“ఇన్నాళ్లకి మళ్లీ మీతో ఇలా డాబా మీద కూర్చుని కబుర్లు చెప్పే అవకాశం వచ్చింది. నిజంగా అందరూ దీన్ని మీ అదృష్టమని అంటున్నారు. కానీ నిజానికి స్వతంత్రమే మీకిది. ఆనాడు బ్రిటీష్ వాళ్ల చేతుల్లో చిత్రహింసల పాలై, చివరికి శాంతి అంటూ ఎలా విరమణ పొందారో తెలీదు కానీ… దాని తర్వాత ఆ తెల్లదొరల ఎంగిలి భాషతో పాటు,మంచివో చెడ్డవో కొన్ని కట్టుబాట్లను నాగరికతలను మాత్రం విడువలేదు మనం. అభివృద్ధి మనకు సాయంగా ఉండాలే కానీ, మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కునేట్లు కాదు.ఎప్పుడూ కోలాహలంగా ఉండే ఈ భాగ్యనగర వీధులు ఇంత నిశ్శబ్ధంతో, కాలుష్యరహిత దారులతో ఉవ్విళ్లూరిస్తుంది.” అంటూ నెమ్మదిగా నాలో నేను మాట్లాడుకుంటుంటే..
“ఎవరితో మాట్లాడుతున్నావ్ నాన్న! అమ్మ పిలుస్తుంది టీ తాగడానికి” అంటూ మను అరుపులు.
“హ..హ..! నువ్వు కూడా రా తల్లీ, ఎవరితో మాట్లాడుతున్నానో చూపిస్తా” అనగానే గబగబా నా దగ్గరికొచ్చేసి “ఎవరున్నారు నాన్న ఇక్కడ” అని అడిగింది.
సూర్యాస్తమయంలో ఆ భానుడి ఎర్రని రూపానికి, వర్షించే పూల మాదిరి గూటికి పయనిస్తున్న పక్షుల గుంపుని చూపిస్తూ “వాటితోనే మాట్లాడుతున్నాను తల్లి..!” అని చెప్పాను.
నెమ్మదిగా నా చెవిలో “ఏంటి నాన్న! పక్షులు మాట్లడతాయా?” అని గుసగుసలాడుతూ..ఆటలాడి అలసిపోయిందేమో ఈ సాయంకాలం చల్లగాలి తనకి జోలపాడుతున్నట్లు నా ఒళ్లోనే పడుకునిపోయింది.
ఈ క్వారంటీన్ వల్ల మనుషులు ఇంట్లో బందీలైపోవడంతో ప్రకృతికి విముక్తి దొరికింది. ఈ నిశ్శబ్ధాలలో నాకు ఊరు గుర్తొస్తుంది. చిన్నపుడు కొబ్బరి చెట్టు కింద మంచం వాల్చుకుని విన్న నాన్నమ్మ కథలు, ఊరి చివరి తోటలో మామిడి కాయల దొంగతనాలు, తలుచుకుంటుంటే ఎంత మారిపోయిందో అనిపిస్తుంది. డైరెక్టర్ అవ్వాలనే ఆశతో ఇంట్లోంచి పారిపోయి పట్నం పట్టాలెక్కాను. అమ్మ కొంగు చాటు పిల్లాడ్ని, నాన్న మాట జవదాటని అబ్బాయిని.అలాంటిది ఆ రోజు ఇళ్లు వదిలి వచ్చేంత ధైర్యం ఎక్కడ్నుంచి వచ్చిందో తేలీదు.కానీ నాన్నకి వ్యవసాయంలో తోడు లేకుండా అయిపోయింది. కన్నతల్లి, పెంచిన ఊరి ముందు నా ఆశే కనిపించింది.ఏదేమైనా ఒక మంచి డైరెక్టర్ అవ్వాలని అడుగుపెట్టా.
మొదట్లో అర్థమయ్యేది కాదు ఇక్కడి జనాల తీరుతెన్నులు, పలకరింపులు. అదే మా ఊర్లో అయితే రోడ్డు మీద నడుస్తుంటే అడుగడుగున ఒక్కొక్కరు పలకరించేవారు. ఏదోలా కష్టపడి ఇష్టమైన దాని కోసం, పరిగెడుతున్న ఈ ప్రపంచీకుల మధ్య నెమ్మదిగా అడుగులు వేయడం మొదలుపెట్టా. కానీ ప్రతి రోజు గుర్తొచ్చేది ఆ అవమానం. పల్లెటూరు, రైతు కుటుంబం అని పెట్టుబడులు పెట్టలేవని వేలేసిన అహంకారపు అవకాశం. అప్పుడు అనుకన్నాను…
“ఒక పెద్ద సునామీ, ఎంత పెద్దదంటే నా ఊహలకే అందనంత.సునామీ దాటికి ప్రపంచమే తలకిందులైపోయి, డబ్బుమోజు, కులవ్యవస్థ, సరిహద్దుల కుట్ర, బీద ధనిక భేదాలు.. ఇలా ప్రాణంలో సగంగా భావించే మలినపు మనుషులను మూగవాడ్ని చేసి మింగ మెతుకులేక డొక్కలు చించుకునే పరిస్థితి వస్తే కాని తెలిసిరాదని.” ఇప్పుడు అదే జరుగుతోంది.
