రివర్స్ గేర్

15.7.23 తరుణి సంపాదకీయం

వాహన చోదకులకు ఈ ఇంగ్లీష్ పదాలు బాగా పరిచయం. బండి రివర్స్ గేర్ తీసి … ఇలా మాట్లాడటం చాలా సాధారణం. ఇదే జీవిత ప్రయాణానికి అన్వయిద్దాం.
జీవితాలలో పెళ్లి అనేది ప్రధానమైన ఘట్టం .ఆడ మగ ఇద్దరు కలిసి జీవనం సాగించేటప్పుడు ఒక పరిమితమైనటువంటి జీవితం ఉండాలి . అంటే ,ఒక ఆదర్శవంతమైన జీవితం ఉండాలి .అంటే ,పెళ్లి చేసి ఇద్దరినీ జంట చేయడం అనాదిగా వస్తున్నది. ఇది ఇద్దరి శరీరాలకు ,ఇద్దరి మనుషుల కోసం కాదు .ఈ జంట ,ఈ జత రెండు కుటుంబాలకు వారధి కూడా అవుతుంది. ఇద్దరి కుటుంబాల వాళ్ళు ,ఇద్దరి కుటుంబాల స్నేహితులు, ఇద్దరి జీవన సంస్కృతులు ఆచారాలు సంప్రదాయాలు సమాంతరంగా సాగుతూ కలిసి ప్రయాణం చేసే జీవన ప్రయాణం. అందుకే ప్రమాణాలు ఉంటాయి. ఇది మన దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో ఇదే పద్ధతి కొనసాగుతున్నది . ఒక విచ్చలవిడితనానికి కళ్ళెం వేయడానికి పెళ్లి అనేది అవసరం. అనంతసాగరానికి పరుగెత్తే , ఉజ్వల నది ప్రవాహానికి అడ్డుకట్ట గా ఆనకట్టనువేసి , నీటిని తాగునీటికి సాగునీటికి ఇతర ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగించుకునే బహుళార్థసాధక ప్రాజెక్టు వంటిది పెళ్లి. స్త్రీ పురుష సంగమం తో సంతానోత్పత్తి కలుగుతుంది. పిల్లలకు ఒక పరిమితమైన ఒక ప్రేమాన్వితమైన బ్రతుకు కలగాలి అంటే పెళ్లి తర్వాత పుట్టిన వాళ్ళకే సాధ్యం. లేకుంటే అలా పిల్లలు పుడుతూనే ఉంటారు .తల్లి మాత్రమే తెలుస్తుంది.తండ్రి ఎవరో తెలియదు. ఈ పద్ధతి ఉండకూడదు అనే విధానానికి చక్కని మార్గం చూపడానికి పెళ్లి అనేది ఏర్పరిచారు . ప్రపంచమంతా ఇదే పద్ధతి ఉంది. ఇదే మంచి పరిణామం .ఇది మన అందరికీ తెలిసిన విషయమే .ఏది కొత్త విషయం కాదు. కానీ ,ఈ మధ్యకాలంలో కొన్ని విపరీత ధోరణలు బయలుదేరింది. ప్రతిదీ వాదోపవాదాలకు చర్చలకు పెళ్లి అనే విషయాన్ని ముందు పెట్టి కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్లకు ఒక భయం కల్పిస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. దీన్నే అతి స్వేచ్ఛ గా మాట్లాడుతున్నారని విచ్చలవిడితనం ఎక్కువైనదనీ, మళ్లీ అంతా స్త్రీల మీది కే తీసుకొస్తున్నారు. కానీ అది నిజం కాదు. ఇది నమ్మించలేని పరిస్థితి. పితృస్వామ్య వ్యవస్థలో పురుషులు చేసే కట్టడి పురుషుల ఆధిపత్యం పురుషుల భావజాలం ,నిండా పిండారపోసినట్లు ఉండేటువంటి ఆనందమైనటువంటి విషయమేమీ కాదు. చాలా చాలా బాధల్లో పడవేసే బడబాగ్ని .దీన్ని గ్రహించక ఆడవాళ్లు ఆడవాళ్ళకే శత్రువులు అవుతున్నారు .ఉదాహరణకి కోడలు అత్తను అనడం అనేదాన్ని చెప్పుకోవచ్చు కోడలుగా వచ్చిన తర్వాత కోడి గుడ్డుకు వెంట్రుకలాగినట్టుగా ప్రతి విషయాన్ని వెక్కిరించడం వంటివి దూరాలను పెంచుతున్నాయి. ఎంతసేపు పెద్దలను నిందించడమేనా? పిల్లలను అనరా వాళ్ల తప్పేమీ లేదా అని ప్రశ్నకు సమాధానంగా ఈరోజు చర్చించుకుందాం.
