చిక్కటి కాఫీతో చక్కటి కబుర్లు

చెంగల్వల కామేశ్వరిగారితో ఇంటర్వ్యూ – ఎస్. యశోద దేవి

ఉదయాన్నే చిక్కటి కాఫీతో రోజు మొదలైతే ఎంత బాగుంటుంది కదా..చిటపట చినుకుల్లో వేడివేడి పకోడీలు తిని కాఫీ తాగితే.. ఆహా జీవితాన్ని ఇంతకన్నా బాగా ఎవరు ఆస్వాదించగలరు అనిపిస్తుంది కదూ.. నిజమే రెండు సందర్భాల్లోనూ కాఫీ రుచి వేరు, అనుభూతి వేరు.. కాఫీ విత్ కామేశ్వరి పుస్తక రచయిత చెెంగల్వల కామేశ్వరి గారితో ముచ్చట్లు కూడా రుచికరమైన కాఫీ మాదిరిగా ఉంటాయి… రోజు వారీ దినచర్యల్లోనే ఆమె ఎన్నో సంగతలును కొత్తగా వివరిస్తారు.. ‘చెప్పుకుంటే కథలు ఎన్నో! అంటూ పాఠకులను అక్షరాల వెంట పరుగులు తీయిస్తారు. గుండెల్లో గోదారిలా హాయిగా సాగే పడవ ప్రయాణంలా ఆమె కథలు ఉంటాయి. కాస్త హాస్యం, మరికాస్త సందేశం కలిసి సరదా కబుర్లు చెబుతారు. ఈ వారం మన తరుణిలో చెంగల్వల కామేశ్వరి గారితో ముఖాముఖీ..

చెంగల్వల కామేశ్వరి

తరుణి : మీ పరిచయం?
కామేశ్వరి : మా స్వస్థలం నర్సాపురం, పశ్చిమగోదావరి జిల్లా. తాతగారు ఇలపకుర్తి వీరవెంకట రామచంద్రరావు గారు. నాన్న ఐఏస్ ఆర్ ఆంజనేయ శర్మ గారు, అమ్మ రాధాదేవి గారు. ఎనిమిది మంది సంతానంలో మూడవదాన్ని నేను. నాన్మగారు ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ లో ఆడిటర్ గా వర్క్ చేసేవారు. ఉద్యోగరీత్యా నాన్నగారికి ఎక్కువగా ట్రాన్సఫర్స్ అవుతూ ఉండేవి. దాంతో నేను మూడో క్లాస్ వరకు మా అమ్మమ్మ గారి ఊరిలో చదువుకున్నాను. ఆ తర్వాత విశాఖ జిల్లా ఏటికొప్పాక ఊరిలో ఐదో తరగతి వరకు చదివాను.
తర్వాత తొమ్మిదో తరగతి వరకు రాజమండ్రిలో చదివాను. తొమ్మిదో తరగతి పరీక్షలు కాగానే నా పద్నాలుగవ ఏట పెళ్లి జరిగింది. మా వారు ఆగ్రాలో ఎయిర్ ఫోర్స్ లో చేసేవారు. పెళ్లి అయిన పన్నెండేళ్లకు ఓపెన్ యూనివర్సిటీ లో బిఏ కరస్పాండెన్స్ డిగ్రీ పూర్తి చేశాను. మాకు ఒక అమ్మాయి, అబ్బాయి. వారిద్దరికీ పెళ్లిళ్లు అయి ఇద్దరేసి పిల్లలు. అమ్మాయికి బాబు పాప, అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు

తరుణి : సాహిత్యం పై ఆసక్తి ఎలా కలిగింది, మీకు స్ఫూర్తి కలిగించిన సాహిత్య వేత్తలు?
కామేశ్వరి : పుస్తకాలు చదివే అలవాటు అమ్మమ్మ గారింట్లో ప్రభ పత్రిక చందమామ బాలమిత్ర చదవటంతో మొదలైంది. చిన్నప్పటినుండి వారపత్రికలు, దినపత్రికలు, మాసపత్రికలు, చదవడం వలన కలిగిన మక్కువ వలన సాహిత్యం చదవడం అభిరుచి గా మారింది. మా నాన్నగారు చదివే కుంతీ విలాపం, పుష్పవిలాపం, జాషువా గారి ఫిరదౌసి, బాలగంగాధర్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి, శ్రీ శ్రీ గారి మరో ప్రస్థానం, అడవి బాపిరాజు గారి కథలు చదివేదాన్ని. పెళ్లయిన తర్వాత తెలుగు మాట వినిపించని, తెలుగువారు కనిపించని ఉత్తరప్రదేశ్ కు వెళ్ళాం. దాంతో అక్కడ కాలక్షేపం కోసం లైబ్రరీ లో ఉన్న తెలుగు పుస్తకాలన్నీ చదివేదాన్ని. మా వారికి ఎక్కడికి ట్రాన్స్ ఫర్ అయితే అక్కడ ఉండే లైబ్రరీలో ఉండే తెలుగు పుస్తకాలు చదివే అవకాశం లభించేది. అలా అంబాలా, ఢిల్లీ తదితర నగరాల్లో ఉన్న లైబ్రరీ లో ఉన్న తెలుగు సాహిత్యం చదివే వీలు కలిగింది. చిన్నచిన్న కథలు, కవితలు రాసే దాన్ని కానీ తెలుగు పత్రికలకు ఎలా పంపాలో తెలిసేది కాదు. అ తర్వాత హైదరాబాద్ కి వచ్చాక ముమ్మరంగా దొరికే తెలుగు దిన, వార, మాస పత్రికలు చూసి ఎంతో ఆనందం కలిగింది. నా ప్రపంచానికి తిరిగి వచ్చినట్లు గా సంబర పడేదాన్ని. తెలుగు పత్రికల్లో వచ్చే అన్ని కథల పోటీల ప్రకటనలు చూసి వాటికి నా రచనలు పంపించేదాన్ని. కొన్ని సంవత్సరాలుగా నా మనస్సును స్పందింప చేసిన సంఘటనలను ఆధారం చేసుకుని రచనలు చేయటం మొదలు పెట్టాను. పోటీల్లో నా రచనలకు బహుమతులు కూడా రావడంతో మరింత ఉత్సాహంలో రచనలు చేశాను. యండమూరి వీరేంద్రనాథ్, సులోచనారాణి, రంగనాయకమ్మ, మాదిరెడ్డి సులోచన, వాసిరెడ్డి సీతాదేవి నా అభిమాన రచయితలు.

