మన మహిళామణులు

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి సుహాసిని

సుహాసిని, IP, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె యువ శాస్త్రవేత్త అవార్డు గ్రహీత, IT ప్రొఫెషనల్, చైల్డ్ సైకాలజిస్ట్, కిడ్స్ ఎమోషనల్ హెల్త్ బ్లాగర్, పేరెంటింగ్ పాడ్‌కాస్టర్, యూట్యూబర్. ఆమె YOUTUBE లో తన కథల ద్వారా పిల్లలకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ , లైఫ్ స్కిల్స్ నేర్పుతుంది. తన చారిత్రక కథల ద్వారా పిల్లలకి మన సాంస్కృతిక మూలాలను తిరిగి పరిచయము చేస్తుంది..

తననే తన విజయాల గురించి, తన జీవిత ప్రయాణం గురించి అడిగి తెలుసుకుందాం.

సుహాసిని

శ్రీ చంద్రమోహన్ గారు ప్రమీల గార్లకి నేనొక్కదాన్నే కూతురిని. మాది తిరుపతి. మా నాన్నగారు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో గణితం, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ హెడ్ గా పదవీ విరమణ చేశారు. మా అమ్మ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. వారిద్దరు నన్ను చదువులో ఎంతో బాగా ప్రోత్సహించేవారు.

నేను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్లో బీటెక్ చేశాను. ఆ సమయంలో, శబ్ద కాలుష్యాన్ని మనం ఎందుకు నియంత్రించాలి అనే దాని గురించి నా పరిశోధనా పత్రానికి నేను యంగ్ సైంటిస్ట్ అవార్డును పొందాను. తరువాత నా M.Tech కోసం IIT బాంబేలో నేను చేసిన, నా ప్రాజెక్ట్ వర్క్ కి (సూక్ష్మజీవులను ఉపయోగించి పారిశ్రామిక వ్యర్థ జలాల నుండి భారీ లోహాలను తొలగించడం) 2 కెనడియన్ పేటెంట్లను గెలుచుకున్నాను, 5 అంతర్జాతీయ పరిశోధన పత్రికలలో కూడా నా ప్రొజెక్ట్ గురించి ప్రచురించబడింది.
అయినా కూడా అందరిలాగే నేను కూడా నా ఉద్యోగాన్ని సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకి మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో కెమికల్ ఇంజనీరింగ్ లో అమ్మాయిలకి ఉద్యోగాలు దొరికేవి కాదు మన ఇండియాలో.

TCS మరియు Accenture వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన రెండు సంస్థలలో 15 సంవత్సరాల పైగా పనిచేయటం నాకు ఎంతో గర్వకారణంగా ఉంటుంది. నేను చాలాసార్లు ఉత్తమ ఉద్యోగినిగా ఆవార్డ్ కూడా పొందాను చాలామంది పెద్ద క్లైంట్లతో సన్నిహితంగా కూడా పనిచేశాను ఎప్పుడూ నా క్లైంట్లు, నా బాసులు కానీ నేను కొత్తవి నేర్చుకోవడానికి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చేవాళ్ళు. నిజానికి నా వర్క్ మీద వాళ్ళకి ఎంత నమ్మకం అంటే 2012 లోనే నాకు వర్క్ ఫ్రం హొం ఆప్షన్ ఇవ్వడానికి వాళ్లు సిద్ధపడ్డారు కానీ నేను నా చిన్న పిల్లవాడితో సమయం గడపాలని కోరుకోవడంతో ఆ ఉద్యోగాన్నీ వదిలేయాలని నిర్ణయించుకున్నాను. మా బాబుని దీవిస్తూ చాలామంది క్లైంట్లు విదేశాల నుంచి కూడా మా వాడికి ఎన్నో బహుమతులు పంపించారు. అది చాలు వాళ్ళందరికి నాతో పని చెయ్యటము ఎంత సంత్రూప్తిని ఇచ్చిందో చెప్పడానికి.

