మానవత్వం అంటే ఇతరులకు సానుభూతి మరియు సహాయం చేసే సామర్థ్యం అని సూచిస్తుంది. మానవుడి తత్వాన్నే మానవత్వం అంటారు. ఎదుటి మనిషిని కూడా తనలాగే తన సాటి మనిషి అని గుర్తించి మసలటమే మానవత్వం.ఈ తత్వాల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు.. కానీ ఉండవలసిన ప్రాథమిక లక్ష్యం మానవత్వమే. అందుకే అంటారు “మానవత్వానికి మించిన మతం లేదని, మానవ సేవకు మించిన వ్రతం లేదని”. మానవత్వం ‘వ్యక్తి యొక్క’ ప్రయోజనాలకి వ్యతిరేకంగా ఉండకూడదు. మానవత్వం అనే స్వభావం నుంచే మానవుడు అనే మాట రూపుదిద్దుకుంది. అంతే కాక మానవత్వం లేని మతం రాణించదు. మతాలన్నీ మానవత్వాన్ని కలిగి ఉండాలని బోధిస్తాయి. అదే ప్రాథమిక సూత్రం కూడా.
మానవత్వం అంటే ఇక్కడ విశదీకరించుకుందాం. కరుణ, ప్రేమ,దయ, అహింస, పరోపకారం మొదలగు గుణాలు కలిగి ఉండటమే. ఇతర విలువల కన్నా మానవ విలువలే మిన్న అని ఎరిగి ఉండడం మానవత్వానికి రేచుక్క . దీనివల్లనే వసుదైక కుటుంబనిర్మాణం జరుగుతుంది.మానవత్వంలో సాంప్రదాయక మత సిద్ధాంతాలకు తావు లేదు. ఈ విషయాన్ని చాలామంది మహానుభావులు తెలియజేశారు. సి నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు ” ఏ కులం వెన్నెల ది? తుమ్మెద లెట్టి జాతికి చెందినట్టివి? అట్టిదే కదా మానవత్వం అన్నిటికి ఎత్తయిన సత్యం ‘ అన్నారు.,, ” మానవాళికి నిజంగానే మంచి కాలం రహిస్తుందా? సాదుతత్వపు, సోదరత్వపు స్వాధతత్వం జయిస్తుందా ‘ అన్నారు శ్రీశ్రీ. ” మనుషులంటే రాయి రప్పల కన్నా కనిష్టంగా చూస్తా వేల అన్నారు “గురజాడ వారు.మనిషి మనిషిలా ప్రవర్తించడమే మానవత్వం అన్నాడు.
అబ్దుల్ కలాం గారు కూడా ఒక కథను ఉట్టగిస్తూ తాను దేవతా విగ్రహాలలో కాకుండా, మనుషులలో వెతకడం వలన మానవత్వం కనిపించిందన్నారు. ఇలాగే ఇతర మతాల గురువులు కూడా మానవత్వాన్ని చాటి చెప్పారు. ఎన్నో దెబ్బలు తిన్న ఈ ప్రపంచంలో ఇలా కొనసాగడానికి ఒకింత మానవత్వమే కారణం.
జీవకారుణ్యం కలిగి ఉండడంమే ఒకప్పుడు మానవత్వం. ఇప్పుడు దాని విస్తృత బాగా పెరిగింది. ప్రపంచంలో ప్రతి ఒక్కరు శాంతి, స్వేచ్ఛ, సౌభాగ్యము, సౌభ్రాతృత్వం తో బతకాలి అని కోరుకుంటున్నారు. దానికి పెరిగిన అక్షరాస్యత కూడా మూలం. అందుకు అవసరమైన సహకారాన్ని ఒకరికొకరు అందిపుచ్చుకోవడమే కాకుండా, సమాజము,ప్రభుత్వం కూడా తోడ్పాటు అందించాలి. అన్ని దేశాలు జూన్ 21ని మానవతా దినోత్సవం గా జరుపుకుంటున్నారు. దీనికి కారణం కూడా ఉంది. 2003 వ సంవత్సరం ఆగస్టు 19న ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో బాంబు పేలుడు సంభవించింది. ఐఎన్ఎస్ ప్రతినిధితో సహా 21 మంది సిబ్బంది మరణించారు. వారి సంస్మరణార్థం ఐక్యరాజ్యసమితి ఆగస్టు 19 ప్రపంచ మానవత్వ దినోత్సవం గా ప్రకటించింది. తర్వాత కొన్ని దేశాలు దానిని మార్చుకున్నాయి.