బలం బలగాల ముందు మానవత్వం తెలిసోస్తుంది. టెక్నాలజీలు, ఆండ్రాయిడ్లు, జోమాటులు, సాఫ్ట్ వేర్లంటూ పరిగెత్తే మానవ కణాలు నాలుగ్గింజలకు కీసరిల్లుతున్నాయి.
పాలించే ప్రభువు కన్నా, పండించే రైతే మొనగాడయ్యాడు.
ఈ కోవిడ్-19 ఇంకో 19 తరాలు గుర్తుండి పోయేలా అన్నింటా మార్పుకి మూలమవుతుంది.
ఇక ఆ అవమానాన్ని అణుచుకుని మళ్లీ ప్రయత్నం మొదలు పెట్టా. నాకు తోడుగా ఉండేందుకు స్నేహితులు, బంధువులు ఎవరూ లేరు. అప్పుడు పరిచయమైంది మను వాళ్ల అమ్మ రూప. రూపుదిద్దుకుంటున్న నా బాటకి తనే ఓ రూపమిచ్చింది.చిన్నపుడే తల్లిదండ్రులను కోల్పోయిన తను ఆశ్రమంలో పెరిగి, కష్టపడి డిజైనింగ్ పూర్తి చేసి,తన ఉద్యోగం కోసం వెతుకుతుంటే…
ఆ రోజు నిజంగా నేను నక్క తోక తొక్కానేమో తను ఎదురైంది. మంచి స్నేహితురాలైంది. ఈ సిటీ వాతావరణం నాకు అలవాటు పడేలా, ఎలా బ్రతకాలో నేర్పించింది. ఇక మా స్నేహం కాస్త ప్రేమగా, ప్రేమ కాస్త పెళ్లిగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నా కష్టంలో,నష్టంలో తోడుగా ఉంటుంది. అప్పటినుంచి వచ్చే చిన్న చిన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ, చివరికి ఒక సినిమా అవకాశం వచ్చింది. ఇంతలోనే ఈ లాక్ డౌన్ ఊబిలో పడిపోయా…!
అమ్మ నాన్నల్ని వొదిలి ఏడేళ్ళయ్యింది. నా పెళ్లి గురించి,మను గురించి కూడా వాళ్లకి తేలీదు. నా సినిమా పూర్తయ్యాకే వాళ్లని కలవాలి అనుకున్నా.
కానీ ఇప్పుడున్న పరిస్థితి, నాలాగే చాలా మంది కలల్ని కట్టిపడేసుంటుంది. ఉద్యోగాలకు సిద్ధమైన యువతకు, పరీక్షలకు తయారైన విద్యార్థులకు, పెళ్లిళ్లు, పేరంటాలకు..మీటింగులు, డేటింగులకు.. వ్యాపారాలు, వ్యవస్థలకు..ఇలా ఎన్నో పనులు గిరి గీసుకుని గడపలోనే గడుపుతున్నాయి.
ఇప్పటికైనా,ఎప్పటికైనా తెలుసుకోవాల్సింది ఒక్కటే.. హద్దులు మీరితే సుద్దులు తెలుసుకోవాల్సిందే అని…
అనుకుంటూ తీక్షణమైన తలపులతో తరలిపోతుంటే, ఉన్నట్టుండి…
“సూర్య..! టైం ఎనిమిది కావస్తోంది. టీ తాగడానికి పిలిస్తే, మీ తండ్రి, కూతుళ్లు లోకం మీది వార్తలు మాట్లాడుతున్నారా.తినడానికి రెడీ చేసాను.త్వరగా రండీ” కోపంగానే మందలించి వెళ్లింది రూప.
ఏదేమైనా నా జీవితంలో ప్రేమ అనే విషయంలో నేను కృతజ్ఞుడినే. కోరుకున్న అతివ అర్థనారి అయ్యింది. అమ్మలాంటి అమ్మాయి నాకు కూతురైంది
మెలుకువ రాకుండా మనుని భుజాన వేసుకుని, ఇంట్లోకి వెళ్తున్నా…
నా జ్ఞాపకాల గనిని పూడ్చేసి,బరువు బాధ్యతల్ని తలుచుకుంటూ…