నా ఉద్యోగాన్ని విడిచిపెట్టినందుకు నేను ఎప్పుడూ భాదపడలేదు. ఎందుకంటే నేను నా అబ్బాయితో పాటు మళ్లీ ఎదగటానికి మరియు అభివృద్ధి చెందటానికి వీలు దొరికింది అని అనుకున్నాను. మా అబ్బాయికు (స్రవంత్) ఆరోగ్యకరమైన ఆకుకూరలు మరియు కూరగాయలతో కూడిన ఆహారం ఇవ్వడానికి నేను నా ఆర్గానిక్ గార్డెన్ని ప్రారంభించాను. ఇప్పుడు అది నా అవసరాలకు సరిపడా తాజా కూరగాయలు, మూలికలు మరియు పండ్లను సరఫరా చేస్తుంది.

స్రవంత్ మాంటిస్సోరి పాఠశాలకు వెళ్లడం ప్రారంభించినప్పుడు, నేను మాంటిస్సోరి ఉపాధ్యాయురాలిగా శిక్షణ పొందాను, తద్వారా నేను మా వాడిని బాగా అర్థం చేసుకోగలను. నేను EVidyaloka ద్వారా వాలంటీర్గా పని చేస్తున్నాను. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని రెండు గ్రామీణ పాఠశాలలకు సైన్స్ బోధిస్తాను. నేను విద్యార్థులకు ఇంట్లోనే అందుబాటులో ఉన్న వాటి నుండి పూర్తి చేయగల క్రొత్త ప్రాజెక్ట్లను అందజేస్తాను. అటువంటి ఒక్క ప్రాజెక్ట్ను పూర్తి చేసిన తర్వాత, నా విద్యార్థులు నాతో మాట్లాడుతూ, ఒక రైతు పంటలను పండించడానికి ఎంత కష్టపడుతున్నాడో తాము ఇన్నాళ్లు గ్రహించలేకపోయాము అని అన్నారు. వారు రైతుల పిల్లలైనప్పటికీ, వారు ఆహారాన్ని వృధా చేసేవారు, రైతులను ఎప్పుడూ గౌరవించేవారు కాదు. కానీ ఈ ప్రాజెక్ట్ రైతు (వారి స్వంత తండ్రి) కృషికి వారి కళ్ళు తెరిపించింది. ఇప్పుడు రైతులకు సాంకేతికతను చేరువ చేయడం ద్వారా వారికి శ్రమ తగ్గించి సహాయం చేయాలనుకుంటున్నారు.

ఆఫ్రికన్ సామెత, “పిల్లలను సంతోషంగా మరియు బలమైన వ్యక్తిగా పెంచడానికి ఒక గ్రామం కావాలి” అని చెబుతున్నప్పటికీ, వివిధ కారణాల వల్ల ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఆ గ్రామం లేదు. నేను నా కథలు, బ్లాగులు, పుస్తకాలు, పాడ్క్యాస్ట్ల రూపంలో, ఆ గ్రామంని మీకు చేరువ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను.

పిల్లలతో పని చేస్తున్నప్పుడు, అధిక పోటీ ప్రపంచం కారణంగా పిల్లలు పడుతున్న ఒత్తిడి మరియు ఆందోళనను నేను అర్థం చేసుకున్నాను. 4 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు కూడా చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలో వారు తమ అందమైన బాల్యాన్ని కోల్పోతున్నారు.

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల భావోద్వేగ మేధస్సును మెరుగుపరచాల్సిన అవసరాన్ని అర్థం చేసుకొవడం లేదు. ఇది భవిష్యత్ తరాలకు చాలా అవసరమైన జీవిత నైపుణ్యం నేర్పుతుంది. ఇది లేదు కాబట్టే, పిల్లల్లో కోపం, ఆందోళన, భయాలు, దృష్టి లోపం, గాడ్జెట్ వ్యసనం, ఆకతాయి ప్రవర్తన వంటి చాలా సమస్యలను మనం చూడవచ్చు.