ప్రతి మనిషిలోనూ మానవత్వం అంతా ఎంతో దాగే ఉంటుంది. మానవత్వం చూపటం లో యువత పాత్ర ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే వారి దేశానికి వెన్నెముక. వరదలు,భూకంపాలు,ప్రమాదాలు మొదలైనవి సంభవించినప్పుడు వారు చేసే సేవ ద్వారా వారి మానవత్వం బయటపడుతుంది ఏ రూపంలో నైనా సరే. నేడు చాలా సులువుగా ఈ సోషల్ మీడియా దయవలన పలానాచోట,ఫలానా మనిషి,ఇబ్బందులో ఉన్నారని అని తెలియగానే ఎందరో దాతలు, ఎన్జీవోస్ తమకు సహకారాన్ని మానవతా దృక్పథంతో అందిస్తున్నారు. మనకు రెండు సంవత్సరాలు క్రితం వచ్చిన “కోవిడ్” సమయంలో ఈ మానవీయత గొప్పగా ప్రకటితమయింది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. సహాయం అందించడంలోనే ఆగిపోకూడదు, ఎల్లప్పుడూ అందరికీ రాజ్యాంగ హక్కుల యందు,బాధ్యతల యందు, అవగాహన కలిగి యుండి అందరికీ అన్ని అందేలా సమున్నత సమాజాన్ని నిర్మించవలసిన అవసరం ఉంది. ఇది కూడా ఒక మానవత్వమే. మానవత్వం లేని సమాజం ఎదగలేదు మరియు సిగ్గుచేటు కూడా. ఎందుకంటే మనము దిగువ స్థాయి పశువులను కాదు కనుక.అది కూడా తను నమ్ముకున్న యజమానికి కట్టుబడే ఉంటుంది p. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాడి దగ్గర మానవతా విలువలు ఉండవు.
జాతిపిత గాంధీ గారు కూడా మానవత్వం గురించి ఇలా అన్నారు ” మీరు మానవత్వం పై విశ్వాసం కోల్పోకూడదు. మానవత్వం ఒక మహాసముద్రం. సముద్రంలోని కొన్ని చుక్కలు కలుషితమైనంత మాత్రాన సముద్రం కలుషితంఅయిపోదు”. ప్రతి విషయంలోనూ చెడు ఉంటుంది. చెడు లేని మంచికి అర్థం లేదు. అలాగని మనం మానవత్వం లేకుండా ఉండకూడదు. వ్యక్తులు తమ వ్యక్తిత్వంలోనే మానవత్వం నింపుకోవడం కాదు మొత్తం వ్యవస్థనే మానవత్వంతో పరిమళింప చేసేలా తీర్చిదిద్దవలసిన అవసరం ఉంది. దానికి సభలు సమావేశాలు ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మీడియాల ద్వారా రేకెత్తించాలి. ఆ పని మనది,మన అందరిదీ కూడా. తల్లిదండ్రులు పిల్లలకు ఉగ్గుపాలతోటే మానవత్వ విలువలు నేర్పాలి. నేటి సమాజంలో అవన్నీ పూర్తిగా నశించాయి. పిల్లలు వీడియో గేములు, స్త్రీలు సీరియల్స్, పురుషుడుకి ఖాళీ సమయంలో పబ్బులు, క్లబ్బులు, రాజకీయాలు. మనిషి బంగారంలా ఉంటే సరిపోదు మనసు కూడా బంగారంలా ఉండాలి అనేవారు పెద్దలు. బంగారం విలువ దాని “క్యారెట్ల”ను బట్టి ఉంటుంది. మనిషి విలువ వాని “క్యారెక్టర్ ” వలన తెలుస్తుంది. మానవత్వం కోల్పోతే మానవ అనుబంధాలైనా…..దేశాల అనుబంధాలైన…ప్రచ్చన్న యుద్ధానికి నాంది పలుకుతాయి. అందుకే
మానవత్వంలోగానే జన్మిద్దాం- మానవత్వంలోనే జీవిద్దాం- మానవత్వంతోనే మరణిద్దాం.