ఆడపిల్లలు ఎంతో కష్టపడి ,బాగా చదువుకొని సమజ్జీలుగా ఎదిగినటువంటి రోజులు ఇవి. ఉద్యోగాల్లోనూ సంపాదనలోనూ కొరత లేకుండా చక్కగా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా బ్రతుకుతున్నారు . ఇది చాలా గొప్ప పరిణామం మరి ఇంతటి తెలివి ఉన్నటువంటి అమ్మాయిలు పెళ్లి విషయానికి వచ్చిన తర్వాత తనకు నచ్చినటువంటి వ్యక్తినే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భర్త అనే వ్యక్తి ఒక్కడే కావాలనుకోవడం అతని పుట్టుకకు కారణమైన, అతని ఎదుగుదలకు దోహదమైన వాళ్ళను వద్దనడం ఎంతవరకు న్యాయం? ఆ అబ్బాయికి తల్లిదండ్రులు ఉంటారు కదా అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉంటారు కదా ! అతని కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం? ఇద్దరూ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ వాళ్ళ కుటుంబాలను గౌరవించుకున్నప్పుడే పెళ్లి చేసుకున్న తర్వాత ఈ కౌటుంబిక జీవన ప్రయాణం సరిగ్గా సాగుతుంది. లేకుంటే ఈ వాహనాన్ని’ రివర్స్ గేరు’ మళ్లించినట్టే !ఎంతసేపు వెనుకకు వెళ్ళగలం? మునుముందుకు కదా పోవాల్సింది !ఎప్పుడు రివర్స్ చేసుకుంటాము? వాహనాన్ని సరిగా నిలప లేనప్పుడు,ఆ ప్రదేశంలోనూ సరైన దిశలో పోవడం లేనప్పుడు, కాస్త సేపు ఆపి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాలనుకున్నప్పుడు రివర్స్ గేర్ ని ఉపయోగిస్తాం ఇవన్నీ….ఈ రివర్స్ గేర్లు! ఈ అవరోధాలు ఈ అవమానాలు ఈ ఆటంకాలు ఇవన్నీ కూడా రివర్స్ గేర్లే!! వీటిని తెలివిగా తప్పించుకొని తెలివిగా అధిగమించాలి.మంచితనంతోనూ మానవీయ కోణంతోనూ తొలగించుకోవాలి.
వస్తాయి తేడాలు వస్తాయి గొడవలు వస్తాయి అభిమానపు ఛాయలు అడ్డు వస్తూ ఉంటాయి వీటన్నింటిని అధిగమించాలి. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్లే గొడవలు పడుతూ ఉంటున్నారు. ఇక భిన్నమైన కటుంబాలనుంచి వచ్చినపుడు తేడాలు ఉంటాయి. సహజం . వాటిని దాటి మళ్ళీ ముందుకు ప్రయాణం చేయాలని అనుకున్నప్పుడు కుటుంబాలు విడిపోకుండా చూసుకోవాలి. అప్పుడే అమ్మాయిలు ఇంత కష్టపడి సాధించిన తెలివిని చదువుని సార్ధకం చేసుకున్న వాళ్ళు అవుతారు.
దీనికి చిన్న ఉదాహరణ చెప్పుకుందాం….
ఆఫీసులో ఉద్యోగం చేసే చోట పని చేసే చోట సబార్డినేటర్ లు కానీ ఆఫీసర్స్ కానీ అఫీషియల్స్ గాని ఎన్నోసార్లు మనసును కష్టపెట్టేలా మాట్లాడుతారు. అది సబ్జెక్టు విషయమే కావచ్చు ,అది అఫీషియల్ విషయమే కావచ్చు కానీ మన తప్పు లేకున్నా ఒక్కోసారి తలవంచాల్సివస్తుంది. ఒకసారి మాట్లాడకుండా గమ్మున ఉండాల్సి వస్తుంది. మన తప్పుకాకుండా ఒక్కొక్కసారి కొంచెం బ్రేక్ తీసుకోనైనా మళ్ళీ ఆఫీసర్స్ తో ఆ సబ్బార్ నెట్స్ తో కలిసి ప్రయాణించాల్సి వస్తుంది .ఎందుకు ? ఎంత వరకు అంటే, ఉద్యోగం చేయాలి కాబట్టి ఉద్యోగం కొనసాగాలి కాబట్టి !! ఈ ఉద్యోగం వదిలేసి వేరే ఉద్యోగం లో చేరినా, వేరే job లో join అయినా అక్కడా బాసిజమ్ వుంటుంది . వీటిని జాగ్రత్తగా Overcome చేయాలి.