ఉమ్మడి కుటుంబ కాలంలో, పిల్లల మానసిక అవసరాలను తీర్చడానికి మరియు ఆ ప్రక్రియలో వారి EQని మెరుగుపరచడానికి పిల్లలకు తాతలు, అమ్మమ్మలు, లేదా అత్త/మామల రూపంలో ఒక గురువు ఉండేవారు. కానీ ఈ తరం పిల్లలకు ఆలా సేద తీర్చే వొడి లేదు, ప్రేమగా మంచి చెప్పె వాళ్లు లేరు. గాడ్జెట్ లు ఆ స్ధానాన్ని భర్తీ చేస్తున్నాయి.

అందుకే, ఆ లోటును పూడ్చేందుకు తల్లిదండ్రులు, పిల్లలకు లైఫ్ కోచ్‌గా పనిచేయడం మొదలుపెట్టాను. నేను పిల్లలతో కనెక్ట్ అవ్వడానికి మరియు వారి భావోద్వేగ మేధస్సును మెరుగుపరచడానికి కథలు, ప్లే థెరపీని ఉపయోగిస్తాను.

పాఠశాలల్లో నా పేరెంటింగ్ సెషన్‌లు ఎల్లప్పుడూ విజయవంతమవుతాయి మరియు వాస్తవానికి, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల తమ ప్రేమను వ్యక్తపరచడం యొక్క ప్రాముఖ్యతను తమకు ఇప్పటివరకూ తెలియదని ప్రశంసించారు. నా చిట్కాలు వారు వాళ్ళ పిల్లలతో ఎలాంటి ఆటంకాలు లేకుండా గడపడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయని అనుకున్నారు. మరియు నా సెషన్ తర్వాత వారు 21వ తరం తల్లిదండ్రులుగా తమను తాము తీర్చిదిద్దుకోవడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు, తద్వారా వారు తమ పిల్లలతో మెరుగైన బంధం ఏర్పర్చుకోగలిగారు. దానితో తమ పిల్లలను రేపటి అనిశ్చితపు ప్రపంచాన్ని ఎదుర్కొనేలా పెంచగలరు.

నేను తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడల్లా, మూడు కోణాల ఆధారంగా నా పేరెంటింగ్ కోచింగ్ ఇస్తాను (ఒకటి మన ప్రాచీన విలువలు మరియు సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది, రెండవది పిల్లల స్వాభావిక అవసరాలపై ఆధారపడి ఉంటుంది, చివరిది ఆధునిక పేరంటింగ్ విధానాలపై ఆధారపడి ఉంటుంది).

అందుకే నేను నా పేరెంటింగ్ పుస్తకాల కోసం “గ్రానీ గ్రేసి” అనే అందరు చాలా ఇష్టపడే పాత్రను సృష్టించాను. ఈ 21వ శతాబ్దపు ఆధునిక, స్టైలిష్ బామ్మ మన “గ్రానీ గ్రేసి”. తన సాంప్రదాయాన్ని ఆధునికతను రెండిటిని ఆమె తన రెండు చేతులతో ఒడిసి పట్టుకుంది. ఈ పేరెంటింగ్ పెబుల్స్ ఫ్రమ్ గ్రానీ గ్రాసీ అన్న పుస్తకం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ పుస్తకం చదివిన వారు, ఇది ప్రతి తల్లి తండ్రి తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకం అని అన్నారు.

విశాలమైన భారతీయ చరిత్ర గురించి మా స్రవంత్ కి బోధిస్తున్నప్పుడు, ఈ తరంలో చాలా మంది పిల్లలకు దాని గురించి తెలియదని నేను గ్రహించాను. కాబట్టి నేను భారతీయ చరిత్రలోని తెలియని కోణాల గురించి మాట్లాడటానికి నా Youtube ఛానెల్‌లో స్టోరీ మారథాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఈ కార్యక్రమం కింద ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా భారతీయ విలువలు మరియు సంస్కృతికి అత్యుత్తమ ఉదాహరణగా నిలిచిన 75 మంది వ్యక్తుల గురించి నేను కవర్ చేసాను. వీరు వివిధ రంగాలలో రాణించినా వారు. ఈ రోజు, మనం ఇలా ఉన్నము అంటే వారి వల్లనే. ఆ కథలన్నీ పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా పెద్ద హిట్ అయ్యాయి. నిజానికి, నేను కుందవాయి యొక్క సరిక్రొత్త కోణాన్ని ఎవ్వరికి పూర్తిగా తెలియని కోణాన్ని అందించాను, ఇది ఇప్పుడు ప్రసిద్ధి చెందిన PS2 చిత్రంలో కూడా చూపించలేదు.

