమా అన్నట్టుండే జయప్రద గార్ల అభినయ కౌశలం అత్యద్భుతం . ఏసుదాసు , సుశీల గార్లు తమగాత్ర రస ప్రవాహంతో దృశ్యానికి ప్రాణ ప్రతిష్ట గావించారు. సినారె గారు కూర్చిన అక్షర మాలికకు, సాలూరి వారి స్వరగతుల నేర్పుకు, గాయనీ గాయకుల స్వర సౌరభాల గుబాళింపుకు, నాయికానాయకుల అభినయపు జోడింపులతో శ్రీ దాసరి గారి ప్రతిభ ప్రకాశమానమై వెలుగొందిందీపాట.