చెదిరిన కల

కవిత

పద్మశ్రీ చెన్నోజుల

వ్యాపార సామ్రాజ్యం నవరత్న కాంతులతో ప్రకాశిస్తోంది

సస్యదేవత పసిడి సిరులతో శోభిల్లుతోంది

సేవారంగం అభిమాన సంద్రమై ఉప్పొంగుతోంది

మానవత్వం మంచిగంధమై పరిమళిస్తోంది

ప్రేమతత్వం తేనెజల్లై ఆపన్న హస్తం అందిస్తోంది

ఆ పవిత్ర సరోవరాన కళ్ళు విప్పిన రాయంచ

మృదుగంభీర స్వరం మితభాషణం హృదయం లోతైన సంద్రం

హంగు ఆర్భాటాలకు దూరం సభ్యత సంస్కారాలే ఆభరణం

హృదయానికి పరదాలు వేసే నిరంతర ప్రయత్నాల్లో కనురెప్పలు

స్వరపేటికకు తాళాలు బిగించే విశ్వప్రయత్నాల్లో నాలుక స్వశక్తికి వేసిన

పెద్దపీట సమున్నత స్థాయికి చేర్చిన దీక్షాదక్షత

విధి వక్రించి విషాన్ని  గుమ్మరించింది

జీవన సాహచర్యం రహదారి రక్కసికి కబలమయింది

అమ్మతనానికి రెండేళ్ల అనుభవం

 ఓటమినంగీకరించని నైజం సానుభూతిని సహించనంది

తిరుగులేని విజేత జాలిని భ రించనంది

ముఖానికి గాంభీర్యపు ముసుగు తొడుక్కుంటూ

అడుగులకు ఆలోచనలను జోడిస్తూ

మనసుకు మౌనాన్ని జతపరుచుకుంటూ

మాటకు మంచి  గంధాన్ని అద్దుతూ

గమ్యానికి బహు చేరువలో సాగుతున్న పయనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆరోగ్యమంటే

గాడి తప్పిన …..