నేను మా స్రవంత్ తో కలిసి చిన్నపిల్లల దృష్టికోణంలో పిల్లల కోసం కొన్ని కథల పుస్తకాలు రాశాను. వాటిలో అత్యంత ప్రసిద్ధ పుస్తకం “మై ఫ్రెండ్స్ ఫ్రమ్ ఇండియన్ మైథాలజీ” ఇది భారతీయ పురాణాల కథల గురించి మాట్లాడడమే కాకుండా వాటిని ఆధునిక ప్రపంచానికి వర్తింపజేస్తుంది. ప్రస్తుత తరంలోని ఒక చిన్న పిల్లవాడు ఈ కథలను ఎలా చూస్తాడో మరియు వాటి నుండి అతను ఏమి నేర్చుకుంటా డో ఈ పుస్తకములో ఉంది. ఈ పుస్తకం పాఠశాలలు ముఖ్యముగా విద్యార్థులలో ఒక్క పెద్ద హిట్, అందరికి చాలా నచ్చింది. చాలా పాఠశాలలు ఈ పుస్తకాన్ని తమ లైబ్రరీలో పెట్టుకున్నారు.

ప్రస్తుతం, నేను ఫ్రీలాన్సర్ కమ్ పేరెంటింగ్ కోచ్‌ని. నేను పిల్లల ఎమోషనల్ హెల్త్ మరియు పేరెంటింగ్ బ్లాగర్‌ని కూడా. ప్రపంచంలోని టాప్ 50 పేరెంటింగ్ బ్లాగ్‌లలో నా బ్లాగ్ ఫీచర్ చేయబడింది. మన భారతీయ సంస్కృతి మరియు విలువలను ఆధునిక-కాల పేరంటింగ్ కు లింక్ చేసే నా బ్లాగ్ పోస్ట్ లను 15 పైగా దేశాలలో ప్రజలు ఆదరిస్తున్నారు. నవ దుర్గ నుండి పేరెంటింగ్ లెసన్స్ వంటి నా బ్లాగ్ పోస్ట్ లు వాటికి ఉదాహరణ, అవి గత రెండు సంవత్సరాలుగా Google మొదటి పేజీలో ర్యాంకింగ్ అవుతున్నాయి. పేరెంటింగ్ పై నా ఇంగ్లీష్ పాడ్‌కాస్ట్ ప్రపంచంలోని టాప్ 10లో ఉంది. చాలా మంది, పేరంటింగ్ మీద తెలుగులో కూడా ఒక్క మంచి పాడ్కాస్ట్ మొదలు పెట్టమని కోరటంతో, నేను తెలుగులో కూడా నా పేరెంటింగ్ పాడ్‌క్యాస్ట్‌ను ప్రారంభించాను. అది తెలుగు లోనే మొట్టమొదటి పేరెంటింగ్ పాడ్‌కాస్ట్.

మీరు సుహసిని గురించి ఇంతసేపు చదివారు కదా. తన కథలు మరియు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చిట్కాలతో ఆమె ఇప్పటికే 100 కంటే ఎక్కువ మంది పిల్లల జీవితాన్ని ప్రభావితం చేసిందని మీకు తెలియజేస్తూన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, ఆమె 2025 చివరి నాటికి 1000+ పిల్లలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మనము తనకి బెస్ట్ విషెస్ చెబుదామా తన ఈ ప్రయాణంలో విజయము సాధించాలి అని.

మీరు సుహసినిని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి వాటిలో సంప్రదించాలి అంటే తన id – mommyshravmusings.
తన బ్లాగ్: https://mommyshravmusings.com/
పాడ్కాస్ట్: Simplified Parenting, పేరెంట్స్ తో ఒక్క చిన్న మాట
Mob. No – 814416968

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మనిషి మనిషిలా ప్రవర్తించడమే మానవత్వం

మౌనమే నీ భాష