తరుణి : మీరు రాసిన వాటిలో కాఫీ విత్ కామేశ్వరి చాలా మంది పేరు, గుర్తింపు తీసుకువచ్చింది. కామేశ్వరి గారి ఇంటి పేరు కాఫీగా మారింది. ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ? ఇప్పటివరకు ఏయో ప్రక్రియలలో రచనలు చేశారు.
కామేశ్వరి : రోజూ ఉదయం కాఫీ తాగుతూ ఇంటిల్లపాదీ కలిసి మాట్లాడుకుంటాం. అవే ముచ్చట్లు ఒక శీర్షిక లా రాస్తే బాగుంటుంది అనిపించింది. దాంతో ఇంట్లో సభ్యులంతా
చర్చించుకునేలా ‘కాఫీ విత్ కామేశ్వరి ధారావాహికంగా మూడు నెలలపాటు ఫేస్ బుక్ లో రాశాను. అనుభవాలను,సందేశాలను సమాజంలోని పలు విషయాల పట్ల నా స్పందనను కబుర్లు గా మార్చి రోజూ నా మిత్రులతో పరస్పరం సంభాషిస్తున్నట్లు గా రాసిన కబుర్లే ‘కాఫీ విత్ కామేశ్వరి ‘ చాలా పాపులర్ అయింది. ఆ తర్వాత వాటిని పుస్తకంగా పాఠకులకు అందించాం. కథలు, వ్యాసాలు, కవితల ప్రక్రియలో రచనలు చేశాను. సుమారు 150 కథలు, రెండు వందల వ్యాసాలు,120 కవితలు రాశాను.
కొన్ని కథలను రెండు కథల సంపుటాలు గా వేయించాను. అవి చెప్పుకుంటే కథలెన్నో, గుండెల్లో గోదారి. ‘గోదావరి ఘుమఘుమలు’, ఊరగాయలు ఊరించే పచ్చళ్లు’ అనే రెండు వంటల పుస్తకాలు కూడా రాశాను. కాఫీ విత్ కామేశ్వరి పుస్తకం మాదిరిగానే ఇంట్లో వారంతా కలిసి సరదాగా మాట్లాడుకునేలా త్వరలో ఛాయ్ విత్ చెంగల్వల పేరుతో సరదా కబుర్లు పుస్తకం, మరొక కథల సంపుటి రాబోతున్నాయి.

తరుణి : పర్యాటక రంగం లో మీ అనుభవాలు, మీరు చూసిన ప్రదేశాలు?
కామేశ్వరి : పుస్తక పఠనం, రచనలతో పాటు నాకు పర్యాటక ప్రదేశాలు చూడటం అంటే చాలా ఇష్టం. నేను మాత్రమే కాకుండా నా స్నేహితులతో కలిసి ఎక్కువగా టూర్స్ ప్లాన్ చేస్తుంటాను. పుష్కరాల సమయంలో, కార్తీకమాసములో పలుసార్లు జిల్లాల వారీగా టూర్స్ గా నిర్వహించడం వలన చాలా ప్రదేశాలు చూశాను. అంతేకాదు గత దశాబ్దకాలంగా అనేక టూర్స్ నిర్వహిస్తూ హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, నేపాల్, గుజరాత్, తమిళనాడు, ఒరిస్సా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలోనూ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పర్యటించడం జరిగింది. సమాజ సేవలో, సాహితీ సేవలో అనేక పురస్కారాలు అందుకున్నాను.

 

తరుణి : నేటి తరం రచయితలు మీరిచ్చే సూచనలు సలహాలు
కామేశ్వరి : నేటి యువతలో చాలా మంది తమ రచనలతో ఆలోచింప చేస్తున్నారు. మా చిన్నతనంలో ఎక్కువగా పుస్తకాలు చదివి సాహిత్య విలువలు తెలుసుకునే వాళ్లం. భాషపై పట్టు వచ్చిన తర్వాత రచనలు చేసి పత్రికలకు పంపి అవి ప్రచురించబడిన తర్వాత రచయితలుగా గుర్తింపు పొందేవాళ్ళం. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. పరిచయాలుంటే చాలు. వాట్సప్ గ్రూప్స్, ఫేస్ బుక్ గ్రూప్స్ లో తమకు తోచింది రాసేసి, తమకు తామే రచయితలుగా అనుకుంటున్నారు. మరికొందరితో కలిసి తమ రచనలను పుస్తకాలుగా తీసుకువస్తున్నారు. అలా కాకుండా సాహిత్యం చదివి, భాషను నేర్చుకుని, పత్రికలకి తమ రచనలు పంపిస్తే బాగుంటుంది. నేటి తరంలో చలాకీతనం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియాలో వారు పెట్టే పోస్ట్ ల లో భాషను సంస్కార యుతంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం!

ఎస్.యశోదా

Written by S. Yashoda Devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

యముండా!

బంధాలు.. అనుబంధాలు