ఉద్యోగమే జీవితం కాదు. జీవితానికి ఉద్యోగం అవసరం. జీవితానికి అవసరమైన ఉద్యోగం కోసమే ఇంత ఆలోచించి నచ్చకున్నా కోపం వచ్చినా విసుగ్గా అనిపించినా అబ్బా అనిపించిన తప్పదా అని అనిపించిన చచ్చినట్టు చేస్తున్నారే! అలాంటిది జీవితమే పెళ్లితో కూడుకున్నప్పుడు జీవన ప్రయాణమే కుటుంబంతో ముడిపడినప్పుడు కొలీగ్స్ తోను ఏదైతే ఆఫీసర్ ఇబ్బందులు పెట్టినా , కష్టాలు ఎదురైతే చాకచక్యంగా తప్పించుకుని ముందుకు ప్రయాణం సాగిస్తున్నారో అదేవిధంగా…. అత్త, మామ, బావగారు, వదిన అంటూ ఉండే ఈ కుటుంబాల్లో ఉండే మిగతా సభ్యులతో ఏదైనా చిరాకు కలిగినా ,కష్టం కలిగినా ,అభిప్రాయ భేదాలు వచ్చినా జాగ్రత్తగా చాకచక్యంగా తప్పించుకొని మళ్ళీ మనసులు కలిసేలా మాట్లాడితే ఎంత బాగుంటుంది! భీష్ముంచుకొని కూర్చోవాల్సిన అవసరం ఉందా? ఒకవేళ నీ పొరపాటు లేదు అనుకున్న కూడా అవతలి వాళ్ళు అత్తనో మామనో ఏదైనా ఒక మాట అంటే నీ కన్నతల్లి అన్నదనుకునో,నీ కన్న తండ్రి అన్నాడనుకొనో అనుకోని భావించుకొని మనసు మీదకి తీసుకోకుండా పెద్ద మనసు చేసుకొని మళ్లీ మాటలు కలుపుకోవచ్చు కదా! దీంతోని భర్తకి ఇంకా దగ్గర అయిపోతావు. ఇంకా స్నేహం అయిపోతుంది ఇంకా ప్రేమమయం అయిపోతుంది.. జీవితం ఇంకా పూల బాటలో నడిచే నందనవనం అవుతుంది .ఇది ఎందుకు గ్రహించడం లేదు? గ్రహించాలి తప్పదు. ఉద్యోగంలోనే మనకు నచ్చని విషయాన్ని సర్దుకుపోతూ ఉద్యోగాలు చేస్తున్నామే అటువంటిది జీవితంలో ఎందుకు సర్దుకుపోకూడదు? సర్దుకు పొమ్మను అంటున్నానే తప్ప ఆత్మవంచన చేసుకోమని అనడం లేదు. బయట వాళ్ళు ఎవరో చెడుగా మాట్లాడితే పడి ఉండడాన్ని అస్తిత్వాన్ని కోల్పోతున్నామని భావించాలి గాని ఇంటి వాళ్ళు కదా ఒకవేళ పొరపాటున ఏదైనా అన్నా కూడా కాస్త ఓపికగా, మన అమ్మా నాన్న లు తిడితే పడుతున్నాం కదా పోనీలే అనుకొని వదిలేస్తే వాళ్లే మారిపోతారు. ఇంకాస్త మంచితనంతో ఉంటే సరి.
అన్ని చెప్పడానికి బానే ఉంటాయి అనుభవిస్తే తెలుస్తుంది అని కూడా అనుకోవచ్చు. మీ కాలం దాటిపోయింది కదా ఎన్నో చెప్తారు అని కూడా అంటారు. మేము శక్తివంతులు మేము యువకులం మీ కన్నా ఎక్కువ ప్రపంచాన్ని చూస్తున్న వాళ్ళం మాకు తెలియదా అని కూడా అంటారు. ఇవన్నీ నిజాలే! పెద్దతరం వాళ్ళ కన్నా ,వాళ్ళు అనుభవంతోనే చాలా నేర్చుకొని ఉంటే కొత్తతరం వాళ్ళు ఆధునిక విజ్ఞానంతోనే ప్రపంచాన్ని మొత్తం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దవాళ్లకంటే వాళ్ల పిల్లలు అయినటువంటి కొడుకు కోడలు వీళ్ళకే ఇంకా ఎక్కువ జ్ఞానం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఇంతమందిని చూస్తూ ఉన్నప్పుడు నేనెక్కడున్నాను నా భర్త ఏమిటి? నా బాధ్యత ఏమిటి నా పిల్లలు ఏమిటి అనే ప్రశ్న లు ఒక్కసారి వేసుకుంటే, కొంచెం సౌమ్యతను కూర్చుంటే అన్ని సజావుగా సాగిపోతాయి. కుటుంబాలను నిలుపుకోవాల్సిన బాధ్యత అందరిదీ. ఏ ఒక్కరిది తప్పు కాదు/ ఏ ఒక్కరి బాధ్యత కాదు. ఒక చేతితో చప్పట్లు రావు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఇలాంటి సామెతలు ఇలాంటివి పలుకుబడులు ఇలాంటి పదాలన్నీ కూడా ఎంతో ఎంతో అనుభవం నుంచి వచ్చినటువంటివి .రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు ఎంత బాగా చెప్పారు చూడండి! తప్పు ఎప్పుడూ ఉండదు, ఉన్నా తప్పు కూడా మొత్తం ఒకళ్ళదే ఉండదు. నీకు ఒక మంచి పేరు వస్తుంది నువ్వు కోడలు చాలా గొప్ప దానివి అయ్యావు అని అంటే మళ్ళీ అక్కడ కూడా కుటుంబం అంతా నీకు సహకరిస్తేనే నీకు మంచి పేరు వస్తుంది. అత్త చాలా మంచిది అంటే మళ్ళీ అక్కడ గొప్పతనం అంతా ఒక అత్తదే కాదు మిగతా కుటుంబ సభ్యులుగా కోడలు, కోడలు తల్లిగారు వాళ్లు అందరూ సహకరిస్తేనే అత్తకు మంచి పేరు వస్తుంది. ఇదంతా సహకార పద్ధతిలో సాగాల్సిన సంసార ప్రయాణం ఈ సంసార నావకి ఈ సంసారం అనే బస్సుకి ఉండవలసినటువంటి పరికరాలన్నీ కుటుంబ సభ్యులు రెండు కుటుంబాల సభ్యులు ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. కుటుంబాలనే బాగుపరచలేని వాళ్ళము కుటుంబంలోని మనుషులతోటే మంచిగా ఉండలేని వాళ్ళము బయట దేశానికి ఏం చేస్తాం? కొంతమంది బయట చాలా మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకుంటారు. కానీ సొంత భార్య దగ్గర భర్తకు భర్త దగ్గర భార్యకు మంచి ఉండదు. ఇదేంటో ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. బయటి వాళ్ళందరికీ మంచి వాళ్ళు ఇంటి వాళ్ళకు చెడ్డ వాళ్ళు ఎలా అవుతారు? ఇది ఒకసారి ఎవరికి వాళ్లు వేసుకోవచ్చండి ప్రశ్న.
This journey is beautiful journey. Find the solutions ,clear the problems. ఈ కుటుంబం అనే బస్సు నడిచిపోతున్నప్పుడు రోడ్డుమీద ముళ్ళు ఉంటే టైర్ పంచర్ చేస్తుంది, రాళ్లు ఉంటే టైర్ లను ఎక్కనివ్వవు. ప్రయాణం సాగనివ్వాలంటే బస్సు ఆపి దిగి ఆ ముళ్ళను ఆ రాళ్ళను తొలగించేసేసి మళ్లీ ప్రయాణం సాగించాలి .ముందర మొత్తం రహదారి కనిపిస్తున్నది. మనం బహుదూరపు బాటసారులం !use reverse gear and go forward.
ఈ టెక్నాలజీ వరల్డ్ లో టెక్నిక్స్ ని ఉపయోగించి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపండి. గాసిప్స్ ని మానాలి ,గాసిప్స్ ని వినద్దు. ఎవరితో పోలికలు అనవసరం ఎవరి జీవితం వాళ్ళది ఎవరు బ్రతుకు వాళ్ళది. ఒకళ్ళకైనట్టు ఇంకొకళ్ళకు జరగదు. తల్లి నొప్పులు అందరికీ వచ్చేవే! పురిటి నొప్పులు పోటీ నొప్పులేమీ కావు.ఎవరి అనుభవం వాళ్ళదే జ్వరం అందరికీ వస్తుంది. అందరి జ్వరాన్ని ఒక్క పొట్లం గా కట్టలేము .ఎవరి అవస్థ వాళ్ళదే. ఆనందం సంతోషం ఇవి కూడా అటువంటివే !కొలమానాలు లేని రుజువులు లేని ఫీలింగ్స్ ఇవన్నీ! హ్యాపీ, సాడ్ – ఈ రెండు కలిసి మనతో ఉంటాయి. కష్టం ఉన్నప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. బాధ ఉన్నప్పుడే సంతోషం విలువ తెలుస్తుంది .అన్ని సంతోషాలే కావాలి అన్ని సుఖాలే కావాలి అనుకోకుండా ఆ బాధలను ఆ కష్టాలను అనుభవిస్తూ అధిగమిస్తూ ప్రయాణించే జీవన ప్రయాణమే అద్భుతంగా ఉంటుంది. ఏమంటారు
యువతా !ఓ యువతా!నీవే ఓ నవతవు !నీవే ఓ భవితవు!

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మౌనమే నీ భాష

అడోల్సీన్స్ ఫేస్