నాకు తోడు కావాలి
చిన్నారి ఆవేదన
ఆటలో పాటలో
తిండిలో తిట్టులో
కొట్టుడో కట్టుడో!!
చేతికి చెయ్యి
మాటకు మాట
వెక్కిరింపులో
కొక్కిరింపులో
నాకు ఒక తోడు కావాలి!!
ఎంత కాలము
ఈ ఒంటెద్దు పోరాటం
తిన్నా పంచుకున్నా
సరదాగా అనుకున్నా
పడుకున్నా పట్టుకున్నా
నాకు ఓ తోడు కావాలి!!
నా మనసు ఎవరికీ తెలీదు
ఎవ్వరికీ పట్టదు
ఎవరికి చెప్పాలి?
ఏమని చెప్పాలి?
ఒక చెల్లో
ఒక తమ్ముడో
నా తోబుట్టో
నా కజినో
మురిసిపోవడానికి
కలిసి ఆడుకోవడానికి
మనసులు పంచుకోవడానికి
ఊసులు చెప్పుకోవడానికి
నాకు ఓ తోడు కావాలి!!
నేను కోట్ల జనాలలో ఏకాకిని!!
నాతోటి మాటలు కావాలి
ఒక్కళ్ళని సరిగా పెంచితే చాలంటారు
మీకేమో తోబుట్టువులు కావాలి
నేనేమీ అనలేననేనా
బాగా పెంచడమంటే
ఒంటరిని చేసి ఉబుసుపోని అగాధం లో పడేయడమేనా
అంతులేని ఎడారిలో ఒంటిగా నడవమనడమేనా
ఏమో !!
అర్థం చేసుకోరు
మీ స్వార్థం మీదే కానీ
నా మనసు గ్రహించరు
నా సంగతి పట్టదా
ఇలాగే పెద్దయితే
నా లోటుకు భర్తీ లేదా?
నా బెంగకు దారి లేదా?
ఆలోచించండి!!
————–
(ఒక్కరు చాలు పిల్లలు అసలే వద్దు అనుకునే జంటకు)